కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1
ట్రావెన్ కూర్ ఝాన్సి రాణి –అక్కమ్మ చెరియన్
అక్కమ్మ చెరియన్ మంచి విద్యా వంతురాలు .మిడిల్ స్కూల్ టీచర్ గా పని చేసింది .ఆ కాలం లో ‘’బుడత కీచులు ‘’అనబడే పోర్చు గీసు వాళ్ళు ,బ్రిటిష్ వాళ్ళ భారతీయుల యెడ చాలా క్రూరం గా ప్రవర్తించేవారు .సరిహద్దులు దాటి చొరబడి భీభత్సం సృష్టించేవారు .దయా దాక్షిణ్యాలు వాళ్ళ డిక్షనరీలో కనిపించేవికావు ఇళ్ళల్లో చొరబడి నిప్పు పెట్టె నీచులు .వీటన్నిటిని చూసి సహించలేక చెరియన్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య యుద్ధం లో పాల్గొన్నది అన్ని అందోళనలలో చురుగ్గా పని చేసింది .1938లో కేరళలో కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .దీనికి నిరసనగా అక్కమ్మ చెరియన్ అందరిని కలుపుకొని బ్రహ్మాండ మైన నిరసన ప్రదర్శనను తాంపనూర్ నుంచి కౌడియార్ పాలస్ వరకు నిర్వహించింది .దీనిపై స్పందించిన ప్రభుత్వం వారిపై కాల్పులు జరుప బోతున్నట్లు ప్రకటించింది .ముందుగా తనను కాల్చి తర్వాత తన అనుచరులను కాల్చమని చెరియన్ ముందుకొచ్చి ధైర్యం గా తుపాకులకు గుండెను ఎదురు పెట్టి నిలబడింది .కంగు తిన్న బ్రిటిష్ ప్రభుత్వం కాల్పుల ఆర్డర్ ను ఉపసంహరించుకోన్నది .ఆమె సాహసానికి మహాత్మా గాంధి ‘’ట్రావెంకూర్ ఝాన్సి రాణి ‘’అని ఆమెను శ్లాఘించాడు .ఇది ఆమె జీవితం లో ఒక సాంపిల్ మాత్రమే .భారత ప్రజలకు వ్యతిరేకం గా బ్రిటిష్ ప్రభుత్వం చేబట్టిన అన్ని పనులను ఎదురొడ్డి నిల్చి నిరసన తెలుపుతూ ,ఆందోళన చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తూ జీవిత మంతా గడిపిన శ్రేస్టవీర వనితఆమె
.
కుట్టిమాలు అమ్మ
ఈమె మరొక పోరాట యోధురాలు .బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచినా స్త్రీ మూర్తి .మహిళలను ఐక్యపరచి పోర్చుగీస్ వారికి వ్యతిరేకం గా ఉద్యమించింది .విదేశీ వస్త్రాలు ధరించవద్దని కేరళ ప్రజలను కోరింది .సహాయ నిరాకరణ ,క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది .
అమ్ము స్వామినాధన్
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు అత్యంత విదేయుదు అమ్ము స్వామినాధన్ భర్త నాయర్ .సుభాస్ బాబు లాగా ధైర్య వంతుడు అలానే ప్రవర్తించేవాడు .అన్ని ఉద్యమాలలో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించాడు .భర్త బోసు బాబు అడుగు జాడల్లో నడిస్తే భార్య అమ్ము స్వామినాధన్ గాంధీ మహాత్ముని అహింసా సిద్ధాంతాన్ని నమ్మి ,ఉద్యమాలు నిర్వహించింది .దీని వలన కేరళీయుల హృదయాలలో ఆమె అమ్మగా నిలిచిపోయింది .కేరళ అసెంబ్లీ శాసన సభ్యురాలుగా ,కేరళ నుండి రాజ్య సభకు ఎన్నికైన పార్ల మెంట్ సభ్యురాలుగా ఆమె సేవలు అందించింది .
ఇంకా కొంతమంది స్త్రీ సమర యోధులు ఉన్నా వారి గురించి రికార్డుల్లో ఎక్కడా కనిపించక పోవటం దుర దృష్టం .
ఇప్పుడు కొందరు పురుష యోధుల గురించి తెలుసుకొందాం
మొహమ్మద్ అబ్దూర్ రేహిమాన్
కొచ్చిన్ రాష్ట్రం కొడంగల్లూర్ జిల్లాలోని అజ్హికోడ్ లో రేహిమాన్ 1898లో జన్మించాడు .మద్రాస్ లో ఆలిగ్హాడ్ లలో విద్య నేర్చాడు .ఆలిగ్హాడ్ యూని వర్సిటిలో చదువుతూ మలబార్ లో సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలలో లో పాల్గొని చదువుకు స్వస్తిపలికాడు .1921లో ‘’మోఫ్లా తిరుగు బాటు ‘’జరిగినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీవ్రం గా కృషి చేశాడు .మోఫ్లా తిరుగు బాటు దారుల తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నం చేసినప్పటికీ రేహిమాన్ ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .రెండేళ్ళు జ్జైలు శిక్ష అనుభవించాడు .
1930కాలికట్ బీచ్ లో ఉప్పు సత్యాగ్రహాన్ని చేస్తున్న రేహిమాన్ ను పోలీసులు చితకబాది అరెస్ట్ చేసి కన్ననూర్ సెంట్రల్ జైలు లోతొమ్మిది నెలలు నిర్బంధించారు’’.ఒ ఆల్ అమీన్ ఒ ‘’ అనే పత్రికను 1929నుండి పదేళ్ళు నడిపాడు .ప్రభుత్వ దమనకాండ వలన పత్రిక మూసి వేయాల్సి వచ్చింది .కాలికట్ మునిసిపల్ కౌన్సిలో 1931నుంచి మూడేళ్ళు మెంబర్ గా ఉన్నాడు .మలబార్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ గా కూడా పని చేసి తర్వాత మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి 1937లో ఎన్నికైనాడు .
1937కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ,1939జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాడు .నేతాజీ కి వీర విదేయుడైన రేహిమాన్ ఫార్వార్డ్ బ్లాక్ లో చేరి సేవలందించాడు .రెండవ ప్రపంచ యుద్ధం మొదలవగానే రేహిమాన్ ను అరెస్ట్ చేసి 1940నుండి 1945వరకు అయిదేళ్ళు జైలు లో ఉంచారు .విడుదల కాగానే కాలికట్ వెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లో క్రియాశీలకం గా పని చేశాడు .ఒక బహిరంగ సభలో ప్రసంగించి 22-11-1945నమహమ్మద్ అబ్దూర్ రేహిమాన్ మరణించాడు .ముస్లిం లీగ్ చెప్పే ద్విజాతి సిద్ధాంతాన్ని రేహిమాన్ పూర్తిగా వ్యతిరేకించేవాడు .మంచి వక్త రచయితా సమర్ధ నాయకుడు ,సాహస స్వాతంత్ర్య యోధుడు రేహిమాన్ లేని లోటు తీర్చలేనిదే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-14-ఉయ్యూరు

