—
అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా?
ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో ఉంటే, అదే తావులో సి.పి. బ్రౌను గ్రంథాలయాన్ని నిర్మించడం వారసత్వ రక్షణ కృషే అవుతుంది. అయితే పాలక పక్షాల నిర్లక్ష్యాల వల్లో, ఆర్థిక దుస్థితుల వల్లో కొన్ని చరిత్రాత్మక సంస్థలు ఒకనాటి సేవల్ని అందించలేకపోవచ్చు. కాలగర్భంలో కొన్ని కలసిపోరుూ వుండవచ్చు. అంతమాత్రాన ఆ సంస్థల్నీ, వాటి రూపకర్తల ఆశయాల్నీ కొంచెపరచడం, కించపరచడం మెచ్చుపని అనిపించుకోదు. హైదరాబాదు, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం శతాబ్ది ఉత్సవ సంఘం వారు – ఆ భాషా నిలయం నూరేళ్ళ చరిత్రను వర్తమాన తరం వారికి స్ఫూర్తిదాయకంగా తెలియజేసే ప్రయత్నంగా ప్రఖ్యాత రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావును ఒక పుస్తకం రాయమని గతంలో కోరడం ముదావహం. వీరేశలింగం పంతులు – సమగ్ర పరిశీలన, వీరేశలింగం లేఖలు – డైరీలు వంటి శ్రమైక గ్రంథాలు రాసిన, వీరేశలింగ గ్రంథాలు కొన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన శ్రీ అక్కిరాజు ‘శరదశ్శతం’ అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంపై ఒక పుస్తకం రాయడం ఆ గ్రంథాలయాభిమానులుగా మనందరికీ ఆనందకారణం. పుస్తకాన్ని ప్రకటించిన భాషాలయ కార్యవర్గమూ అభినందనార్హమే. అయితే… ఆ పుస్తకంలో ఆ గ్రంథాలయేతరంగా ఆయన రాసిన కొన్ని అంశాలు చరిత్రాభిమానుల మనోభావాల్ని గాయపరిచేవిగా ఉన్నాయి. వాస్తవ ప్రదర్శనశాలలో వాటిని ఎత్తిచూపడం ఈ రచనోద్దేశం.
పుట రెండులో ‘‘వీరేశలింగం పంతులుగారి హితకారిణి వంటి సంస్థలే ఇప్పుడు లేవు’’ అన్నారు. కాగా ‘వంటి సంస్థలు’ అలా వుంచితే ‘హితకారిణీ సమాజ’మే ఓ సంస్థగా దేవాదాయ శాఖ క్రింద నడపబడుతోంది అనేది వాస్తవం. 2, 3 పుటల్లో ‘‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థగాని, అది నడపిన పత్రికగాని, రాజమహేంద్రవరంలోని ఆంధ్ర చారిత్రక పరిశోధన సంస్థగాని ఇప్పుడు లేవు. రాజమండ్రిలో శ్రీ వీరేశలింగ ఆనందోద్యానం, పురమందిరం నామమాత్రంగా తమ ప్రాణావసాన దశలో ఉన్నాయి. దామెర్ల రామారావు చిత్రకళా సంస్థ లేనట్లే లెక్క’’ అని తీర్మానించేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థ ఇప్పుడు లేదంటే కాకినాడలో ప్రతి పౌరుడూ ముక్కుమీద వేలేసుకుంటాడు.
కాకినాడలో రామారావుపేటలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు గవర్నమెంటు మ్యూజియంగా ఆ సంస్థ సుమారు ఐదువేల రాతప్రతులతో, ప్రాచీన ముద్రిత గ్రంథాలతో, క్యూరేటరు సిబ్బందితో సేవలు నిర్వహిస్తోంది. నూతన దశాభివృద్ధికి కొన్ని లక్షలు వచ్చాయి కూడా.
అక్కిరాజు వారు చెప్పినట్లు వీరేశలింగపుర మందిరం నామమాత్రంగా ప్రాణావసాన దశలో మాత్రం లేదు. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలతో, వీరేశలింగ గ్రంథ ప్రదర్శనతో ప్రాచీన సంస్థ ఎలా ఉంటుందో అలా వుంది.
‘‘దామెర్ల రామారావు ఆర్టు గేలరీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ క్రింద రాజమండ్రి లక్ష్మివారపుపేటలో అభివృద్ధి దశలోనే ఉంది. నిత్యం సందర్శకులు ఎంతోమంది సందర్శిస్తున్నారు. ఇటువంటి సంస్థ ‘లేనట్లే లెక్క’ అక్కిరాజు వారి వినూతన గణితంలో. ‘మయసభ వీక్షణానుభూతి’ చెందారేమోమరి. గతానికే కాదు, వర్తమానానికి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రల్ని వాస్తవ దృష్టితోనే గమనించాలి. ఎన్నో పాతపత్రికలు, ప్రాచీన గ్రంథాలు కళ్ళల్లో వత్తి పెట్టుకుని మరీ పరిశీలించే అక్కిరాజు వారు వక్రీకరణలకి దూరంగా ఉండాలి మరి. ఎన్నో సంస్థలు, మరికొన్ని గ్రంథాలయాలు కాలగర్భంలో కలసిపోయినా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని శతాధిక సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుని రావడాన్ని ఎంత కొనియాడినా తక్కువే అవుతుంది. కానీ దాని వైభవ ప్రాభవాలు చెప్పే సందర్భాలలో తక్కిన ఉన్నవాటిని సున్నగా చూడడం, చూపడం రమాపతిరావు గారికి తగదు.
