గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం
కావ్య కంఠ ,వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’షస్ట శతకం’’ఏక వింశ స్తబకం ‘’(21) లో ‘’అనుష్టుప్ ‘’వృత్తాలలో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని మహా వైభవం గా వర్ణించారు .ఆ సొగసు చూడ తరమా –చూద్దాం –
‘’ఇతం పీత్వాకుచం స్కంధే ప్రసారితకరే తతః –జయతి స్మిత ముద్భూతం శివయో రేక దేహయోః’’అంటూ ప్రధమ శ్లోకం రాశారు .బాల సుబ్రహ్మణ్యం ఎడమవైపునున్న స్తనం నుండి పాలు తాగి ,కుడి వైపుకు చేతులు చాపగా ఒకే శరీరం కల పార్వతీ పరమేశ్వరులకు పరమ ఉత్కృష్టమైన నవ్వు కలిగిందట .
వామభాగం లో రత్నాలు పొదిగిన అందెల ధ్వనికి ఆకర్షితులైన హంసలు ,కుడి వైపు అందెగా ఉన్న నాగ రాజు బుసలతో వాటిని భయ పెడుతున్న నారీ ,పురుషాకారం కల ఒక దివ్య వస్తువు తన హృదయం లో ఉండుగాక అని కోరారు రెండవ శ్లోకం లో .ఎడమ వైపు దేవ సేనా నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జా గిస్తూ ,కుడి వైపు ఒడిలో గణపతి శిశువును ధరించిన అర్ధనారీశ్వరత్వం కాపాడు గాక అని మూడో శ్లోకం లో అంటారు .నాలుగులో
‘’విడంబిత బ్రహ్మ చారి కోకైకస్తన మేకతః –కవాతార్ధ నిభం బిభ్ర ద్వక్షః కేవల మన్యతః ‘’
ఎడమ వైపు తోడూ (జంట)లేకుండా జక్కవ పక్షి లాగా ఉన్న ఒంటి చన్ను కలిగి ,కుడి వైపున తలుపు చెక్క లాగా (బేస్ బాల్ కోర్ట్-లేక టెన్నిస్ కోర్ట్ )విశాలం గా ఉన్న స్తనంలేని వక్షం ఉన్న నారీ పురుషాకారం తనను రక్షించు గాక అన్నారు .తరువాత పార్వతీ భాగం లో శ్వాసిస్తూ కుమారస్వామి పాలుతాగుతుంటే ,పరమేశ్వర భాగం లో బుసకొట్టే భయంకర సర్పం ఉన్న అర్ధనారీశ్వరులు కాపాడాలని కోరుకొన్నారు .ఎడమ వైపు తామర తూడు లాగా మెత్తగా మృదువుగా ఉన్న బాహు లతను ధరిస్తూ ,కుడివైపు ఐరావత గజ తొండం లాగ భీకర బాహుదండం ఉన్న స్త్రీపురుషత్వం కాపాడాలని కోరారు .ఏడవ శ్లోకం లో –
‘’కుత్రాప్య విద్య మానే పి వందనీయేతదా తదా-పరస్పర కర స్పర్శ లోభాతో విహితాంజలి’’
పార్వతీ పరమేశ్వరులిద్దరికి ఎవరికీ నమస్కరించాల్సిన అవసరం లేని సర్వోత్రు క్రుస్టూలు . కాని అప్పుడప్పుడు ఒకరి చేయి మరొకరు తాకాలనే కోరికతో దోసిలి రూపం తో నమస్కరిస్తున్నట్లు కని పిస్తారని చమత్కరించారు కవి .మరో శ్లోకం –
‘’శక్ర నీల సవర్నత్వా ద్భాగయో రుభయోరపి –ఊర్ధ్వాధరాం గ సాపేక్ష సంధి జ్ఞాన గల స్థలం ‘’
కంఠ స్థలం లో కుడి ఎడమ భాగాలు రెండూ కూడా ఇంద్రనీల మణుల్లాఉన్నందున ,ఆ సంధి జ్ఞానం పై కింది అంగాల ఆపేక్ష కలది అయి అక్కడ ఉన్న అర్ధ నారీశ్వార వస్తువు నా హృదయం లో ఉండుగాక అని ప్రార్ధించారు .ఇక్కడ కొంత వివరణ అవసరం –దేవి కాళికా స్వరూపం కనుక ఆమె కంఠం ఎడమ భాగమంతా నీలం గా ఉంటుంది. తెల్లని శరీరం కల శివుడు విషాన్ని కంఠం లో దాచినందు వల్ల కుడి భాగం నీలం గా ఉంటుంది .ఇలా కంఠం అంతా నీలం కాగా ఏది పార్వతీదేవి కంఠం లో సగం, ఏది శివుని కంఠం లో సగం అని తెలుసుకోవటం కష్టం గా ఉంది అని కవి భావం .కాని కుడి భాగం లోశివుడి కంఠం మీదున్న తెలుపు కంఠం కింద ఉన్న తెలుపుల ను బట్టి పార్వతీ పరమేశ్వరుల కంఠసంధి భాగాన్ని గుర్తించి తెలుసుకోవాలి అని భావం .
