లలితా పరాభట్టారిక సచ్చిదాన౦ద స్వరూపం లో విశ్వమంతా ఉండే పరమేశ్వరి .విశ్వం లో విశ్వం బయటా ఉంటుంది .సర్వత్రా ఉన్నా అందరికీ కనిపించదు .మనం మనకళ్ళతో ప్రపంచమంతా చూడగలం కాని అమ్మవారి కళ్ళను చూడలేము .మనవిధాత్రి ,నేత్రి ,సంధాత్రి పాదాల చప్పుడు వింటాం.కాని ఆనవాళ్ళను గుర్తించలేం .చూడాలన్న తపన, దీక్ష ఉంటే ఆ అడుగుల చప్పుడే మనల్ని ఆమె వద్దకు చేరుస్తుంది .’’శ్రుతి ద్వారా సాధకులు ‘’దృష్టి’’ఆధారాన్ని చూడగలుగుతారు .ఒక సారి ఈ దృష్టి లభిస్తే ఇక ద్రష్ట ,దృష్టి,దర్శన భేదం ఉండదు .దీనినేలలితా సహస్రనామ స్తోత్రం 75వ శ్లోకం లో తెలుసుకోగలం
‘’విశ్వాధీకా ,వేద వేద్యా ,వింధ్యాచల నివాసినీ –విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసినీ ‘’
భూమి , నీరు కాంతి ,వాయువు ,ఆకాశం రూపం లో మన కంటికి కనిపించేదంతా విశ్వమే .స్పర్శ రూపం రసం గంధం దీని లక్షణాలు .పరమేశ్వరి విశ్వం లోనే ఉంది .భిన్నంగా ఉంది .పాంచ భౌతిక ప్రాణులు,తమ చర్మ చక్షువులద్వారా ముందూ వెనకా పైనా కిందా బయట లోపల సర్వత్రా వ్యాపించి ఉన్నఆ దివ్య స్వరూపాన్నిచూదలేవు .అందుకే ఆమె ‘’విశ్వాధికా ‘’.విశ్ అనే ధాతువు నుంచి విశ్వం అనే శబ్దమేర్పడింది .దీని అర్ధం ‘’ప్రవేశించటం ‘’.అంటే దేనిలో కనిపించే వస్తువులన్నీ ప్రవేశిస్తాయో అదే విశ్వం .కాని శ్రీదేవి దివ్య రూపానికి ఏ వస్తువూ ఆధారంగా ఉండదు .అన్నిటినీ దరి౦చే ధాత్రి అంటే భూమికి ఒక పాత్ర కాని సందాని౦చేదికాని అవసరం లేదు .అలాంటి ఏ వస్తువులోనూ ఆమె ఇమడదు .ఆమె సర్వత్ర ,సర్వస్వ ,,సర్వోపరి ,.అందుకే ఆమెను ‘’విశ్వాధిక ‘’అన్నారు .
బాగానే ఉంది వేదాంతం .మరి ఆమెను తెలుసుకొనే ఉపాయం లేదా ?అంటే ఉంది .అదే ‘’తెలుసుకో ‘’,’’అర్ధం చేసుకో ‘’,’’చూడు ‘’,’’పరీక్షించు ‘’.ఇదొక్కటే ఉపాయం .ఈజిజ్ఞాస వేదాలలో వేల రుక్కులలో ఛందస్సుల,స్పందనల రూపం లో ఉన్నది .ఎవరు యెంత ప్రయత్నిస్తే వారికి ఆ పరతత్వం అంతగా హృదయ గతం అవుతుంది .తెలుసుకొనే ,గుర్తుపట్టే ఈ దీర్ఘ మార్గం తప్పలక్ష్యం చేరటానికి మరొక షార్ట్ కట్ దగ్గర దారి లేదు .తెలుసుకోవటం ద్వారానే ఆమె తెలియబడుతుంది అంటే వెల్లడవుతుంది .వేదం ద్వారానే ఆమె వేద్య అంటే తెలియ బడుతుంది .కనుకనే’’ వేద వేద్య’’ అయింది .ఈ సుదీర్ఘ యాత్ర తనకు ఏమీ తెలియదన్న అనుభవం తోనే మొదలౌతుంది .నాకేమీ తెలియదు .తెలిసింది అంతా అసత్యమే అనేది ముందు తెలుసుకోవాలి .నిజమైన జ్ఞానం ఏమిటి అనే ప్రశ్న రావాలి .దేన్నీ తెలుసుకొంటే సర్వమూ తెలుస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి .అప్పుడే జ్ఞానాన్వేషణ నిజంగా ప్రారంభమైనట్లు లెక్క .