16వ పుటలో ఒక దారుణ విశే్లషణకు ఒడిగట్టారు, రావుగారు. ‘‘రాజమండ్రిలో వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడు, నాళం కృష్ణరావు ప్రభృతుల స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు ఉన్నా అవి సార్వత్రిక, సార్వజనిక గ్రంథ పఠనోద్దేశ నిలయాలు కావు. తరువాత ఈ పెద్దల గ్రంథ సంగ్రహాలు ఒక చోట కలిపి, దానిని గౌతమీ గ్రంథాలయమని నామముంచినా, ఈ గ్రంథాలయం పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేది’’ – అని వ్యాఖ్యానించారు.
శ్రీ ‘గౌతమీ’ గ్రంథాలయానికి నాసికాత్రయంబకం వంటి వీరేశ గ్రంథాలయాన్ని నాళం కృష్ణారావుగారు 1898లో స్థాపించారు. అదే తరువాత సర్వజన గ్రంథాలయంగా నామధారణ చేసింది. ఈ గ్రంథాలయం ఉన్న కాలంలో వడ్డాది సుబ్బారాయ కవి పేర వ.సు.రాయ గ్రంథాలయంగా వేరే గ్రంథాలయం వృద్ధి చెందింది. 1920లో వసురాయ సర్వజన గ్రంథాలయాలు సమ్మేళనమై శ్రీ గౌతమీ గ్రంథాలయంగా రిజిస్టరయింది. గ్రంథాలయాలు స్థాపించడాన్ని ‘స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు’గా కొంచెపరచారు. అంతేకాక వాటిని ‘సార్వత్రిక, సార్వజనిక గ్రంథపఠనోద్దేశ నిలయాలు’ కావని స్థాపకుల ఆశయాల్నే కించపరచారు. ‘సర్వజన గ్రంథాలయం’ అనే నామకరణంలోనే సామాజికోద్దేశం ఉండగా రమాపతిరావు గారి దృష్టిలో అది శ్రీ మద్రమారమణ గోవిందో హరి అయింది. అంతేకాదు, ప్రయత్నాలు అనే మాటతో వారి ఆశయాల్ని విశే్లషించడంలో ఔచిత్యాన్ని పాటించలేదు.
ఆ గ్రంథాలయాలు ఎటువంటి పాత్ర వహించాయో తెలుసుకోవాలంటే ఒకనాటి పాత గ్రంథాలయ సర్వస్వాలూ, అవీ మరింతగా చూస్తే మంచిది, గ్రహించవచ్చు.
‘శ్రీ గౌతమీ గ్రంథాలయం పండితులకి మాత్రమే అందుబాటులో ఉండేది’ ఇది అక్కిరాజు వారి పరిశోధన. 116 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల గ్రంథాలయానికి ఏవైనా కొన్ని సంవత్సరాల ఆటుపోటులు వుండి వుండవచ్చు. స్ర్తి విద్యాభ్యాసానికి వెన్నుదన్నులిచ్చిన వీరేశలింగం స్ఫూర్తితో – పురుషులకంటే స్ర్తిల వద్ద చందా తక్కువగా వసూలు చేసిన ఘనత ఆ గ్రంథాలయానిది. దశాబ్దాలపాటు గ్రంథాలయ గ్రంథాలు ప్రజావినియోగార్థం సైకిళ్లపై సంచులతో ఉద్యోగులతో ఇంటింటికీ వినియోగింప చేసిన గ్రంథాలయం గౌతమీ గ్రంథాలయం. పరిశోధక, సభ్య పాఠకులకు సేవ చేస్తే – కేవలం పండితులకే అనడం ఈ పండితునికే తగింది. వందల వందల సాహిత్య సాంస్కృతిక సభలు కంచుమర్తి బాబాయమ్మ హాలులో చేసి, జ్ఞానాన్ని ప్రజలకు పంచాలనే ఆశయ సిద్ధిగల గౌతమీ గ్రంథాలయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంగా నడపబడుతోంది.
వేటపాలెంలోని సారస్వత నికేతనం, రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, నెల్లూరులోని వర్ధమాన సమాజం వంటి గ్రంథాలయాలు ప్రతి తెలుగువాడూ గర్వించదగిన గ్రంథాలయాలు… వాటి చరిత్రలు అవశ్య పఠనీయాలు. ఇంతకీ అక్కిరాజు వంటి వారు చరిత్రను భూత, వర్తమాన కోణాలలో దేనినీ కొంచెపరచరాదు, కించపరచరాదు అనిపిస్తుంది. అక్కిరాజు గారు లేదన్నంత మాత్రాన చరిత్ర మరుగున పడిపోదు, కనుమరుగైపో

