శృంగి
ఉత్తరప్రదేశ్ లోని నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది .
తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త శివుడికీ ఆహ్వానం లేకపోయినా ,పుట్టింటి పై మమకారం తో , భర్త పరమేశ్వరుడు వద్దని వారించినా , పిలువని పేరంటానికి వెళ్లి నట్లు సతీ దేవి వెళ్లి ,అక్కడ తండ్రి వలన తీవ్ర అవమానికి గురై ,భరించలేక యోగాగ్నిలో దగ్ధమై పోయింది .ఇది తెలిసిన శివుడు ఉగ్రరూపం తో సతీదేవి శరీరాన్ని తన భుజాలపై మోస్తూ , నిరంతర తాండవ నృత్యం సలిపాడు .లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి . బ్రహ్మాది దేవతలంతా దిక్కుతోచక విష్ణు మూర్తికి మొరపెట్టారు. ఆయన వచ్చి సతీదేవి శరీరం శివుడు మోసినంత సేపూ ఆయనను శాంతి౦ప జేయలేమని గ్రహించి తన సుదర్శనచక్రం తో సతీ దేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు .అవి 10 8 ముక్కలుగా ఖండింప బడి భారత దేశమంతటా వివిధ ప్రదేశాలలో పడ్డాయి .ఈ ఖండాలు పడిన చోట అమ్మవారి ఆలయాలు వెలిసి,108 శక్తి పీఠాలయ్యాయి .నైమిశారణ్యం లో అమ్మవారి గుండె తెగిపడింది .అందుకే మహోత్క్రుస్ట శక్తి పీఠం గా వన్నె కెక్కింది .
‘’వారాణసీ విశాలాక్షీ ,నైమిశే లింగ దారిణి’’అన్న ప్రసిద్ధ శోకం ఉంది .కాశీలో విశాలాక్షి రూపం లో , నైమిశారణ్యం లో’’ లింగధారిణి’’ అయిన లలితా పరాభట్టారికా రూపం లో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది .అమ్మవారి దగ్గర ప్రతిస్టింప బడిన శ్రీ చక్ర యంత్రం మహామహిమాన్వితమైనది అంటారు .మహిషాసుర, భండాసురాది క్రూర రాక్షస సంహారం చేసి లోకాలను కాపాడిన చల్లని తల్లి లలితాదేవి అనిమనకు తెలుసు . మహామంగళ స్వరూపిణి గా ఇక్కడ విశేష పూజలందుకొంటున్నది .భక్తుల కొంగుబంగారం లలితాంబ .
ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు 90 కిలోమీటర్లలో సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరాన నైమిశారణ్యం ఉంది .’’నైమిశే అనిమిష క్షేత్రే ‘’అన్న దానిప్రకారం ఇది దేవతా క్షేత్రమేకాక ,విష్ణు క్షేత్రం కూడా .అనిమిషులు అంటే రెప్పపాటు లేని దేవతలు .విష్ణు సహస్ర నామాలలో అనిమిష అనేది ఒకటి .అంటే ఆయన నిత్య జాగరూకుడు కను రెప్పలు మూయని వాడు , నిద్ర పోనివాడు ,,మహా మేధావి అని అర్ధం.-‘’గురుః,గురు తమో ధామః సత్యః సత్య పరాక్రమః నిమిషో ,అనిమిషః స్రగ్వీ ,వాచస్పతిర్ ఉదారదీః’’.
నైమిశం 16 కిలోమీటర్ల చుట్టుకొలత కలది. దీనినే పరిక్రమ అంటారు .ఇక్కడే భగవాన్ వేద వ్యాసుడు వేద విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు , భాగవతాది పురాణాలు ,మహాభారతం ఉపనిషత్తులు మొదలైన ప్రసిద్ధ రచనలు చేశాడు .ఆయన కూర్చున్న చోటును ‘’వ్యాసగద్ది’’అంటారు ఇప్పుడు మనం చూడచ్చు .మహాభారతం మొదటి సారిగా పారాయణం చేసిన ‘’పురాణ మందిరం ‘’ఉన్నది . శృంగి మహర్షి తపస్సు చేసిన మందిరం ఉంది . సూత మహర్షి ఇక్కడే శౌనకాది మునులకు ఎన్నో పురాణాలు ప్రవచించాడు . ఇంద్రుడి వజ్రాయుధం తయారు కావటానికి దధీచి మహర్షి తన వెన్నెముకను దానంచేసిన పవిత్ర స్థలం ఇది. శ్రీరాముడు రావణ సంహారం అనే బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి ఇక్కడి’’మిశ్రిక్’’ లో ఉన్న ‘’హత్యా హరణ తీర్ధం ‘’లో పవిత్ర స్నానం చేశాడు .ఇది నైమిశానికి 11 కిలోమీటర్ల దూరం లో సీతాపూర్ వైపు ఉంది.విక్రమాదిత్య చక్రవర్తి శ్రీరామ పత్ని సీతా సాధ్వి పేరిట సీతాపూర్ నిర్మించాడు .అంతే కాదు చారిత్రకంగా కూడా నైమిశం ప్రసిద్ధి చెందింది .1857 ప్రధమ స్వాతంత్ర సమరం లో ఈ జిల్లా ఆదివాసులు బ్రిటిష్ కంటోన్ మెంట్ పై దాడి చేసి కాల్పులు జరిపారు . ఈదాడిలో చాలామంది మిలిటరీ ఆఫీసర్లు, పౌరులు తప్పించుకు పారి పోయే ప్రయత్నం లో మరణించారు.
నైమిశం లోని చక్రతీర్ధం పుణ్యస్నానాలకు ప్రసిద్ధి .విష్ణు మూర్తి చక్రం ఆగిన ప్రదేశం లో ఏర్పడిన పుష్కరిణి ఇది .నైమిశారణ్యం లో ఆది శంకరాచార్యులవారు లలితా దేవిపై ‘’లలితా పంచకం ‘’రాశారు .సతీదేవి ఇక్కడే తపస్సు చేసింది . ఇక్కడి హనుమాన్ గర్హిలో ‘’పెద్ద హనుమంతుడు ‘’కొలువై ఉన్నాడు .పాతాళంలో అహి మహి రావణులను మర్దించి భూమిపైకి వచ్చి మొదటిసారిగా ఇక్కడే ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులకు కనిపించాడు .9 వశతాబ్దికి చెందిన’’తిరు మంగై ఆళ్వార్ ‘’నైమిశం పై తమిళం లో 10 పద్యాలు రాసి ఇదే’’మహా విష్ణు క్షేత్రం ‘’ అన్నాడు .ఇక్కడ ఆహోబిలమఠం ,రామానుజ కూటం కూడా ఉన్నాయి .శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమూ నిర్మించారు .కనుక నైమిశారణ్యం లో కాలుపెడితే ఎన్నెన్నో విశేషాలను శ్రీ లలితాదేవిమందిరం తో పాటు దర్శించవచ్చు .’’టూమెనీ బర్డ్స్ ఎట్ వన్ షాట్ ‘’.అన్నమాట .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు
—