ఈ జ్ఞాన లాలస కు ముందు జ్ఞాన మీమాంస దశ ఒకటి ఉంది .ఈ దశ మీదనే ‘’వింధ్యాచలం ‘’మీద నివసించే ‘’విశ్వాధిక ‘’అయిన దేవి శాసనం ఉంటుంది .’’వింధ్యాచల నివాసినీ’’అనే దేవి నామం .ఈ సాధనాన్నే స్పష్టం చేస్తుంది .ఇక్కడ వింధ్యా చలం అంటే మనం అనుకొనే వింధ్య పర్వతం కాదు .ఇది సాంకేతిక పదం .వి౦దతి ,ధ్యాయతి అనే రెండు క్రియల అందమైన కలయిక ఇది వి౦దతి అనే క్రియకు పొందుతాడు అని ,లక్ష్య సిద్ధి కలుగుతుంది అనే గొప్ప నమ్మకం కలిగిస్తుంది .ధ్యాయతి క్రియకు శ్రద్ధ పెడితే ,ధ్యానం ఏకాగ్రత పెడితే అని అర్ధం .కనుక ఈ జ్ఞానప్రాప్తి కి ఈ రెండూ సాధనాలను సూచిస్తుంది .భౌగోళికంగా వింధ్యాచలం హిమాలయాలకు ,మలయపర్వతానికి మధ్య ఉంటుంది .హిమాచలం మంచుకు ,ఉన్నతికి,ఉదాత్తతకు , సాత్వికతకు ప్రతి రూపం .ఇక్కడికి ఎంతో కష్టపడితే కాని చేరటం సాధ్యం కాదు .కాని దాని మాదకత ,మధురిమలను మలయాచల మంద పవనాలు తెలుపుతాయి .మలయాచల మంజులత్వం హిమాచల మహిమ వైపుకు ప్రేరేపిస్తుంది .మధ్యలో ఉన్న వింధ్యాచలం ఈ ప్రేరణకు శ్రద్ధను జోడిస్తుంది .కనుక వింధ్యాచలం ప్రాప్తికీ ,ధారణకు కేంద్రం ,పరమార్ధ సాధనకు ఉపకరించే ధ్యాన పీఠం.ఇదే పరమేశ్వరి నివాసం .వింధ్యాచలం బయట భూమిపై ఉన్న పర్వతమే కాదు మనిషి లోపలకూడా ఉంటుంది బాహ్య ధ్యానం లోపలి వైపు కేంద్రీకృతమైతే ధ్యాన పీఠంజ్ఞాన పీఠంఅవుతుంది .కనుక ధ్యానం వల్లనే జ్ఞానం లభిస్తుంది అనిఅర్ధం .ఈ జ్ఞానమే పరమేశ్వరిని గుర్తింప జేస్తుంది అని భావం .
పరమేశ్వరి ధ్యాన జ్ఞాన కర్మ ధర్మ పుణ్య పాప సత్ అసత్ అన్నిటినీ విధించే ‘’విధాత్రి ‘’ఆమె వేదమాత ,వేదజనని విధానాన్ని ఏర్పరచటం ,జ్ఞానమార్గాన్ని సుగమనం చేయటం ఆమె పనే .సృష్టి రహస్యమంతా తెలిసిన సృష్టి కర్త్రి ఆమె .ఆమె కృప ఉంటే తెలుసుకోవాలనుకొనేవారికి సహాయం లభిస్తుంది .వేదాలలో జ్ఞాన విజ్ఞానాల భాండారం అనంతం గా ఉంది .అదంతా అక్షర మయం .వేదమాత దయ ఉంటేనే సాధారణ అక్షరం అక్షర నిధి అవుతుంది .గాయత్రీ మంత్రాన్ని కూడా వేదమాత అంటారు .తన గుణాలను గానంచేసే సాధకుల రక్షణ గాయత్రీ మంత్రం లక్షణం .సాధన యెంత గాఢంగా ఉంటే సిద్ధి అంత సులభం. వేదమాత శ్రీమాత సహాయం సాధనలో స్థైర్యాన్ని పెంచుతుంది .
