పండితుల కర్మాగారం

సంస్కృత, తెలుగు భాషల్లో శిక్షణ అనగానే గర్తొచ్చే పేరు తిమ్మసముద్రం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉందీ గ్రామం. ఈ ఊరు భాషా పండితుల కర్మాగారం, పండితుల పుట్టిల్లు. ఇక్కడ గోరంట్ల వెంకన్న అనే వ్యక్తి 1933 ప్రాంతంలో వేద పాఠశాలను స్ధాపించారు. అయితే దానికి అంత ఆదరణ లభించలేదు. తరువాత ఆయన సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వెంకన్న రాజకీయాల్లోనే చురుగ్గా పాల్లొనేవారు. ఆంధ్రకేసరి టంగులూరి ప్రకాశం పంతులుకు ఈయన ముఖ్య అనుచరుడు. గాంధీజీ సైతం రెండుమూడు పర్యాయాలు తిమ్మసముద్రం వచ్చారంటే వెంకన్న స్థాయి అర్ధం చేసుకోవచ్చు. 1936లో తుఫాన్ వచ్చినపుడు ఈ ప్రాంతంలో బాధితుల అవసరాలను తాను చూసుకుంటానని చెప్పి హరిజనులకు తనకు చెందిన ఏడు ఎకరాలను ఇచ్చారు. నివేశన స్ధలాలకు గాంధీజీతో పట్టాలు ఇప్పించాడు. మొత్తం 1200 ఎకరాల ఆస్తిలో తమ్ముళ్ళ భాగాలు పంచి తన వాటా 300 ఎకరాలను ఇతర స్థిర, చరాస్థులను సంస్కృత భాషకు దానం చేశారు. తిమ్మసముద్రంలోనే కాక జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా వేద పాఠశాల నిర్మాణం చేశారు. వేద సభలు నిర్వహించారు. అప్పట్లో ఒంగోలులోనే గోరంట్ల వెంకన్న ఉన్నత పాఠశాల ఓరియంటల్ హైస్కూలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ట్రస్టు ద్వారా గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల, ఉచిత ఆయుర్వేద వైద్యశాలలు నుడుస్తున్నాయి. ట్రస్టు ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు మూడు పూటల ఉచిత భోజనంతో పాటు వసతి కూడా అందిస్తున్నారు. ఇప్పటివరకు ఓరియంటల్ కళాశాలలో సుమారు మూడువేల మంది విద్యార్ధులు విద్యనభ్యసించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారు ఇదే కళాశాలలో అధ్యాపకులుగా కూడా పని చేశారు. మహోన్నత వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందిన గోరంట్ల వెంకన్న 1947లో దివంగతులయ్యారు. ఆయనను ఈ తరం వారు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయనడంలో సందేహం లేదు.
. రావిపాటి శ్రీనివాసరావు

