కృష్ణం వందే జగద్గురుం
శ్రీమన్నారాయణుని షోడశ కళల పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి పుణ్యతిథి శ్రీకృష్ణాష్ఠమిగా జరుపుకోవటం సంప్రదాయం. దశావతారాలు ఇంతటి వైవిధ్య భరితమైనది, ప్రముఖమైనది మరొకటి లేదు. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే దేవకీ వసుదేవులకు తన నిజరూప దర్శన ప్రాప్తి కలిగించాడు. తన అవతార రహస్యం చెప్పాడు. ఆ తర్వాత కార్యమైన తనను గోకులానికి చేర్చటం, యశోద పుత్రికను తెచ్చి దేవకి దగ్గరలో పరుండబెట్టటం ఇత్యాది భావి కార్యాచరణకు ఆదేశమిచ్చాడు. పుట్టినది మొదలు గోకులం, యమునాతీరం, బృందావన ప్రాంతాలు అన్నీ ఆ చిన్నారి చిద్రూపుని విహార భూములయ్యాయి. ఈ అమాయక గోపబాలుడు వెన్నదొంగ అయి ఎన్నో అలౌకిక దివ్యలీలలు ప్రదర్శించాడు. భక్తాగ్రగణ్యులైన గోపికలు కృష్ణుని భౌతిక దృష్టితో దేవకీవసుదేవుల పుత్రుడిగా కాక ఆత్మదృష్టితో దర్శించి ఆరాధించారు. అఖిల దేహినా మంతరాత్మదృక్ అని భావగత పురాణం వివరించినట్లు సకల ప్రాణులలోను అంతర్యామియై ఉన్నవాడనే భావనతోనే చూశారు. వారికి జన్మాంతర బంధమున్నది. ధర్మసంరక్షణార్థం మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించినప్పుడు, ఎందరో మహర్షులు, దేవతలు గోపగోపీ జనులుగాను, ఆదిశేషుడు బలరామునిగాను ఆ ఆదిదేవుని అనుసరించి జన్మించిన వారే!
ఆ బాలకృష్ణుని దివ్యలీలా చేష్టలకు పరవశించి, కలవరించి, కవులెందరో ఆ వేణుగానలోలుని గుణగణాలను గానంచేసి తరించారు. మన తెలుగు వారికి కృష్ణుని పేరు చెప్పగానే స్ఫురించేది పోతనగారి భాగవతమే! భక్తికి మరోపేరు భాగవతంగా ప్రసిద్ధి పొందటానికి కారణం మందారమకరంద సదృశమైన శైలిలో, సుందర పదబంధ భరితమైన పోతనగారి తెలుగు పద్యాలే. కవిత్వాన్ని కైవల్య సాధనంగా చేసుకొని మధురమైన భక్తిమార్గంలో పయనించి తరించిన భాగవతోత్తముడు పోతన.
తెలుగునాట పోతన పద్యం లాగా ఉత్తరాన సూరదాస్కీర్తనలు బహుళప్రాచుర్యం పొందినవి. ఇవి భాగవతంలోని కథలను వర్ణించినా,దశమస్కందంలోని కృష్ణ లీలలను తనివితీరా పాడుకొన్నాడు సూరదాస్. వంగ సాహిత్యాన్ని శ్రీకృష్ణ చైతన్యంతో పునీతమొనరించిన వాడు చైతన్య మహాప్రభు. మహారాష్ట్రులకు పండరిపురంలో వెలసిన పాండురంగడే పరమ ఆరాధ్యుడు. ఏకనాథ్, తుకారం, నాందేవ్ లాంటి కవులు శ్రీకృష్ణ కవితా లహరిలో తడిసిన వారే. గుజరాతీలో నరసిమెహతా రచనలు ప్రసిద్ధి పొందాయి. శ్రీకృష్ణుడే ధ్యాసగా, శ్వాసగా తన్మయం చెంది గానం చేసిన మీరాభజనలు యావద్భారతావనిని మధుర భక్తి లహరిలో ఓలలాడించాయ. కృష్ణతత్త్వ ప్రతిపాదిత గ్రంథాలలో జయదేవుని గీతగోవింద ప్రాశస్త్యం ఇంతింతనరాలేము కదా. అటులనే లీలాశుకుని కృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి మకుటాయమానంగా భాసించే మహత్తర మధుర కావ్య కల్పతరువులు.
