నాస్తికత్వం నుంచి వేదాంతం వైపు

జీవితంలో మలుపులు అనూహ్యంగా ఉంటాయి. పోలీసుశాఖలో సుమారు 37 ఏళ్ల క్రితం ప్రారంభమైన నా జీవన అధ్యయనం క్రమక్రమంగా వేదాంతం వైపు వెళ్లడం నా మిత్రుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కానీ, వెనక్కి తిరిగి చూస్తే బహుశా అది సహజ పరిణామమేమో అనిపిస్తుంది. ప్రభుత్వశాఖల్లో అందులోనూ పోలీసుశాఖలో పనిచేసే వారికి సమాజంలోని అనేక సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. సమాజంలోని సంఘర్షణలు, వాటి మూలంలో ఉన్న సిద్ధాంత భేదాలు మొదలైనవన్నీ కొంతవరకు అవగాహనకు వస్తాయి. అందులో భాగంగానే బహుశా నా వేదాంత పరిశ్రమ..
సిద్ధాంతం అనేది మతానికి సాఫ్ట్‌వేర్ లాంటిది. ఈ సిద్ధాంతం ఆధారంగా కొన్ని పూజలు, అనుష్ఠానాలతో పాటు మతపరమైన నియమాలు మొదలైనవి అల్లుకుంటాయి. ఇవన్నీ ఆ మతంలో ఉన్న మనుషుల్ని మంచిమార్గంలో పెట్టడానికి, సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి, అలాగే దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి ఆ మతానికి హార్డ్‌వేర్ లాంటివి. కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌కే ప్రాధాన్యం. కాని హార్డ్‌వేర్‌కు కాదు. అలాగే మతానికి తర్కబద్దమైన సిద్ధాంతం చాలా ముఖ్యం.
యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో ఆనాటి యువకులందరి లాగే నా పైన కూడా మార్క్సి.జం ప్రభావం పడింది. తెలుగులో ఆనాడు లభిస్తున్న వామపక్ష పుస్తకాలు చదవడంతో తత్వ శాస్త్రంపై అభిరుచి కలిగింది. ముఖ్యంగా ఏటుకూరి బలరామమూర్తి గారి ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే పుస్తకం ద్వారా భారత దేశంలో చార్వాకుల నుంచి మొదలుగా వేదాంతుల వరకూ వచ్చిన అనేక సంప్రదాయాల గురించి పరిచయం కలిగింది. మన సంస్కృతిలో వేదాల్ని సమర్థిస్తూ ఎన్ని సంప్రదాయాలు, గ్రంథాలు ఉన్నాయో అంతే ప్రమాణంలో వేదాల్ని వ్యతిరేకించిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. వేదాల్ని పొగిడిన వారూ, తిట్టిన వారూ ఇద్దరూ సంస్కృతంలోనే పుస్తకాలు రాశారు. పై పుస్తకంలాగానే రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు, రస్సెల్‌లాంటి వాళ్ల పుస్తకాలు చదవడంతో నాస్తికత్వం పూర్తిగా అబ్బింది. సంప్రదాయానుసారంగా ఇంట్లో చేసుకోవాల్సిన అనుష్ఠానాలు, పూజలు, పునస్కారాలు కొన్నేళ్లు గాలికి వదిలేయబడ్డాయి. పోలీసు శాఖలో పనిచేసే కాలంలో మతపరమైన సంఘర్షణలు అనేకం చూశాను. వృత్తిరీత్యా, వాటి వెనుక ఉన్న తాత్విక విభేదాలను తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా, తత్వశాస్త్రం పట్ల సహజంగా నాలో ఉన్న అభిరుచి వల్ల వీటిపై దృష్టి మళ్లింది. పాశ్చాత్య తత్వశాస్త్రం చూస్తే జర్మన్ వేదాంతులైన షోపెనార్, ఇమ్మాన్యుయెల్ కాంట్ మొదలైన వారు ఉపనిషత్తులచే బాగా ప్రభావితులయ్యారని తెలుస్తుంది. అందువల్ల మొట్టమొదటిగా భగవద్గీతను చదవాలనేది ప్రయత్నం. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న భగవద్గీతను అప్పుడప్పుడు తరచి చూసినా, అదంతా అయోమయంగానే కనిపించేది. చదివిన తర్వాత మన పుస్తకాలు సులభంగానే అర్థం అవుతాయి అనే అహంకారంతో చదవడం ప్రారంభించాను. కానీ, దీనిలోని సిద్ధాంతం మాత్రం బోధపడలేదు. శ్రీకృష్ణుడు ఒక్కో సందర్భంలో ఒక్కొక్క విధంగా చెప్పినట్లు కనిపించింది. భగవద్గీతపై చాలా మందికి ఇదే అనుభవం ఉంటుంది.
వేదాంతం చదవడం సరైన పద్ధతి కాదు, అధ్యాపకుని ద్వారా వినాలి అని ఒక నియమం ఉంది. చదవడం వల్ల విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, అందువల్ల విషయం పట్ల ఆసక్తి లోపిస్తుంది. అదృష్టవశాత్తూ మంచి అధ్యాపకుల వద్ద భగవద్గీతపై సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యలు చదివే అవకాశం కలిగింది. ప్రతి మతానికీ, మనిషి గురించి, ప్రపంచాన్ని గురించి, దేవుణ్ని గురించి ఒక సిద్ధాంతం ఉంటుంది. మానవుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఈ సిద్ధాంతం ఎంత తర్కబద్దంగా ఉంటే దానికి అంత గౌరవం ఉంటుంది. ఇది ఏ జాతికో, మతానికో సంబంధించినది కాకూడదు. దేవుడికి ఒక ప్రియమైన జాతి, శత్రుజాతి అంటూ ఉండరాదు. ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో సంబంధించినదిగా ఉండకూడదు.
