అనువాద సినీ రాజ శ్రీ –

అనువాద సినీ సాహిత్య శిఖరం రాజశ్రీ

 
Published at: 14-08-2014 00:47 AM
 
 
 
 

తెలుగు సినీ గేయ కవుల్లో అగ్రతాంబూలమివ్వదగిన ఓ కవిని నిర్ణయించమంటే కష్టం కావచ్చు కాని, తెలుగు అనువాద సినీ రచయితల్లో ఇప్పటి వరకు ఆ అర్హత కలిగిన ఒకే ఒక పేరు చెప్పమంటే ఎవరైనా తేలిగ్గా చెపుతారు ‘రాజశ్రీ’ అని ! తెలుగులో సుమారు 600 అనువాద చిత్రాలకు రచన చేసి అగ్రభాగాన నిలవడమే కాకుండా సంఖ్యాపరంగా ఎక్కువ ప్రాచుర్యం కల అనువాద గీతాలను రాసింది కూడా రాజశ్రీయే! అనువాద రచనను అలవోకగా, అనాయాసంగా, అతివేగంగా సె్ట్రయిట్‌ పిక్చర్స్‌కు రాసినంత తేలిగ్గా రాజశ్రీ చేయగలగడానికి కారణం ఆయనకు గల సంగీత పరిజ్ఞానం. ఆ మాటకొస్తే ఆయన నాటకరంగం నుంచి సినీ సంగీత దర్శకుడిగా స్థిరపడాలనే చెన్నపట్టణానికి తరలివచ్చారు. కానీ అనువాద రచయితై అత్యున్నత శిఖరాలకు ఎదిగారు.

రాజశ్రీ 1934 ఆగస్టు 31వ తేదీన విజయనగరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. రాజశ్రీ ముందుగా రచ్చ గెలిచి, ఆ తర్వాత ఇంట గెలిచారు. సినీ రంగానికి వచ్చిన కొత్తలోనే ఎంజీఆర్‌ను కలిసి ఆయనకు కథ చెప్పే సాహసం చేసి, ఆయన మెప్పును, తొలి ప్రయత్నంలోనే కథకు ఆమోదాన్ని పొందారు. అది ఎంజీఆర్‌ ద్విపాత్రాభినయంతో విజయవంతమైన ‘తేడివందమాప్పిళ్ల ’ తమిళచిత్రం! ఆ తర్వాత అనేక తమిళ చిత్రాలకు కథ, స్ర్కీన్‌ప్లేలను సమకూర్చారు రాజశ్రీ. తెలుగులో ‘ఆడ పెత్తనం’ (1958) చిత్రంలో తొలిపాట రాసినా, ఎం.ఎస్‌.శ్రీరామ్‌ నిర్మించిన ‘మూఢనమ్మకాలు’ (1963) అనువాద చిత్ర రచనతోనే రాజశ్రీ తన సత్తా నిరూపించుకొని పూర్తిస్థాయిలో రచయితగా స్థిరపడ్డారు. రాజశ్రీ రచన చేసిన డైరెక్ట్‌ తెలుగు చిత్రాల కంటే ఆయన అనువాద చిత్రాలు సుమారు పదిరెట్లు! రాజశ్రీ ‘సత్తెకాలపు సత్తెయ్య’, సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ- బుల్లోడు, కన్నవారి కలలు, తులాభారం, తోటరాముడు, ఏడంతస్తుల మేడ, స్వప్న మొదలైన డైరెక్ట్‌ చిత్రాల్లో రాసిన ఆపాత మధురమైన పాటలు నేటికీ వినిపిస్తున్నాయి. బంగారు గాజులు (1970), మట్టిలో మాణిక్యం (1971) చిత్రాలకు ఉత్తమ కఽథకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి నంది పురస్కారాలను అందుకున్నారు. రచయితగానే కాక చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా! పెళ్లి చేసి చూపిస్తాం, ఎంకన్నబాబు, మామాకోడలు తెలుగు చిత్రాలతోపాటు పుదియ సంగమం తమిళ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చూపించారు.

మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు స్ర్టెయిట్‌ సినిమాలకు రాయటం కంటే డబ్బింగ్‌ సినిమాలకు రచన చేయడం మరీ కష్టం. అవధానంలో నిషిద్ధాక్షరి, ఛందస్సులో యతి ప్రాసల నియమం వంటి నిబంధనల్లా అనువాద రచనలో అడుగడుగునా ఎదురయ్యే ‘లిప్‌సింక్‌’ను పాటిస్తూ భావానికి భంగం కలగకుండా రాయడం అసిధారావ్రతం. అటువంటి అనువాద కళ మీద అవగాహనతో పెదవుల కదలికతో పాటు నటనను, వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నల్లేరు మీద నడకలా అనువాద రచన చేసిన ప్రజ్ఞాశాలి రాజశ్రీ. తెలుగులో నేరుగా తీసిన చిత్రాల రచనలో చలం ప్రోత్సహించినట్టే అనువాద చిత్రాల రచనలో దర్శకుడు మణిరత్నం రాజశ్రీకి ఎక్కువగా అవకాశాలిచ్చారు. మౌన రాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా వంటి మణిరత్నం అనువాద చిత్రాలకు రాజశ్రీ రచయితగా పనిచేయడమే గాక, ఆయన తెలుగులో తీసిన గీతాంజలికి సంభాషణలను సమకూర్చారు కూడా. ప్రేమసాగరం, ప్రేమపావురాలు, వైశాలి, జంటిల్‌మేన్‌, బంగారు పతకం, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు వంటి మరెన్నో విజయవంతమైన అనువాద చిత్రాలు రాజశ్రీ కీర్తి కిరీటాలే! వీటిలో కొన్ని శత దినోత్సవాలూ, ద్విశత దినోత్సవాలూ జరుపుకొని సె్ట్రయిట్‌ చిత్రాలకు సింహస్వప్నాలుగా నిలిచాయి. శిఖరం చిత్రాన్ని రాజశ్రీ 500వ అనువాద చిత్రంగా గుర్తించి నేషనల్‌ కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌ సొసైటీ వారు విశాఖపట్నంలో 1990 డిసెంబరు 23న రాజశ్రీ చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని జరపడం అనువాద చిత్రాలకు గర్వకారణం.

సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం, కాలచరిత్రకు సంకేతం, కరుణకు చెరగని ప్రతిరూపం (మేరీమాత/అన్నై వేలంగణ్ణి), సింగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట (దళపతి), చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ (రోజా), నిన్ను కోరీ వర్ణం… (ఘర్షణ/అగ్నినక్షత్రం, చికుబుకు చికుబుకు రైలే, అదిరెను దీని స్టయిలే (జంటిల్‌మేన్‌) మొదలైన ఆణిముత్యాల్లాంటి రాజశ్రీ అనువాద గీతాలు కాలానికి చెక్కు చెదరకుండా నేటికీ ఇంటింటా మారుమోగుతున్నాయి. తమిళంలో టి.రాజేందర్‌ అన్నీ తానై నిర్మించిన ‘ఉయిరుళ్లవరై ఉషా’ విజయదుందుభిని మోగించి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అది తెలుగులో ప్రేమసాగరం (1983) పేరుతో అమోఘ విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకుడు రాజశ్రీ. ‘‘వైగైక్కరై కాట్రే నిల్లు, వంజీ దనై పార్తాల్‌ సొల్లు, మణ్ణన్‌ మనమ్‌ వాడుదెన్రు, మంగైదనై తేడుదెన్రు’’… అంటూ కాళిదాసు సందేశాన్ని తలపించేలా ప్రియుడు చిరుగాలికి చేసిన విన ్నపాన్ని మాతృకలో రాజేందర్‌ రాయగా… ‘‘చక్కనైన ఓ చిరుగాలి, ఒక్క మాట వినిపోవాలి, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను… గాలీ! చిరుగాలీ! చెలిచెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం’’ అంటూ ఆ పాటను రాజశ్రీ అద్భుతంగా తెనిగించారు. రాజేందర్‌ సతీమణి పేరు ఉష. తన పేరు స్ఫురించేలా రాసిన రాజశ్రీని ఆమె మెచ్చుకొని తమిళంలో కూడా అలా రాసి ఉండాల్సిందని రాజేందర్‌తో అన్నారట! అసలు ‘ఉయిరుళ్లవరై ఉషా’ అనే టైటిల్‌ను ఆ ఉద్దేశంతోనే నిర్ణయించారట!