శ్రీకృష్ణుడు తన అవతారంలో చూపిన లీలా వినోదా లన్నింటిలోకి రాసలీల మధురాతిమధురం. భాగవతంలో రాసలీలలు 5అధ్యాయములలో వర్ణితాలైనవి. దీనినే రాస పంచాధ్యాయి అంటారు. బహుజన్మ కృత పుణ్యఫలంగా గోపికలను కృష్ణ పరమాత్మతో తదాత్మ్యం చెందే భాగ్యం లభించింది. అదే రాసలీలా పరమార్థంగా సంభాషించాలి. అనురక్తికే కాక భక్తికీ సుందర అభివ్యక్తిగా నిలిచింది రాధ. మధురాధిపతే రఖిలం మధురం అని మాధుర్య రసాధిపతి అయి భాసించినవాడు కృష్ణుడు. పరా ప్రకృతిగా భాసించినది రాధ. పైకి శృంగారంగా కనపడినా జీవాత్మ పరమాత్మల సంయోగం కోసం అంతరచైతన్యం కోరుకునే భగవద్రతి అది. భాగవతంలో కనిపించే గోపికల ప్రణయ తత్త్వమూ ఇదే! రాధా తత్త్వాన్ని ఉపాసించి కృష్ణానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని అంటారు. శ్రీకృష్ణ్భగవానుడు తన అనంతముఖ అవతార రహస్యాలను మూడు ముఖ్య దశలలో విశదపరిచాడు. మొదటిది బాల్యదశ. వెన్నదొంగగా మారి, గోపాలకుడై నందకులాన్ని వందనీయం చేశాడు. బృందావనానికి మారటం కాళీయమర్దనం, తదుపరిదైన యవ్వనాంకురదశ, బృందావనం తరువాత‘ప్రౌఢ నిర్భర పరిపాక దశ’. అష్ట మహిషులతో పరిణయం, కురుపాండవుల సంగ్రామం, గీతాబోధ. ఇది ప్రపంచానికి కర్తవ్య బోధ. ఇక రుక్మిణీ కల్యాణం, సత్యభామ పరిణయం ఇవన్నీ తెలిసినవే. కలడో లేడో అనే సంశయం లేకుండా అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు శ్రీకైవల్య పదాభి లాషులందరి హృదయాలలోనూ వెలసే ఉన్నాడు. అలా వెలసి ఉన్న వాడిని తెలుసుకోవడమే జన్మ సార్థకత.(ఆంద్ర భూమి )
బిల్వమంగళుడు లీలాశుకమహర్శియై శ్రీ కృష్ణ కర్ణామృతం మధుర భక్తికి పరాకాష్ట గా రాశాడు .మొదటి శ్లోకంలో
‘’చింతామణి ర్జయతి సోమగురుర్మే-శిక్షా గురుశ్చ భగవాన్ శిఖి పించమౌళిః
యత్పాద కల్పతరు పల్లవ షేఖ రేషు –లీలాస్వయం వరరసం లభతే జయశ్రీః’’
అంటే –శ్రీ కృష్ణ కర్ణామృత కావ్య రచనలో నాకు మార్గ దర్శి అయిన చింతామణికి ,నాకు దీక్షా గురువైన సోమ గిరికినమస్కరిస్తున్నాను .కల్ప వృక్షం తమ చిగురాకుల కొనలవద్ద లక్ష్మ్మీ దేవిని అలంకరించుకొని విలాసంగా కన్పిస్తోంది ఆ కల్ప వృక్షం లాంటి పాదాలతో విరాజిల్లుతూ నెమలి పించం ధరించి ఉన్న నా శిక్షా గురువైన శ్రీ కృష్ణునికి కూడా నమస్కరిస్తున్నాను
శ్రీ కృష్ణ కర్ణామృత శ్లోకాలు ఉత్తర ,దక్షిణ భారతాలలో విరివిగా వ్యాప్తి చెందాయి సంగీత భజన సభలలో ఆలపిస్తారు తాళ లయాన్వితంగా ఉండటం తో వీటిని నృత్యాభినయానికీ చక్కగా వినియోగిస్తారు .మూడు ఆశ్వాసాల కర్ణామృతం నిజంగానే చెవులకు అమృతమే .4 వ శ్లోక౦ భావ మాధుర్యాన్ని జొన్నలగడ్డ పతన్జలిగారు వివారించారు చూడండి
బర్హోత్తంస విలాస కుంతలభరం మాధుర్య మగ్నాననం –ప్రోన్నీ లన్నవ యౌవనం ,ప్రవిల సద్వేణుప్రణాదామృతం
ఆపీనన స్తన కుట్మళా భి రాభితో ,గోపీభి రారాదితం –జ్యోతిశ్చేతసి నశ్చ కాస్తుజగతా మేకాభిరామాద్భుతం
భావం –లోకాలన్నితిలోని మనోహర వస్తువులకంటే ,ఆశ్చర్య పదార్దాలన్నిటికంటే ,ఆశ్చర్యమైనది గోపాల కృష్ణుని దివ్య తేజస్సు శిర్సులో నెమిలి పించం ఉంటుంది బాలుడే అయినా సౌన్దర్యం లో పడుచువారి లక్షణాలు కనిపిస్తాయి మాధుర్య విలసిత మోము నుండి వీనుల విందైన మురలీనాడం వెలువడుతుంది .ప్రౌఢ గోపా కాంతలు నిరంతరం ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటారు .అలాంటి తేజో రూప గోపాలుని రూపం ఎప్పుడూ నా మనసులో ప్రకాశించాలి .
