భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో నెహ్రూ అలీన విధానం- ద్విధ్రువ ప్రపంచపు అధికార రాజకీయాలలో చిక్కుకోకుండా ఉండడం- తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో భారతదేశానికి తోడ్పడింది; అంతేకాకుండా ప్రపంచ దేశాల మధ్య అవగాహనను పెంపొందించి, శాంతి సామరస్యాలను నెలకొల్పింది; తద్వారా అంతర్జాతీయ ఘర్షణల్లో మధ్యవర్తి పాత్రను పోషించే శక్తిని భారత్‌కు సమకూర్చింది. నెహ్రూ నాయకత్వంలో అలీనోద్యమం ప్రపంచపు అతి పెద్ద శాంతి ఉద్యమంగా వర్ధిల్లింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య రాజ్యాలు, సోవియట్‌ యూనియన్‌ పరస్పర అపనమ్మకాలతో ఉండేవి. తమ మధ్య ఘర్షణలను నివారించి రాజీ కుదర్చడానికి నెహ్రూ వైపు చూస్తుండేవి. ఆయన మధ్యవర్తిత్వాన్ని కోరుకునేవి. ఒక తటస్థ, నిష్పాక్షిక వ్యక్తిగా ఈ రెండు శత్రుపూరిత కూటముల మధ్య శాంతి వారధిని నిర్మించడానికి నెహ్రూ అపారమైన కృషిచేశారు. కొరియా యుద్ధం (1950), సూయెజ్‌ వివాదం (1956), కాంగో అంతర్యుద్ధం మొదలైన అంతర్జాతీయ సంక్షో భాలు మరింతగా విషమించకుండా సమస్యలను పరిష్కరించడంలో నెహ్రూ సఫలమయ్యారు.పలు సందర్భాలలో మూడో ప్రపంచయుద్ధం ప్రజ్వరిల్లకుండా నెహ్రూ నివారించారని బెర్ట్రండ్‌ రస్సెల్‌ కొనియాడారు.
స్వతంత్ర భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తుందని నెహ్రూ ప్రకటించినప్పుడు ఆయన ఆదర్శం ఆచరణాత్మకం కాబోదని పాశ్చాత్యరాజ్యాలు కొట్టివేశాయి. అయితే ప్రజల స్వతసిద్ధ వివేకంలో సంపూర్ణ విశ్వాసమున్న నెహ్రూ కుల మతాలకు అతీతంగా, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా 21 ఏళ్ళ వయస్సు నిండిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించారు. దేశ పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు కల్పించారు. సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైందని మరి చెప్పాలా? ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
పురానవ భారతదేశాన్ని, దాని చరిత్రను, సమున్నత సాంస్కృతిక వారసత్వాన్ని నెహ్రూ కంటే మెరుగ్గా అర్థంగా చేసుకున్న వారు మరొకరులేరు. ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ (భారతదర్శనం)లో ‘భిన్నత్వంలో ఏకత్వంగా… వైరుద్ధ్యాల పుట్ట అయినప్పటికీ అదృశ్య శక్తులతో, సమైక్యంగా విలసిల్లుతున్న జాతిగా… ఒక కల్పన, ఒక భావం, ఒక స్వప్నం, ఒక దార్శనికతగా..’ మన పుణ్యభూమిని నెహ్రూ అభివర్ణించారు. ఆ రాజనీతిజ్ఞుని దార్శనికత, ఆదర్శాలే స్వతంత్ర భారతదేశంలో లౌకిక ఉదారవాద ప్రజాప్వామ్య వ్యవస్థకు పునాదులు వేశాయి. 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగసభలో నెహ్రూ ఒక ఉత్తేజకరమైన ప్రసంగాన్ని వెలువరిస్తూ దేశప్రజలకు ఒక ఉదాత్త, స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. ‘చాలా సంవత్సరాల క్రితం అదృష్టదేవతతో సమాగమానికి మనం ఒక ముహూర్తం కుదుర్చుకున్నాం. ఇప్పుడు మన ఆ ప్రతిజ్ఞని సంపూర్ణంగా లేక పూర్తి స్థాయిలో కాకపోయినా గణనీయమైన స్థాయిలో నెరవేర్చుకునే తరుణం ఆసన్నమయింది. సరిగ్గా అర్థరాత్రి పన్నెండుగంటలకి, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు, భారతదేశం జాగృతమై నూతన జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతోంది…. ఈ పవిత్ర తరుణంలో మనం భారతదేశం, భారత ప్రజ, అంతకంటే బృహత్తరమైన మానవజాతి సేవకి అంకితమవుతూ శపథం చేయడం ఎంతైనా సముచితం’. ఆ అర్థరాత్రి నెహ్రూ మాట్లాడిన ఆ మాటలు భారతీయులను ఎప్పటికీ ఉత్తేజపరుస్తూనే ఉంటాయనడంలో సందేహం లేదు.
