యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2
మరింత లోతైన ప్రశ్నలను అడిగే ప్రయత్నం లో ఉన్నాడు యక్షుడు .
5-‘’ఇంద్రియ భోగాలు అనుభావిస్తూ ఊపిరి పీలుస్తూకూడా నిర్జీవుడైన వాడేవడు?
‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను పోషించుకోలేని వాడే ,ఊపిరి పీలుస్తున్నా ,నిర్జీవుడు ‘’అన్నాడు ధర్మ రాజు .మళ్ళీ యక్షుడు –
6-‘’భూమికన్నా పెద్దది ,ఆకాశం కంటే ఎత్తైనది ,గాలికంటే వేగమైనది ,గడ్డి కంటే దట్టమైనది ఏది ?’’
పాండవ ప్రధముడి సమాధానం –‘’భూమికన్నా భారమైంది తల్లి .ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి .గాలికంటే వేగ వంతమైనది మనసు .గడ్డికంటే దట్టమైంది చింత ‘’చెప్పాడు ధర్మ రాజు .
7-‘’నిద్రిస్తూ కూడా కళ్ళు మూయనిది ,పుట్టినప్పటి నుండి చలనం లేనిది ,ఏది ?హృదయం లేని వాడెవడు?వేగం వలన వృద్ధి పొందేది ఏది ?
‘’నీటి లోని చేప నిదిస్తున్నా కళ్ళు మూసుకోదు .తల్లి పొట్టలోంచి బయట పడినా గుడ్డు కదలదు .హృదయం లేనిది రాయి .వేగం వల్ల నది వృద్ధిపొందుతుంది ‘’అని తెలివైన సమాధానాలు చెప్పాడు .
8-ధర్మ రాజు చెప్పే ప్రతి సమాధానానికి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.పరమానందం పొందుతున్నాడు యక్షుడు .ఉత్సాహం పెరిగిపోతోంది .ఇక అతని వివేకాన్ని తెలుసుకొనే ఉద్దేశ్యం తో –
9’’-రాజా !నీ జవాబులు పరమ తృప్తికరంగా ఉన్నాయి .కనుక నీ తమ్ములలో లో ఒకరిని మాత్రం బతికిస్తాను .ఎవర్ని బ్రతికి౦చ మంటావు?’’అడిగాడు యక్షుడు
‘’’’నకులుడిని బ్రతికించండి ‘’అన్నాడు వెంటనే ఏమీ ఆలోచి౦చకుండా .ఆశ్చర్య పడ్డ యక్షుడు ‘’నీ కోరిక విడ్డూరంగా ఉంది .భీముడు అంటే నీకు ప్రేమ అర్జునుడు అంటే నీకు అండా దండా కదా .వీల్లిద్దర్ని బతికించమని కోరుకోకుండా సవతి తల్లి కొడుకు ను బతికి౦చ మనటం లో నీ ఆంతర్య మేమిటి ?’’సూటిగా అడిగాడు.
యుధిష్టిరుడు’’-‘’మహాత్మా !నీకు తెలియని ధర్మం లేదు .ధర్మాన్ని చంపితే అదిమనల్ని వదిస్తుంది .ధర్మ రక్షణ చేస్తే అదిమనల్ని రక్షిస్తుంది .ధర్మ౦ దెబ్బతిని మనల్ని అది తిరిగి దెబ్బ తియ్య రాదు –‘’ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః –తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు .’’కరుణ పరమ ధర్మ మైనది.అందుకే సమ ద్రుష్టి తో ఆలోచించాను నా తండ్రికి కుంతీ ,మాద్రి ఇద్దరు భార్యలు .ఇద్దరి బిడ్డలూ బ్రతికి ఉండటం సమన్యాయం ‘’అని యుధిష్టిరుడు సుస్థిరంగా జవాబు చెప్పాడు .
