ముచ్చట్లు లో శర్మ గారి అంతరంగం – నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే – రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి.

నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే

రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి.

‘’ఇతని హృదయమ్ము ఏదియో ఒక మంచి కార్యమ్ము సాధించ కలవరించు ‘’-మా బావ మరది మైనేని గోపాల కృష్ణ (గారి )పై 2005లో రాసిన సీస పద్యం లోని పై పంక్తులు ఈ పుస్తక నిర్వహణ లో ఆయన పాత్రను వ్యక్త పరుస్తాయి .

ఈ సంవత్సరం ఏప్రిల్ మూడవ వారం లో ఆయనతో (Hunts ville-Alabama,U.S.A )టెలిఫోన్ లో మాట్లాడుతూ ఒక సందర్భం లో ‘’Louis Untermeyer  రాసిన  “”Lives Of the poets’’ గొప్ప పుస్తకం ఆంగ్ల కవుల జీవిత చరిత్రలు తెలుసుకోవటానికి ఒక’’ golden mine ‘’ లాంటిదని ,నా ఇంట్లో మంచి కాపీ ని మిత్రుల కిచ్చేసి జిరాక్స్ కాపీ పెట్టుకొని చదవక వీకీ పీడియా చూసి కాలం వృధా చేసుకొన్నాను అని అన్నాను  . ఆ మాట ఆయన చెవిని పడిందో లేదో ఆ పుస్తకం కొని express mail  లో ఉయ్యూరుకు  పంపించేడు .ఎవరికో మీకు తెలుసు .ఇది ఈ పుస్తక ప్రచురణకు నాంది .ఇది ఆయన సాధించుటకు ‘’కలవరించిన’’ మరొక మంచి కార్యం .

ఏప్రిల్  30 వ తేదీకుకు దుర్గా ప్రసాద్ గారికి పుస్తకం అందింది .మే మూడవ తారీకుకు అప్పుడే 150పేజీలు  చదివి –పుస్తకం చాలా ఆసక్తికరం గా ఉన్నదని,అనువాదం చేస్తే బాగుంటుందని వెంటనే ఆ పని ఆరంభించారు . ఆయన మిగతా కార్య క్రమాలకు భంగం కలుగ కుండా రోజుకు 10-15పేజీలు  చదువుతో,జూన్ ఏడవ తేదీకు 750పేజీల ఉద్గ్రంధాన్ని సంక్షిప్తీకరించి (కుదించి) 250పేజీలు  తెలుగులో   సరళ సుందరమైన శైలితో తెలుగు జాతీయముల తోనూ ,నుడికారము తోను రసవంతం గా ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’అనే ఈ పుస్తకం పూర్తి చేసేరు .ఇతర గ్రంధాలు కూడా చూసి కొన్ని చేర్పులూ మార్పులు చేసేరు .

ఈ గ్రంధ రచయిత శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు సరసభారతి అధ్యక్షులు.శేముషీ విశేష విభవ సంపన్నులు .అర్ధ సహస్రాధిక వ్యాసాలను రచించి ప్రామాణిక మైన పత్రికలలో ప్రచురించిన వారు .డెబ్బది ఐదేండ్ల వయసులోనూ నిబ్బరముగా వైవిధ్య భరితమగు సాహితీ ప్రక్రియలను కొనసాగిస్తున్న గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని కొని యాడుటకు మనకు మాటలు చాలవు .ఎంత మేదావియో అంత నిగర్వి ,నిరాడంబరులు .అకుంఠితమైన కార్య దీక్ష లో  వారికున్న బాధ్యత ,నిబద్ధత ,సత్వరత అపూర్వములు ,అనన్య సాధ్యములు .

దుర్గా ప్రసాద్ గారితో నా మొదటి పరిచయం ఉయ్యూరు లో 2004 లో గ్రంధాలయం మా అత్త మామల పేరిట పునర్నిర్మాణం చేసి ఆవిష్కరించి నపుడు .నేను రాసిన సీస పద్యాలను సభలో వారిని చదివి పెట్టమని కోరితే ,అందుకు అంగీకరించి ,తప్పులు దిద్ద కుండా చదివినందుకు వారి సౌజన్యతకు ఆశ్చర్య పోయేను .

2008లో నేను అమెరికా వెళ్ళినప్పుడు వారు కూడా అక్కడ ఉండటం తటస్థ పడింది .అప్పటికి అచ్చయిన నారెండు పుస్తకాలు కవితా సంకలనాలు వారికి పంపగా మరునాటికే సుదీర్ఘ మైన విశ్లేషణ తో ప్రోత్సాహకరమగు ప్రశంసా వాక్యాలతో వ్రాసి  పంపించేరు  .నా ఆశ్చర్యానందములకు మేర లేదు .తరువాత ఈ ఎనిమిది సంవత్సరాలలో సరసభారతి ప్రచురణలన్నీ నాకు వారు పంపడం ,నేను నా అసమర్ధత వల్ల  వెంటనే స్పందిచక పోవడం మామూలై పోయింది .

