కన్నడ ‘జ్ఞానపీఠ’ యూఆర్ అనంతమూర్తి కన్నుమూత

బెంగళూరులో గుండెపోటుతో మృతి
సాహిత్యంలో సంచలనాలకు మారుపేరు
ప్రత్యామ్నాయ సినిమాకు ఆద్యుడు
‘సంస్కార’తో కన్నడ సమాజంలో తుఫాను
సాహితీ రంగానికి లోటు : ప్రధాని మోదీ సంతాపం
మూడు రోజులు సెలవులు
బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నవ్య కన్నడ సాహిత్య ఉద్యమానికి సారథి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి శుక్రవారం సాయంత్రం మృతిచెందారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆయనకు శ్వాసతీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో శుక్రవారం వెంటిలేటర్లను అమర్చారు. చికిత్స కొనసాగుతుండగానే.. గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. అనంతమూర్తి పార్థివదేహాన్ని డాలర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనకు భార్య ఏస్తర్, కుమారుడు శరత్, కుమార్తె అనురాఽధ ఉన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్య జీవితంలో అనేక ప్రయోగాలకు, కళా విప్లవాలకు అనంతమూర్తి ఆద్యునిగా నిలిచారు. ఆయన ప్రసిద్ధ నవల సంస్కార 1960ల్లో కన్నడ సమాజంలో పెను తుఫానును రేపింది. సనాతన బ్రాహ్మణ విలువలపై ఆయన ఆ నవలలో తిరుగుబాటు ప్రకటించారు. తన ప్రథమ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నా రు. ఆ నవల ఆధారంగా ప్రముఖ తెలుగు కవి పఠాభి సినిమా తీ యగా..అది కన్నడనాట ప్రత్యామ్నాయ సినిమాకు మైలురాయిగా నిలిచింది అనంతర కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్‌కు అనంతమూర్తి
చైర్మన్‌గా పని చేశారు. వామపక్ష రాజకీయ అభిమానిగా పేరుపడిన అనంతమూర్తి..సాహిత్య కళా రంగాల్లో ఎంత ఎదిగారో, రాజకీయాల్లో అంతే వివాదాస్పదునిగా మారారు. రెండుసార్లు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. మోదీ ప్రధాని అయితే దేశం విడిచిపోతానని ప్రకటించి..ఆ తరువాత మాటని సవరించుకున్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కన్నడ సాహిత్యానికి తీరని లోటు అని ట్విట్ చేశారు. మన కాలంలో జీవించిన సాహితీ దిగ్గజంగా.. ఏఐసీసీ అధినేత్రి సోనియా అభివర్ణించారు. భాషా ప్రపంచంలో సాంస్కృతిక రాయబారిగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొనియాడారు. సాహితీలోకానికి మార్గదర్శకత్వం అందించారని తమిళనాడు ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. సాహిత్య రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కన్నడ సమాజానికి ఆయన సేవలు నిరుపమానమని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి నివాళి అర్పించారు. కన్నడ సాహితీ ప్రముఖులు చంద్రశేఖర్ కం బార, పాటిల్ పుట్టప్ప, చిన్నవీరకణవి, చంద్రశేఖర్ పాటిల్, కే.మరుళ సిద్దప్ప, ప్రకాశ్ బిళవాడేలు అనంతమూర్తి పార్థివ దేహం వద్ద నివాళి అర్పించారు. కన్నడ సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహారచయితగా..ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు.
సాహితీ సమరాంగణాన..
అనంతమూర్తి స్వస్థలం మైసూరు సంస్థానంలోని షిమోగా జిల్లా తీర్థహళ్లి తాలూకా మల్లిగె గ్రామం. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1932 డిసెంబర్ 21న ఆయన జన్మించారు. అనంతమూర్తి ప్రాథమిక విద్యాభ్యాసమంతా సంస్కృతంలోనే సాగింది. ఉన్నత చదువులను మైసూరు విశ్వవిద్యాలయం, బర్మింగ్‌హాం వర్సిటీల్లో పూర్తి చేశారు. 1954లో ఏస్తర్ అనే క్రిస్టియన్ మహిళను వివాహమాడారు. 1970లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఆచార్యునిగా జీవితం ప్రారంభించారు. తిరువనంతపురంలోని కేరళ విశ్వ విద్యాలయానికి 1987లో వైస్‌చాన్సలర్‌గా పని చేశారు. 1994లో జ్ఞానపీఠ, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.

