రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి
కాశీ అంటే వారణాసి లో శ్రీ వారాహి దేవి అమ్మవారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి .ఆలయం భూ గృహం లో ఉండటం ఒక విశేషం అయితే ,రోజూ ఉదయం 5-30 గంటలనుండి 7-30 గంటల వరకు రెండు గంటలు మాత్ర మే తెరచి ఉండటం మరొక విచిత్రం .తర్వాత పూర్తిగా మూసేస్తారు ..అమ్మవారిని సరాసరి చూసే వీలులేకపోవటం తలుపులకున్న రెండు రంధ్రాలనుంచి మాత్రమే అమ్మవారిని దర్శించటం మరో వింత .ఒకదాని నుంచి చూస్తే దేవి పాదాలు ,మరో దాని నుంచి చూస్తే అమ్మవారి ముఖం కనిపించటం ఇంకో వింత .
కాశీ ఖండం లో వారాహీ దేవి గురించి ఉన్నది .’’వారాహీ వీర్య వందితా ‘’అని లలితా సహస్రనామాలలో కూడా ఉన్నది .ఈమెను పూజిస్తే ఏరకమైన కస్టాలు నష్టాలు ఉండవని ఉంది కాశీ రాజు .రాజా దివోదాసు పాలనలో దుర్మార్గం పెచ్చుపెరిగినప్పుడు ,పరమశివుడు 64 మంది యోగినులకు కాశీకి పంపి కాశీని విధ్వంసం చేయమన్నాడు .అయితే వాళ్ళు కాశీ అంద చందాలకు ముగ్ధులై కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు .వారిలోసర్వ శక్తి వంతురాలైన వారాహీ ఒకరు .సప్త మాతృకలలో ఒకరుగా ఆమెను భావిస్తారు .
కాశీలో మన్మ౦దిర్ ఘాట్ వద్ద వారాహీ దేవి ఆలయం ఉంది .దశాశ్వమేద విశ్వనాధ దేవాలయ గల్లీ లో కుడిప్రక్కకు తిరిగి సుమారు నూట యాభై గజాలు నడిస్తే వారాహీ దేవి దేవాలయం వస్తుంది .కోర్ట్ వ్యవాహారాలలో జయం ,లిటిగేషన్ నుండి బయటపడటానికి సర్వ విధాల విజయాలకోసం ఈ అమ్మవారిని భక్తులు ప్రార్ధించి పూజ చేస్తారు .ఉదయం మాత్రమే అమ్మవారికి హారతి ఇస్తారు. హారతిచ్చేసమయం లో తలుపులు మూసేస్తారు ఇది మరో విశేషం .భక్తులు లోపలుండి హారతి చూడచ్చు .తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది తర్వాత గుడి మూసేస్తారు ..పూజారి తప్ప వేరెవరూ భూ గృహం లో ప్రవేశించారాదనే నియమం ఉంది .అమ్మవారు మహోగ్ర స్వరూపిణి .కనుక భయపడే ప్రమాదము౦ది .పూజారి అమ్మవారికి చేసే నిత్య పూజ తప్ప ప్రత్యేక పూజలంటూ ఉండనే ఉండవు .
వారాహేదేవి వరాహ రూపమైన విష్ణు మూర్తి రూపం లో ఉంటుంది .విష్ణుదేవుని శక్తి స్వరూపమే వారాహీదేవి .తాంత్రిక గ్రంథాలలోఆమె తల తల్లి పంది రూపం లోఅంటే వరాహ రూపం లో ఉంటుందనిఅందుకే వారాహీ అంటారని ,నాలుగు చేతులు౦ టాయని,ఎడమ పై చేతిలో హలంఅంటే నాగలి ,కుడి పై చేతిలో ముసలం అంటే రోకలి ,కుడి కింద చేయి అభయముద్ర ,ఎడమ కింది చేయి వరద ముద్రతో ఉంటుందని వర్ణించాయి .వారాహీ దేవి శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారిఅంటే లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలు .సర్వ శక్తి స్వరూపిణి కనుక ఆమె పూజ అపజయం కల్గించక సర్వదా విజయకారకం .తమిళం లో ఒక సామెత ఉంది ‘’వారాహీ దేవి భక్తులతో తగాదా పెట్టుకోకు మసై పోతావు ‘’అని .ఆమెను అర్చిస్తే యుద్ధం లో తప్పక విజయం సిద్ధిస్తుందని రాజుల నమ్మకం .కనుక రాజులందరూ వచ్చి పూజించి వెళ్ళటం రివాజు .దీనికి నిదర్శనమే తంజావూర్ బృహదీశ్వరాలయ నిర్మాత రాజ రాజ చోళుడు అమ్మవారి పరమభక్తుడు అవటం వలన ఏ యుద్ధం లోను అపజయం పొందలేదు .అతనేకాడు అతని వారసులూ వారాహీదేవి భక్తులే . త్రిభువనైక అఖిలా౦ డేశ్వరి అంటే వారాహీ దేవి .ఆమె ఉగ్ర రూపం తగ్గించటానికి ఆది శంకరాచార్యులవారు అమ్మవారి రెండు చేవులకుశ్రీ చక్రాలు తయారుచేయించి అలంకరించారు .అయినా ఆమె ఉగ్రం పూర్తిగా తగ్గక పోయే సరికి ఆమె సన్నిధిలో ‘’ప్రసన్న గణపతి ‘’ని ప్రతిష్టించి కొంత శాంత పరచారు .కుమార గణపతి పై ప్రేమాభిమానాలు కురిపిస్తూ అమ్మవారు శాంతించింది .కనుక ఆలయం ఉదయ వేళలలో తెరచి ఉన్నప్పుడు ఆమె శాంత స్వరూపిణి అయిన అఖిలాండే శ్వరిగా దర్శనమిస్తుంది .ఆలయం మూసెయ్యగానే ఉగ్ర వారాహీ రూపం పొంది భయకంపితులనుచేస్తుంది .పూజారులుకూడా ఆలయం మూసి ఉన్నప్పుడు లోపల భయంకర శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు .కనుక ఎవరూ సాహసించి దర్శన వేళలో తప్ప అమ్మవారిని చూడటానికి వెళ్లరు .
అమ్మవారిని ఇక్కడ ‘’పాతాళ వారాహీ దేవి ‘’అనికూడా పిలుస్తారు .అమ్మవారు యెంత భయంకర ఉగ్రరూపిణి అంటే ,ఒక సారి పూజారి మంత్రాలు తప్పుగా చదువుతుంటే అతడిని అమ్మవారు అమాంతం మింగేసింది అని కధనం .ఆలయ దర్శనవేళలు సూర్యోదయాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు ‘’.శ్రీమన్నగర వాసిని’’అని అమ్మవారిని ఆర్యా ద్విశతిలోవర్ణించారు . కాశీనగర గ్రామ దేవతగా వారాహీదేవి ప్రసిద్ధి చెందింది.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-18 –ఉయ్యూరు
—

