యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5
కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రానికి హేతువులు .కోరిక ఆగిపోతే మిగిలేది సంపన్నత ,అదీ ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై ప్రశ్నిస్తున్నాడు యక్షుడు .
49-‘’బ్రాహ్మలకు దానం ఎందుకు ?’’
‘’ధర్మం కోసం ‘’అని ధర్మరాజు సమాధానం .
50’’-నటులకు నాట్యం చేసేవారికి దానం ఎందుకు ?’’
‘’కీర్తికోసం ‘’
51-‘’సేవకులకు దానం ఎందుకు ‘’?
‘’పోషణ కోసం ‘’
52-‘’రాజులకు దానం ఎందుకు ‘’?
‘’భయం వలన ‘’
53-‘’లోకాన్ని ఆవరించి ఉన్నదేది ‘’?
‘’అజ్ఞానం ‘’
54-‘’అది ఎందుకు ప్రకాశించదు’’?
‘’అజ్ఞానం వలన ‘’
55-‘’మనిషి మిత్రుల్ని ఎందుకు విడిచిపెడతాడు ‘’?
‘’లోభం వలన ‘’
56-ఏ కారణం వలన స్వర్గానికి పోలేరు ?’’
‘’విషయాసక్తి వలన ‘’
‘’లోకం లో తలిదండ్రులు ,మిత్రుడు ఈ ముగ్గురే హితులు .తక్కినవాళ్ళు ప్రయోజనాన్ని బట్టి హితులౌతారు ‘’అని పంచ తంత్రం హితవు చెప్పింది .మిత్రులను సంపాదించుకోవాలి నిలుపుకోవాలి .కర్ణ దుర్యోధనులు ప్రయోజనం కోసం మిత్రులయ్యారేకాని అసలు మిత్రులుకారు. అసలు మిత్రులు కృష్ణార్జునులు .అర్జునుడి కోసం కృష్ణుడు ప్రాణాలిస్తాడు .అవసరమైతే మందలిస్తాడు .కార్యోన్ముఖుడిని చేస్తాడు .దుఖం నుండి బయట పడేస్తాడు కర్తవ్యమ్ బోధిస్తాడు .ప్రతిజ్ఞను నిలబెట్టుకొనే ధైర్యమిస్తాడు .దుర్యోధనుడికి కర్ణుడు ‘’తందాన తాన గాడు ‘’.మార్గ దర్శనం చేసే శక్తి లేనివాడు .లోభం వలన మిత్రుల్ని పోగొట్టుకొన్నవాడు గుడ్డి రాజు .లోభం కూడా ఒక స్వీయ కేంద్ర ప్రవృత్తే అన్నారు జి వి ఎస్ .గారు .తరువాత యక్షుడు మృతలక్షణం పై ప్రశ్నలను సంధించాడు .
57-‘’ .మనిషి మృతుడు ఎలా అవుతాడు “”?
‘’దరిద్రం వలన ‘’
58-‘’రాష్ట్రం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?
‘’రాజు లేక పోవటం వలన ‘’
59-‘’శ్రాద్ధ కర్మ ఏ విధంగా మృతమౌతుంది ?’’
‘’శ్రోత్రియుడు లేక పోవటం వలన ‘’ ‘’
60-‘’యజ్ఞం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?
‘’దక్షిణలు లేక పోవటం వలన ‘’
మృతం అంటే ప్రాణం లేక పోవటమేకాదు.నిష్ప్రయోజనం అని కూడా అర్ధం .రాష్ట్రం అంటే రాజ్యం అని అర్ధం .ధృత రాస్ట్రుడు అంటే రాజ దండాన్ని ధరించి రాజ్యం లో ప్రజలకు రక్షణ కల్పించేవాడని అర్ధం ఈ ధర్మాన్ని పాటించక పొతే రాజ్యం మృతమే అవుతుందని యుదిస్ష్టిరుని విశ్వాసం .రాజదండం ధార్మిక ప్రయోజనాన్ని కోల్పోతే రాజ్యం మృతమే అవుతుంది .కనుక రాజు బాధ్యత గొప్పది .ధర్మ రాజుకు రాజధర్మం విస్పష్టంగా తెలుసు .ఇప్పుడు అవీఇవీ ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు .
61-‘’రాజా ! దిక్కు ఏది ‘’?
‘’మహాత్మా !లోకానికి సజ్జనులే దిక్కు .’’
62-‘’ఉదకం ఏది “”?
‘’ఆకాశమే ఉదకం .’’
63-‘’అన్నం ఏది ‘’?
‘’గోవు ‘’
64-‘’విషం ఏది ‘’?
‘’ కోరిక ‘’
65-శ్రాద్ధానికి తగిన కాలం ‘’?
‘’సద్బ్రాహ్మండు వచ్చిన సమయమే ‘’
ప్రజలు ఆపత్సమయం లో సజ్జనులనే ఆశ్రయిస్తారు .సజ్జనుడే పాలన చేయాలని అభిలషిస్తారు .ఆకాశమే జలం అనటం లో లోతైన భావన ఉంది .ఆకాశమే జలాన్ని ధరించి భూమికి దానం చేస్స్తుంది .కనుక ఆకాశానికి జలానికి భేదమే లేదు .ఆవు అన్నం అనటానికి కారణం –ఆవుపాలు సిద్ధాన్నం కావటమే .గో సంపద ధన సంపదను సృష్టించి అన్నాన్ని సృష్టిస్తుందని భావం .కోరికలో మృత్యు లక్షణం ఉంది .తీరనికోరిక దుఖాన్నే ఇస్తుంది .దుఖమే మృత్యువు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-16-ఉయ్యూరు

