నా దారి తీరు -96
పుల్లూరు అనే చిలుకూరి వారి గూడెం లో చేరటం
ఉయ్యూరు నుంచి భోజనం చేసి బస్ లో బయల్దేరి మైలవరం చేరి అక్కడి నుండి తిరువూరు బస్ ఎక్కి పుల్లూరు చేరాను .మధ్యాహ్నం వర్జ్యం ఉంది .కాసేపు అక్కడ హోటల్లో కాలక్షేపం చేసి వర్జ్యం వెళ్ళగానే హైస్కూల్ లోకి అడుగు పెట్టాను .ప్రశాంత వాతావరణం .రోడ్డు ప్రక్కనే స్కూలు .కాంపౌండ్ వాల్ ఉంది బిల్డింగ్లు ఉన్నాయి .హెడ్ మాస్టారు బదిలీ అయి వెళ్ళారు కనుక సైన్స్ టీచర్ విజయ లక్ష్మి గారు సీనియర్ అవటం వలన ఇంచార్జి గా ఉన్నారు .ఏం పురుషోత్తమాచారి అనే లెక్కలమేస్టారు ,వీరు భొట్ల శేషగిరి రావు అనే సెకండరీ టీచరు వెంటనే పరిచయమయ్యారు .ఇద్దరూ మంచి వాళ్ళుగా కనిపించారు .ఆఫీసు వ్యవహారాలన్నీ ఆచారిగారికి కరతలామలకం .గుమాస్తా పోస్ట్ ఖాళీ గా ఉంది .డ్రిల్ మాస్టారు గురు ప్రసాద్ .సీనియర్ మోస్ట్ .మంచి ఆటగాడు .డ్రిల్ మాస్టారుగా ఉంటూనే బిఎడ్ చేసి త్ట్రెయింగ్ పూర్తిచేసి సోషల్ మాస్టారుగా ఇక్కడ పని చేస్తున్నాడు .చలమా రెడ్డి వినుకొండ వాడు యెన్ డి ఎస్ గా ఉన్నాడు .నరసింహా రావు గారనే తెల్ల పంచకట్టు ఆయన ఏ కొండూరు నుండి రోజూ వచ్చేవాడు .టెన్త్ తప్ప హామిగిలినవి రెండేసి సెక్షన్లు అని గుర్తు .లాబ్ పెద్దగా ఏమీలేదు .దాసు అని అటెండర్ చురుకుగా ఉండేవాడు .తెలుగు మేష్టారు కృష్ణుడు కుర్రాడే. మైలవరం నుండి వచ్చేవాడు . పిల్లలు డిసిప్లిన్ గా ఉన్నట్లే కనిపించారు .విజయ లక్ష్మి గారి దగ్గర చార్జి హాండ్ ఓవర్ చేసుకొన్నాను. ఆచారి గారు టిఫిన్ కాఫీ ఇంటి నుండి తెప్పించారు .తిన్నాను .ఉండటానికి బాగానే ఉంది .అయితే నా దారిలోకి తెచ్చుకోవాలి .ఎక్కువ రోజులు ఉండాలనీ లేదు .కనుక బయట రూమ్ మాట్లాడక్కర లేదని చెప్పాను హెడ్ మాస్తార్ రూమ్ లోనే వెనక ఖాళీలో వంట చేసుకొంటూ కాల క్షేపం చేయవచ్చని భావించాను ..నాకు ఏ రకమైన ఇబ్బందీ ఉండదని తాము అందరూ కని పెట్టు కొని ఉంటామని అచారిగారు శేషగిరిరావు గారు హామీ ఇచ్చారు సరేనన్నాను .ఆచారిగారు ఇంటికి తీసుకొని వెళ్లి వాల్లమ్మగారికీ భార్యకూ పరిచయం చేశారు మహా దొడ్డ ఇల్లాళ్ళు వారు ఇంటివారూ రెడ్లు చాలా మంచివారు .మళ్ళీ రాత్రికి బయల్దేరి అంచెలంచెలుగా ఉయ్యూరు చేరాను .
