కథల్లో మొలిచిన కొత్త సంగతులు
- – నండూరి రాజగోపాల్, 9848132208
కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న
కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు
కనపడటం ఆశ్చర్యమనిపిస్తుంది.
అనేకమైన ప్రయోగాలు, ప్రభావాలు, అనుకరణల తర్వాత తెలుగు కథ సమకాలీన కాలాన్ని, మనిషిని, సమాజాన్ని డయాగ్నైజ్ చేయగలిగింది. తెలుసుకోగలిగింది. కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు కనపడటం ఆశ్చర్యమనిపిస్తుంది. జీవితం చాలా సౌకర్యవంతంగా గడిచిపోతున్న ప్రజలు ఒకపక్క తీరిన సగం సగం ఆశలతో మిగిలిన భాగాన్ని పొందాలనే తాపత్రయంతో సమాజంలో… అందరూ ఏకమొత్తంగా కోరుకునే ఒక పునర్నిర్మాణపు సంతోష సందర్భాన్ని నిలబెట్టడం కోసం తన వంతుగా వనరులు పోగేస్తున్న కొన్ని మంచి కథలు గురించి మాట్లాడుకుందాం.
‘రైట్ ఎమోషనల్ రెస్పాన్స్’ను అందించే ఒక ఇడియమ్‌లో ఇప్పటి కథ మనం కోరుకునే సమయాలని చాలా ఆసక్తిగా చెపుతోంది’ అంటూ శుభాశర్మ కథల సంపుటి ‘ఫ్లై ఆన్ ది వాల్’కు ముందుమాట రాస్తూ చెప్పిన సచ్చిదానందన్‌ను చదివిన తర్వాత, కథలు తెచ్చిన కొత్త సందర్భాన్ని పంచుకుందామనిపించింది. ఇప్పటిదాకా కథేం చేసిందో పక్కనపెట్టి, ఇప్పుడు కథ ఏం చేస్తోందో గమనించినప్పుడు, ఇదివరకటి కన్నా ఎక్కువగా, శ్రద్ధగా, ఇష్టంగా సమాజాన్ని హత్తుకుంటోంది అనిపించింది. ‘యిదో దురదృష్టం. సరదాగా గడపడానికి బోల్డంత ప్రపంచం. మనసుకి కష్టమొస్తే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. (కుప్పిలి పద్మ – ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్)’ అన్నది కనిపెట్టాక కథ మరికాస్త ఎక్కువగా సమాజ అంతరాత్మలోకి తొంగి చూడటం ప్రారంభించింది. నిజానికి కుప్పిలి పద్మ కథా శీర్షికే ఇవాల్టి సమస్యను ఫోకస్ చేస్తోంది. కెరీర్ కోసం మనం సమస్తం కోల్పోవడమనే ఒక భయంకర అవసరాన్ని కల్పించడమే ఈ గందరగోళ జీవితాలకు కారణం. ఇది ఒకసారి తెలిసిన తర్వాత తెలుగు కథ ఉపరితల రవాణాని వదిలేసి ఎప్పుడైతే అంతరంగాన్ని చూడటం మొదలుపెట్టిందో… మానవ స్పర్శ ఆనవాళ్ళు చాలా అవసరమని తేల్చేసింది. కొన్ని కథలు చాలా చక్కగా చిక్కగా delightful transformation of the genre గురింఛి చెప్పగలుగుతున్నాయి.
నిజానికి ఇవాళ ఇక్కడ కావలసినది ఓదార్పు కాదు, పోరాటం కాదు, ఉద్యమం కాదు, మనం మనంగా బతికే అవకాశం. మన కోసం, మనలాంటి వాళ్ళ కోసం, వాళ్ళని కలవడం కోసం, మనం మనంగా నిలవడం కోసం ఎలా మారాలో తెలుసుకోవడం, ఆ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించడం అత్యవసరమని గ్రహించిన కథా రచయితలు కొంతమంది కొన్ని అరుదైన, అద్భుతమైన కథలందించారు. నిజానికి ఈ ప్రయత్నం మొదటగా ప్రారంభించి తల్లావఝల పతంజలిశాస్ర్తీ. 1990ల్లోనే ‘నెమలికన్ను’ అనే కథ పిల్లలకి బాల్యం ఎంత జ్ఞాపకంగా మిగలాలో చెపుతుంది. ‘ఈ చిన్నతనం జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. అటువంటి జ్ఞాపకాలు లేని చిన్నతనం ముసలితనం లాంటిది’ అని చెప్పే ఈ కథ పిల్లల్లో తగ్గిపోతున్న ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని పదిపదిహేనేళ్ళ ముందుగానే హెచ్చరించింది.
