చరమాంకంలో ‘అర్జున’ పిచ్చయ్యకు ఆర్థిక కష్టాలు
బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఒకనాడు మేరునగ ధీరుడు
ననేడు రోజులు గడవడమే కనాకష్టం
క్రీడాయోధుడికి పాలకుల ఆదరణ కరవు
వరంగల్ టౌన్ : అద్భుత ప్రతిభతో బాల్ బ్యాడ్మింటన్ ఆటకు వన్నెతెచ్చి.. ఆ ఆటలో తొలి ‘అర్జున’ అవార్డును సొంతం చేసుకున్న జమ్మలమడుగు పిచ్చయ్య…. జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. 96 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించక, ఆదాయం లేక రోజు గడవడం కూడా కష్టంగా మారిన స్థితిలో జీవితం గడుపుతున్నారు. పుట్టింది కృష్ణాజిల్లాలో అయినా తెలంగాణ పోరుగడ్డ వరంగల్‌లో స్థిరపడి ఇక్కడే ఆటకు మెరుగులు దిద్దుకుని 1970లోనే అర్జున అవార్డును కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ‘ప్రత్యర్థి ఆటగాళ్ల్లు నకరాలు చేస్తే ఆయన షాట్ కొట్టి ముఖం పచ్చడి చేసేవారు… ఎదుటి కోర్టులో వున్న పది పైసల నాణాన్ని ఆయన గురిచూసి షాట్ కొడితే అది ఎక్కడికో ఎగిరిపోయేది… ’ అని పిచ్చయ్య గురించి ఆయన మిత్రులు గొప్పగా చెప్పుకుంటారు.
మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో పావలా, అర్ధ రూపాయి, రూపాయి టికెట్ కొని పిచ్చయ్య ఆటను చూసేందుకు వచ్చేవారు. 1936 నుంచి 1975 వరకు సుమారు 1800 టోర్నమెంట్లలో ఆడారు.. బంగారు, వెండి బహుమతులతోపాటు ప్రశంసాపత్రాలు, స్టార్ ఆఫ్ ఇండియా, విజార్డ్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ తదితర అవార్డులు పొందారు. బ్యాడ్మింటన్ క్రీడలో జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిన పిచ్చయ్యను పాలకులు ఆదరించకపోవడంతో అంతిమదశలో అవస్థలు పడుతున్నారు. నాటి ప్రాభవం… నేటి దైన్యస్థితిపై ఆయన మనోగతం..
పుట్టింది కృష్ణాజిల్లాలో..: నేను పుట్టింది కృష్ణా జిల్లా కోడూరులో… అమ్మ నాగమ్మ, నాన్న పున్నయ్య. మేం నలుగురం అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నేను మూడోవాడిని. నాకు మా అన్నయ్య నారాయణమూర్తి ప్రేరణ. బాల్ బ్యాడ్మింటన్‌లో మంచిపట్టు సాధించాలని అనుకునేవాడిని. అన్నయ్య ఆడే బ్యాట్ హ్యాండిల్ విరిగిపోతే దాన్ని మూలకు పడేశాడు. నేను దానిని తీసుకుని సైకిల్ ట్యూబ్ చుట్టి ఆట ప్రాక్టీస్ చేశా. నాకు ఆటలో గురువు లేరు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నదీ లేదు. ప్రముఖ ఆటగాళ్ల స్ర్టోక్స్‌ను చూసి ప్రాక్టీస్ చేశాను. ప్రముఖుల ఆటను పరిశీలించి అదే శైలిలో ఆడడం మొదలు పెట్టాక ఎక్కడకెళ్లినా నాదే విజయం. నా దృష్టిలో ఆటగాడికి డిసిప్లేన్, డివోషన్, డెడికేషన్ ముఖ్యం. 36 ఏళ్ల పాటు క్రీడాకారుడిగా కొనసాగినా ఏ దురలవాటూ నా దరి చేరలేదు.
1939లో ఆరంభించి…: 1939లో బ్యాడ్మింటన్ కెరీర్ ప్రారంభించా.. అప్పటికే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసయ్యా.. నాన్నగారు పోయాక కొన్నిరోజులపాటు ట్యూషన్స్ చెప్పాను. ఆ తరువాత బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టి టోర్నమెంట్స్‌లో పాల్గొనేవాడిని. ఆనాటి మేటి ఆటగాడు దక్షిణమూర్తితో ఆడి గెలవడం మరిచిపోలేని సంఘటన. అలా మూడున్నర దశాబ్దాలపాటు బాల్ బ్యాడ్మింటన్‌తో మమేకమైపోయాను.
పిచ్చయ్య పేరుమీద బ్యాట్లు…: అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఆటకు భలే క్రేజ్ ఉండేది. దీంతో మిత్రుడు ఆర్థిక సాయం చేయడంతో పిచ్చయ్య పేతో జేపీఎన్‌రోడ్‌లో షాపు పెట్టా.. అది 2012 వరకు నడిచింది. త్వరగా పాడవకుండా గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో బ్యాట్‌లను పంజాబ్‌లో పిచ్చయ్య పేరుమీద తయారు చేయించేవాడిని.పిచ్చయ్య బ్యాట్ అంటే అప్పట్లో క్రేజ్ ఉండేది.
