గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి
ఈవారం లోనే విశాఖ దగ్గర భీమిలీ నుండి సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ‘’సుపద ‘’ద్విమాస పత్రిక మార్చి సంచికను శ్రీ కంభం పాటి సుబ్రహ్మణ్యంగారు మా ఇంటికొచ్చి ఇవ్వగా చదివాను .అందులోడా. శ్రీ మాదిరాజు రంగా రావు గారు రాసిన ‘’గీతాంజలి లో అనుభూతి కళ ‘’వ్యాసం చాలా బాగా నచ్చింది .అందులోని ముఖ్య విషయాలను మీకు అందజేస్తున్నాను .
‘’గీతాంజలి ‘’లో అమూర్తమైన దివ్య చేతనా ఆత్మాశ్రయ ప్రపంచం లో అనుభూతి వస్తుంది .భక్తీ సంప్రదాయ విషయాలైన కీర్తనం ,స్మరణం సఖ్యం ,వందనం ,సేవనం ఆత్మా నివేదనం మొదలైన భావాలు మెరిసి మురిపిస్తాయి .కవితా కళ కు సంబంధించిన విలువల్ని పెంచుతుంది .భరతీయ సాంస్కృతిక ఉజ్జీవనానికి ప్రేరక శక్తిగా నిలిచింది .కొత్త అనుభవ స్పందనకు ప్రతీక అయింది .పాశ్చాత్య గుణాత్మకతను స్వీకరిస్తూ సంప్రదాయ మూలాలను మన్నించే సంస్కృతిని స్థాపిస్తుంది .అనుభూతి దృష్టితో విశ్వ భావన కలిగిస్తుంది .
యుద్ధ వాతావరణం లో అశాంతికి గురి అయిన జనాలకు జాతీయ భావన పట్ల నిబద్ధత ,ప్రపంచ శాంతి కాముకత్వం ,ఉదార వర్తనకు మార్గం చూపింది .అతీత శక్తి యొక్క దివ్య రూపం ఇందులో అనుభవైక వేద్యమయింది .భావ చిత్రాలతో దర్శన సుందరమైనది .ప్రక్రుతి విలసనం ,మనిషి జీవితం సమాజ దర్శనం దివ్య దర్శనం అంచె లంచెలుగా ఉండి .వ్యక్తీ చేతన నుండి విశ్వ చేతనకు పయనించే మార్గం ఉంది .ఆర్ద్రతా వేదన గుణాదికత రసార్ద్రమైంది .సత్యం బంగారు తెర వెనక దాగి ఉందన్న భావం ఉపనిషత్ వాక్యమే .’’live in the midst of men ‘’అన్న సారాంశాన్ని చెప్పింది .మనిషి ఆనందం లో పుట్టి ఆనందం లో ప్రయాణించి ఆనందం లో కలిసే లక్షణం చెప్ప బడింది .హృదయార్ద్రత ద్రవీ భూతమైనది .జాతీయ భావన ప్రేరితమైంది .

![]()
గీతాంజలి లో సంగీత భూమిక ఒక గొప్ప పార్శ్వం .వేణువు ప్రక్రుతి సిద్ధమైంది .శరీరమూ నవ రంధ్రాల వేణువే .వేణువు మధుర జీవానికి ప్రతీక .శరీరం భాగవదదీనం .ప్రక్రుతి, మానవ జీవితం, దివ్య శక్తి ఈ మూడింటి నిర్వ్యాజ అనుబంధం స్థాపించాడు కవి ఇందులో .కవి గొప్ప గాయకుడిగా భగ వంతుడిని దర్శిస్తాడు .దేవుడు కవిని పాడమని అడుగుతాడు .మనసు చలించి ఉద్వేగం తో కళ్ళ వెంట ధారాపాతం గా నీరు వెల్లుబుకుతుంది .అపస్వరాలన్నీ కరిగి ఒకటై రసమయమైనాయి .ఇక్కడ ఆరాధనాభావం శిఖర స్థాయి పొందింది .సాగరం పై రెండు రెక్కలూ సాచిన విహంగం గా మహా సంతోషం గా ఉంది. కవికి భక్తుని నిరీక్షణ ఫలించి దర్శనం పొంది ఆనందం పరి పుస్టమైంది .భక్తీ తో ప్రారంభమైన మనోనుభావం స్నేహ భావం తో కళా కృతిని పొందుతుంది .ఇప్పుడు కవి అయిన గాయకుడి స్తితి మనోమయ మైనది .ఇది గగనం తో సూచించాడు .సముద్రుడు జాలాధి దేవత .జలం రసమయ మైనది .రసమయం నుండి గగనానికి ఎగిరే అనుభవమే మనోమయం .తర్వాత అత్మాభిముఖమైంది .చివరికి దివ్యమైంది ఇదీ సోపాన క్రమం .పాటపక్షితో పోల్చ బడింది .ఇది జీవ శక్తి తో భగవంతుని చేరే జీవాత్మ ప్రయత్నమే ఇక్కడ మనం చూస్తాం .కవి భాగవస్సాన్నిధ్యం లో అస్తిత్వాన్ని కోరుతాడు .ఇది మనోమయమైంది ,జీవలక్షణ మైనదీ ,ఆత్మ రూప మైనదీ .గాన రసానందం లో కవి గాయకుడిగా భగవద్ భావన లో లీన మయ్యే తృప్తి, పారవశ్యం పై పొరలలోనే నిలుస్తాయి .భగవంతుడు తన ప్రభువు అనే భావం అదృశ్యమై లోపలి పొరల్లో స్నేహ రూపాన్ని పొందటం విశేషం .ఈ స్నేహ బంధమే భక్తుడినీ భగవంతుడినీ కలిపింది .ఇద్దరి మధ్య ఉన్న విభజన రేఖ అదృశ్యమైంది .ఇక్కడ కవి చిత్రించిన భావ చిత్రం అనుభూతమైంది .
వేదనా ప్రకాశం లో గీతాంజలి భక్తీ మయమైన తాత్విక శోభను పొందింది .నిరాకరణ ద్రుష్టితోకాక సృజన ,నిర్మాణ దృష్టితో జీవితం రూపం పొందింది .ఈ విధమైన రమణీయ కళాత్మక భావ ప్రపంచానికి ప్రత్యక్ష రూపమే రవీంద్రుని శాంతి నికేతన్ ‘’.ఈ భావ జగత్తుకు దివ్యానుభూతి చిత్రణమే రవికవి గీతాంజలి ..’’
రేపు శ్రీ శంకర జయంతి సందర్భం గా శుభాకాంక్షలు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-14- ఉయ్యూరు