ఒక అపజయం నుంచి, ఒక పరాభవం నుంచి, ఒక అత్యాచారం నుంచి, ఒక బాల్యం లేని జీవితం నుంచి, ఒక ఆదరణ లేని చోటునుంచి, ఒక వైఫల్యం నుంచి, ఒక పోరాటం నుంచి మనం మనిషిగా ఎలా మిగలాలో ఇప్పటి కథ చెపుతోంది. ‘ఆరోజు నామీద జరిగిన దాడివల్ల నేను నా నెమ్మదితనాన్ని, ఒద్దికనూ పోగొట్టుకున్నాను. క్రమంగా రఫ్‌గా మారేను. మంచితనం కూడా నాలోంచి పోయిందేమో అనుకున్నాను. కాని మా అమ్మ నాలోంచి అది పోకుండా నన్ను తన ఒడిలో దాచుకుంది’’ (వాడ్రేవు వీరలక్ష్మీదేవి – ‘ఆ రాత్రి’) అని చెప్పే కథ, జీవితాన్ని చూసిన కథ. జీవితాన్ని ఆలింగనం చేసుకుంటే తప్ప, దగ్గర చేసుకుంటే తప్ప ఇలా పరాజితను విజేతగా నిలబెట్టే నేపథ్యం గురించి చెప్పలేదు.
ఇలాంటిదే ఇంకో కథ వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బరువులు – భారాలు’ జీవితాలలో పెరిగిన వేగం మనల్ని ఎన్నింటికి దూరం చేస్తోందో చెప్పే కథ. ఏ చిన్న అనుబంధాన్ని తోడు తీసుకెళ్లలేక, ఎక్కడికక్కడ యూజ్ ఎండ్ త్రోతో బతికే జీవితాల నిర్లిప్తతని పట్టుకున్న కథ. ‘పోగు చేయడం దగ్గర్నిండి పంచిపెట్టడం దాకా’ జరిగే సక్రమమైన ప్రయాణం ఎలా వుంటుందో చెప్పే ఒక రోల్ మోడల్ అవసరాన్ని చెప్పిన కథ. ఈ రెండు కథలలోని టెక్నిక్ కూడా కొత్త పోకడ సంతరించుకుంది. రచయిత్రి ఏది చెప్పాలనుకుందో ఆ విషయం చాలా క్రమబద్ధంగా కథంగా పరచుకుని ఏం చెప్పే ప్రయత్నం చేస్తోందో దానికి అనుసంధాన మవుతుంది. టైం లేదంటూ… సాగే ఎండిన బతుకుల మధ్య ‘కాలాన్ని నియంత్రించి తన చిటికెన వేలుమీద నిలబెట్టే వ్యక్తులను’ చూపెట్టిన కథ.
ఈ వరుసలోనే వచ్చిన మరో కథ మధురాంతకం నరేంద్ర ‘నిశ్శబ్దపు చప్పుడు’. నరేంద్ర ఇంతకుముందు కథలకి, ఈ కథకి మధ్య చాలా వ్యత్యావసముంది. చాలా అరుదుగా రాసే ఈ రచయిత కాలాన్ని, కాలగమనాన్ని, సమాజాన్ని, మనిషిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. అందుకే, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మారిన మనుష్యుల ఆలోచనలని పసిగట్టి, చాలా ధైర్యంగా విప్పి చెప్పిన కథ. సాంకతిక అడ్వాంటేజ్ చాలా గొప్పగా సొంతం చేసుకున్న ఈ కథ మనం వినలేని నిజాన్ని చాలా స్పష్టంగా చెపుతుంది. అందరూ చదువుకున్న ఎగువ మధ్యతరగతి స్థాయి కుటుంబాలలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు తమ ఉనికికి ఫొటో కట్టి దండవేసే సందర్భాలున్నప్పుడు, వాటినుండి బయటకు రాలేని సంఘర్షణలున్నప్పుడు కనీసం తమ పిల్లలైనా తమకు కావాలనుకునే జీవితాన్ని పొందాలనుకోవడం ఈ కథకి ముందస్తు రూపం. ఈ కథలో రెండు సంక్లిష్ట వృత్తాలు ఉన్నాయి. అనుకోకుండా ‘కజిన్స్’లా మారిన ఇద్దరి వ్యక్తుల అంతరంగ సంభాషణ పాఠకుడికి వినపడటం ఒక ఎత్తయితే, యాదృచ్ఛికమైన ఆలోచన ఆ ముగ్గురిని ఎలా వెంటాడుతుందో కథంతా తెలుస్తూ ఉంచడం ఒక ఎత్తు. ఈ రెండింటిని సమన్వయం చేసే నైపుణ్యం ఎక్కడ కనబడుతుందంటే… జీవితాన్ని స్వేచ్ఛగా, హాయిగా, స్వతంత్రంగా, స్వచ్ఛంగా, ఇష్టంగా, మాలిన్య రహితంగా గడపడంలోని ఆనందాన్ని దక్కించుకోవడమే ఇప్పటి అవసరమని పాఠకులకు కమ్యూనికేట్ చేయడమే ఈ కథ సాధించిన విజయం.
