ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి అని పించేట్లు రాశారు కావ్య కంఠులు .ఆ కవితా సౌభాగ్యం అందుకుందాం .

మూడవ శ్లోకం –‘’అర్చన కాలే రూప గతా ,సంస్తుతికాలే శబ్ద గతా –చింతన కాలే ప్రాణ గతా ,తత్వ విచారే సర్వగతా’’

జగదంబ పూజా సమయం లో పూజించాల్సిన మూర్తిలో ,స్తుతించే టప్పుడు శబ్ద రూపం లో ,ధ్యానించే టప్పుడు ప్రాణం లో ఉంటుందట .అంటే అంతటా సర్వ రూపిణిగా ఉంటుంది. అర్చన ,కీర్తన ,ధ్యానం ,తత్వ విచారణ సమయాలలో భగవతి ఆయా స్థానాలలో భక్తులకు సన్నిహితం గా ఉండి అనుగ్రహిస్తుందని భావం .అయిదవ శ్లోకం లో –

‘’అంబర దేశే శబ్ద వతీ పావక తాతే స్పర్శ వతీ-కాంచన వీర్యేరూప వతీ సాగర కామ్చ్యాం గంధ వతీ ‘’

ఉమాదేవి ఆకాశం లో శబ్దం గా ,వాయువులో స్పర్శగా తేజస్సులో రూపం గా ,భూమిలో గంధం గా ,ఉంటుంది అంటే శబ్ద స్పర్శ రూప రస గందాదులు అన్నీ ఆమెయే అని అర్ధం ‘.ఆరవ శ్లోకం –

‘’అప్స్యమ లాసు స్పష్ట రసా చంద్ర విభాయాం గుప్త రసా –సంసృతి బోగే సర్వ రసా పూర్ణ సమాదా వేక రసా ‘’

అంటే ‘’నిర్మల మైన నీటి లో వ్యక్తమయ్యే రసం గా ,చంద్ర కాంతి లో గూఢ మైన రసం గా ,, ప్రపంచాను భవం లో శృంగారం మొదలైన రసాలుగా ,సంపూర్ణ సమాధిలో ఆనంద రసం గా శ్రీ దేవి ఉంటుంది .తరువాత శ్లోకం –

‘’చక్షుషు దృష్టి  శ్శాససతమా చేతసి దృష్టిశ్సిత్ర తమా—ఆత్మని దృష్టిసశుద్ధ తమా బ్రాహ్మణి దృష్టిః పూర్ణ తమా’ ‘’

దేవి మన నేత్రాలలో దృష్టిగా ,మనసులో విచిత్ర భావనా దృష్టిగా ,ఆత్మలో సహజ ద్రుష్టి గా ,బ్రహ్మ లో సమగ్ర ద్రుష్టి గ ఉంటుంది .తరువాత –

‘’స్థూల శరీరే కాంతి మతీ ,ప్రాణ శరీరే శక్తి మతీ –స్వాంత శరీరే భోగవతీ,బుద్ధి శరీరే యోగవతీ  ‘’ గా వ్యక్తమవుతుందట .అంటే ‘’పాంచ భౌతికం అయిన ఈ శరీరం లో దేవి కాంతి గా ,భౌతిక జీవనానికి ఆధారమైన ప్రాణ దేహం లో శక్తిగా ,సుఖ దుఖాను భవ సాధనం అయిన మనోమయ దేహం లో భోగ శక్తిగా ,బుద్ధి మయ దేహం లో ఆత్మ స్వరూప నిష్ట గా ఉంటుంది .

పదవ శ్లోకం లో –‘’సారస బందో రుజ్జ్వలభా ,కైరవ బందో స్సున్దరభా –వైద్యుత వహ్నే రద్భుత భా ,భౌమ క్రుశానో ర్దీపకభా ‘

శ్రీ దేవి సూర్యునిలో జ్వజ్వల్యమాన మైన దీప్తి గా ,చంద్రునిలో ఆహ్లాదమైన కాంతిగా ,విద్యుత్తూ లో విచిత్రమైన మెరుపుగా  భూమి అగ్నులలో ప్రకాశం గా జ్యోతకమవుతుంది .తరువాత శ్లోకం –‘

‘శస్త్రధరాణాం భీకరతా శాస్త్ర ధరాణాం బోధకతా –యంత్ర ధరణాం చాలకతా,మంత్రం ధరాణాం సాధకతా’’

ఆయుధాలలో భయాన్ని కలిగించే శక్తిగా ,శాస్త్ర వేత్తలలో బోధనా శక్తిగా ,యంత్ర వంతులలో యంత్రాన్ని నడిపే శక్తిగా ,రహస్యాలోచన పరుల్లో కార్య సిద్ధి కర శక్తిగా ఉమా దేవి ఉంటుంది .అంతేనా –

‘’గాన పటూనాం రంజకతా ధ్యాన పటూనాం మాపకతా –నీతి పటూనాం భేదకతా దూతి పటూనాం క్షేపకతా ‘’

