జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

విజయవాడ లో శ్రీక్షేత్రయ్య కళా క్షేత్రం లో ఈ రోజు 9-8-2014ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ద  ప్రసాద్ గారు స్వంత ఖర్చులతో  జాతీయకవి ,జానపదకవిరాజ శేఖరుడు కళాప్రపూర్ణ స్వర్గీయ జాలాది రాజారావు గారి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరణ   చేశారు  . ఆతర్వాత  సభను ఆంధ్రా ఆర్ట్ అకాడెమి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో నిర్వ హిం చారు .సభాధ్యక్షులుగా అకాడెమి కార్య దర్శి శ్రీ గోళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ జాలాది ప్రజల నాడిని స్పందించే కవిత్వం రాశారని ,ఆయన పాటలు గుండె లోతుల్లోంచి పుట్టినవని అందుకే అంత ఆర్ద్రం గా ,ఆవేదనా భరితం గా ,ఆలోచనాత్మకం గా రాశాడని చెప్పారు .సభను శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభిస్తూ జాలాది తో అయన కుటుంబం తోను మొదటినుంచి పరిచయం ఉందని ఆయన జన్మ దినం రోజున విగ్రహావిష్కరణ చేయటం చిరస్మరణీయమన్నారు .

నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ దేవి నేని ఉమా మహేశ్వరరావు నందిగామలో తన అన్నగారు స్వర్గీయ దేవినేని రమణ ,జాలాది మంచి మిత్రులని జాలాది లేకుండా ఏ సభకూ రమణ వెళ్ళే వారు కాదని తనకూ అన్నగారివలన జాలాది ,ఆయన కుటుంబం మంచి సన్నిహితులయ్యారని గుర్తు చేసుకొన్నారు .ముఖ్యమంత్రి శ్రీ చంద్ర బాబు నాయుడు తోనూ జలాదికిబాగా పరిచయం ఉందని చెప్పారు .వీలు చూసుకొని మనం అందరం కలిసి ఒక రోజల్లా జాలాది పై ఒక సెమినార్ నిర్వహిద్దామని దానికి ముఖ్య మంత్రి గారిని తీసుకొచ్చే బాధ్యతా తనదని చెప్పారు . ఆ మధ్య తెలంగాణా సి ఏం .టాంక్ బ్యాండ్ పై బళ్ళారి రాఘవ వంటి ఉత్తమ కళా కారుల విగ్రహాల విషయం లో అవాకులు చవాకులు పేలితే తామందరం శ్రీ బుద్ధ ప్రసాద్ గారి దృష్టికి తీసుకొని వెళ్లామని ,ఏదో ఒక తీవ్రమైన  స్టేట్ మెంట్ మనందరి తరఫునా ఇమ్మని కోరామని దానికి ఆయన నవ్వుతూ మనం మాట్లాడ వద్దు చేసి చూపిద్దాం అన్నారని , రాఘవ గారిపై హైదరాబాద్ లోనే సభ పెట్టి ఆయన బహుముఖ ప్రజ్ఞ ను అందరికి తెలియ జేషిన కార్య శీలి శ్రీ బుద్ధ ప్రసాద్ గారని చెప్పారు .అలాగే భారతదేశం గర్వింప దగిన ఇంజినీర్ స్వర్గీయ కే.ఎల్. రావు గారిపైనా అ సభ పెట్టి దీటుగా సమాధానం చెప్పి మనవాళ్ళ సత్తా ఏమిటో హైదరాబాద్ లో రుజువు చేశారు బుద్ధ ప్రసాద్ అని జ్ఞాపకం చేసుకొంటూ ఇవాళ ఇక్కడ జాలాది విగ్రహమూ అలాంటి వారికి కనువిప్పు కలిగించేదే అన్నారు .

జాలాది పై  రిసెర్చ్ చేసి ఏం ఫిల్ ,సమర్పించి పి హెచ్ డి .సాధించిన  ఆయన కుమార్తె శ్రీమతి విజయ తామొక సంస్థను స్తాపించి జాలాది ఆశయాలకు అంకితమై పని చేస్తున్నామని ,విశాఖ లో జాలాది నిలువెత్తు విగ్రహాన్ని అందరి సహకారం తో ఏర్పాటు చేశామని ,తమకు బుద్ధ ప్రసాద్ గారు అన్నయ్య వంటివారు లక్ష్మీ ప్రసాద్ బాబాయి అని అలానే తాము పిలుస్తామని చెప్పింది .జాలాది పాటలను అందులో ఈటెల్లాంటి మాటలను ఆమె ప్రస్తావించి సభా రంజనం చేసింది .తండ్రిపై ఒక పవర్ ప్రాజెక్ట్ తయారు చేసి ప్రదర్శించింది .తాము దళితులమైనా జాలాది ఏనాడు తనను దళిత కవి అని చెప్పుకోలేదని ,విస్తృత భావాలు మనసు ఉన్న కవి అని ,సమాజ హితమే ధ్యేయం గా రాశాడని ,రాజసం గా జీవిన్చారని ఎప్పుడూ మీ చెయ్యి పైనే ఉండాలి కాని కింద కాదు అని తమకు బోధించేవారని గుర్తు చేసుకొన్నది .

