పరమేశ్వరి యోగ సిద్ధుల విభూతి ని వివరించిన గణపతి ముని
కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ దశమ శతకం లో ముప్ఫై తొమ్మిదవది స్తబకంలో దేవి యోగ సిద్ధులను ఇంద్రజా వృత్తాలలో ‘’లలో మహా సొగసుగా వర్ణించి .ఆ దేవీ యోగ వైభవాన్ని వివరించారు … .మొదటి శ్లోకం –
‘’వ్యాప్యేద మిందో ర్భువనం య ఏవ ,ప్రాయేణతస్యామల చంద్రికా భూత్ –మంద స్తవార్తిం స ధునోతు హాసో ,నిశ్శేష లోకేశ్వరా వల్లభాయాః’’
ప్రతి స్తబకం లో చేసినట్లే ఇక్కడా అమ్మవారి చిరునవ్వు వైభవాన్ని ముందుగా స్తుతించారు .చంద్ర మండలం లో వ్యాపించి చంద్రుని చల్లని తెల్లని వెన్నెల అయిన పరమేశ్వరి మందహాసం నీ వ్యధను హరించుగాక అని ప్రార్ధించారు .తర్వాత అఖండమైన ఆకాశం లో అద్వితీయమైన మెరుపుగా ప్రకాశిస్తూ అన్నిలోకాలను నిరంతరం పరిణామాన్ని పొందిస్తూ ,ఒక్కో సారి మేఘం లో విద్యుత్ రూపం గా ఉన్న ప్రచండ దేవి మా పాపాలను హరించాలి అని కోరుకొన్నారు .ఇలా మార్పులు జరుగుతున్నా ఇంకా కొన్ని బ్రాహ్మాండాలు ఆవిర్భ విస్తూనే ఉన్నాయని కొన్ని నశించి పోతూ ఉన్నాయని మరికొన్ని వృద్ధి చెందుతున్నాయని తెలియ జేశారు .మహా ప్రమాణం అయిన సూర్యుని తో ,అతి ప్రమాణాలైన కుజుడు మొదలైన గ్రహాతో కూడిన ఒక్కొక్క బ్రహ్మాండం దేవి రోమ కూపం వంటిది కనుక ఆమె మహాదైశ్వర్యాన్ని పొగడ గల వాడు లేడు అంటారు .మేఘాల గంభీర ధ్వనియే దేవి శబ్దం అని ,అందులోని మెరుపులే ఆమె కాంతి తరంగ విలాసమనీ కీర్తించారు .తర్వాతి శ్లోకాలన్నీ పరమాద్భుత రీతిలో రచించి బీజాక్షర సముదాయమా అన్నంత పవిత్రం గా ప్రస్పుటం గా విరచించారు మహా ముని .ఏడవ శ్లోకం నుండి ఈ కవితా ధారా విజ్రుమ్భించి భక్తీ వెల్లువై విరుస్తుంది .
‘’ఇన్ద్రస్య వజ్రం జ్వలితం క్రుశానో ర్జోతిస్సహస్ర చ్చదబంద వస్య –పీయూష భానో ర్హసితం విసారి ,జీవస్య చక్షు ర్మమ తాత దైవతం ‘’
ఇంద్రుని వజ్రాయుధం ,అగ్ని జ్వాల ,సూర్యుని తేజస్సు ,చంద్రుని వెన్నెల ,జీవుని దర్శన శక్తి ,జ్యోతిర్మయమైన అమ్మవారి దైవ స్వరూపమే అన్నారు .తరువాత –
‘’యస్యైవ తేజః ప్రావి భక్త మారక ,విద్యుచ్చశాం కానల లోచనేషు –గూఢం తదాకాశ గృహే సమంతా దంతాన భిజ్నం ప్రణమామి దైవం ‘’
‘’సూర్య- విద్యుత్ చంద్ర -అగ్ని నేత్రాలలో వేరుగా ఉన్నట్లు భిన్నమై ఆకాశం అంతా గుప్తంగా ఉన్న అనంత తేజస్సు కల దైవానికి నమస్సులు అని చెప్పుకొన్నారు .