తరువాత నామం ‘’విష్ణు మాయ ‘’.ప్రపంచం, పరమాత్మ అంతా మాయ అంటాం .మాయ అంటే హద్దు . మన జ్ఞాన క్షేత్రం పరిమితమైతే మాయే పని చేస్తుంది .ఈ హద్దు దాటి మనం పోలేము .ఇదే మాయామాత లీల .పరమాత్మ కూడా ఈ మాయామయి బారిన పడుతూ ఉంటాడు .పరమేశ్వరి మాయలో పడిన పరమాత్మ మానవ రూపం ధరించి మనలాగే సుఖాలు దుఖాలు ,రాగ ద్వేషాలు మొదలైన ద్వంద్వాలు అనుభవిస్తాడు .అలౌకిక శక్తి సంపన్నులైన అవతార పురుషుల విషయమే ఇలా ఉంటే ,సాధారణ పురుషులు ఆడవారు చెప్పినట్టల్లా ఆడటం లో వింత ఏముంది ?పరమేశ్వరి మహా మాయ అంశం .లోకం లో స్త్రీల౦దరిలో కొద్దో గొప్పో ఉంటుంది .మాయవల్ల లోక కల్యాణం కూడా జరుగవచ్చు .మాయా మమతల ప్రభావం వలన ప్రపంచం నడుస్తుంది .దీన్ని కూడా శ్రీ దేవి ప్రసాదం గా భావి౦చి,స్వేకరిస్తే ,ఈ మాయా తరంగం మన శరీరాన్ని ,మనసును రంజింప జేస్తూ ,పైపై ను౦ డేదాటి పోతుంది .అందుకే ఇది విష్ణుమాయ .విష్ణువు విశ్వ వ్యాపి అయితే ,మాయ కూడా విశ్వ వ్యాప్తమే కదా .నిజానికి శ్రీమాతయే మాయ .మాయ మమతామయ రూపం .
అయితే మాయ ఎందుకు ?ఎందుకంటె అది లీల .ఈ ప్రపంచం అంతా ప్రేమ శ్రద్ధ ,విశ్వాసం ,మాయ ,మమత మొదలైన దైవీ భావనల లీలయే .జగజ్జననికి కూడా ఈ మాయలో ఒక అనిర్వచనీయ ఆనందం లభిస్తుంది .ఈ సమస్త జగత్త౦తాఎవరి లీలా స్థలమో ,ఆమె లీలావిలాసమే అక్కడ అణువణువులో విలసిల్లుతుంది .సంసార జీవితం లోని ప్రతి ఘటనలో ఈ లీలామయ లాలన వలన లాలిత్య పూర్ణ విలాసమే గోచరిస్తుంది .శ్లోకం లోని చివరి నామం ‘’విలాసిని ‘’లలితా పరమేశ్వరి యొక్క ఈ విలాసమయ స్వరూపాన్నే సూచిస్తుంది .
అయితే తెలుసుకోవాల్సిన అసలు రహస్యం ఒకటి ఉన్నది .విశ్వ కళా విలాసిని అయిన శ్రీదేవి లీలాదామం మన శరీరమే .మానవ శరీరం అశాశ్వతమే అయినా శాశ్వత సత్య సాత్విక కాంతిని తనలో ఇముడ్చుకొని ఉంటుంది .శరీరాన్ని క్షేత్రమనీ ,శరీరం లో నివశించే శరీర ధారిని క్షేత్రజ్ఞుడు అనీ అంటారు .ఈ శరీరాన్ని అందులో ఉండే వాడినీ కూడా సృష్టించిన మూల శక్తియే క్షేత్ర క్షేత్రజ్ఞుల పాలనా పోషణా చేస్తుంది .ఈ క్షేత్రేశ్వరి వర్ణన తరువాత శ్లోకం లో వస్తుంది . సశేషం
ఆధారం –డా .శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’.
శరన్నవ రాత్రి శుభాకాక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-18-ఉయ్యూరు
—

