కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం
తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే ‘’పరంగినాద శివుడి’’ని ఆరాది౦చాడని కథనం.
మదుర నగరానికి 5 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది .మురుగన్ ముఖ్యదైవం .శివ ,విష్ణు వినాయక ,దుర్గాదేవి విగ్రహాలుకూడా ఉన్నాయి .నిత్యం ఆరు పూజలు సంవత్సరం లో మూడు ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి .ఇందులో అక్టోబర్ –నవంబర్ నెలలో వచ్చే ‘’స్కంద షష్టి’’ఉత్సవం అత్యంత ముఖ్యమైనది .దీన్ని ఘనంగా చేస్తారు .శూరపద్మ రాక్షస వధ వృత్తాంతం స్కంద పురాణం లో ఉన్నది .ఈ రాక్షసుడు శివుని తపస్సు చేసి మెప్పించి అద్భుత వరాలు పొంది ,లోక భీకరుడై నరకంటకుడై 108 లోకాలను గడగడ లాడించాడు .వీడు పాదుమకోమల ను వివాహమాడి చాలామంది కొడుకులను పొందాడు .వీరం కేంద్రం ను సముద్రం లో నిర్మించి రాజధానిగా చేసుకొని పాలించాడు .ఇంద్రాది దేవతలను లొంగదీసుకొని ఇంద్రాణిపై మోజు పడ్డాడు .చేసేది లేక మురుగను శరనణువేడాడు దేవేంద్రుడు . కుమారస్వామి వాడికి నయానబుద్ధి చెప్పాలని భావించి వాడి దగ్గరకు ‘’విరవాకుటర్’’అనే దూతను పంపాడు .వాడు లొంగలేదు .తప్పని సరి పరిస్థితులలో స్కందుడు ససైన్యంగా ఆరాక్షసుని తో ‘’తిరుపరం కుండ్రం’’ వద్ద భయంకర యుద్ధం చేయాల్సి వచ్చింది .వాడి కుమారులలో ‘’ఇరణ్యు’’ డుని తప్ప అందర్నీ సంహరించాడు .భయపడి దానవుడు సముద్ర గర్భం లో దాక్కున్నాడు .తన నెమలి వాహనం కోడిపుంజు లతో తో సముద్ర గర్భానికి వెళ్లి వాడిని రెండుముక్కలుగా నరికి చంపాడు .స్కందుడు శూర పద్ముడిని సంహరించిన షష్టి రోజు ను ‘’స్కంద షష్టి’’ ఉత్సవంగా అప్పటినుంచి మురుగ దేవాలయాలలో సంప్రదాయం గా వస్తోంది .కుమారస్వామి వీర ధీర పరాక్రమాలకు సంతోషపడిన దేవేంద్రుడు తన అపురూప పుత్రిక’’ దేవ సేన’’ని స్కందునికిచ్చి ‘’తిరుపరం కూండ్రం’’లో వైభవంగా వివాహం చేసి రుణ౦ తీర్చుకొని అల్లుడిని చేసుకొన్నాడు .దేవతందరు వివాహ వేడుకకు విచ్చేసి దంపతులను ఆశీర్వ దించారు అప్పుడు కుమారస్వామి వారిని తిరిగి తమతమ లోకాలకు మనో వేగం తో వెళ్ళమని కోరాడని ఈ దైవ వివాహ విషయాన్ని గ్రంధస్థ౦ చేసిన ‘’కాందహార అనుభూతి ‘’లో ఉంది .ఈ ప్రదేశం లోనే స్కందుడు తన తండ్రి పరమ శివుని ‘’పరం గిరి నాధుడు ‘’గా అర్చించాడు .
ఒకప్పుడు ఈ రాక్ టెంపుల్ జైనమందిరం అని తర్వాత స్కంద దేవాలయం అయిందని కొందరు అంటే, కాదుకాదు ఆరో శతాబ్దానికి ముందే ముందేఇది స్కందాలయం దీన్ని జైన మతస్తులు పాండ్య రాజు’’ కూన పాండ్యు’’ నికాలం లో ఆక్రమి౦చారనీ అంటారు .తర్వాతకాలం లో పాలించిన పాండ్యరాజు మంత్రి ‘’గజపతి ‘’ఈ ఆలయాన్ని8 వశతాబ్దిలో నిర్మించాడు .ఆతర్వాత మధురనాయకులు ఆలయాన్ని అనేకరకాలుగా విస్తరించారు .
