ఒక శకం సమాప్తి ,అయితే ?
మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ దౌత్యం లో తనకు సాటి ఎవరూ లేరనిపించిన ,ప్రభుత్వాన్ని నయానో భయానో నడపటం కాదు ,అందరికి ఇష్టమైనట్లు భాగస్వామ్యపక్షాల సమ్మతితో పాలించిన ,అకలంక దేశభక్తుడు ,స్వయం శిక్షకుడు ,గురు గౌరవం గరిష్టంగా ఉన్నవాడు ,దేశ విదేశాలలో అత్యంత స్థిత ప్రజ్ఞుడనిపించుకొన్నవాడు ,అజాత శత్రువుగా వినుతి౦పబడినవాడు ,తన ప్రభుత్వం ఓడిపోయినా తను అమలు జరిపిన సంస్కరణలు ఆగామి ప్రతిపక్ష ప్రధాని ఆనుసరించాలని కోరినవాడు , భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తుఅద్దం గా భాసి౦చిన వాడు ,ప్రజలతో మమేకమై వారి అభి వృద్ధికోసమే అహరహం శ్రమించినవాడు,అతులిత ధీశాలి భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ మరణం తో అందరూ’’ ఒక శకం ముగిసింది’’ అన్నారు ముక్త కంఠం తో .నిజమే ముమ్మాటికీ నిజమే .
విలువల శకం ముగిసింది .ప్రజాస్వామ్య శకం ముగిసింది .అవతలివాడి అభిప్రాయాన్ని
గౌరవించే ,మన్నించే శకం ముగిసింది .ఫెడరల్ వ్యవస్థలో ఉండాల్సిన ఇచ్చిపుచ్చుకొనే ధోరణి గల శకం ముగిసింది .చేసిన వాగ్దానాలు నిలబెట్టుకొని సుభాష్ అనిపించుకున్న శకం ముగిసింది .శుష్కవాగ్దానాలు శూన్య హస్తాలు లేని శకం ముగిసింది .భవి ష్యత్తు పై జనం ఆశలు పెట్టుకొనే శకం ముగిసింది .బ్యా౦కుల్లో దాచుకున్న డబ్బు కు రక్షణ కల్పించిన శకం ముగిసింది .దాచుకొన్న డబ్బు తీసుకోవటానికి వరుసలో గంటలతరబడి నిలబడాల్సిన అవసరం లేని శకం ముగిసింది .సంపన్నుల కొమ్ముకాయని శకం ముగిసింది .పన్నుల భారం మోపని శకం ముగిసింది .దేశ రాజకీయాలలో వంశాపాలనకు చరమ గీత౦ పాడిన శకం ముగిసింది . ప్రపంచం లో భారత దేశ గౌరవ ప్రతిష్టలు మహోన్నతంగా వెలిగిన శకం అటల్జీ మరణం తో ముగిసింది .ఐతే ?
భారత జాతిపిత మహాత్మా గాంధీ మరణిస్తే కూడా ఇలాగే భావించాం .పాలకులైన కాంగ్రెస్ వారు ఆయన నడచిన బాటలోంచి ఎంతో దూరం బయటికి వచ్చి ఇష్టారాజ్యం చేశారు .ఆయన ఏవి వద్దన్నాడో వాటికే ప్రాణ ప్రతిస్టచేశారు .గా౦ధీయిజం అటకెక్కించి ‘’ఆటవిజం ‘’తో కదం తొక్కారు .ప్రణాళికలు ఎన్ని అమలు జరిగినా ప్రజలకు కూడు గుడ్డా అమర్చలేకపోయారు .స్వార్ధం మితిమీరి అవినీతి రాజ్యమేలింది .బంధు ప్రీతీ వారసుల ప్రభావం పెచ్చరిల్లింది .వంశపాలనకు ,అధిదేవత ఆరాధనకు నాయకులు ఆమోదించారు .ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశాయి .గాంధీ యుగ సమాప్తి ఫలితాలే ఇవన్నీ .
