భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి
ఎందరెందరో త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం .
![]()
కేరళ లో త్రివేండ్రం లోని వేంగ నూర్ లో 1863లో అయ్యం కాలి చర్మకార దళిత వంశం లో ఏడవ సంతానం గా జన్మించాడు .విద్యా గంధం లేని కుటుంబం .ఆ రోజుల్లో దళితులూ వీధుల్లో నడవటానికి అగ్రకులాలు ఒప్పుకోనేవే కావు .ఆడవాళ్ళు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు వక్షస్తలాన్ని వస్త్రం తో కప్పుకోనిచ్చే వారు కాదు .అయ్యం కాలి ఈ దురాచారాలను రూపు మాపాలని పిలుపునిచ్చి దళితులను సమైక్య పరచాడు .’’అయ్యావు స్వామి ‘’అనే ఒక సాధువు వీరికి అండగా నిల బడ్డాడు .ఈ స్వామి అంటే విపరీతమైన ఆరాధనా భావం ఉండేది . మనుస్మృతికి వ్యతిరేకం గా ప్రదర్శనలు నిర్వహించి ,కుల మతాలకూ తావు లేని సమాజం కోసం వీధులలో నిషిద్ధ మైన ప్రదేశాలలో ఎడ్ల బండి మీద ఊరేగుతూ ప్రచారం చేసి అందర్నీ నిరుత్తరుల్ని చేశాడు .దళిత బాలలు చదువుకోవాలని హితవు చెప్పాడు వారికోసం వెంగనూర్ లో ఒక స్కూల్ ప్రారంభించాడు .ఆ కాలం లో దళితులకు టీ షాపుల్లో టీ ని కొబ్బరి చిప్పలలో మాత్రమె పోసి ఇచ్చేవారు .దీన్ని వ్యతిరేకించి అందరితో సమానం గా తమకూ టీ తాగే హక్కు ఉందని డిమాండ్ చేసి సాధించాడు .దళిత పిల్లలను అందరితో పాటే స్కూల్ లలో చదివే ఏర్పాటుకు ,కూలీల పని గంటల ను తగ్గించటం ,జీతాలను ధాన్యం రూపం గా కాకుండా డబ్బు రూపం లో ఇప్పించటం లో సాధించి భారత దేశం లో మొట్ట మొదటి కార్మిక నాయకుడు అయ్యాడు అయ్యం కాలి .
దళితులకు సమానమైన మానవ హక్కుల సాధన కోసం కృషి చేశాడు.వీటినే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం లో పొందు పరచారు .కేరళలో కార్మిక సంఘాలు లేనికాలం లోనే ,వారి బాగోగులకోసం వేతనాల కోసం శ్రమించిన మకుటం లేని కార్మిక నాయకుడని పించాడు .నిరక్షర కుక్షి అయిన ఆతను ఇన్ని పనులకు ఆద్యుడుగా ఉన్నాడంటే ఆశ్చర్యమేస్తుంది .అంత ముందు చూపున్న నాయకుడు .మంచి చేయటానికి విద్య అవసరం కాదు అని నిరూపించాడు .1910అయ్యం కాలి ని ట్రావెంకూర్ అసెంబ్లీ స్థానానికి నామినేట్ చేసి ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ,గౌరవించి ప్రతిస్పందించింది .కేరళ ఆధ్యాత్మిక గురువు , సంఘ సంస్కర్త ‘’నారాయణ గురు ‘’ఆశీస్సులు ,అండా పుష్కలం గా లభించాయి .దీని ఫలితం గా 1900నాటికి కేరళ ప్రభుత్వం దళితులను బజారులలో నడిచే హక్కు ,దళిత విద్యార్ధులను స్కూళ్ళ లో చదువుకొనే హక్కు కలిపించింది .
అయ్యం కాలి ఉద్యమానికి అగ్రకులస్తులు ,ప్రజాసభ ‘’ లో సభ్యులైన సంపన్నులు కూడా మద్దతు పలికారు .కుట్టనాడులో’’ పల్లితానం లూకా మత్తయ్య ‘’ అనే ప్రజా సభ సభ్యుడు దళితుల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు .ఆయన్ను ‘’కుట్టనాడు కాయ రాజా ‘’అనిఅప్పటినుంచి అందరూ గౌరవం గా పిలిచారు .’ఆయన కేరళ లోని ఛాందస సిరియన్ క్రిష్టియానిటి మతస్తుడైనప్పటికి ,అయ్యం కాలి చేబట్టిన ప్రతి సాంఘిక సంస్కరణకు మనస్పూర్తిగా మద్దతు పలికి సహక రించాడు .స్నేక్ బోట్లు ఇతర నావలలో వందలాదిగా అయ్యం కాలి తో వచ్చిన దళితులకు తన స్వంత ఊరు ‘’నలు కెట్టు ‘’లో స్వాగతం పలికి వారితో సహా పంక్తి భోజనం చేసిన సంస్కారి లూకా ముత్తయ్య .
పేద ప్రజలకు ఆసరాగా ‘’సాధుజన పరిపాలన సంఘం ‘’స్థాపించి ,వ్యవసాయ కార్మికులకు వారానికి ఆరు రోజుల పని ఏర్పాటు చేశాడు అయ్యం కాలి .1941 జూన్ పద్దేనిమిదిన ఈ కేరళ మహోద్యమ కారుడు 78వ ఏట అయ్యం కాలి కాల గర్భం లో కలిసిపోయాడు .కేరళ ప్రజలు ఆయన్ను ”మహాత్మా అయ్యం కాలి ”అని గౌరవం గా సంస్మరిస్తారు అతని సంస్కరణలు నారాయణ గురు సంస్కరణలంత ప్రాచుర్యం పొందాయని కేరళ ముఖ్య మంత్రి అన్నాడు .1907లో అయ్యం కాలి నిర్వహించిన చారిత్రాత్మక రైతుకూలీ ప్రదర్శన చిరస్మరణీయం అని నంబూద్రిపాద్ మెచ్చుకొన్నాడు .వేల్లయామ్బలం జంక్షన్ లో ఆయన శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు .పద్మ నాభ స్వామి దేవాలయానికి వెళ్ళే వారంతా ఈ విగ్రహాన్ని దర్శించే వెడతారు .’’విముక్తి –విప్లవ నాయకుడు –అయ్యం కాలి ‘’అన్నాడు కేరళ ఉఖ్య మంత్రి ఇ.కే నయనార్ .ఆ నాటి సంఘ సంస్కర్తలైన రాజా రామ మోహన రాయ్ ,రామ కృష్ణ పరమ హంస ,స్వామి వివేకానంద్ ,దయానంద సరస్వతి అయ్యం కాలి జీవించి ఉన్న కాలం వారే కావటం,సమకాలీనులవటం విశేషం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-14-ఉయ్యూరు