ముఖ్య అతిధి శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’జాలాది కృష్ణా జిల్లా కవి అని ,గుడివాడ దగ్గర దొండ పాడు లో జన్మించారని ఆయన తాత గారు భగత్ సింగ్ అనుయాయి ,తండ్రి ఇమాన్యుల్ స్వాతంత్ర్య సమార యోధుడని జాలాది కూడా చిన్న తనం లో సమారా యోధులకు   రహస్యం గా సమాచారం అందిస్టూ ఉండేవాడని కనుక వారి కుటుంబం లో దేశ భక్తీ జీర్ణించుకు పోయిందని అందుకే ‘’పుణ్య భూమి నా దేశం నమో నమామి ‘’అనే  జాతి జీవితాన్ని ప్రభావితం చేసే పాట రాసి అవార్డ్ అందుకోన్నాడన్నారు .శ్రీకాకుళం జిల్లా వీరవాసరం లో డ్రాయింగ్ మేస్టారు గా జీవితం ప్రారంభించాడని జాలాది చనిపోతే ఆ గ్రామం అంతా తరలి వచ్చి చివరి దర్శనం చేసుకొన్నారని అంతటి ప్రభావం అక్కడ కలుగ జేసిన వ్యక్తీ అని జ్ఞాపకం చేశారు .తెలుగు భాషా సమాఖ్య శ్రీకాకుళం లో మొదటి సారి సభ జరిపినపుడు జాలాది వచ్చి,పాల్గొని దశా దిశా నిర్దేశం చేసి తమను నడిపించాడని ఆయనకు భాష పై అంత ఆరాధనా భావం ఉండేదని చెప్పారు .అవని గడ్డలో తనతో పాటు ఆరేడు మండలాలు పర్య టించి ప్రతి చోటా గంటకు తక్కువ కాకుండా ప్రసంగించి ,జనాలలో భాష పట్ల అవగాహన కల్గించి చైతన్య పరచిన వ్యక్తీ జాలాది అని కొని యాడారు .

జాలాది భార్య శ్రీమతి ఆగ్నేశమ్మ ప్రభుత్వ ఉద్యోగి అని ,ఆమెకు నందిగామ దగ్గర కోనాయ పాలెం బదిలీ అయితే అక్కడికి జాలాది కుటుంబం వచ్చిందని ,కోనాయ  పాలెం లో నీరు ఫ్లోరిన్ తో నిండి అనేక జబ్బులకు కారణం అవుతుంటే ఇరవై రోజులు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం మెడలు వంచిఅక్కడ లోతుగా బోర్లు వేయించి ఫ్కోరిన్ బాధ నుండి ప్రజల్ని రక్షించిన సామాజిక చైతన్యం గల వ్యక్తీ అని చెప్పారు .ప్రజలకు అర్ధమయ్యే భాషలో ,జానపదానికి దగ్గరగా వారి గుండె చప్పుళ్ళను వినిపించేట్లు సామాన్యమైన మాటల్లో మాండలికం లో ,అత్యంత ప్రభావితం గా సినీ గీతాలు రాసి మెప్పు పొందాడని ఇది అనితర సాధ్యమనీ అన్నారు జాలాది – కాకులమ్మ విశ్వ మోహిని వంటి నవలలు,అమరజీవి ,తండ్రి సమాధి కారుమేఘాలు నాటకాలు  రాశాడని ,ఏది రాసినా మనసుపెట్టి మనసులోకి సూటిగా దూరి పోయేట్లు రాయటం జాలాది ప్రత్యేకత అని ,కొసరాజు జానపద కవిరాజు అయితే జాలాది జానపద కవి రాజాది రాజు అన్నారు .జాలాది కృష్ణా జిల్లా వాడే అయినా ,ఆయన విశాఖ లో మరణిస్తే మన జిల్లా నుండి పెద్దగా ఎవరూ వెళ్లలేదని అదే వీరఘట్టం ప్రజలు తండోప తండాలుగా వచ్చి అంతిమ దర్శనం చేసుకొన్నారని ఆ నాడు తానూ జాలాది కుటుంబాన్ని పరామర్శించానని ,అప్పుడే కుటుంబ సభ్యులకు విజయవాడలో కళాక్షేత్రం లో జాలాది విగ్రహాన్ని  తానేనిర్మించి ,ఆవిష్కరణ చేస్తానని చెప్పానని  దీనికి అనివార్య కారణాల వాళ్ళ ఆలస్యం అయి ఇప్పుడు పూర్తీ అయినందుకు తనకెంతో సంతృప్తిగా ఉందని ,తనకంటే ముందే ఆయన కుటుంబం విశాఖ లో జాలాదినిలువెత్తు విగ్రహావిష్కరణ చేయటం వారి కుటుంబానికి ఆయన పై ఉన్న ప్రేమ ,గౌరవాలకు నిదర్శనమని ,జాలాది కలిమి లోను లేమిలోను హుందాగా దర్జాగానే జీవించారని అది అందరికి ఆదర్శమే ననిజాలాడికి నంది అవార్డ్ తో బాటు కళాసాగర్ అవార్డ్ తో సహా పది అవార్డులన్డుకోన్నారని తెలుగు విశ్వ విద్యాలయానికి సలహాదారుగా ఉండి ఎన్నో ఆచరణాత్మక సూచనలు చేసి అభివృద్ధికి తోడ్పడ్డారని,ఆంద్ర విశ్వవిద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరించిందని  చెప్పి ముగించారు .

