విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు

ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా ఉంటాడో ఎన్‌కె రామారావు అలా వుండేవారు. మంచి కథా రచయిత, మంచి మనిషి కూడా కావడం అరుదైన విషయం. రాసిన కథలు పిడికెడే అయినా పదునైనవీ, ఎల్లకాలం గుర్తుంచుకునేవి. సమాజం పట్ల నిబద్ధతతో ఆయన కథా రచన చేశారు. స్వీయ మానసిక లోకంలోంచి ఇతివృత్తం ఇష్టపడడు. ఆయన కథా రచన రెండు విడతలుగా సాగింది. కాంచనపల్లి చినవెంకట రామారావు, బోయ జంగయ్య వంటి నల్లగొండ జిల్లా సీనియర్ కథా రచయితలతో ఆయన రచనలు ప్రారంభించారు. వారితోపాటు ఓ విడత కథలు రాసి ఆ తర్వాత వదిలేశారు. ఆ తరువాత కొంతకాలానికి తిరిగి రాయడం మొదలుపెట్టారు. ఆయనకు కథలంటే ప్రాణం.
రామారావు గారు ఆంగ్ల కథలు చదివి వాటి గురించి చెప్పేవారు. దేశదేశాల కథల గురించి అత్యంత ఆసక్తికరంగా ఆయన చెబుతుండేవారు. కథా రచనలోని మెలకువలు కూడా ఆయన మాటల్లో ఉండేవి. కథలు రాయడంలోనే కాదు, కథలు చెప్పడంలో కూడా రామారావు దిట్ట. ఆయన దేశవిదేశాల్లోని ఉత్తమ కథల గురించి చెబుతుంటే ఏమాత్రం విసుగొచ్చేది కాదు. రామారావు మంచి హాస్యప్రియుడు. హాస్యం ఆయన నోటివెంట అప్రయత్నంగా జారిపడేది. హాస్యం, వ్యంగ్యం ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన శ్రీరమణను చాలా ఇష్టపడేవారు. అలాగే, బాపు-రమణల జంటకు రామారావు అత్యంత ప్రీతిపాత్రుడు. బాపుగారు రామారావు బొమ్మ కూడా గీశారు. ఆయన రాసిన విద్యుల్లత కథా సంపుటికి కవర్ పేజీ బొమ్మ కూడా గీసిపెట్టారు. కవర్‌పేజీల బొమ్మలు గీయడం మానేసిన తర్వాత బాపు రామారావు కోసం ఆ పని ప్రత్యేకంగా చేసిపెట్టేవారంటే ఆ అభిమానం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. ముళ్లపూడి రమణ రచనలను విపరీతంగా అభిమానించేవారు. వ్యంగ్య, హాస్య కథలు కూడా రామారావు రాశారు. అయినా, ఆయన తన సామాజిక నిబద్ధతను వదిలిపెట్టలేదు. ఆయన కథలు చెప్పడం గురించి అనుకున్నాం. విప్లవ గేయం రాసిన ఎన్‌కె అనుకుని తనను పోలీసులు నిర్బంధించిన తీరు, తాను తిరిగి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలను ఆయన అత్యంత ఆసక్తికరంగా చెప్పేవారు. అలాగే శ్రీశ్రీ, రావిశాస్ర్తీ నల్లగొండకు వచ్చినప్పటి వివరాలను కూడా కథలు కథలుగా చెప్పేవారు. రావిశాస్ర్తీ రాచకొండ కోటని, గ్రామాన్ని చూద్దామని పట్టుబడితే వెళ్లారుట. తమ పూర్వీకుల నివాసం ఈ రాచకొండనే అని రావిశాస్ర్తీ చెప్పారని రామారావు చెప్పారు.
సాహిత్య లోకానికి సంబంధించి ఆయనకు కచ్చితమైన ఇష్టాఇష్టాలు ఉండేవి. శిల్పం లేని కథలను ఆయన ఏమాత్రం అంగీకరించేవారు కాదు. రచనలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ నిండుతనం ఉండాలని ఆయన భావించేవారు. ఆయన లోటు భర్తీ అయ్యేది కాదు. అంతటి పదునైన రచయిత తెలుగు సాహిత్య లోకంలో చాలా అరుదు. ఆయన రాసిన కథలు తక్కువే అయినా, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనే రీతిలో ఆస్వాదించవచ్చు.