ఎడమ వైపు కలువలను వికసింప జేసే చంద్రుడు నేత్రం గా ,,కుడివైపుపద్మాలను వికసింప జేసే సూర్యుడిని నేత్రం గా కలిగి ఉన్న అర్ధనారీశ్వరాన్ని స్తుతించారు .ఎడమ వైపు అందమైన నల్ల గ్రుడ్డున్న నేత్రం చేత ,కుడివైపున చేతుల్లో ఆడు కొనే లేడి పిల్ల ఉన్నదట . అంటే పార్వతికన్ను శివుడి చేతిలో ఉన్న లేడి పిల్ల దృష్టివిలాసాన్ని ,శివుడి చేతిలో ఉన్న లేడి పిల్ల పార్వతి ద్రుష్టి విలాసాన్ని నేర్చుకోన్నాయని చమత్కారం .లలాటం లో ఎడమ వైపు కాశ్మీర సుగంధ ద్రవ్యం చేత ,కుడి వైపు మన్మధ దహన అగ్ని నేత్రం చేత అలంకరింప బడి ఉందట .ఒక వైపు మంచి వారికి క్షేమం కలిగించే చూపు ,రెండవ వైపు దుస్టూలకు భయం కలిగించే మండే చూపు ఉన్నాయట ..ఎడమ వైపు నల్లని మెరసే కేశాలుంటే ,కుడివైపు అగ్ని జ్వాలల్లా పాటల వర్ణ జడలున్నాట.అర్ధ నారీశ్వర వక్షం లో ఎడమ వైపు కేశపాశం ,కుడి వైపు సర్పహారాలున్నాయి .ఎడమవైపు కొత్త పారిజాత పుష్ప మాల ఉంటె ,కుడివైపు పెద్ద కెరటాలతో ఉన్న ఆకాశ గంగ ఉందట .వెండికొండలో ,యోగుల మనస్సుల్లో విహరించే అర్ధ నారీశ్వరం .యెర్రని ఈశ్వర జటా జూటం యెర్రని సంధ్యాకాశం లా ఉంటె దేవి కురులు సంధ్యాకా మేఘం లాగా ఉన్నాయట .
‘’దమత్యో ర్యువాయో రేష లోపో యన్నాస్తి శైలజే –వామం పార్శ్వం విభో స్షేతుం దాతుం తే దక్షిణ కరః ‘’
‘’అమ్మా పార్వతీ !ణ పతి శివుడికి శయ నించటానికి ఎడమ వైపు లేదు .దానం ఇవ్వటానికి నీకు కుడి చెయ్యి లేదు దంపతులైన మీ ఇద్దరికీ ఇదే లోపం అని భలేగా చమత్కరించారు ముని
లోకం లో స్త్రీలు రెండుస్తనాల తో ఒక్క బిడ్డను పోషించ గలరో లేదోకాని నువ్వు మాత్రం ఒకే స్తనం తో ముల్లోకాలనూ పోషిస్తున్నావు .స్త్రీలు కడుపులో ఒక బిడ్డను మోయటానికే ఆప సోపాలు పడతారు .నువ్వు మాత్రం సగం కడుపుతో మూడు లోకాలని అవలీలగా మోస్తున్నావు .
‘’అనురూపా శివస్య త్వమనురూపః శివస్తవ –ఆలం కారో నురూపో వా మకలంకో ర్భకః శశీ ‘’ .
అమ్మా ! మీ ఇద్దరు ఒకరికి ఒకరు తగిన వారు .మీ ఇద్దరికీ తగిన ఆభరణం కళంకం లేని చంద్రుడు .
‘’తవైవ తవ దేహామ్శో హరస్యైవ హరస్య యః –ప్రాణాస్తూ జగతాం ధాత్రి హరస్య త్వం హర స్తవ ‘’
జగదీశ్వరీ !నీ దేహం నీదే –దానిపై శివుడికి అధికారం లేదు .శివుని దేహ భాగం ఆయనదే. దానిమీద నీకూ అధికారం లేదు .దేహ భాగాలు వేరైనా శివుడికి నువ్వు ప్రాణం ,శివుడు నీకు ప్రాణం గా ఉంటారు .కనుక మీ దాంపత్యం, ప్రేమ లోకోత్తరం అంటారు .ఇద్దరూ ఏకం గా ఉన్న దయామయమైన మీ మనస్సు మాకు శుభం చేకూర్చాలి అని ఇరవై నాలుగో శ్లోకం లో కోరారు .
చివరిదైన ఇరవై అయిదవ శ్లోకం లో మళ్ళీ ఒక చమత్కారం చేశారు –
‘’భవస్య భాగ ముత్సృజ్య భవానీ భాగ మాత్మనః –భజ త్వనుస్టూ భా మాసాం సృస్తానాం నార సింహినా ‘’
నరసింహుని పుత్రుడినైన ఈ గణపతి ముని కవి అనుష్టుప్ ఛందస్సులో భవ (శివ) వర్ణన పరమైన పద్య భాగాన్ని నీ భర్త భవునికి వదిలేసి భవానీ !నీకు సంబంధించిన పద్య భాగాన్ని నువ్వు స్వీకరించు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-14-ఉయ్యూరు

