ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూత

జీర్ణకోశ కేన్సర్‌తో మృతి
రెండేళ్లుగా అంపశయ్యపైనే..
తుదిశ్వాస వరకూ కళకే అంకితం
ఆ కుంచెకు నవ్వించడమే తెలుసనుకున్నాం. నిప్పులు చిమ్మడమే ఎరుకనుకున్నాం. గుండె లోతుల్లోంచి పిండిన సంవేదనను బొమ్మ కట్టడం చూశాం. కానీ, శిథిలమవుతున్న శరీరాన్ని వేళ్ల మధ్యకు తెచ్చుకొని రోజూ ఒక సూర్యోదయాన్ని చిత్రీకరిస్తున్న విషయం మిత్రులకే చాలాకాలం తెలియదు. బ్రష్‌కు కాన్వాస్ అమరినట్టు.. చెదరని గీతకు చక్కని రాత సైజోడయి ‘సై..సై..’ అంటూ రాజకీయ కార్టూన్‌ని పరుగులు పెట్టించిన ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ మరిలేరు.
హైదరాబాద్, మే 19 : కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ (కంభాలపల్లి చంద్రశేఖర్) కన్నుమూశారు. రాష్ట్రంలో రాజకీయ కార్టూనింగ్‌కు వన్నెతెచ్చిన శేఖర్ (49) గత రెండేళ్లుగా జీర్ణకోశ సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవా రుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య చంద్రకళ, కుమార్తె చేతన, కుమారుడు నందు ఉన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జూలై 16, 1965లో శేఖర్ జన్మించారు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అభిరుచిగా పెట్టుకొన్న ఆయనను చుట్టూ ఉన్న ఉద్యమ వాతావరణం ఉత్సాహపరిచింది. ఎంఏ (తెలుగు) పూర్తయిన తరువాత పూర్తిగా చిత్రకళారంగానికే శేఖర్ అంకితం అయ్యారు. పత్రికలను వేదిక చేసుకొని తన భావాలకు రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్ట్‌గా 1989లో తన ప్రస్థానం మొదలుపెట్టారు.
కొంతకాలం ఇతర పత్రికల్లో పనిచేసి.. 19 97లో రాజకీయ కార్టూనిస్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేశారు. తుదిశ్వాస విడిచేవరకు సంస్థకు సేవలు అందించారు. 20 ఏళ్లలో దాదాపు 45 వేల కార్టూన్‌లు ప్రచురించారు. ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి అనుబంధ నవ్య వార పత్రికలో శేఖర్ ట్యూన్స్, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లైఫ్ లైన్ శీర్షికలను నిర్వహించారు. మృతి చెందడానికి కొద్దిరోజుల ముందే ‘కాస్ట్ కేన్సర్’ పుస్తకాన్ని తీసు కొచ్చారు. గిదీ తెలంగాణ, బ్యాంక్ బాబు, శేఖర్ టూన్స్, పారాహుషార్ తదితర కార్టూన్ పుస్తకాలు వెలువరించారు. బెల్జియమ్‌లో 1996లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు అందుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని.. విజేతగా నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొ న్నారు. ఆయన మరణవార్త తెలియగానే చిత్రకళ, రాజకీయ, ఉద్యమ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన సహచరులు, అభి మానులు బోడుప్పల్‌లోని శేఖర్ స్వగృహానికి తరలివచ్చి నివాళులర్పించారు. బోడుప్పల్ నుంచి బయలుదేరిన అంతిమ యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు కాచిగూడలోని అంబర్ పేట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. కుమారుడు నందు తండ్రి చితికి నిప్పు అంటించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కార్టూనిస్టులు రమణ, నర్సిమ్, మోహన్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పత్రికా రంగానికి తీరని లోటు : కేసీఆర్
శేఖర్ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వెలిబుచ్చారు. శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పత్రికా లోకానికి, పాఠకులకు శేఖర్ సుపరిచితులని టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ‘శేఖర్ టూన్స్” శీర్షిక ద్వారా భావి కార్టూనిస్ట్‌లకు మార్గదర్శిగా నిలిచారని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎ.సత్యారావు తెలిపారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.అమర్, వై.నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జీ ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కన్వీనర్ బీ బసవపున్నయ్య, జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బి.చక్రధరి తదితరులు నివాళులర్పించారు.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ నివాళి
శేఖర్ పార్థివదేహానికి ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్, నెట్‌వర్క్ ఇన్‌చార్జ్ కృష్ణప్రసాద్, ఇతర సిబ్బంది నివాళి అర్పించారు. దుఖఃంలో మునిగిపోయిన శేఖర్ కుటుంబాన్ని వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, వినయ్ కుమార్, తెలకపల్లి రవి, ఉద్యమ నాయకులు కోదండరాం, విమలక్క, వరవరరావు, జూలూరు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి రెడ్డి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.
మృత్యువును పరిహసించినవాడు…