నేడు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ విఫల రాజ్యాలే. ప్రజాస్వామ్య విధానాన్ని మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా చిత్తశుద్ధితో విజయవంతంగా అనుసరించగలుగుతున్నామంటే అందుకు స్వతంత్ర భారతదేశ తొలినాళ్ళలో నెహ్రూ అందించిన నాయకత్వమే ముఖ్య కారణం. ప్రజల విచక్షణా వివేకాల్లో ఆయన ఉంచిన సంపూర్ణ విశ్వాసం ఏమాత్రం వమ్ము పోలేదు. నెహ్రూనే స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రి కాకపోయి ఉన్నట్టయితే మన స్వాతంత్య్రం, ప్రజాస్వా మ్యం సుస్థిర మనుగడను సాధించుకునేవా అన్నది అనుమానాస్పదమే. మన దేశం కూడా పాకిస్థాన్‌ వలే రూపొంది ఉండే దేమో! ఆ దేశంలో వలే ఇక్కడ కూడా సంకుచితులైన మతాచార్యులు సమాజంపై పెత్తనం చెలాయిస్తుండేవారు. రాజకీయ అఽధికారానికి ఆరాటపడే సైనికాధికారులు రాజ్యవ్యవస్థను తమ నియంత్రణలో ఉంచుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక సువ్యవస్థిత జాతి-రాజ్యంగా మన దేశం ఎదిగి ఉండేది కాదనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పటిష్ఠమవడానికి నెహ్రూ వంటి నాయకుడు లేరని ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే అంగీకరించారు, ఇప్పుడు పాక్‌ అస్తిత్వం సంక్షోభంలో పడిందని మరి చెప్పనక్కరలేదు. భారతదేశంలో ప్రజాస్వా మ్యాన్ని, ప్రజాస్వామిక సంస్థలను నెహ్రూనే పెంచి పోషించారు. భారతీయులు ఇప్పటికి 16 సార్లు తమ జాతీయ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ఏడాది జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 81 కోట్ల మందికి పైగా ఓటర్లలో 51 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ భారతీయ ఓటర్ల సంఖ్య అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీల మొత్తం జనాభా కంటే అధికం. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదొక చరిత్రాత్మక విజయం. భారతీయులు మాత్రమే సాధించగల విజయమిది.
లౌకిక వాదం నెహ్రూకు ఒక సునిశ్చిత విశ్వాసం. సమాజాల, నాగరికతల చరిత్రపై సమగ్ర అవగాహన ఉన్న నెహ్రూకు మతతత్వ రాజకీయాలు భారతదేశాన్ని విభజించాయన్న సత్యం బాగా తెలుసు. ప్రజాజీవితంలో మతం, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలని, ఎట్టి పరిస్థితులలోను ఆ రెండిటినీ కలిపివేయకూడదని ఆయన గట్టిగా విశ్వసించేవారు. లౌకికవాద రాజకీయాలే బహుళ మతాలతో విలసిల్లుతున్న సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతాయని ఆయన భావించారు. మతం ప్రభావం బాగా ఉన్న సమాజంలో మత మైనారిటీలకు భద్రత ఉండాలని, వారికి అన్ని రంగాలలోనూ సమాన హక్కులు ఉండాలని నెహ్రూ భావించారు. కనుకనే భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ మత స్వాతంత్ర్యాన్ని కల్పించింది. రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకోవడాన్ని, యావత్‌ జాతిపై నిర్దిష్ట మత విశ్వాసాలను రుద్దడంగానీ జరిగితే దేశ ఐక్యత, సమగ్రత విచ్ఛిన్నమవుతాయని నెహ్రూ పదే పదే హెచ్చరించేవారు. ఇటీవలి మన చరిత్రను సింహావలోకనం చేద్దాం. 1992లో మతావేశంతో ఊగిపోయిన హిందూమూకలు బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగివుండేవికావు; 2002లో గుజరాత్‌లో గోధ్రా ఘటన, ముస్లింల ఊచకోతలు చోటుచేసుకుని ఉండేవి కావు. గుజరాత్‌ మతతత్వ అల్లర్ల వల్లే ఇండియన్‌ ముజాహిదీన్‌ అనే మిలిటెంట్‌ సంస్థ ఏర్పడింది. గుజరాత్‌ అల్లర్లపై పగ తీర్చుకునేందుకే ఆ సంస్థ ఏర్పడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌ ఇంకెంత మాత్రం మునుపటి వలే లేదు.
నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి కావడంతో సంఘ్‌ పరివార్‌ తన ‘హిందూ ఎజెండా’ను అమలుపరచాలని ఒత్తిడి చేయవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మోదీ విజయంతో భారత్‌ మితవాద పథంలోకి మళ్ళిందన్నది స్పష్టం. హిందూ ఛాందసవాదం ప్రజ్వరిల్లుతోందనేది కూడా వాస్తవం. దేశ జనాభాలో 82 శాతంగా ఉన్న హిందువులకు 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ముప్పు ముంచుకొస్తోదని ఆరెస్సెస్‌ భావిస్తోంది. అల్పసంఖ్యాకులుగా ఉన్న మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న మతస్థులు నిర్దేశించిన విధంగా ఉండాలనేది సంఘ్‌పరివార్‌ సిద్ధాంతం. ఇది ఇప్పుడు భారత రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే అంశంగా పరిణమించింది. ఇది సంకుచిత దృక్పథం. వాస్తవ విరుద్ధమైనది. దేశలౌకికవాద పునాదులను దెబ్బతీస్తుంది. సంఘ్‌పరివార్‌లోని తీవ్రవాదులు మన దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చడానికి ఆరాటపడుతున్నారు.
మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే నెహ్రూ పట్ల మోదీ అయిష్టత. నెహ్రూ కాకుండా పటేల్‌ ప్రథమ ప్రధానమంత్రి అయివున్నట్టయితే దేశచరిత్ర మరో విధంగా ఉండేదని ఆయన అంటున్నారు. మహాత్ముడు స్వయంగా జాతీయ ప్రభుత్వాధినేతగా నెహ్రూను ఎంపికచేశారని, పటేల్‌ ఆయన నిర్ణయాన్ని అంగీకరించారన్న వాస్తవాన్ని మోదీ విస్మరిస్తున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పటేల్‌ స్మృతిని వినియోగించుకోవడానికి మోదీ ప్రయత్నించడం విచ్రితంగా ఉంది. సంఘ్‌పరివార్‌ నాయకుల విద్వేష ప్రసంగాల వల్లే నెలకొన్న విషమ వాతావరణం గాంధీజీ హత్యకు దారితీసిందని పటేల్‌ విశ్వసించారు. ఆ కారణంగానే ఆయన ఆ సంస్థపై నిసేధం విధించారు. అయితే ఆరెస్సెస్‌ సాంస్కృతిక కార్యకలాపాలకు పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటుందని గోల్వాల్కర్‌ లిఖిత పూర్వకంగా హమీ ఇవ్వడంతో పటేల్‌ ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ వాగ్దానాన్ని ఆరెస్సెస్‌ విస్మరిస్తోంది. నెహ్రూ వ్యతిరేకతే ప్రాతపదికగా తన రాజకీయాలను తీర్చిదిద్దుకున్న వ్యక్తి ఇప్పుడు, నెహ్రూ సువ్యవస్థితం చేసిన ఉదారవాద ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థకు సారథ్యం వహిస్తున్నారు. మరి ఈ మన ప్రజాప్వామ్య వ్యవస్థ భవిష్యత్తు భద్రంగా ఉంటుందా? నెహ్రూ వారసత్వం, ప్రమాదంలో పడింది.
డాక్టర్‌ జి. రామచంద్రం
(ముంబై విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన రామచంద్రం ‘నెహ్రూ అండ్‌ వరల్డ్‌ పీస్‌’ గ్రంథకర్త)
(నేడు నెహ్రూ 125వ జయంతి)
సామాజికంగా, సాంస్కృతికంగా అపార వైవిధ్యంతో విలసిల్లుతూ, ఆర్థికంగా వెనుకబడి, అక్షరాస్యత అతి తక్కువ శాతం ఉన్న సమాజంలో ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడమనేది అత్యంత సాహసోపేతమైన ప్రజాస్వామిక ప్రయోగం. నెహ్రూచేసిన ఈ ప్రజాస్వామిక ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమయిందని మరి చెప్పాలా? ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించి, సుస్థిరంగా వర్ధిల్లుతుందంటే అందుకు నెహ్రూయే ప్రధాన కారకుడు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.