ఆలయం లో అందమైన శిల్పాలు ఉన్న రాతి స్తంభాలపై ఆ స్థాననమండపం అనే ఒక హాలు ,150అడుగుల ఎత్తైన 7 అంతస్తుల రాజగోపురం కను వి౦దు చేస్తాయి.ఆలయం వెనుక 10 50 అడుగుల ఎత్తైన కొండపై శ్రీ కాశీ విశ్వనాధ దేవాలయం చూపరులకు ఆకర్షణీయంగా ఉంటుంది .ఇందులోని వినాయకుని హస్తాలలో చెరుకుగడ ,పండ్లు ఉండటం విశేషం .కంభ తాడి మండపం ,అర్ధ మండప౦, మహా మండపం ఒకదానికొకటి ఎత్తుగా ఉంటాయి .ముఖ్య దేవాలయం కొండను తొలచి కట్టబడి కుమారస్వామి శివ ,విష్ణు ,వినాయక దుర్గ విగ్రహాలతో శోభిల్లుతుంది .ఇవన్నీ పరం కూండ్రం రాయితో శిల్పీకరి౦పబడినవే .ఇక్కడి శివుడిని పరంగిరి నాదుడని అంటారు అమ్మవారు పార్వతీదేవిని ‘’అవుదై నాయకి ‘’అంటారు .బయట శివతాండవ దృశ్యాలు అద్భుతమనిపిస్తాయి .
శివుడు విష్ణువు ఈ ఆలయం లో ఎదురెదురుగా ఉండటం మరో విశేషం .ప్రాచీన దేవాలయాలలో ఎక్కడా ఇలాంటి అరుదైన దృశ్యంకనిపించదు .ఆలయం బయట ఉన్నకోనేరు లోని చేపలు మన చూపులకు గేలాలు వేస్తాయి .వాటికి భక్తులు ఉప్పు అటుకులు వేయటం తమాషా విషయం .ధ్వజస్తంభం, నంది, నెమలి, ఎలుక విగ్రహాలు కూడా ఆకర్షణీయం .ఆలయానికి అనుబంధంగా వేద పాఠ శాల ఉంది . అర్ధ మండపం ముందు ఆరు మెట్లతో ‘’షహ సార పడిగ’’ఉన్నది .హాలులో మహిషాసుర మర్దిని అమ్మవారు ,కర్పగ వినాయకుడు ,అందరాబరణ ,ఉగ్గిరార్ విగ్రహాలుంటాయి .బయట శరవణ పాయిగ , లక్ష్మి తీర్ధం ,సన్యాసిబావి ,కాశి సునై ,సత్యకూపమనే జలతీర్దాలున్నాయి ,
పరమ శివభక్తుడు ‘’సంబందార్ ‘’ ఈఆలయం దర్శించి శివుని పై ‘’థేవరం’’ రచించి గానం చేశాడు .చేర ,చోళ ,పాండ్య రాజులను’’జ్ఞాన సంబంధ ‘’ఇక్కడే కలిసి దీవించాడు .సుందరార్ ,సంబందార్ కవులు ఇక్కడే ‘’థేవర పతిగం ‘’రచించారు .నక్కీరన్ అనే భక్తుడు ఇక్కడే స్కందునిపై ఎన్నో పాటలు రచించి కుమారస్వామికి వినిపించాడు .తిరుప్పుగై ,కందపురాణ౦ ఈ క్షేత్రాన్ని గురించి అద్భుతంగా చెప్పాయి .
ఆలయం లో స్కంద షష్టి మొహోత్సవం 6 రోజులు వైభవంగా చేస్తారు .’’శరవణ భవుని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు .ఫాల్గుణమాసం లో బ్రహ్మోత్సవం జరుగుతుంది .ఇక్కడి’’తమిళులు పిలుచుకొనే ‘’ పవలకానివై పెరుమాళ్ ‘’అనే ఆలయ విష్ణుమూర్తిని ,,కుమారస్వామి లను ఊరేగింపుగా మధుర మీనాక్షి అమ్మవారి కల్యాణానికి తీసుకు వెడతారు ఇదొక గొప్ప సంప్రదాయం .కార్తీక దీప శోభ ఆలయం లో మహాద్భుతంగా నిర్వహించి అపరకైలాసం అనిపిస్తారు .వైశాఖమాసం లో తెప్పోత్సవం చూసి తీరాల్సిందే .ఆలయం లో విష్ణువు మూర్తి కూడా ఉండటం తో వైకుంఠ ఏకాదశీ అపూర్వంగా చేసి మరో వైకుంఠం అనిపిస్తారు . .ఒకరకంగా ఈ దేవాలయం శివకేశవ అభేదానికి ప్రత్యక్ష నిదర్శనం .
72వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-18 –ఉయ్యూరు