కుటుంబ నేపథ్యం…: నా భార్య సత్యవతి గతించింది. ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు, ఆమె కొడుకు (మనవడు) పోయారు. మనవరాలు హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్న కూతురు నాతోపాటే ఉంటుంది. ఆమె భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. నాకిప్పుడు6 సంవత్సరాలు. శరీరం సహకరించడం లేదు. ఆదాయం లేదు. రోజువారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇల్లు అమ్ముదామని అనుకుంటున్నాను.
ప్రభుత్వ ఆదరణ లేదు…: మొదటి నుంచీ నాకు ప్రభుత్వ ఆదరణ లేదు. కేంద్రప్రభుత్వం అర్జున అవార్డును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వరంగల్‌లోని దేశాయిపేటలో 500 గజాల ఇంటి స్థలం ఇచ్చింది. ఇంటి స్థలం ఇస్తున్నామని ప్రకటించాక మూడేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగాక చేతికి వచ్చింది. ఏదైనా ఆపదలో ఉంటే స్నేహితులు ఆదుకునేవారు.
తెలంగాణ రాష్ట్రంలోనైనా…: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ కవులను, కళాకారులను, క్రీడాకారులను సత్కరిస్తున్నారు. అది అభినందించదగ్గ విషయం. కేసీఆర్ పార్టీ పెట్టేటప్పుడు పార్టీలోకి రావాలని ఇప్పటి స్పీకర్‌ను పంపించాడు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసి నా బాధలు చెప్పుకునే స్థితిలో లేను. శరీరం సహకరించడంలేదు. పెద్దమనసుతో నన్ను ఆదుకోవాలి. క్రీడల్ని నమ్ముకుంటే ప్రభుత్వ ఆదరణ, అండ ఉంటుందని తెలియజెప్పాలి.
ఉద్యోగం కోసం వరంగల్ వచ్చా..
నా చిన్ననాటి మిత్రుడు రాధాకృష్ణ వరంగల్ అజంజాహి మిల్లులో ట్రేడ్ యూనియన్ నాయకుడు. నా ఆటను చూసి మెచ్చుకుని మిల్లులో ఉద్యోగం ఇప్పిస్తా రమ్మన్నాడు. మిల్లు తరపున టోర్నమెంట్లలో ఆడాలని చెప్పాడు. దీంతో 1947లో ఉద్యోగం కోసమని వరంగల్ వచ్చా. అయితే మిల్లులో ఉద్యోగం దొరకలేదు కానీ..ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమించి జీతం ఇచ్చేవాడు. అది చేసుకుంటూనే ఎక్కడ టోర్నమెంట్స్ ఉంటే.. అక్కడికెళ్లి ఆడేవాడిని. భూపతి కృష్ణమూర్తి, మృత్యుంజయలింగం, పోలా కృష్ణమూర్తి లాంటి వారితో ఆడేవాణ్ని. మొదట క్రిష్ణాకాలనీలో ఇల్లు కట్టుకున్నాను. తరువాత దాన్ని అమ్మేసి దేశాయిపేటలో ఇల్లు నిర్మించుకున్నాను.
పంచెకట్టుతో కోర్టులోకి…
మద్రాస్‌లో టోర్నమెంట్స్ జరుగుతుంటే వెళ్లి ఆడుదామని కోర్టులోకి దిగా… అయితే ఇప్పటిలాగా అప్పుడు స్పోర్ట్స్ ప్యాంటు, షార్ట్ కొనే స్థితి లేదు. దీంతో పంచకట్టుతో కోర్టులోకి దిగడంతో అందరూ నన్ను చూసి పాలేరు అనుకుని ఎగతాళి చేశారు. ఆట అయిపోయాక అందరూ నా దగ్గరకు వచ్చి కోర్టును దున్నేశావని మెచ్చుకున్నారు. బహుమతులు కూడా ఇచ్చారు. ఆటలో ఎదుటివారిని ఎగతాళి చేసినట్టు కనిపిస్తే చాలు… షాట్ కొట్టి ముఖం పచ్చడి చేసేవాణ్ణి. ఎదుటి కోర్టులో పావలా బిళ్ల పెడితే గురిచేసే బాల్‌తో కొట్టే నేర్పు నాది.
మరిచిపోలేని విజయాలు…
నేను ఆడిన ఆటల్లో మరిచిపోలేని విజయాలు కొన్ని ఉన్నాయి. 1944లో ఆంధ్రాజట్టును తయారు చేసి మద్రాస్ జట్టును ఓడించడం. 1951లో మద్రాస్‌లో దక్షిణమూర్తి జట్టును ఓడించి బాల్ బ్యాడ్మింటన్ రారాజుగా పేరుగాంచాను. 1953లో కోయంబత్తూరులో జరిగిన ఆలిండియా ఇన్విటేషన్ పోటీల్లో ప్రముఖ ఆటగాడు రాజగోపాల్‌ను ఓడించాను. 1956 బెంగళూరులో, 1957 మద్రాస్, 1962 బెంగళూరు, 1965 కొచ్చిన్, 1966లో జంషెడ్‌పూర్, 1967లో రాజమండ్రిలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో గెలుపొందడం నా ప్రదాన విజయాలు. |