మతానికి సిద్ధాంతం సాఫ్ట్‌వేర్
సిద్ధాంతం అనేది మతానికి సాఫ్ట్‌వేర్ లాంటిది. ఈ సిద్ధాంతం ఆధారంగా కొన్ని పూజలు, అనుష్ఠానాలతో పాటు మతపరమైన నియమాలు మొదలైనవి అల్లుకుంటాయి. ఇవన్నీ ఆ మతంలో ఉన్న మనుషుల్ని మంచిమార్గంలో పెట్టడానికి, సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి, అలాగే దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి ఆ మతానికి హార్డ్‌వేర్ లాంటివి. కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌కే ప్రాధాన్యం. కాని హార్డ్‌వేర్‌కు కాదు. అలాగే మతానికి తర్కబద్దమైన సిద్ధాంతం చాలా ముఖ్యం.
మనదేశంలో ప్రాచీన కాలం నుంచి నాస్తికవాదం చాలా బలంగా ఉంది. మన సంప్రదాయంలో నాస్తికుడు అంటే కేవలం దేవుణ్ని నమ్మని వాడే కాక వేదాలు ప్రమాణం అని ఒప్పుకోని వాడు కూడా నాస్తికుడే. అలా గమనిస్తే పూర్తి నాస్తికులు చార్వాకులు (‘చారు’ అంటే అందమైన, ‘వాక్’ అంటే మాటలు, అనగా వీరి మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి కానీ, అసత్యాలనే భావనతో మిగతా వాళ్లు వీరికి పెట్టిన పేరు ఇది) ఆ తర్వాత వేదాలను అంగీకరించని బౌద్ధులు, జైనులను కూడా నాస్తికులుగానే వ్యవహరిస్తారు. నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ, మనుషులు రకరకాల దేవుళ్లను పూజిస్తూ, మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తూ ఉంటారు. ఈ దేవుళ్లకు ఒక పేరు, రూపం ఉండవచ్చు. లేదా లేకపోవచ్చు. కానీ, ఇద్దరికీ విశ్వాసమే ప్రధానం. విశ్వాసం అంటే శాసీ్త్రయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు నా విశ్వాసమే సరియైునదని అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్లను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు. ఒకానొక ఉపనిషత్తులో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు (నేదం యదిద ముపాసతే – కేన ఉపనిషత్) అంటాడు.
దేవుడు అనేది మనిషి సృష్టించిన ఒక ఊహ మాత్రమే అంటాడు నాస్తికుడు. అదే ధోరణిలో శంకరాచార్యులు ఈ ప్రపంచమూ, దేవుడు అనే ఊహ మనిషి కల్పించినదనే భావంలో ‘సేశం మయాకల్పితం’ అని మనీషాపంచకంలో అంటాడు. మతం, మత వ్యవస్థ పరమార్థం కాదు అంటాడు నాస్తికుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే ఽధోరణిలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడికి వేదాలనే వాటితో ప్రయోజనమే లేదంటాడు (భగవద్గీత 2.46) ఇలాగ వేదాంతి నాస్తికుడితో కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాడు. కొంత దూరం వెళ్లాక వీరి మార్గాలు విడిపోతాయి. నాస్తికుడు దేవుణ్ని నిందించి స్వర్గం, నరకం ఏవీ లేవు, నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు. వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానప్పుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు.
పైన చెప్పిన సాఫ్ట్‌వేర్ ఉపమానాన్ని తీసుకుంటే.. హిందూ మతానికి సాఫ్ట్‌వేర్‌లాంటి పుస్తకాలు ఉపనిషత్తులు. సుమారు అయిదారువేల సంవత్సరాల క్రితం రాయబడిన వేదాల్లోని చివరి భాగాలు ఈ ఉపనిషత్తులు. వేదాల చివర్లో (అంతంలో) ఉన్నాయి కాబట్టి వీటిని వేదాంతం అన్నారు. ప్రాచీన కాలంలో రుషులు అడవుల్లో నివసిస్తూ కేవలం తత్వ చింతన చేసేవారు. ఏదో ఒక మతాన్ని స్థాపించాలనే ఉద్దేశం లేకుండా కేవలం సత్యాన్ని వెతుకుతూ విశ్వంలో మనిషి స్థానమేమిటి, భగవంతుని తత్వమేమిటి? అంటూ ఆలోచించి వారు రాసిన అనుభవాలే ఉపనిషత్తులు లేదా వేదాంతం. భగవంతుని తత్వాన్ని శాసీ్త్రయ పద్ధతిలో విచారించడం చూడాలంటే ఈ పుస్తకాలను మనం చదవచ్చు. వీరి అధ్యయనంతో ప్రారంభమైన నా వేదాంత పరిశ్రమ అలా కొనసాగుతోంది.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