జంటిల్‌మేన్‌ తమిళ మాతృకలో ‘‘ఉసిలం పట్టి పెన్కుట్టీ ముత్తు పేచ్చీ, ఉన్‌ ఒసరం పాత్త ఎన్‌ కళుత్తు సుళిక్కి పోచ్చి’’ అనే (వైరముత్తు) పల్లవికి ‘‘ఉసిలం పట్టి (ఊరిపేరు) చినదానా నీ యెత్తే చూసి నా మెడ బెణికింది’’ అని భావమయితే, దానిని తెలుగు సీతలో రాజశ్రీ
‘‘ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగూ పొంగూ నా గుండె కోసేనమ్మా’’ అని మార్చడం మూలానికి మెరుగులు దిద్దడమే! కోటీశ్వరుడు చిత్రంలో రాజశ్రీ ‘‘నేలపై చుక్కలు చూడు,. పట్టపగలొచ్చెను నేడు… ఏదో వింత, ఏదో వింత’’ అనే పల్లవి గల ఒకే ఒక్క పాటను రాశారు. దీనికి తమిళ మూలం దైవమగన్‌లో ‘‘కాదల్‌ మలర్‌ కూట్టం ఒండ్రు, వీధివళి పోగుం ఎండ్రు, యారో సొన్నార్‌, యారో సొన్నార్‌ (ప్రేమ పూల గుంపు ఒకటి వీధిలో వెళుతుందని ఎవరో చెప్పారు) అనేది! మూలానికి భిన్నమైన భావుకత రాజశ్రీ తెలుగు పాటలో ఉండడం గమనార్హం.

మైనే ప్యార్‌ కియా హిందీ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌. దానిని అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. అయితే తమిళ అనువాద చిత్రం అపజయం పాలు కాగా, తెలుగు వెర్షన్‌ మాత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ ఘనతంతా రాజశ్రీకే దక్కుతుందని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశంసించారు. ఆ చిత్రంలో… ‘‘దిల్‌ దివానా బిన్‌ సజ్‌నా కే మానేనా, ఏ పగ్‌లా హై సమ్‌ఝానేసే సమ్‌ఝేనా’’ (హృదయం పిచ్చిది. ప్రియురాలు లేదంటే అది ఒప్పుకుంటుందా? నచ్చచెబితే మాత్రం వింటుందా?) అనే పాటకు దీటుగా తెలుగులో ‘‘నీ జత లేక పిచ్చిది కాదా నా మనసంటా, నా మనసేమో నా మాటే వినదంటా’’ అంటూ రాజశ్రీ రాసిన పాట భాషాభేదం ఎరుగని ఆయన అనువాద పటిమను తెలియజేస్తుంది. ‘కేలడి కన్మణి’ తమిళ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుక్క తిప్పుకోకుండా పాడిన పాటకు దీటుగా తెలుగు వెర్షన్‌ ‘ఓ పాపా లాలీ’లో ‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అనే పల్లవితో రాసిన పాటలో బ్రెత్‌లెస్‌గా పాడేందుకు బాగుండే పదాల పోహళింపుతో చేసిన ప్రయోగాలు రాజశ్రీ అనువాద శైలికి నిదర్శనాలుగా నిలిచాయి. శివాజీగణేశన్‌ అంతటి మహానటుడు బంగారు పతకం అనువాద చిత్రాన్ని చూసి రాజశ్రీ ప్రజ్ఞకు ముగ్ధుడై ‘‘ఇది అనువాద చిత్రం లా లేదు, నేను తెలుగు చిత్రాల్లో నటించడం లేదనే కొరత తీరిపోయింది’’ అని రాజశ్రీని కౌగిలించుకున్నారట! 1994 ఆగస్టు 14న ప్రభుదేవా హీరోగా నటించిన తొలి చిత్రం ‘ప్రేమికుడు’ (కాదలన్‌ అనువాదం) కోసం ‘వింత లోకంలో మనం విహరించే దెప్పుడో’ అనే పాటను రాసి భోజనానంతరం మధ్యాహ్నం తిరిగి వస్తానన్న రాజశ్రీ నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూయడం తెలుగు చిత్ర పరిశ్రమ దురదృష్టం! జీవితరంగం నుంచి ఆకస్మికంగా అనాయాసంగా నిష్క్రమించిన రాజశ్రీ తెలుగు చలన చిత్ర రంగంలో ‘అనువాదం’ అనే పదం ఉన్నంత కాలం జీవిస్తూనే ఉంటారు!

– డాక్టర్‌ పైడిపాల
ఫోన్‌: 99891 06162

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.