లలితా పరమేశ్వరి గాన విశారదులలో శ్రోతలను రంజింప జేసే శక్తిగా ఏకాగ్రమనసుతో ఆలోచించేవారికి విషయ నిర్ణయ శక్తిగా ,నీతి నిపుణుల్లో భేదక శక్తి గా ఇతరులను ప్రేరణ చెందించే వారిలో ప్రేరక శక్తిగా ఉంటుంది .తరువాత –

‘’దీధితి ధారా లోక యతాం జీవిత ధారా వర్త యతాం-జ్ఞాపక ధారా చింత యతాం,మాదక ధారా ద్రావయతాం’’

పార్వతీ దేవి –చూసేవారిలో అవిచ్చిన్న దర్శన శక్తిగా , జీవించే వారిలో జీవన శక్తిగా ,ధ్యానించే వారిలో జ్ఞప్తి శక్తిగా ,సహస్రారం లో సోమ రసాన్ని స్రవింప జేసే యోగులలో ను ,బయట యాగాలలో సోమ రస పాణం చేసే యజమానుల్లో హర్ష జనక శక్తి గా ఉంటుంది .పదహారవ శ్లోకం –

‘’సూరి వరాణాం వాద బలం వీర వరాణాం బాహు బలం –మర్త్య వతీనాం సైన్య బలం రాగవతీనాం హాస బలం ‘’

భట్టారిక –పండితులలో ప్రవచన సామర్ధ్యం గా ,గొప్ప వీరులలో భుజ బలం గా ,రాజుల్లో సేనా బలం గా ,అనురాగ వతులైన స్త్రీలలో హాస బలం గా ఉంటుంది .మరోశ్లోకం –

‘’వైదిక మంత్రే భావ మతీ తాంత్రిక మంత్రే నాద వతీ –శాబర మంత్రే కల్ప వతీ సంతత మంత్రే సారవతీ ‘’

ఆది శక్తి –గాయత్రి మొదలైన మంత్రాలలో అర్ధా వతి గా ,శ్రీవిద్యాది మంత్రాలలో నాదం గా సామాన్య మాటలలోచెప్పే శాబర మంత్రాలలో ఉపకరణ వస్తు సామగ్రిగా ,ఉచ్చ్వాస ,నిస్శ్వాస రూపం లో ఉండే ‘’హంస మంత్రం’’ లో స్తిరత్వం గా ను ఉంటుంది . మరికాస్త తరచి చూస్తె –

‘’బ్రహ్మ ముఖాబ్జే వాగ్వనితా వక్షసి విష్ణోః శ్రీర్లలితా –శంభు శరీరే భాగమితా విశ్వ శరీరే వ్యోమ్ని తతా’’

బ్రహ్మ ముఖం లో సరస్వతిగా ,విష్ణు వక్షస్థలం లో శ్రీ లక్ష్మిగా ,శంకర శరీరం లో అర్ధ భాగం గా ,ఆకాశం అంతా వ్యాపించి విశ్వేశ్వరి గా ఉమాదేవి ఉంటుంది .

భూమి ,గ్రహాలు ,ఖగోళాలు లను బంతుల్లా ఆడుకొంటూ ,సర్వ లోకాలను ధరించి అనంతం గా ఆకాశమంతా వ్యాపించి ,తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటుంది ఉమా పార్వతి .సూర్యాది మండల రూపం లో జీవుల్లో కుండలినీ శక్తిగా ,అజ్ఞానుల అభిప్రాయాల్లో మంచి స్త్రీగా ,పండితాభిప్రాయం లో పరమానంద రూపిగా ఉంటుంది .తేజో మయి అయినా చిత్త రూపిణిగా ,ప్రాణం దేహం గా కలదైనప్పటికి ప్రాణం గా, దేహం గా ఉంటుంది .బ్రహ్మ దేహం ,ప్రకాశం, ఐశ్వర్యం కూడా ఆమెయే .

‘’దుర్జన మూలో చ్చేదకరీ దీన జనార్తి ధ్వంస కరీ  –ధీబల లక్ష్మీ నాశ క్రుశం పుణ్య కులం నః పాతు శివా ‘’’

దుస్టూల్ని సమూలం గా నాశనం చేస్తూ ,దీనుల దుఖాన్ని పోగొడుతూ ,మంగళ రూపిణి అయిన ఉమాదేవి మన బుద్ధి,బలం ,సంపద నశించటం మూలం గా కృశించిన మన పవిత్ర మానవ జాతిని కాపాడు గాక అని గణపతి ముని ఇరవైనాలుగోశ్లోకం లో వేడుకొన్నారు .చివరి శ్లోకం –

‘’చంద్ర కిరీటా మ్భోజ దృశః శాంతి సమృద్ధం  స్వాంత మిమే –సమ్మద యంతు శ్రోత్ర శుఖాః సన్మణి బంధాః సూరి పతే ‘’

పండిత శ్రేష్టుడైన గణపతి ముని చెవులకు ఇంపు గా చక్కని ‘’మణి బంధ వృత్తాలు ‘’తో రచించిన ఈ స్తోత్రాలు చంద్ర శేఖర పత్ని అయిన ఉమా దేవి ప్రశాంత మానసానికి ఆనందం  కల్గించు గాక అని ప్రార్ధించారు కావ్య కంఠు లైన వాసిష్ట గణపతి ముని .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-4-8-14-ఉయ్యూరు

 

‘’

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.