శేఖర్ లేడని తలచుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయి. జీవితంతో పోరాడి గెలుపును ఆస్వాదించే సమయానికి మృత్యువు సవాలు విసిరింది. ఆఖరి నిముషం దాకా కలం, కుంచెతో మృత్యువును ఏమార్చి చిట్టచివరకు అలసి సొలసి కడపటి నిద్రలోకి జారిపోయాడు. సోమవారం నాటి ఆంధ్రజ్యోతి సంచికలో శేఖర్ ఆఖరి కార్టూన్ సంతకం చేసి పెన్నుమూశాడు. శేఖర్‌తో నాది దాదాపు రెండున్నర దశాబ్దాల పై అనుబంధం. ప్రజాశక్తితో ప్రారంభమైన మా పరిచయం హైదరాబాద్‌లో పెనవేసుకుపోయింది. తను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత నేను ఆంధ్రజ్యోతికి వచ్చాను. దాదాపు రోజూ కలసే వాళ్ళం.
కార్టూన్లకే పరిమితం కాకుండా చిత్రలేఖనానికి సంబంధించిన సకల రంగాలని ఆకళింపు చేసుకునేందుకు బాలి, టీవీ నుంచి బాపూ వరకు పెద్ద పెద్ద కళాకారులను కలుసుకోవడం, టెక్నిక్‌లు చర్చించడం శేఖర్‌కు ఇష్టమైన పని. తుమ్మపూడిలో కళాతత్వ విమర్శకుడు సంజీవదేవ్‌ను కలిసేందుకు టి. వెంకట్రావు గారితో కలసి వెళుతూ నన్ను కూడా తీసుకువెళ్ళారు. అప్పుడు సంజీవదేవ్‌ను అనుకోకుండా ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరికింది.
జీవితం పట్ల అంతులేని ఆపేక్ష, కార్టూన్ ప్రపంచంలో రారాజు కావాలనే ఆకాంక్ష, పట్టువీడని పరిశ్రమ కలిస్తే కంభాలపల్లి చంద్రశేఖర్ అవుతాడు. హైదరాబాద్‌లో లబ్దప్రతిష్టులైన మోహన్ లాంటి టైకూన్‌ల స్థాయికి తాను ఎదగాలనేది ఒక ఆకాంక్ష. ప్రజాక్షేత్రంలో పనిచేసే వారు ఎవరైనా కరపత్రం నుంచి పోస్టర్… కవర్ పేజీదాకా ఏమి వేసి పెట్టమని అడిగినా శేఖర్ ఎంతో ఇష్టంతో ఆ పని చేసిపెట్టేవాడు.
మేమిద్దరం పుస్తకాలు వేయడం నుంచి సిండికేట్ నడిపేదాకా ఎన్నెన్నో ఆలోచనలు చేసేవాళ్ళం. ఆ చర్చలలో అసాధ్యం అనుకున్న ఐడియాలను తర్వాత కాలంలో అమలు జరిపాడు. శేఖర్ టూన్స్ వంటి సిండికేషన్ ద్వారా చాలా భాషలలోకి తన బొమ్మను నడిపించాడు. అలాగే అమెరికా టూర్. ఎలా ఆహ్వానం వచ్చిందో, ఎలా వెళ్ళాడో… నాకయితే ఆశ్చర్యం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయ డం కూడా ఒక కళే. దానికి అవసరమైన పరిశ్రమ, పట్టుదల శేఖర్‌కు చిన్నతనం నుంచే బాగా అబ్బినట్లున్నాయి.
జీవిత సహచరి చంద్రకళకు అక్షరాభ్యాసం నుంచి కంప్యూటర్ కళలో దిట్టగా తీర్చిదిద్దడం వరకూ ఎన్నో సవాళ్ళు గెలిచాడు. మృత్యువు విసిరిన వలను సైతం పట్టుదలతో నిముష నిముషం తను తప్పించుకున్న తీరు వైద్యం చేస్తున్న డాక్టర్‌కే ముచ్చట కల్పించిందని మిత్రులు కొందరు చెప్పారు. వైద్యం లేని రోగానికి జీవితేచ్ఛ అనే ఔషధాన్ని శేఖర్ సొంతంగా పరిశోధించి కనుగొన్నాడు. దానితోనే ఇన్నాళ్ళు చావును చంపుతూ బతికాడు. కానీ క్లినికల్ ట్రయల్స్ లెక్కలు ఎక్కడో తప్పాయి. డ్రగ్ డిజైనింగ్‌లో ఏదో తేడా జరిగింది. ఆ క్షణాన్ని క్షణంలో మృత్యువు అవకాశంగా తీసుకుంది.
చాలా కాలం క్రితం నేను విజయవాడలో వుండగా శేఖర్ చిన్న సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ ఆపరేషన్ తర్వాత చిన్న టిష్యూను బయాప్పీకి పంపినప్పుడు తనకేదో అంతుపట్టని జబ్బు వచ్చిందేమోనని భయపడ్డాడు. డాక్టర్‌తో మాట్లాడమని నాకు ఒక తెల్లవారుజామున హఠాత్తుగా ఫోన్ చేశాడు. నేను తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్‌తో తెలిసిన డాక్టర్ మిత్రుడితో మాట్లాడి భయపడాల్సింది లేదని చెప్పించాను.
సాధారణంగా ఏ కాస్త తేడా వచ్చినా నాతో చెప్పేవాడు. కానీ ఈ సారి ఆపరేషన్ జరిగిన తర్వాత తెలకపల్లి రవి చెప్పేదాకా తనకు ఇంత పెద్ద జబ్బు చేసిందని నాకు తెలియదు. ఇంత జబ్బులోనే… నాకు బైపాస్ జరిగిందని తెలిసి పలకరించడానికి రామ్‌నగర్ దాకా వచ్చాడు. సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఆ రోజు కలవలేకపోయాం. మిత్రులను సంతోషపెట్టడం శేఖర్‌కు ఇష్టమైన పనుల్లో కల్లా ఇష్టమైనది. ఇకముందు ఇలా సంతోషపెట్టేదెవరు. శేఖర్ లేని లోటును తీర్చేదెవరు.
–


విషం, విద్వెషం, పక్కవాడి కష్టాన్ని దోచుకునే తత్త్వం ఉన్న ఇలాంటి తెలబాన్లు పురుగులు పడి చస్తరనే దానికి ఈ తాలిబన్ వెధవే ఉదాహరణ. In the guise of artist he spwed venom and spread hatred and lies against the Andhra people.
LikeLike