నేను తెచ్చిన మార్పులు
స్కూల్ కు గార్డెన్ లేదు .కనుక టీచర్లతో సంప్రదించిఖాళీ ప్రదేశం లో ఒక్కో సెక్షన్ కు కొంత స్థలం కేతా ఇంచాము అందులో పిల్లలు మొక్కలు పెట్టి పోషించాలి .ఎవరి తోటబాగా ఉంటే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించాం .వారికిచ్చిన స్థలం బాగు చేసుకొని మంచి పూలమొక్కలు ,కాయ గూరలమొక్కలు నాటి పండించేవారు .మంచి హుషారుగా పని చేసేవాళ్ళు .డ్రిల్ మాస్టార్లు క్లాస్ టీచర్లు పర్య వేక్షించేవారు .ఇక్కడవిద్యార్ధులకు స్పెషల్ ఫి llaకన్సెషన్ ఇవ్వకుండా ఫీజులు దానితో బాటు కింది క్లాసు వాళ్లదగ్గర నూటయాభై పైక్లాస్ వారు రెండు వందలువసూలు చేసి కామన్ గుడ్ ఫండ్ కింద ఉంచేవాళ్ళంఇదంతా కమిటీ వారి అనుమతితోనే జరిగేది . ఈ లెక్కలన్నీ లేక్కలమేస్టారి అధీనం లో ఉండేవి. ప్రతిదీ చక్కగా అకౌంట్ ఫర్ చేసేవాడు .ఈ డబ్బుతో చాక్ పీస్ పెట్టెలు పరీక్ష కాగితాలు ,ఆట వస్తువులు ,సైన్సుసామాన్లు మంచి నీటి ఏర్పాటు ,సైన్స్ చార్టులు ,మేస్టార్ల లీవ్ అప్లికేషన్లు కొని అందజేసేవాళ్ళం .స్టాఫ్ మీటింగ్ లో ఆచారిగారు జామా ఖర్చులు చెప్పేవారు .అందరికి సంతృప్తిగా ఉండేది .నేను ఉయ్యూరు నుంచి అరటి పిలకలు తెచ్చి స్కూలు ముందు నాటించాను. బ్రహ్మాండంగా పెరిగి కాయలు కాశాయి .స్కూలుకు కల వచ్చింది .
స్కూల్ కమిటీ చైర్మన్
స్కూల్ కమిటీకి శ్రీ అప్పిడి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆయన మాటిక్కడ వేదవాక్కు.ఆయన తమ్ముడు సొసైటీ ప్రెసిడెంట్ . వారానికోసారి వచ్చి మంచీ చెడు కనుక్కోనేవారు .అవసరమైన అభి వృద్ధి పనులు చేసేవారు మోటారు ఉంది. నీళ్ళ ఇబ్బంది లేదు .లెట్రిన్ సౌకర్యాలున్నాయి ఆడపిల్లలకూ వసతి బాగానే ఉంది .వి రాఘవులు అనే గొల్లతను బిసి హాస్టల్ వార్డెన్ .పరిచయమయ్యాడు చాలాసహాయ కారిగా ఉండేవాడు .నేను స్టవ్ గిన్నెలు తెచ్చుకొని వంట చేసుకొనే వాడిని .ఆచారిగారు ఇంటినుంచి కూరలు పచ్చళ్ళు పంపేవారు .హాస్టల్నుంచి గడ్డ పెరుగు పంపేవాడువార్డెన్ రెండు పూటలా .చాలా రుచిగా ఉండేది .పిల్లలకూ మంచి భోజనం పెట్టేవాడు అప్పుడప్పుడు వెళ్లి చూసేవాడిని .అందరికి తలలో నాలుకలాగా నవ్వుతూ ఉండేవాడు .మైలవరం కాపురం .నేను ఆచారిగారు శేషగిరిరావు రాఘవులు ఒక బృందంగా ఉండేవాళ్ళం .దేనికైనా కలిసి వెళ్ళేవాళ్ళం .కలిసి మైలవరం లో సినిమాలు చూశాం. మార్కెట్ కు వెళ్ళేవాళ్ళం .శాసన సభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారింటికి ఒక సారి వెళ్లాం .. హాస్టల్ పిల్లలకు ట్యూషన్
ప్రతి శనివారం ఉయ్యూరు వచ్చేవాడిని .మిగిలిన రోజుల్లో రాత్రి పూట పదవతరగతి హాస్టల్ పిల్లలకు స్కూల్ లో చదువు చెప్పి చదివిన్చేవాడిని రాత్రి పదిదాకా . .అందులో రాంబాబు అనే పోట్టికుర్రాడు నాకు అన్నం గిన్నెలు తోమి పెట్టేవాడు .పెద్దగా చదివేవాడు కాదుకాని క్రమశిక్షణ ఉండేది .నాకు నమ్మిన బంటు గా ఉండేవాడు .నవ్వుముఖం .కస్టపడి చదివి టెన్త్ పాసయ్యాడు .నాకు సేవ చేయటం వల్లనే పాసయ్యానని చెప్పుకోనేవాడు. అదీ గురు భక్తీ? .
సశేషం
మీ-గబ్బట దుర్గాప్రసాద్ -1-8-15-ఉయ్యూరు