ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244
91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్
ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో డిలాన్ ధామస్ జ్వలించే విప్లవ భావ ,సాటి లేని శైలీ శయ్యా సౌభాగ్యాలతో ప్రపంచం పై విరుచుకు పడ్డాడు ..రాయగానే స్వాగతించక పోయినా ,వారసత్వ కవితా లక్షణాలు లేక పోయినా తనకాలపు ఉత్సాహ ఉద్రేక కవి అయ్యాడు .దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చనిపోయినా సాహిత్య లోకం పై బలమైన ముద్ర వేశాడు .కొన్ని కవితలు ,కదా సంపుటాలు కొన్ని ,స్వీయ చరిత్రలాంటి స్కెచ్ లు మాత్రమే రాసి లబ్ధ ప్రతిస్టుడయ్యాడు .అతని ‘’పోర్ట్రైట్ ఆఫ్ ఎ పోయెట్ అస్ ఎ యాంగ్ డాగ్ ‘’తోపాటు మరొక నాటకం ఆయన్ను సాహిత్యం లో చిరంజీవిని చేశాయి .వీటితో ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ,అనుపమ సంగీత సౌభాగ్యం కలిగించి ,కొత్త దృశ్యాలను చూపించి నూతన శబ్దాలు వినిపించి ,సమకాలీన సాహిత్యానికి జవ జీవాలు కల్పించి సంచలనం సృష్టించాడు .
27-10-1914 న వేల్స్ లోని వెల్ష్ సీ పోర్ట్ లోని స్వాన్సేయా లో ఇంగ్లీష్ టీచర్ కొడుకుగా డిలాన్ ధామస్ పుట్టాడు .టౌన్ లోని గ్రామర్ స్కూల్ లో చేరి క్లాస్ రూమ్ పాఠాల కంటే ,స్థానిక జానపద గీతాలపై ఆసక్తి పెంచుకొన్నాడు .’’చిన్నప్పుడు నేను చిన్న ,సన్న ,చురుకైన వెంటనే మురికి అయ్యేట్లు ,ఉంగరాల జుట్టు తో ఉండేవాడిని ‘’అని చెప్పుకున్నాడు .సాధారణ చదువు పూర్తీ అయి ,గ్రామర్ స్కూల్ వదిలి నటుడిగా రిపోర్టర్ గా ,రివ్యూ రాసేవాడిగా ,స్క్రిప్ట్ రైటర్ గా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ పొట్ట కూటికి డబ్బు సంపాదించాడు .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్నర్ ‘’గా పని చేశాడు.ఈ అనుభవాలన్నీ కవితల్లోకి చేరాయి .21 కి కైర్లిన్ మాక్నమారా తో వివాహమై ,లివిలీన్ కాలం అనే ఇద్దరు అబ్బాయిలు ,ఐరాన్ అనే కుమార్తెను కనీ, లాఫర్నే ,కర్మర్తాన్ షైర్ అనే చేపలు పట్టే గ్రామం లో స్థిరపడ్డాడు .అక్కడ తన ఇల్లు ‘’బోట్ హౌస్ ‘’మాత్రమే నని చెప్పుకొన్నాడు . ఈ గ్రామం ఒకప్పుడు ఫెర్రీల రేవుగా ఉండేది .
ఇరవైలలో ఉండగా తాను రాసిన కవితలను బి బి సి రేడియో లో చదివి వినిపించేవాడు .1950 లో మొదటి సారి అమెరికా వెళ్లి రెండేళ్ళ తర్వాత తిరిగొచ్చి మళ్ళీ 1953 లో వెళ్ళాడు .అక్కడ తనవి, తనవి కానివి పాటలు పాడి రంజింప జేసేవాడు .ఆతను పాడేది అతని స్వంతమో ఇతరులదో ఎవరికీ తెలిసేదికాదు .’’కాళిదాసుకవిత్వం కొంత నా పైత్యం కొంత ‘’అన్నట్లు ఉండేది .అతని గానమాదుర్యం ,తాదాత్మ్యత తో పాడటం అందరినీ ముగ్ధులను చేసేవి . .అతనిలో షెల్లీ మళ్ళీ కనిపించినట్లు ఉండేది .మంత్రం ముగ్ధమై విని పరవశి౦చేవారు .కాగితం పై ఉన్న ఆయన కవిత్వం అర్ధం కాక పోయినా ఆనాటి హృదయాకర్షణ పాటకుడు అనిపించాడు .అమెరికా స్వంత ఇల్లు అయింది .’’నాకు న్యూయార్క్ అంటే నమ్మకం లేదుకాని సౌత్ ఎవెన్యు ను ప్రేమిస్తాను ‘’అనేవాడు .సీమెన్స్ బార్ అంటే ఇష్టం .అక్కడ అతన్ని వెల్ష్ జాతివాడిగా గుర్తించి మాట్లాడేవారు .అది సాహిత్య సాంఘిక కార్యకలాపాల క్లబ్ గా ఉండేది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16- ఉయ్యూరు