 |
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్ శామ్యూల్ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా ‘డిక్కీ’గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద కాలం సినీ కెరీర్‌ను ఆస్వాదించారు. ఆయన పేరు చెప్పగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ‘గాంధీ’ (1982) చిత్రం. ఆ సినిమా ఆయనకు ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌లను అందించింది. నిజానికి ఆయన కెరీర్ అంతకంటే నాలుగు దశాబ్దాల ముందు ప్రారంభమవడం గమనార్హం.
పందొమ్మిదేళ్ల వయసులో బ్రిటీష్ ఫిల్మ్ ‘ఇన్ వుచ్ వుయ్ సర్వ్’ (1942)తో ఆయన వెండితెర జీవితం నటునిగా ఆరంభమైంది. ఆ మరుసటి ఏడాదే రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుండగా బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో కెమెరామన్‌గా పనిచేస్తూ బాంబు దాడులనూ, వాటి పరిణామాలను డాక్యుమెంటరీగా రూపొందించారు. గ్రాహమ్ గ్రీన్ నవల ఆధారంగా అదే పేరుతో రూపొందిన ‘బ్రైటన్ రాక్’ (1947)లో పింకీ బ్రౌన్‌గా అటెన్‌బరో గొప్ప నటనను ప్రదర్శించి, అందరి మన్ననలనూ పొందారు. కొంత కాలం బ్రిటీష్ సినిమాల్లో నటించాక హాలీవుడ్ నుంచి ఆయనకు పిలుపందింది. వరుసగా ‘ద గ్రేట్ ఎస్కేప్’ (1963), ‘ద ఫ్లయిట్ ఆఫ్ ద ఫోనిక్స్’ (1965), ‘ద శాండ్ పెబుల్స్’ (1966), ‘డాక్టర్ డులిటిల్’ (1967) సినిమాలతో హాలీవుడ్‌పై తనదైన ముద్ర వేశారు అటెన్‌బరో. వీటిలో చివరి రెండింటి ద్వారా నటునిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఆయన పొందారు. వాటి తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. ఆ కొద్ది కాలానికే 1969లో ‘ఓ! వాట్ ఎ లవ్‌లీ వార్’ అనే మ్యూజికల్ సినిమాతో ఆయన డైరెక్టర్ అవతారమెత్తారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన ‘ఎ బ్రిడ్జ్ టూ ఫార్’ (1977)ను రూపొందించారు.
ఎపిక్‌గా నిలిచిన ‘గాంధీ’
అయితే దర్శకుడిగా ఆయనకు చిరకాల కీర్తిని దక్కించిన సినిమా నిస్సందేహంగా ‘గాంధీ’. అహింసనూ, సత్యాగ్రహాన్నీ ఆయుధాలుగా మలచుకుని, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టిన మహాత్ముడి జీవితం ఆధారంగా ఆయన రూపొందించిన ఈ చిత్రం ఒక ‘ఎపిక్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. అప్పటిదాకా ప్రపంచానికి పెద్దగా పరిచయంలేని బెన్ కింగ్‌స్లే అనే నటుణ్ణి గాంధీ పాత్రకు తీసుకుని, ఆయనకు ప్రపంచవ్యాప్త కీర్తిని ఆర్జించిపెట్టారు అటెన్‌బరో. 22 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం 52.8 మిలియన్ డాలర్లను వసూలు చేయడమే కాకుండా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 17 వారాల పాటు టాప్ 10లో నిలిచింది. 11 అస్కార్ నామినేషన్లు పొంది, ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కాలంలో ‘క్రై ఫ్రీడమ్’ (1987), చాప్లిన్ (1992), ‘షాడోల్యాండ్స్’ (1993) చిత్రాలు ఆయన కీర్తికి తగ్గ పేరును సంపాదించాయి. దర్శకునిగా ఆయన చివరి చిత్రం ‘క్లోజింగ్ ద రింగ్’ (2007). ఓ వైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే నటననూ కొనసాగించిన ఆయన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ప్రసిద్ధ చిత్రం ‘జురాసిక్ పార్క్’ (1993)లో డైనోసార్లను క్లోన్ చేసే శాస్త్రవేత్తగా, ‘మిరకిల్ ఆన్ 34 సీ్ట్రట్’ (1994)లో క్రిస్ క్రింగిల్‌గా, శేఖర్ కపూర్ సినిమా ‘ఎలిజిబెత్’ (1998)లో రాణి ప్రధాన సలహాదారుగా గొప్ప నటనను ప్రదర్శించారు. ఓ వైపు ఇలా సృజనాత్మకంగా పనిచేస్తూ, మరోవైపు ‘రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్’ (రాడా) ఛైర్మన్‌గానూ, యునిసెఫ్‌కు సౌహార్ద్ర రాయబారిగానూ వ్యవహరించిన అటెన్‌బరో ప్రపంచ సినిమా యవనికపై వేసిన ముద్ర అసామాన్యం, అనితరసాధ్యం. ఆయన మృతికి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర రంగాలవారే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రగాఽఢ సంతాపం వ్యక్తం చేస్తూ, నివాళులర్పిస్తున్నారు. |
|