అందరు చెప్పుకొనే శ్లోకం ‘’కస్తూరీ తిలకం ‘’లీలాశుకునిది అని చాలామందికి తెలియదు .
‘’కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం –నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుఃకరేకంకణం
సర్వాంగే హరి చందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ—గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః
328 శ్లోకాలున్న ఈ స్తోత్ర మంజరి లో ప్రతిశ్లోకం కర్ణ రంజనమే .చివరగా లీలాశుకుడు
‘’లీలాశుకం రచితం తవ దేవ దేవ కృష్ణ కర్ణామృతం వహతు కల్పశతాంత రేపి ‘’అని చెప్పాడు వంద కల్పాల
దాకాఅంటే నాలుగు యుగాల దాకా కావ్యం జీవించి ఉండాలని ఆకాంక్షించాడు .ఉంటుంది కూడా
లోకం లో కృష్ణుడిని ‘’గోపాల సుందరి ‘’గా అర్చించే విధానం ఉంది .ఆ మూర్తి జపానికి 33 బీజాక్షరాలున్నాయి .ఇందులో 18రాజ గోపాల మంత్రం లోని వైతే 15 శ్రీ విద్య లోని పంచ దశాక్షరాలు .
దక్షిణ ద్వారక లోని రాజా మన్నార్ గుడి దైవం శ్రీ రాజగోపాలుడు. ఆయన ధ్యానం ‘’శ్రీవిద్యా రాజ గోపాలునిగా చేస్తారు స్వామి పాదాల చెంత శ్రీ చక్రం ప్రతిష్టితమై ఉండటం గొప్ప విశేషం ఆయన అలంకారం ఏమిటో తెలుసా ?మోహినీ అలంకారం అంటే మదన గోపాల సుందరి అలంకారం బ్రహ్మోత్సవాలు ఈ అలంకారం తోనే నిర్వహిస్తారు .లీలాశుకుడు ఈ మదన గోపాల సుందరి ని శ్రీకృష్ణ కర్ణామృతం లో 3 నుంచి 104 శ్లోకాల వరకు తనివితీరా బహు సుందర పదబంధం తో వర్ణించాడట
శ్రీ రామ కర్ణామృతం
కంచి మఠానికిచెందిన పీఠాదిపతి శ్రీ శ్రీ బోదేంద్ర సరస్వతి గారికి శ్రీరామ సిద్ధాంతం పై మహా అభిరుచి ఉండేది వారు తమ పీఠాదిపత్యాన్నిఐచ్చికంగా త్యజించి పదవీ విరమణ తర్వాత కుంభ కోణం దగ్గరున్న గోవిందాపురం గ్రామం వెళ్లి రామభక్తి సామ్రాజ్యం లో చిదానందాన్ని అనుభవిస్తూ ‘’శ్రీ రామ కర్ణామృతం ‘’అనే మహా గొప్ప స్తోత్ర రచన చేశారు. త్యాగ రాజస్వామికివీరు ము౦దు వారు .వీరి అనుయాయులు రామనామ సిద్దాంతా న్ని కావేరీ పరీ వాహక ప్రాంతం లో విస్తృతంగా వ్యాపింప జేశారు. కావేరీనదీ ఉపనది అయిన వీరసోగ్హన్ నదిలో స్వామివారు ‘’జీవ సమాధి ‘’ చెందారు . రామ కర్ణామృత శ్లోకాలు కృష్ణ కర్ణామృత శ్లోకాలలానే ఉండటం విశేషం .ఆ సౌరు చూద్దాం –ముందుగా కృష్ణ కర్ణామృత శ్లోకం –
‘’హే దేవ హే దయిత ,హే జగదేక బంధో-హే కృష్ణ హే చపల హే కరుణైక సింధో
హే నాధ హే రమణ ,హే నయనాభి రామ –హాహా కదాను భవితాసిపధం ద్రుసోర్మే
ఇప్పుడు శ్రీ రామ కర్ణామృత మకరందం జుర్రుదాం
‘’హే రామ ,హే రమణ హే జగదేక వీర –హే నాద హే రఘుపతే కరుణాలవాల
హే జానకీ రమణ హే జగదేక బంధో –మాం పాహి దీనం అనిశం కృపణం కృతజ్నం ‘’
కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.
శ్రీ కృష్ణ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-16 -కాంప్-బాచుపల్లి -హైదరాబాద్