కవిగా రచయితగా ,సంపాదకుడిగా,అనువాదకుడిగా వివిధ పాత్రలలో శతాధిక గ్రంధములను వెలువ రించిన ‘’లూయిస్ అంటర్ మేయర్’’ గురించి చర్చించిన ఈ సందర్భం లో , వారిని ఆరాధించిన నా మిత్రులు ,గురు తుల్యులు కృష్ణా జిల్లా బందరు వాస్తవ్యులు గా ఉండిన శ్రీ కోట సుందర రామ శర్మ గారు ద్వాదశ భాషా ప్రవీణులు జ్ఞాపకానికి వచ్చారు ..వారు సంస్కృత ఆంద్ర ఆంగ్లములలో పండిత ప్రకాండులు .’’Return of the rambler’’  అని వారు రచించిన ఆంగ్ల కావ్యమును లూయిస్ అంటర్ మేయర్ కు పీఠిక వ్రాయమని పంపేరు .దురదృష్ట వశమున 90 ఏళ్ళ వయసులో అంటర్ మేయర్ గారు ఆస్వస్థగా ఉండి వారం దినములలో చనిపోయేరు .పీఠిక రాలేదు .ఆ సందర్భం లో లూయిస్ అంటర్ మేయర్ గురించి ‘’ఆయన చాలా గొప్ప వాడు ‘’అని మొదటి సారిగా విన్నాను .కోట సుందర రామ శర్మ గారు అయిదు లేక ఆరు సంవత్సరాల  క్రిందట బందరులో వారు నిర్మించిన వృద్ధాశ్రమం లో స్వర్గస్థులైరి .అమెరికా లో20సంవత్సరాలు ఉండి వారు ఆర్జించిన దంతా వారి భార్య పేర ’’త్రిపుర సుందరీసంస్థ ‘’ అను ‘’చారిటబుల్ ట్రస్ట్ ‘’నెల కొల్పిన వితరణ శీలురు . బందరు చేరువలో ఉన్న ఉయ్యూరులో శ్రీ కోట సుందర రామ శర్మ గారిని ఈ సందర్భం లో  సంస్మరించుట ఔచిత్యమే కదా .

2007 లో నేను ప్రచురించిన ‘’పడమటి సంధ్యా రాగం ‘’లోని మూల కవితలు కొన్ని(snow flakes ,tiger tiger) మొదలైనవి 1971 లో లూయిస్ అంటర్ మేయర్ ప్రచురించిన ‘’singing world ‘’ లోవే .ఆ తర్వాత Anthology of American  verse ,Anthology of British verse  ఎక్కువగా వాడుతూ ఉండే వాడిని .వాటిలో కూడా కవుల యొక్క జీవిత చరిత్రలు ఒకటి రెండు పేజీలు పొందు పరచే వాడు .’Lives of the poets ‘’ నా వద్ద  అయిదేళ్ళు  ఉండీ 100పేజీల కన్నా చదవ లేదు .రెండు నెలలో దుర్గా ప్రసాద్ గారు మొదటి సారిగా చదివి ,జీర్ణించుకుని ,కుదించి  తెలుగు లో అనువదించే రంటే  వారి ప్రతిభా వ్యుత్పత్తులకు మరొక నిదర్శనం మాత్రమే .

ఈ గ్రంధ రాజమునకు పీఠిక వ్రాసిన డా.లంకా శివ రామ ప్రసాద్ గారు ‘’వయసున పిన్న యైన శేముషీ విశేషమున మిన్న ‘’.అమూల్యమైన స్వీయ రచనలే కాక ,అర్ధ శత సమీప ద్విభాషాను వాదములు అనితర సాధ్యములు .భాగవతాది పురాణములను ఆంగ్లములో అనువదించుటయే కాక ,ఇతః పూర్వం తెలుగులో అనువదింప బడని ఆంగ్ల క్లాసిక్స్ ను ఎన్నిటినో  అనువదించి తెలుగు పాఠకులను వారు రుణ గ్రస్తులను గావించిరి .వృత్తి రీత్యావారు హృదయ (శస్త్ర) వైద్యులని తెలుసు కున్నప్పుడు మన ఆశ్చర్యమునకు మేర యుండదు .

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’అను ఈ గ్రంధం నేను అంకితం పొందటం లో ‘’ఇద్దరు ప్రసాదు  ‘’గార్లతో నా పేరు కూడా శాశ్వతం గా ముడి పడి ఉండటం నా పూర్వ జన్మ లేక పూర్వీకుల సుకృతం గా భావిస్తున్నాను . .దుర్గా ప్రసాద్ గారికి నాపై ఉన్న అవ్యాజాను రాగ మే కారణము గా భావిస్తున్నాను .వారికి నా హృదయ పూర్వక అభినందనలు ,శుభాశీస్సులు .

తెలుగు పాఠకులకు వినోదము తో పాటు విజ్ఞానము, మానసిక వికాసము ,విశాల దృష్టి,ఆధ్యాత్మిక చింతన కలిగించు అమూల్య గ్రంధములు మునుపటి వలె  వెలయించు నట్లు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని సర్వేశ్వరుడు  ఆయురారోగ్య భాగ్య పరంపరాభి వృద్ధి  ప్రసాదించి  కాపాడు గాక  అని ప్రార్ధిస్తూ ఈ వ్యాసమున ముగిస్తున్నాను

డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ ,ఏం డి. –

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.