సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని
కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని సమన్వయము చేశారు .ఆ వైభోగమే మనం ఇప్పుడు దర్శించ బోతున్నాం .
ఏడవ శ్లోకం ‘’భూమి రుహాగ్ర స్థాపిత భాండా ద్యో మధు పాయం పాయ మజశ్రం
విస్మృత విశ్వో నన్దతి మాత స్తత్ర కిల త్వం ధామ దదాసి ‘’-లో ‘’అమ్మా!చెట్టు చివరనున్న పాత్ర(తాటి చెట్టు చివర కట్టిన కల్లు కుండ) నుండి మదకరమైన మధువును నిరంతరం తాగి తాగి ప్రపంచాన్ని విస్మరించి ఆనందించే శివుని యందు నీవు ఉంటావట ‘’అన్నారు .ఇక్కడ వాసిష్ట గణపతి ముని ఆంతర్యం ఏమిటో తెలుసుకొందాం .శరీరమే చెట్టు .దాని చివరిభాగమే శిరస్సు .అందులోని సహస్రారమే పాత్ర .అందులో కారే సోమ రసమే మధువు .ఆ మధుపానం వలన కలిగిన బ్రహ్మానందమే మదం .దాని వల్లే ప్రపంచాన్ని మర్చి పోవటం .ఇలా బ్రహ్మానందం లో అన్నీ మరచి ఉన్న వ్యక్తీ పరమ శివుడు .ఆయన అంతటినీ దేవీమయం గానే భావిస్తూ ,అన్నిట్లోనూ దేవినే దర్శిస్తాడని భావం .తరువాత శ్లోకం
‘’కోపి సహస్రై రేష ముఖానాం శేష ఇతీడ్యఃపన్నగ రాజః –ఉద్గిర తీదంయద్వనేభ్యో దేవి!తనౌ మే తద్బత!పాసి ‘’
లో’’ఇలాంటిది అని వర్ణించ టానికి వీలు కాని ఒక అనుభవం వెయ్యి శిరస్సులున్న ఆది శేషుని లాగా నా దేహం లో అనుక్షణం విషం లాగా తాపాన్ని కలిగిస్తోంది .దాన్ని నువ్వు తాగి నా తాపాన్ని హరిస్తున్నావు .అయ్యో నీకు యెంత కష్టం కలిగిస్తున్నాను తల్లీ ‘’అంటారు .ఇందులోని అంతరార్ధం –దేవి అనుగ్రహం తో యోగ సాధన జరుగుతుంటే ,ఏ సిద్ధీ సిద్ధాచక ముందు ఒక తాపం శరీరం అంతా వ్యాపిస్తుంది .దాన్ని అమృతమయి అయిన దేవి హరించి సాధకుడిని కాపాడుతుంది .ఇది గణపతి ముని గారి స్వానుభవమే .ఇప్పుడు సముద్ర మధనం దగ్గరకు ప్రవేశిస్తున్నాం .
‘’మందర దారీ నామృత హేతు ర్వాసుకి రజ్జు ర్నామ్రుతా హేతుః -మంధన హేతు స్సామృత హెతుః సర్వ బలాత్మా శర్వ పురంధ్రీ ‘’
అన్న శ్లోకం లో ‘’అమృత మధన సమయం లో మందర పర్వతాన్ని మోసిన ఆది కూర్మ మైన శ్రీహరి కాని ,కవ్వం తాడు అయిన వాసుకి కాని అమృత ప్రాప్తికి కారణం కాదు .మధనానికి కారణం అయిన సర్వ బాల స్వరూపిణి అయిన ఉమా దేవియే అమృత ప్రాప్తికి కారణం అన్నారు గణపతి ముని .అంటే మందరం, వాసుకి సహాయ కారులె కాని అమృత ప్రాప్తికి భగవతి ఏ కారణం అని కవి హృదయం .
‘’ప్రాణి శరీరం మందర శైలో మూల సరోజం కచ్చప రాజః –పూర్ణ మనంతం క్షీర సముద్రః పృష్ట గ వీణా వాసుకి రజ్జుః’’
అనే శ్లోకం లో ముని ‘’జీవుని దేహమే మందర పర్వతం .మూలాధార పద్మమే కూర్మ రాజు .దహరా కాశమే క్షీర సాగరం వెన్నెముక అయిన వీణా దండమే రజ్జువు అయిన వాసుకి .అని యోగ శాస్త్ర రహస్యార్ధాన్ని వివరించారు .తరు వాతిశ్లోకం –
‘’దక్షిణ నాడీ నిర్జర సేనా వామగ నాడీదానవ సేనా –శక్తి విలాసో మంధన కృత్యం శీర్షజ ధారా కాపి సుదోక్తా ‘’
అంటే ‘’దేహమధ్యం లోఉన్న సుషుమ్నా నాడికి కుడి వైపు ఉన్న పింగళ నాడి దేవతా గణం .సుషుమ్నకు ఎడమ వైపున ఉన్న ఇడానాడి రాక్షస గణం .శక్తి యొక్క క్రీడయే మధనం అనే కార్యం .సహస్రం నుండి వెలు వడిన ఆనంద ధారయే అమృతం .అని యోగార్ధాన్ని వివరించారు .ఇంకొంచెం ముందుకు సాగి తరువాతి శ్లోకం లో
‘’కంఠ నిరుద్దే భూరి విషాగ్నౌ తైజస లింగా వాసి హరేణ-త్వద్బల జాతం స్వాద్వమృతం కో దేవి!నిపీయ ప్రేత ఇహ స్యాత్ ‘’అంటారు –‘’తేజస్వరూపిణివి అయిన మాతా !అమృత మధన సమయం లో మొదట వాసుకి ముఖం నుంచి వెలువడిన విషాగ్నిని తేజోమయ లింగ వాసి అయిన రుద్రుడు తన కంఠం లో దాచేశాడు .నీ శక్తి వలన పుట్టిన మధురామ్రుతాన్ని గ్రోలాడు కనుక బతికి బయట పడ్డాడు ‘’.అంటే అమ్మ బలం వల్లకలిగిన అమృతాన్ని తాగిన వాడికి మరణం ఉండదని అర్ధం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