‘’జాగ్రత్సు బుద్ధి ర్నిమిశాత్సు నిద్రా ,శుష్కేషు పక్తి స్తరణేషు వ్రుద్ధిః-ధీరేషు నిస్టాచపలేషు చేస్టా.దేవీ మమాపత్తి మపా కరోతు ‘’
మేల్కొన్న వారిలో మెలకువగా ,నిద్రపోయే వారిలో నిద్రగా ,రసహీనాలలో పాకం గా ,యౌవన వంతులలో పుష్టి గా ,దీరులలో ధైర్యం గా చంచల మనస్కులలో చలనం గా ఉన్న పరమేశ్వరి ఆపదలను తొలగించాలని మొక్కుకొన్నారు .
‘’విద్యావతో వాద విధాన శక్తిఃవీరస్య సంగ్రామ విధాన శక్తిః-నారీమణేర్మోహ విధాన శక్తిః ర్లేశ త్రయం కిన్చిదపార శక్తెః’’
విద్వాంసుని వాదన శక్తి ,వీరుని యుద్ధ శక్తి ,స్త్రీ సమ్మోహన శక్తి ,అనే ఈ మూడూ ‘’అనంత ‘’అయిన మహాశక్తి స్వల్ప అంశాలు మాత్రమే .
తాపసుల మనస్సులకు ఉత్సాహం కలిగించే శక్తి ,మహా కార్యాలలో ప్రేరణ శక్తి ,దుస్టూల హృదయాలలో క్షోభ కలిగించే వ్యామోహ శక్తీ అయిన పరదేవత మనల్ని కాపాడాలి అని వేడుకొన్నారు .
అంతటా వ్యాపించే వ్యాన వాయు శక్తి తో జీవుల దేహాలను నడిపించే సర్వేశ్వర శక్తి ,యుద్ద్ధ విజేత ప్రతాపం లో ,ఓడిపోయి భయ పడిన వాడి పలాయనం లో ఉన్న ఆశక్తికి నమస్కారాలు అంద జేశారు .
ఒక్కటే అయిన రూపాన్ని అనేక అద్భుత కల్పనలతో అనేక రూపాలుగా మూల స్వరూపం ఎరుగని జనాలకు చూపిస్తూ ,యదార్ధ ద్రుష్టి ఉన్న జనానికి మాత్రం తన ప్రభువైన సర్వేశ్వరుని చూపించే ఈ విశ్వ మూల శక్తికి ప్రణామాలు చేశారు .
విశ్వ సంవాదం కలవాడై ,ధ్యానం తో కాని మంత్రం జపం తో కాని ,గుణ సంకీర్తన తో కాని దేవిని ఆశ్ర యించే వాడు ధన్యుడు అని నిష్కర్ష గా తెలిపారు .-పదిహేనవ శ్లోకం –లో
‘’మూలాగ్ని ముద్దీగ్ని శిరశ్శశాంకం సంద్రావ్య యస్తర్పయతే కృతీ త్వాం-తస్మిన్ నగాదీశ్వర కన్యకే త్వం ,ప్రాదుర్భ వంతీ న కి మాదదాసి ‘’
అమ్మా పార్వతీ దేవీ !మూలాధారం లో అగ్ని ని ప్రజ్వలింప జేసి సహస్రారాం లో చంద్రుని ద్రవింప జేసి నీకు సంతృప్తి కలిగించే భక్తుని కి నువ్వు ఆవిర్భవించి చేసేదేముంది ?అని ప్రశ్నించారు .
సహస్రార పద్మ మాధ్యమం లో చంద్ర రూపిణి అయిన అమ్మ ను సేవించే యోగి ఆధ్యాత్మిక తాపమే శాంతిస్తుంటే అల్పమైన బాహ్య తాపం శమిస్తుంది అని వేరుగా చెప్పాలా అంటారు గణపతి ముని .
