భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ
‘’లేదు ‘’అనే సిద్ధాంతాన్ని సింగం పల్లి సిద్ధాంతి అని పిలువబడిన ‘’అనంతుని సీతారామ సిద్ధాంతి ‘’తాను రాసిన ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’గ్రంధం లో అనేక ఉపపత్తులతో రుజువు చేశాడు .ఈయన -తెలంగాణా సంస్కృతాంధ్ర మహాకవి ,పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర వేత్త ,’’అభినవ కాళిదాస ,కవికులాలంకార ,కవి కల్పద్రుమ ,అలంకార నటరాజ ‘’బిరుదాంకితులు శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారి సమకాలీనుడు .సిద్ధాంతి ‘’రాజా ధరం కరణ్ బహద్దర్ ఆసఫ్ జాహీ సదరుల్ మహా రాజా ‘’ఆస్థాన జ్యోతిష విద్వాంసుడు .రాజ మండ్రి,కోన సీమలలో మహా పండితుల వద్ద జ్యోతిషం నేర్చినవాడు .గణిత శాస్త్రం లో అఖండ ప్రజ్ఞానిధి. మాహా రాజసంగా జీవించాడు .ఎన్నో ఎకరాల భూమి ,వ్యవసాయం ఎడ్లు పాడి గొడ్లు పాడి పంట లతో వడ్డీ వ్యాపారం తనఖా లతో సరస్వతీ సంపన్నం తో పాటు లక్ష్మీ సాక్షత్కారమూ పొందటం తో గృహం ఎల్లప్పుడు కళకళలాడేది .
ఇంతటి ఉద్దండ పండిత సిద్ధాంతి మన తెల్క పల్లి వారి సాయం తో పై గ్రంధాన్ని రాసి కాదు ఆయనతోనే రాయించి తానె రాశానని చెప్పుకుని గురువుకు పెద్ద పంగనామాలు పెట్టిన ఘనుడు ‘’మోసం గురో ‘’కు ఆద్యుడు ..ఆ వివరాలు తెలుసు కుందాం .
ఈ సిద్ధాంతి జైన ,బౌద్ధ మత గ్రంధాలను క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకుని ,37ఉపపత్తులతో ‘’భూమికి చలనం లేదు .అంటే భూమి తిరగటం లేదు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .ఆ సిద్ధాంత ప్రతిపాదనకోసమే ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’రాసే ప్రయత్నం చేశాడు .దీనికోసం ఆయన తిరగవేయని గ్రంథం,సేకరించని పుస్తకం ,పరిశీలించని విషయం లేనే లేదు .అంత శ్రమ పడ్డాడు .విషయ సేకరణ అంతా పూర్తిగా చేసినతర్వాత తన పరిశోధన ను కాగితం పై పెట్టె సమయం లో ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు పరిచయమయ్యారు .తన శ్రమ అంతా శాస్త్రి గారికి వివరించి రచనలో సాయం చేయమని కోరాడు సిద్ధాంతి .ఒక మహత్తర గ్రంథానికి తాను కారకుడౌతున్న ఆనందం తో, ఆ గ్రంథం తమకు గొప్ప పేరు కీర్తి ఇస్తాయన్న నమ్మకం తో సరే నన్నారు శాస్త్రి గారు .