ఈ సమ దృష్టికి మహానందపడి యక్షుడు ‘’నీ సమ దృష్టి నాకు మహాదానందాన్నిచ్చి౦ది కనుక నీ తమ్ముళ్ళను అందర్నీ బ్రతికిస్తున్నాను ‘’అంటూ వాళ్ళను పేరు పేరునా పిలువగా ,వాళ్ళంతా నిద్ర లోంచి లేచినట్లు లేచారు .ధర్మ రాజు యక్షుని విశాల హృదయానికి కృతజ్ఞత చూపించి ‘’మీరు మహనీయులలో మహోత్క్రుస్టు లని తెలిసింది .మీ నిజ రూప దర్శనం తో నాకు ఆనందం కల్గించండి’’ అని చేతులు జోడించి ప్రార్ధించాడు .
అప్పుడు యక్షుడు ‘’ధర్మ రాజా ! నేను ధర్మ దేవతను .నిన్ను చూడాలనే వచ్చాను.కీర్తి ,సత్యం ,శ్రమం ,దమం ,శౌచం ,రుజు వర్తనం ,దానం ,తపస్సు,బ్రహ్మ చర్యం వంటి మహనీయ ధర్మా లన్నీనా రూపాలే .అహింస ,సమతా ,కరుణ ,మత్సరం లేక పోవటం మొదలైన పవిత్ర మార్గాలే నన్ను చేరుకొనే దారులు. శమ ,దమ ఉపరతి,తితిక్ష ,సమాధానం అనే అయిదూ నీలో సుస్థిరంగా ఉన్నాయి .,ఆకలి ,దప్పులు ,శోక మోహాలు ,జర,మృత్యువు అనే ఆరింటిని నువ్వు పూర్తిగా జయించావు .నా భక్తులకు దుర్గతి ఏ నాడూ కలుగదు .నీకో వరం ఇస్తా కోరుకో ‘’అడిగాడు .ధర్మ రాజు ధర్మ దేవతను ‘’బ్రాహ్మణుడిఆరణి మంధన కాస్టాలుఇప్పించండి ‘’అని కోరాడు .’’అవి నీకు ఇవ్వటానికే నిన్ను ఇక్కడికి రప్పించాను ‘’అని చెప్పి వాటిని అప్పగించి ‘’నీకు ఇష్టమైన కోరిక ఏదైనా కోరుకో ‘’అన్నాడు .ధర్మ రాజు ‘’మహాత్మా !మా అజ్ఞాత వాసం ఏ విఘ్నం జరుగ కుండా పూర్తీ అయ్యేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .ధర్మ దేవత ‘’మీ అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయ గల వారెవరూ లేరు .ముగిసే దాకా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు .విరాట నగరం లో అజ్ఞాతవాస కాలం గడపండి. మీకు అక్కడ అన్నీ కలిసి వస్తాయి ‘’అన్నాడు .వినమ్రంగా రాజు నమస్కరించాడు ‘’మరో వరం కోరుకో ‘’అన్నాడు ధర్మ దేవత .ధర్మరాజు ‘’నా మనస్సు దానం ,తపస్సు ,సత్యం అనే ఉత్తమ విషయాల మీద సదా నిలిచి ఉండేట్లు అనుగ్రహించండి ‘’అని ప్రార్ధించాడు .’’తధాస్తు ‘’అంటూ ఆశీర్వదించి ధర్ముడు అంతర్ధానమయ్యాడు .తమ్ములతో ఆశ్రమానికి తిరిగి వచ్చిన ధర్మ రాజు బ్రాహ్మణుడికి ఆరణి,మంధన కాస్టాలను అంద జేసి ఆశీస్సులు పొందాడు .
ఈ యక్ష ప్రశ్నలు మార్మికత తో ఉన్న ధార్మిక ప్రశ్నలు .ధర్మ రాజు శోకమోహాలను ప్రక్కన పెట్టి స్థిర చిత్తం తో 100ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ,తన సమచిత్తతను ,తిక్కన మహా కవి చెప్పినట్లు వశీకృత చిత్త్తాన్ని ప్రదర్శించాడు .ధర్మ దేవత కూడా రాబోయే అజ్ఞాత వాసానికి ,కురుక్షేత్ర మహా సంగ్రామానికి పాండవులను సిద్ధం చేసే ప్రయత్నమే ఇది అని దీనిపై చక్కని సమీక్ష చేశారు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు

