నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4

మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

పాప వినాశిని తీర్ధం –

అల౦పురానికి దక్షిణాన అరకిలో మీటర్ దూరం లో ‘’పాప నాశినీ తీర్ధం ‘’ఉంది .అష్టాదశ తీర్ధాలలో తీర్ధ రాజం గా ప్రసిద్ధి .అలంపురం లో బ్రహ్మేశ్వరాలయంసమూహం  ఉన్నట్లే ఇక్కడా ఒక దేవాలయ సముదాయం ఉంది .ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న గుడులు కట్టారు .ఇవి  ద్రావిడ, వేసర పద్ధతులలోఉంటాయి .ప్రధానాలయం లో ‘’పాపనాశేశ్వరుడు  ‘’ఉంటాడు .సూర్య నారాయణ స్వామి ఆలయానికి ,ఇక్కడి ఆలయ మండపానికి స్తంభాలు ,పై కప్పులకు ,వాటిపై ఉన్న మూర్తులకు చాలా పోలికలుంటాయి .ద్వారబంధం స్తంభాలు ,పైకప్పు బండలు ఎర్ర ఇసుక రాతి తో చేయబడ్డాయి .ఒక రంగ మండపం మీద’’ త్రైలోక్య మల్లుని’’ కాలపు శాసనం ఉంది .మంటపం లో దక్షిణాన గణపతి ,సప్త మాతృకలు ,ఉత్తరాన అష్ట భుజ మహిషాసుర మర్దిని విగ్రహాలున్నాయి .ఆలయానికి ఉత్తర ,దక్షిణాలలోచక్కని గుళ్ళు ,మంటపాలు నిర్మించారు స్తంభాలపై రామాయణ గాధ,క్షీర సాగర మధనం శిల్పాలు పరమ రామణీయకంగా దర్శన మిస్తాయి.ఈ గుడులన్నీ నవ బ్రహ్మాలయాల తర్వాత కాలం లో నిర్మింప బడ్డాయి  .చాళుక్య రాజులకాలం నాటి వాస్తు ,శిల్ప పరిణామాల అధ్యయనానికి ఈ రెండు దేవాలయ సమూహాలను తప్పక చూసి తీరాల్సిందే .శ్రీ శైలం ప్రాజెక్ట్ ప్రభావం వలన ఆలంపూర్ కు దగ్గరలోనే ఈ తీర్ధం పునర్నిర్మాణం జరిగింది అన్నారు గడియారం రామ కృష్ణ శర్మ గారు .

Inline image 16

నరసింహాలయం

అలంపురం కోట లోపలే నరసింహాలయం ,సూర్య నారాయణ స్వామి ఆలయాలున్నాయి ఇవి 9 లేక 10 వ శతాబ్దం లో నిర్మించ బడి ఉండచ్చు .నరసింహాలయం శిధిలం కాగా త్రిభువన మల్లుని కాలం లో జీర్ణోద్ధరణ జరిగిందని శాసనం తెలియ జేస్తోంది .ఆ కాలం లో నరసింహ స్వామిని ‘’మాధవ దేవర ‘’అని పిలిచే వారు .గుడి ప్రవేశ ద్వారం ప్రక్కనే ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ,గుడిలో రంగ నాయకులు ,ఆళ్వారులు ,విజయనగర రాజులకాలం లో ప్రతిష్టించారు .లోపల ప్రదక్షిణం చేసుకొనే దారి లేదు .వరుసగా మూడు గర్భ గుడులు ఉండటం విశేషం .మొదటి దానిలో ‘’మాధవీ శక్తి ‘’,మధ్య దానిలో ‘’యోగానంద నరసింహ స్వామి ‘’,మూడవ దానిలో లక్ష్మీ విగ్రహానికి బదులు ‘’చాకమ్మ ‘’విగ్రహాన్ని ప్రతిష్టించారు ఇవన్నీ దివ్య మంగళ విగ్రహాలే .ఇలాంటి దేవాలయాన్ని  ‘’త్రిక దేవాలయం ‘’అంటారని శర్మ గారన్నారు .ఉత్సవ మూర్తులు పంచలోహ దాక్షిణాత్య సుకుమార శిల్ప కళా నైపుణ్యం తో ఉంటాయి గర్భ గుడి మీద విమానం ,ప్రవేశ ద్వారంపై గోపురం ఒకే కాలం లో నిర్మించబడి ఉంటాయని గడియారం వారి ఊహ .

Inline image 12Inline image 13

Inline image 14Inline image 15

సూర్య నారాయణ స్వామి దేవాలయం

నరసి౦హాలయానికి వెళ్ళే దారిలోనే సూర్య నారాయణ స్వామి గుడి ఉంది ఇదీ సుమారుగా తొమ్మిది ,పదీ శతాబ్దాలలో కట్టినదే. ఆలయానికి ముఖ మండపం లేక పోవటం ఒక ప్రత్యేకత .మూడు వైపులా మూసి ,ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న విశాల మండపం ఉంది .ప్రదక్షిణ మార్గం లేదు .మధ్యలో ప్రధాన మూర్తి సూర్య నారాయణ స్వామి కొలువై ఉన్నాడు .ఇరువైపులా శివలింగాలు ఉండటం మరో విశేషం .స్తంభాలపై పురాణ గాధలు చెక్కబడ్డాయి పై కప్పు బండలకు దిక్పాలకులు ,గౌరీశంకర కల్యాణం ,గౌతమ బుద్ధునితో కూడిన నవావ తారాలు శిల్పించబడ్డాయి .ఎర్ర ఇసుక  రాతి కట్టడమే ఇది కూడా .కనుక చాలా ప్రాచీనాలయమన్నారు శర్మాజీ .మూడు గర్భాలయాలపై సోపాన పద్ధతిలో మూడు కదంబ శైలి విమానాలున్నాయి .ప్రధాన దైవం సూర్య నారాయణ మూర్తి విగ్రహం ‘’పాద రక్షల’’తో ఉత్తర దేశ ఆచారాన్ని బట్టి కన్పించటం మరొక ప్రత్యేకత .గణపతి సప్త మాతృకలు ,నంది ,పరశురాముడు నల్లరాతి తో సర్వాంగ సుందరంగా శిల్పీకరించ బడ్డారు .మంటప స్తంభం మీద ‘’కాల చర్య భుజ మల్లుని ‘’కాలం లో కర్నాటక ప్రసిద్ధులైన వణిక్ ప్రముఖులు వేయించిన’’ దాన వాహనం ‘’ఉంది అని అలంపురం పై సాధికారం ఉన్న గడియారం వారు చెప్పారు

Inline image 9Inline image 10Inline image 11

కూడలి సంగ మేశ్వరాలయం

శ్రీ శైలం ప్రాజెక్ట్ వలన ముంపుకు గురైన ఈ ప్రాంతం లో’’ కూడలి సంగమేశ్వరాలయాన్ని ‘’అలంపురం కు తరలించి ఊరి ముందు విశాల స్థలం లో యదా తధంగా పునర్నిర్మించారు .ఈ దేవాలయ గోడలపై ఉన్న మూర్తులు విలక్షణ శిల్ప విన్యాసాన్ని చాతుతున్నాయని శర్మ గారువాచ .నరసింహ సూర్యనారాయణ ,పాప వినాశన ,సంగమేశ్వరాలయాలను  సమయం లేక మేము చూడలేక పోయాం .

అలంపురం మూర్తులు

అలంపురం శిల్పాలలో మూర్తి లక్షణం ,ప్రతిమా లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి .శైవం మూలాధారంగా ఉన్న శిల్పాలివి .హైందవ పురాణ విజ్ఞానం ,తత్వ విచార పరిచయం తెలిసిన వాళ్ళకే వీటిలోని లోతుపాతులు తెలుస్తాయని శర్మగారంటారు దీనికి ఉదాహరణ ఇక్కడి ‘’అంధకాసుర సంహార మూర్తి ‘’,మరియు ‘’ధ్యాన ముద్రా శివ మూర్తి ‘’లను పేర్కొన వచ్చు అన్నారు గడియారం వారు .అలాగే ‘’త్రిముఖ మహేశ మూర్తి ‘’ప్రత్యేకమైనదని ,ఇలాంటిది ఎలిఫెంటా గుహాలయం లో మాత్రమే ఉందని ఈ మూర్తి భగవంతుని సృష్టి స్థితి లయాలను తెలియ జేస్తుందని విశ్లేషించి చెప్పారు నందులలో తల వాకిలి కి ఎదురుగా ఉన్నది అపూర్వమైనదని ,అది గౌరీ శంకరులను మోస్తున్నట్లు ఒకే రాతిలో చెక్కబడిందని ఇలాంటి మూర్తి ప్రపంచం లో ఇంకెక్కడా లేదని ,దీన్ని ‘’వృషభారూఢ మూర్తి ‘’అంటారని తమకున్న అపూర్వ శిల్పాను భవం తో శర్మగారు వాక్రుచ్చారు .

Inline image 6Inline image 7Inline image 8

పురావస్తు సంగ్రహాలయం

మ్యూజియం అనే పురావస్తు సంగ్రహాలయం అలంపురం లో కుమార బ్రహ్మాలయానికి వెనక ,ఒకప్పటి సిద్ధుల మఠం లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది .ఇందులో అలంపురం పరిసరాలలో పడి ఉన్న దేవతా మూర్తులు ,శిలాశాసనాలు తెచ్చి చక్కని పీఠాలపై అమర్చారు .ఇవన్నీ విలక్షణ మూర్తులే .హైందవ విగ్రహ మూర్తి లక్షణాలు తెలుసుకోవాలంటే ఈ సంగ్రహాలయం ‘’అపూర్వ విజ్ఞాన దాయిని ‘’అన్నారు శర్మగారు .

కనుక దైవ భక్తీ ,విజ్ఞాన పరిశీలనా ,చారిత్రిక పరిశోధనా ,వాస్తు, శిల్ప జిజ్ఞాస ఉన్నవారందరూ సందర్శించాల్సిన అపూర్వ క్షేత్రం అలంపురం .ఆలం అనే సంస్కృత పదానికి  ’’ఇక చాలు ‘అని అర్ధం .ఎంత చూసినా ‘’చాలు అని పించని ‘’జిజ్ఞాసా ప్రదేశం అలంపురం .జోగులాంబ దర్శనం ముక్తి దాయకం .ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించండి .అపూర్వ అనుభవం పొందండి .

Inline image 3Inline image 4Inline image 5

శ్రీగడియారం రామ కృష్ణ శర్మ గారు

అలంపురం దేవాలయాలు శ్రీ శైలం ప్రాజెక్ట్ లో జల సమాధి కాకుండా పరి రక్షించినవారు ,ఇక్కడి శిల్ప సంపద ,చరిత్ర ,పురా తత్వ విషయాలను పరిశోధించి ప్రపంచానికి తెలియ జెప్పినవారు ,ఆరు వందల ఏళ్ళ తర్వాత ,జోగులాంబా దేవి నూతన ఆలయాన్ని పూర్వం ఉన్న చోటనె నిర్మించ టానికి మూల కారకులు ,సంస్కృతాంధ్ర కవి ,పండితులు వక్త ,సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధులు ,చరిత్ర శాసన పరిశోధకులు జీవితం లో  సగం కాలం ఆలంపూరు పరిశోధనలకే వెచ్చించిన వారు , కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత స్వర్గీయ శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారు .శర్మగారు రచించి 15 వ ముద్రణ పొందిన ‘’దక్షిణ కాశి –ఆలంపూరు క్షేత్రం ‘’పుస్తకమే నేను తెలియ జేసిన విషయాలన్నిటికి ఆధారం అని మనవి చేస్తూ ఆ మహాను భావునికి కై మోడ్పు ఘటిస్తున్నాను .

శర్మగారు 1919 మార్చి 6 న అనంతపురం జన్మించి అలపురం కు వచ్చి స్థిరపడి లో 25-7- 2006 న ల 87 వ ఏట మరణించారు .’’శత పత్రం ‘’అనే వారి ఆత్మకధకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్నిశర్మగారి మరణానంతరం  అందించింది .మాధవ విద్యా రణ్య చరిత్ర ,హిందూ ధర్మం ,పల్లెపాడులోని విజయాదిత్య తామ్రశాసనం ,కేయూర బాహు చరిత్ర ,విజ్ఞాన వల్లరి ,మన వాస్తు సంపద అనే గ్రంధాలు రాశారు

Inline image 1Inline image 2

పీచే మూడ్

‘’యోగాంబ’’అనే జోగులాంబ శక్తి పీఠాన్ని 15-8-16 సోమవారం సందర్శించిన మేము మధ్యాహ్నం 3 -30 గంటలకు అందరం స్ప్రైట్ తాగి ,మళ్ళీ కారులో హైదరాబాద్ కు బయల్దేరాం .పిల్లలు ‘’ఆకలో అని గోల’’ .దారిలో కేసి ఆర్ గారి ఉచిత టిఫిన్ కాఫీ సెంటర్లు కాని ఉచిత భోజనాలు కాని ఎక్కడా జాడ లేదు .దాబాలపై’’ దాడి’’ చేసి పుష్కర యాత్రికులు ,’’డబ్బు చిలుం’’ వదిలించుకొని అక్కడ ఉన్న అన్నం లాంటి దేదో కతికి, కడుపాకలి తీర్చుకొంటూ కనిపించారు .సరైన హోటల్ ఎక్కడా దొరకలేదు .మధ్యలో ‘’హేబ్బెర్ ‘’అనే ఊరు వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడు కనిపించింది .వెంటనే నాకు ‘’హెబ్బార్ నాగేశ్వర రావు ‘’అనే కవి కధకుడు జ్ఞాపకం వచ్చాడు. బహుశా ఇక్కడి వాడేమో అనుకొన్నాను .దారిలో అంతా’’ బిగ్ పిరమిడ్’’ హోటల్ ఫ్లేక్సీలు చూసి ఆశగా జడ్చెర్ల దాటాక’’ బిగ్ పిరమిడ్ ‘’అనే పెద్ద హోటల్ పై మేమూ దాడి చేద్దామని వెళ్లి కూర్చున్నాం .కాని అక్కడ నీళ్ళ సరఫరా లేదట .ఒక గంట అయ్యాక వండి వడ్డిస్తామన్నారు టిఫిన్లు .నెత్తిన ముసుగేసుకొని ఇంకొంచెం దూరం పోయి అక్కడ విఘ్నేశ్ విరాట్ హోటల్ లో దూరాం .నేను అట్టు ఆర్డర్ ఇచ్చా మిగినవాళ్ళు అట్టు ,చపాతీ ఆర్డర్ ఇచ్చారు .నాకేమీ సహించలేదు. సగం తిని వదిలేశా,ఐస్ క్రీం కొని కడుపు చల్లార్చుకోన్నాం పిల్లలు నేనూ .కడుపు లో ఏదో పడిందనే సంతృప్తి మాత్రమే మిగిలింది .బాచుపల్లి కి రాత్రి 9 గంటలకు చేరుకున్నాం .భోజనం మా అబ్బాయిఇంటి పక్కనే ఉన్న వాడి  బావ మరిది ప్రసాద్ ఇంట్లో .తిని ఇంటికొచ్చి హాయిగా నిద్ర పోయా .ఒళ్ళంతా పులిసింది కనుక నిద్ర బాగా పట్టింది .

అనుకోని కృష్ణా పుష్కర ప్రయాణమే అయినా ఆనందం సంతృప్తి ఆధ్యాత్మిక చారిత్రిక వైభోగాలను అందించింది ఈ పుష్కరం .అలంపురం లో సాంస్కృతిక కార్య క్రమాలూ నిర్వహిస్తున్నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.