వీణా దండం గా ఉన్న వెనక మార్గాన ప్రాణ వాయువును గాని ,వాక్ రూప మంత్రం కాని బుద్ధిని కాని సాధనం గా చేసుకొని హృదయా కాశ మద్యం లో దిగే వాడు దేవి ఈశ్వరుని తోకలిసి అద్భుత లీలలను ప్రదర్శించే అద్వితీయ బ్రహ్మ పురాన్ని పొందుతాడు అని భరోసా ఇస్తారు
జగన్నాయికా ,రుద్ర పత్నీ ,ఘనశ్యామా కేశ పాశా! తంత్ర శాస్త్రం లో చెప్ప బడ్డ దేవి మంత్రం మనోనిగ్రహం తో ఉపశించే వాడు సంసార బంధ విముక్తుడై అన్నిటిని జయిస్తాడు అని వివరించారు తరువాత పందొమ్మిది ఇరవై శ్లోకాలలో ‘’పంచ దశాక్షరీ ‘’మంత్రాన్ని గూర్చి వివరించారు .
‘’పద్మాసనో ద్వాదశ వర్ణ శాంతీ దంభోలి పాణి ర్భువనాది నాదా –గీర్వాణ మార్గో భ్రుగు రాబ్జ యోని ,రంతే తదాగ్రే చ హలం విరాజీ ‘’
‘జమ్భస్య హన్తా నల శాంతి చన్ద్రైఃసంయుక్త ఊష్మా గల దేశ జన్మా –దంత స్థలీ సంభవ ఊష్మ వర్ణో ,వాణీ పతిర్వజర ధర శ్చ లజ్జా ‘’
దీనికి పూర్తీ వివరణ కావాలి –పద్మాసనః అంటే బ్రహ్మ అంటే క కారం ద్వాదశ వర్ణ –శాంతి పన్నెండవ అక్షరం ఏ కారం శాంతి ,ఈ కారం దంభోలి పాణి అంటే వజ్రయుధదారి ఇంద్రుడు ల కారం ,భువనాదినాదా అంటే భువనేశ్వరి –హ్రీం కారం అంటేటే మొత్తం మీద క –ఏ –ఈ –ల –హ్రీం –ఇది మొదటిఖండం
గీర్వాణ మార్గ –ఆకాశ మార్గం అంటే హ కారం ,భ్రుగు అంటే స కారం ,అబ్జయోని అంటే బ్రహ్మ కకారం అగ్రేచ అంటే కకారానికి ముందు హలం –హలక్షరం చివర విరాజే అంటే ప్రకాశించే హ కారం జమ్భస్య హన్తా అంటే జమ్భాసురుడిని చంపిన ఇంద్రుడు అంటే ల కారం ,గలదేశ జన్మా అంటే కమలం లో పుట్టిన ఊష్మా అంటే శ స ,స ,హ లలో ఒకటైన హ కారం అనల శాంతి అంటే రేఫ ఈ కార అనుస్వారాలతో కూడిన హ్రీం కారం మొత్తం మీద హ –స –కః-ల –హ్రీం –ఇది రెండవ ఖండం
దంత్యస్థలం లో పుట్టిన ఊష్మం అయిన స కారం ,వాణీపతి అంటే బ్రహ్మ కనుక క కారం ,వజ్రధర అంటే ఇంద్రుడుకనుక ల కారం లజ్జా హ్రీమ్కారం మొత్తం మీద స-క-ల-హ్రీం ఇది మూడో ఖండం
ఏతావాతా తేలింది ఏమిటి అంటే క-ఏ-ఈ –ల –హ్రీం ,హ –స-క-హ-ల- హ్రీం ,స –క-ల—హ్రీం ఇదిపంచాదశాక్షరి మంత్రం .తరువాత శ్లోకం లో