శుక్లనామ సంవత్సరం నుంచి ఆంగీరస నామ సంవత్సరం వరకు నాలుగు సంవత్సరాలు సిద్ధాంతి కోరికపై సిద్ధాంతి ఇంట్లోనే భార్యతో సహా ఉండిపోయారు .మొదట సిద్ధాంతి తనభావాలను శాస్త్రి గారికి వివరించేవాడు .వాటిని శాస్త్రిగారు శ్రద్ధగా విని ,ఆకళింపు చేసుకుని ,వాటిని క్రమబద్ధం చేసి అతని కుమారుడికి చెప్పి రాయి౦చేవాడు .అవసరమైన చోట ‘’కారికలు ‘’కూడా శాస్త్రి గారే రాసి ,నిర్వచనాలు సైతం తానే వ్రాశారు .సిద్ధాంతి ఎప్పుడూ బిజీ బిజీ .సమయం దొరికేది కాదు కుదురుగా కూర్చుని రాయటానికి .అయితే శాస్త్రి గారు వచ్చి కూర్చునే లోపు సిద్ధాంతి విషయానికి తగ్గ రిఫరెన్స్ లు రెడీ గా ఉంచేవాడు .వీటినన్నిటిని క్రోడీకరించి శాస్త్రిగారు శ్రమ దమాదులకోర్చి ,సిద్ధాంతి భావాలకు చక్కని సమన్వయము తో రూప కల్పన చేసి,మనస్పూర్తిగా గ్రంథం రాశారు ..సిద్ధాంతి తన గ్రంథానికి ‘’భూ భ్రమణ భ్రాంతి నిరసనం ‘’అని మొదట్లో పేరు పెడదామనుకుని , ఆంగ్లేయుల సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం అని పేరు లోనే తెలిసిపోతుందని భయ పడి ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’అని పేరు మార్చాడు .
అమాయకులైన శాస్త్రి గారు సిద్ధాంతి ఊహాపోహలను కనిపెట్టలేక పోయారు .గ్రంథ రచన పూర్తికాగానే శాస్త్రి గారితో ‘’అభిప్రాయం ‘’రాయి౦చుకుని శాస్త్రి గారిని బిగించేశాడు .ఇది మొదటి స్టెప్పు .1931లో శాస్త్రి గారిని వెంట బెట్టుకుని మైసూర్ విరూపాక్ష పీఠాన్ని సందర్శించి అక్కడి పీఠాధిపతికి తన గ్రంధాన్ని చదివి వినిపించాడు .ఆయన విని మెచ్చి ‘’ప్రమాణ పత్రిక ‘’రాయించి ఇచ్చారు .ఇది రెండవ స్టెప్పు .మూడవ స్టెప్పు గా వెల్లాల శివ శంకర శాస్త్రి చేత ,మైసూర్ మహారాజా సంస్కృత మహా కళాశాల ఉద్దండ పండితుల చేత ,పరకాల పీఠాధిపతి చేత ,’’ప్రశస్తి పత్రికలు ‘’ పొంది తన చాకచక్యాన్ని, చాణక్య నీతినీ ప్రదర్శించాడు .పరకాల స్వామి సిద్ధాంతిని గ్రంథ రచన ఎవరు చేశారని ప్రశ్నించగా శాస్త్రిగారి పేరు ఊసెత్తకుండా అంతా తానె రాశానని ప్రగల్భాలు పలకగా శాస్త్రిగారు చాలా ఖిన్నులయ్యారు .అప్పుడు అర్ధమయింది’’మోసం గురో ‘’అని .”భూమి తిరగటం లేదు ”అన్నమాట ఏమోకాని శాస్త్రిగారి కళ్ళు తిరిగి బైర్లు కమ్మేట్లు చేశాడు కపట సిద్ధాంతి .
ఆధారం -మహబూబ్ నగర్ తెలంగాణా వికాస సమితి ఆధ్వర్యం లో శ్రీ సంబరాజు ప్రకాశరావు సంపాదకుడుగా శ్రీ తెల్కపల్లి రాజ శేఖర శర్మ సహ సంపాదకుడు గా ప్రచురించిన ‘’ అభినవ కాళిదాస తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి’’పుస్తకం లో శ్రీ కపిలవాయి లింగ మూర్తి గారి వ్యాసం .
శ్రీ శాస్త్రి గారిపై రాసిన పై పుస్తకాన్ని శ్రీ శాస్త్రి గారికుమారులు శ్రీ రాజ శేఖర శర్మగారు నాకు 27-2-18 న అభిమానం తో ,ఆదరణతో పంపారు .వారికి ధన్యవాదాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్