కేంద్రం లో లో బిజెపి ప్రధాని ఉండటం వలన అటల్జీ అంత్యక్రియలు అంత గొప్పగా జరిగాయి .దేశవిదేశాలనుండి ప్రభుత్వ ప్రతినిధులు ,దేశంలోని అన్నిపార్టీల నాయకులు ,కేంద్ర మంత్రివర్గం మొత్తం ,ముప్ఫై మంది గవర్నర్లు హాజరై ఆ మహామహునికి శ్రద్ధాంజలి ఘటించారు .ఏడు కిలోమీటర్లు నడిచి శవ యాత్రలో పాల్గొనటం చాలా విశేషమైన విషయం .మునుపెన్నడూ జరగనిది,ఎరగనిది .అతి నిబద్ధతతో జరిగిన కార్యక్రమం .జనం ముక్కుమీద వేలు వేసుకొని ఆశ్చర్యంగా చూసిన కార్యక్రమం .లక్షలాది ప్రజలు చేరి తమ ప్రియతమ నాయకునికి కన్నీటితో వీడ్కోలు చెప్పిన సన్నివేశమది .మీరు గమని౦చారో లేదో కాని మోడీ, షా లు ముళ్ళమీద కూర్చున్న ఫీలింగ్ తో ఉన్నారని పించి౦ది నాకు .చెమటలు తుడుచుకోలేక సతమతంయ్యాడు మోడీ .సున్నం కొట్టిన రాయి అయ్యాడు షా .బాధ ,విషాదం వారి ముఖాలపై నాకు కనిపించలేదు .పోనీ గంభీరతా లేదు .పాపం ఎరక్కపోయి ఇరుక్కు పోయామే అన్నట్లు ఉంది .ఆజనసందోహాన్ని చూసి ఆ ఆత్మీయత ,ఆరాధనాభావం ,అకళంక దేశభక్తిపట్ల ఉన్న గౌరవం చూసి మనసులో కలవర పడినట్లు అనిపించి౦ది నాకు మాత్రం .ఇది నా దృష్టి లోపమూ కావచ్చు నెమో?
ప్రభుత్వం బిజెపి కాకపొతే ఇంత వైభవం జరిగేదా?అని ఒక ప్రశ్న .ఈ ప్రభుత్వం ఇంకెవరైనా నాయకుడు మరణిస్తే ఇంత దీక్షగాచేస్తారా అనేదీ ప్రశ్నే.కనుక ఇప్పుడు అటల్జీని గుర్తుంచుకోవాలి .తరతమ భేదాలు పాటించకుండా ఆయనలాగా గౌరవించాలి .అది ఏ ప్రభుత్వమైనా ఎవరు అధికారం లో ఉన్నా .ఆయన అనుసరించిన మార్గం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా దూరం వచ్చేసింది కాంగ్రెస్ లాగా .ప్రజాస్వామ్య విలువలను కనీసం ఇప్పటినుంచైనా అమలు చేయాలి, గౌరవించాలి .అభిప్రాయ భేదం ఉన్న డి .ఏం .కే .,లెఫ్ట్ పార్టీలతో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నవారితోప్రజాస్వామ్యం కోసం చేతులుకలిపి పనిచేసిన అటల్జీ స్పూర్తి అదృశ్యం కాకుండా చూసుకోవాలి .ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం యెంత అభి వృద్ధిచెందితే దేశం అంతగా అభి వృద్ధి చెందుతుంది .ఆయన గౌరవించినట్లు వృద్దతరం నాయకులను గౌరవిస్తూ,సలహాలు పాటిస్తూ యువకులకు అవకాశం కలిపిస్తూ, ప్రోత్సహిస్తూ భావి భారత అభ్యుదయానికి తోడ్పడాలి .సంస్కరణలు అమలు జరిపే పరిస్థితులలో ఒకటికి రెండు సార్లు ఆలోచించు ముందుకు అడుగువేయాలి .బుర్రలో ఏదో తొలిచి౦దికదా అని అర్ధ రాత్రి నిర్ణయాలు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేయకూడదు .నల్లదనం కుప్పలు తెప్పలుగా బయటికి తెస్తానని వ్యర్ధ ప్రసంగాలతో కాలక్షేపం చేయక ,సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి బయటికి తెచ్చి అన్నమాట నిలబెట్టుకోవాలి .శాసనసభలలో చేస్సిన వాగ్దానాలు తుచ తప్పక అమలు చేయాల్సిందే . ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిందే .విడి పోయిన రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ధికి ఉదారం గా పెద్దమనసుతో నిధులు అందించాల్సిందే .మట్టి మశాన్నం లతో సరిపుచ్చి అటల్ జీ గౌరవాన్ని భంగ పరచరాదు .ఊరకుక్కల్ని ఉసికోల్పినట్లు పార్టీ కేడర్ ను ప్రతి పక్షనాయకునిపై ప్రయోగించి అటల్జీ సాధించిన స౦యమన ధర్మాన్ని నీరుగావి౦చవద్దు .ఇల్లుకాలి ఏడుస్తుంటే విదేశీ ప్రయాణాలు చేసి అక్కడి జనాలను సమ్మోహనం లో ము౦చద్దు.ఇక్కడేదో దేశం వెలిగిపోతోందనే భ్రమ వాళ్లకు కలిగించి మభ్యపెట్టవద్దు .కోర్టులపరిధికి న్యాయవ్యవస్థకు అడ్డుకట్టలు వేయరాదు.పాలకులు సవ్యంగా పాలనా సాగిస్తే న్యాయస్థానాలకు పెద్దగా పనిఉండదు .గవర్నర్ వ్యవస్థ ను అపహాస్యంపాలు కానివ్వవద్దు. నాలుగేళ్ళలో ఏనాడూ భాగస్వామ్య పక్ష సమావేశం నిర్వహించకుండా రోడ్డు రోలర్ మెజార్టీ ఉందికదా అని ప్రవర్తిస్తే వచ్చే ఫలితాలు మహా దారుణంగా ఉంటాయి .
ముఖ్యంగా రాష్ట్రాలపై ,మరీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలు మొదటికేమోసం. అటల్జీ ఆత్మ గౌరవాన్ని మంటగలిపినట్లే .గెలుపే ముఖ్యం కాదు గెలిచిన తీరు ముఖ్యమని నిరూపించిన అటల్జీ మార్గాన్నే అనుసరించాలి . ఇప్పటిదాకా జరిగిందేదో జరిగి పోయింది .ఆ చెడు సంప్రదాయం అటల్జీ చితాగ్నిలో భస్మమై పోయినట్లు భావించాలి.ఇప్పటి కేంద్ర అధినాయక వర్గం ,పార్టీ విశాల దృక్పదాన్ని అలవరచుకొని, ఇక వేసే ప్రతి అడుగు బహుళ జన సంక్షేమంగా వేయాలి బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నఅటల్జీ మార్గమే శరణ్యం .జన హృదయసీమల్ని గెలవాలికాని నోట్లతో వోట్లుకాదుఅని గ్రహించాలి .చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. సుగమ సుందర మార్గం లో పయనించి ప్రజాసంక్షేమానికే అగ్రతాంబూలమివ్వాలి.ప్రజలమైన మనమూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ,మన ప్రవర్తనతో సమాజాన్ని మార్చాలి .ఇవన్నీ చేస్తే అదే అటల్జీ కి మనమిచ్చే ఘన నివాళి అవుతుంది .అటల్జీ శకం అయిపోయి౦దన్నమాట కు కాలం చెల్లి, అదే శకం నూతన జవసత్వాలతో మరింత ముందుకు వెడుతోందనే నమ్మకం కలుగు తుంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-18 –ఉయ్యూరు
—