మూడు ఖండాలుగా ఉన్న క ఏ ఈ ల హ్రీం ,హ స క హ ల హ్రీం ,సకల హ్రీం అనే పంచ దశాక్షరాల్తో కూడిన శ్రీ విద్యనూ సాక్షాత్తుగా మహా ముని దక్షిణా మూర్తి రూపం లో ఉన్న మహా దేవుడు ఉపదేశించాడు అంటే ఈ పంచ దశీ విద్య కు రుషి దక్షిణా మూర్తి –ఈ విద్య రహస్య విద్యల్లో అత్యంత రహస్యమైంది .పుణ్యం చేసిన వారికే లభిస్తుంది .అన్ని విద్యల్లో శ్రేష్టమైనది బ్రహ్మ చేత స్తుతింప బడింది
ఈ విద్యనే శరీరం లో కుండలిని అని వస్తువులో విద్యుత్ అని ,లోకం లో ఆకాశం అని చెప్ప బడింది. దేవతా స్త్రీ లచే నమస్కరింప బడిన దేవి దేవటా స్త్రీలచే కీర్తింప బడింది .ఉపాసకుడు నేత్రాన్ని నిశ్చలం గా ఉంచి మనస్సు తో మంత్రాక్షర రూపం మయిన ప్రాణాన్ని దర్శిస్తూ విశ్వ పోషిణి అయిన దేవిని సేవిస్తే సర్వాభీస్టాలు సిద్ధిస్తాయని తరువాత శ్లోకం లో చెప్పారు .
భువనేశ్వరి కాలి ,ప్రచండ చండి ,లలితా మొదలైన దేవతలకు హ్రీం ,క్రీం ,హ్రూం ,శ్రీం మొదలైన ఏకాక్షర మంత్రాల్నికాని పంచ దశాక్షరీ మంత్రాన్ని కాని ,సర్వేశ్వరుని శక్తి అయిన పర దేవతా యొక్క శ్రేష్టమైన దశ మహా విద్యలను కాని భక్తితో జపిస్తే సాటి లేని సిద్ధులకు జన్మ భూమి అయిన ప్రాణం వశం అవుతుంది .ప్రాణ శక్తి వశం అయితే సర్వ శక్తులూ వశమైనట్లే నని ఇరవై నాలుగవ శ్లోకం లో చెప్పారు –చివరి శ్లోకం
‘’ఏతాః కవీనాం పద కిమ్కరస్య, ,పూతాః ప్రమోదం పద మావహంతు-గీతాఃసభక్తి ద్రవ మింద్ర వజ్రాః,శ్వేతాచలాదీశ్వర వల్లభాయాః’’
కవులకు పాద సేవకుడైన గణపతి భక్తి రస బంధురం గా ఇంద్రజా వృత్తం లో రచించిన శ్లోకాలు కైలాస నాద పత్ని అయిన పార్వతీదేవికి పరమాందం కలి గించు గాక అని స్తబకాన్ని ముగించారు గణ పతి ముని .
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-14-ఉయ్యూరు


kalidassboddupally dass
శ్రీ మాత్రే నమః
ఈ సంసార సాగరం లో జీవుడు “అఛ్ఛపు చీకటింబడి విషయాసక్తుడై చచ్చుచు పుట్టుచున్ మరల బుట్టుచు చచ్చుచున్” – ఎన్నెన్నో దశలను దాటి అంత్యమున పురాకృత పుణ్య కర్మఫల విశేషమున మానవ జన్మమునొంది ముక్తి ని పొందే ప్రయత్నం చేస్తాడు..ఐతే ఆ కైవల్యాన్నిపొందే ప్రయత్నం ఎలా చెయ్యాలో శ్రీ లలితా సహస్ర నామం మనకు వివరిస్తుంది. ఇది స్తూలంగా నాలుగు దశలలో వివరింపబడింది.