జాలాది పాటలు రాసిన పల్లె సీమ సినిమాలో ‘’సూరట్టుకు జారుతాది సితుక్కు సితుక్కు వాన సినుకు ‘’పాట విని గొప్ప కవి ఎవరో సినిమాకు వచ్చాడని గుర్తింపు తెచ్చుకోన్నాడు జాలాది .దీనికి ముందు ‘’ప్రాణం ఖరీదు ‘’సినిమాలో ‘’ఏతమేసి తోడినా యేరు ఎండదు ,పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు ‘’అన్నపాట సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .’’యాలో యాలో  ఉయ్యాలో’’,సీతా మాలక్ష్మిలో ‘’సీతాలు సింగారం మా లచ్చి బంగారం ,వారాలబ్బాయిలో ‘’కాకమ్మ కాకి కడివెల్ల కాకి’’ ,మొదలైన దాదాపు రెండొందల యాభై పాటలు రాశాడు రాసిన ప్రతిదీ ఆణిముత్యమైంది  .కావాలనే సినిమాలు తగ్గించుకొని సినీపాటలు రాయటం మానేసి విశాఖ చేరాడు .

దాదాపు పదేళ్ళ క్రితం గుడివాడలో జాలాది తోపాటు నాటకాలు వేసిన ఒక నటుడు మరణిస్తే ఆయన శిలా విగ్రహాన్ని కైకాల సత్యనారాయణ స్వంత ఖర్చుతో నిర్మించి ఆవిష్కరించిన సభకు జాలాది వచ్చాడు .ఆ రోజు నేను కడిమెళ్ళ జంట శాతావదానానికి వెళ్లి విరామ సమయం లో ఈ సభ జరుగుతుందని తెలిసి వెళ్లాను . అదే మొదటిసారి జాలాడిని కైకాలను చూడటం .కైకాల జాలాది సహనటులు .ఒకరినొకరు ఎరా అని పిలుచుకొనే సాన్నిహిత్యం వారిద్దరిది .జాలాదిని పరిచయం చేసుకొని ఆయన అభిమాన కవి అని చెప్పిఅడ్రస్ తీసుకొన్నా .మాట్లాడినంత సేపు బాగానే మాట్లాడాడు భేషజం లేకుండా

.కృష్ణా జిల్లల రచయితల సంఘం ఆధ్వర్యం లో రెండవ ప్రపంచ తెలుగు రచయితల సంఘం సభల చివరి రోజున  ముగింపు సభకు ముందు జాలాదిని అరగంట మాట్లాడమన్నారు . గంటం బావు మాట్లాడి జనాన్ని కదలకుండా చేసి సెహబాస్ అనిపించాడు .పిన్ డ్రాప్ సైలెన్స్ గా సాహితీ బృందం విని ఆగకుండా హర్ష ధ్వానాలు చేసి జాలాదికి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేశారు . ఆ సమయం లో టైం ఎవరికీ జ్ఞాపకం రాలేదు పాటా మాటా మాట వెంట పాట తోసయ్యాట లాడాడు .ఎవరికి విసుగు అనిపించలేదు ఇంకాస్త సేపు మాట్లాడితే బాగుండునని పించింది .ఆ మూడు రోజుల్లో జాలాది ప్రసంగమే హైలైట్ అని పించింది విన్న వాళ్ళందరికీ .ప్రసంగం అంటే ఇలా ఉండాలి అన్నట్లు మోడల్ గా మాట్లాడాడు జాలాది .అందుకే అభిమానులు ‘’ఆ నాడు జాబాలి –ఈ నాడు జాలాది ‘’అని కీర్తిస్తారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-14-ఉయ్యూరు

9-8-2014శనివారం విజయ వాడ శ్రీ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం లోకళా ప్రపూర్ణ  స్వర్గీయ జాలాది రాజారావు విగ్రహావిష్కరణ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.