ఈ మధ్యన ఎక్కువగా కుటుంబ సంబంధాల మీద కబుర్లు నడుస్తున్నాయి. వ్యాపార ప్రకటనలు కూడా వీటికి అనుగుణంగానే రూపుదిద్దుకుంటున్నాయి. ఉద్వేగాలు లేని వీరి జీవితాలలోకి ఒక చిన్న ఆనందం ప్రవేశించడమే వారి తడిలేని బతుకులకు ఒక పెద్ద తుఫాన్ అని గ్రహించిన కథకులు అలాంటి చిన్న చిన్న కార్నర్స్‌ని వెతికి పట్టుకున్నారు. పలమనేరు బాలాజి ‘తోడు’ కథ ఇలా వచ్చిందే. Try to introduce, try to identify himself / herself, try to impact తప్ప ఎక్కడా intimacyకి ప్రయత్నించని కొత్త తరం కాపురాలను మనం బాలాజీ కథలోనూ, జి.లక్ష్మి ‘ప్రయాణం’లోనూ చూస్తాం. జి.లక్ష్మి చాలా గట్టిగానే ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌కి కారణాన్ని కనిపెట్టగలిగింది. తల్లిదండ్రులే పిల్లల వైఫల్యాలకి కారణమవుతున్నారు కాబట్టి వాళ్ళే ఈ గ్యాప్‌ను ఫిల్ చేసే టూల్స్‌లా మారాలని చెబుతుంది.
ఈ కథలన్నీ కూడా ఒక సంప్రదాయ ముగింపుని ఇవ్వవు. కొనసాగింపులోంచే కథలు ముగుస్తాయి. జీవితం కూడా అంతే. ఎక్కడా ఆగదు. మజిలీలను దాటుకుంటూ మెరుగైన చోటుకి చేరాలనుకుంటుంది. అక్కడికి తీసికెళ్ళే బాధ్యతను ఇప్పటి ‘కథ’ తన భుజానికెత్తుకుంది. అందుకే కెరీర్ కోసమే పనికొచ్చే ప్రేమల గురించి, బాల్యాన్ని చంపేస్తున్న చదువుల గురించి, ఆనందాన్ని మింగేస్తున్న వేగం గురించి, మనిషిని కబళిస్తున్న పోటీ గురించి, స్వేచ్ఛను చంపేస్తున్న పెళ్ళి గురించి చెప్పడం మాత్రమే కాదు. వీటిని కోల్పోతున్న కారణాలకి మూలమైన వ్యక్తి ఆలోచనల అపరిపక్వతను కనుక్కుంటోంది. ఇది బహుశా సంప్రదాయ విరుద్ధమైన పరిష్కారానే్న చూపెట్టవచ్చు. అయితే ఆనందమైన జీవితాలను ఇచ్చే క్రమంలో ఒక్కొక్కప్పుడు మనం మనుషులను కాపాడుకోవడం కూడా అవసరం. అలా కాపాడుకోవడానికి తెలుగు కథకులు సమాజంతో నడిచి అంతర్లీనమై ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకుని పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపెడుతున్నారు. ఈ మధ్య వచ్చిన కథలలో వాక్యాలు కూడా ఆప్తతను సంతరించుకుంటున్నాయి. విపులలో వచ్చిన ‘ఆ తర్వాత’ కథ బహుశా అవసరమైనప్పుడు కావలసిన, రావలసిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గురించి చెబుతుంది. చాలా చిన్న కథైనా సూటిగా వుండటం ఈ కథ ప్రత్యేకత. అవసరమైనచోట ఏ రకమైన అడ్డంకులు ఎదురొచ్చినా గెలుచుకుని తమదైన జీవితాన్ని సాధించుకోవడమే ఇవాల్టి అవసరంగా కథ చెబుతోంది.
సాంకేతికమైన నైపుణ్యాన్ని వస్తువుతో జతచేసి రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించి చదివే పాఠకుడికి నేటి సామాజిక అవసరాన్ని సరిగ్గానే బట్వాడా చేస్తోంది. జీవితాన్ని తరచి చూడటం మొదలుపెట్టాక మనుషుల మధ్య పెరుగుతున్న అసంతృప్తికి చాలా చిన్న కారణాలను కథ చెప్పగలుగుతోంది. ఈ చెప్పడం కూడా ఆధునిక శైలిని సంతరించుకుని నేరుగా పాఠకుడికి చేరేలా చెప్పడంతో ఈ కథలు కలకాలం గుర్తుండిపోతున్నాయి. ఒక సీనియర్ కథా రచయిత ‘ఈ కొత్త సంగతులను ఇప్పటి కథలు చెప్పడానికి కారణం బహుశా సమాజం కూడా వినడానికి సిద్ధమవడం ఒక కారణమైతే వినవలసిన అవసరం రావడం కూడా అనివార్యమైంది’ – అని అనడం చూసినప్పుడు భవిష్యత్తులో తెలుగు కథ మరింత పదును తేలి మనుషులను, సమాజాన్ని, మన కాలాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆశించవచ్చు. అలాంటి మరికొన్ని కథలు రావాల్సిన అవసరం ఉంది.