మొదటిదశ.. మొదటి 23 1/2 శ్లోకాలు..
విషయాసక్తుడైన జీవుడు అమ్మ ను “సృష్టి స్థితి లయ కారిణి”- అని “చిదగ్నికుండ సంభూత”- అని తెలుసుకున్నా కూడా ఆమెను వాంఛితార్ధప్రదాయిని గానే అర్చించి అర్ధించి సుఖ సంతోషాలను వరాలుగా పొందాలనుకుంటాడు.కామితార్ధ ప్రదాయిని ఐన అమ్మకరుణామయి కదా! అందుకే అడిగినవి అడగనివీ అన్నీ ఇస్తుంది అమ్మ!…ఈ విషయాన్ని అమ్మ నామాలుగా వివరిస్తుంది సహస్ర నామాల్లోని ఈ మొదటి 23 1/2 శ్లోకాలు.
రెండవ దశ…23 1/2 నుండి 33 1/2 శ్లోకాలు..
ఇది కాస్త పౌరాణికం గా కనపడుతుంది.
“భంఢాసుర సంహారం”-అనే ఈ పౌరాణిక కధ లోని ఆంతర్యం తెలుసు కున్న భక్తులకు అమ్మ వారు దివ్యమైన “హర నేత్రా గ్ని సంధగ్ధ కామ సంజీవ నౌషధిః” -గా దర్శనమిస్తారు.అప్పుడు సాధకుని కి విషయేఛ్ఛ నశిస్తుంది.
మూడవ దశ…
ఈ దశ, మంత్ర యంత్ర తంత్ర సమన్వితం. ఇక్కడ సద్గురువుల ఆశ్రమంలో ఆశ్రయంలో సాధకుడు “పంచదశి”- మంత్రాన్ని అపూర్వమైన “ఉపదేశం” గా పొంది శ్రీ చక్ర యంత్రార్చనతో శ్రీ విద్యోపాసకుడుగా తంత్ర సాధన చేస్తే ఆ లలిత పరమేశ్వరి ని దర్శంచే అవకాశం కలుగుతుంది.ఈ దశ ను అత్యధ్భుతంగా లలితాసహస్ర నామాల్లోని33 1/2 శ్లోకం నుండి 127 వ శ్లోకం వరకు వివరించడం జరిగంది.గమనించగలరు
ఇక్కడ మంత్రం పంచదశి.
బీజాక్షర సమన్వితం.
యంత్రం శ్రీ చక్రం.
ఏ దేవతా విగ్రహం కాని వర్ణన కాని లేనియంత్రం
ఆ శ్రీ చక్రార్చన లో లలితాంబికను దర్శించే సాధననే తంత్రం.ఈ మంత్ర యంత్ర తంత్ర యుక్తమైన ఉపాసన వల్ల సాధకుని కి అమ్మ “ఙ్ఞనదా ఙ్ఞాన విగ్రహ” గా ఙ్ఞానాసక్తని కలిగిస్తుంది.
నాల్గవ దశ. కైవల్యప్రదం..
శ్రీ విద్యోపాసకుడైన సాధకుడు తన సాధనలో అలౌకికము అవ్యక్తమూ ఐన అనుభూతితోతాదాత్మ్యంచెందుతాడు.
అమ్మ ను “సర్వ వేదాంత సంవేద్య” గానే తెలుసుకున్న సాధకుడు
అంతిమంగా అమ్మ వారిని శివ శక్త్యి
ఐక్య రూపిణిగా లలితాంబికగా సాధన లో దర్శనం చేసుకుని తన అఙ్ఞాన నివృత్తి చేసుకొని “స్వస్వరూపాను సంధానం”తో జీవన్ముక్తుడౌతాడు.
అవ్యాజ కరుణామూర్తి కురిపించే అపార కరుణామృత వర్షం లో తడిసి పునీతుడౌతాడు.జీవితం ధన్యమౌతుంది
లలితానంద
LikeLike