గౌతమీ మహాత్మ్యం—73-104-భీమేశ్వరతీర్ధం

ఋషి సత్రం అని ప్రసిద్ధి చెందిన భీమేశ్వర తీర్ధం గురించి నారదుని బ్రహ్మ వివరించాడు .గంగను సప్తరుషులు ఏడుపాయలుగా విభజించారు.దక్షిణ దిక్కులో వాషిస్టీ,ఉత్తరాన వైశ్వా మిత్రీ , దీనికి ఉత్తరాన కామ దేవీ ,మధ్యలో శుభప్రద గౌతమీ ఏర్పడ్డాయి .తర్వాత భరద్వాజీ ,ఇంకోటి ఆత్రేయి ఏర్పడ్డాయి .చివరది జామదగ్ని ..త్రికాల దర్శులైన ఆ సప్తర్షులు మహా సత్రయాగం ప్రారంభించగా ,దేవతల శత్రువు విశ్వరూపుడు అక్కడికి వచ్చి ఋషులను పూజించి ‘’దేవతలను జయించే అజేయుడైనపుత్రుడు నాకు ఎలాకలుగు తాడో చెప్పండి ‘’అని అడిగాడు .విశ్వామిత్రుడు ‘’కర్మ వలన ఫలితాలు కలుగుతాయి .మూడు కారణాలలో కర్మ మొదటిది .తర్వాత కర్త .కారణాలు ఎక్కువకాగా కర్మలకు కారణత్వం చెప్పారు .కర్మకు రెండు ఫలాలు .ఒకటి భావం రెండు అభావం .కర్మ ఫలం కర్మా దీనం .కర్మ రెండు విధాలు .ఒకటి చేయబడు తున్నది ,రెండు చేయబడినది .విచక్షణ కలవాడు కర్మ చేస్తూ దేన్ని భావిస్తాడో దానికనుకూలమైన ఫలితం పొందుతాడు .భావన లేని కర్మ విరుద్ధ ఫలితాలనిస్తుంది .కనుక తపస్సు ,వ్రతం ,దానం ,జపం ,యజ్ఞం మొదలైన క్రియలు భావాన్ని బట్టి కర్మాను సారంగా ఫలితాలనిస్తాయి .కనుక భావాను రూప కర్మ ఫలమిస్తుంది ‘’

   ‘’భావం మూడు రకాలు .సాత్వికం రాజసం తామసం .కర్మల స్థితి విచిత్రంగా ఉంటుంది .భావనతో కర్మ చేయాలి .యజమాని ఫలం ప్రకారం ప్రవర్తిస్తే ,ఫలదాతకూడా అలాగే స్పందిస్తాడు .నిజంగా అక్కడ కర్మ చేసే వాడు లేడు.అంటే స్వాతంత్ర్యం లేదు .అతని స్వభావాన్ని బట్టి కర్మ చేస్తాడు .అదే ఉపాదానం మొదలైన కారణాల చేత ,సత్వాది గుణ భేదం వలన కర్మ చేస్తాడు .భావాన్ని బట్టి కర్మ చేయటం జరుగు తుంది .ధర్మార్ధ కామ మోక్షాలకు కర్మమే కారణం .భావ స్థిత కర్మ ముక్తి నివ్వచ్చు ,బంధాలను కలిగించవచ్చు .ఒక పదార్ధం భావ భేదాలవలన వేర్వేరుగా కనిపిస్తుంది .కనుక భావం చాలా విశిష్ట మైనది .’’అని వివరించాడు .

  అంతా విని విశ్వ రూపుడు తామస భావాన్ని ఆశ్రయించి తపస్సు చేశాడు .మునులు వారించినా వినకుండా ఘోర తపస్సు చేశాడు .భీషణ అగ్ని గుండం లో భీషణ అగ్నిహోత్రం లో హవనం చేశాడు .హృదయం లో దారుణమైన పురుషుని ధ్యానించి తపస్సు చేశాడు .అప్పుడు అశరీరవాణి ‘’శివుడు లేకుండా వృత్రుడు ఆత్మను జయించలేదు .విశ్వరూపుడు వ్యర్ధంగా ఆత్మను అగ్ని హోత్రం లో సమర్పిస్తాడు .అతడే ఇంద్ర వరుణ,అతడే సర్వం అవుగాక వృజునుని కొడుకు ఆత్మను వదిలి జటనుఆత్రమే ఆహుతిచ్చాడు వృత్రుడే వృజినుడు అన్నది వేదం .జగదీశ్వరుడైన భీముని మహిమలు ఎన్నలేము ‘’అన్నది .మహర్షులు భీమేశ్వరస్వామికి నమస్కరించి తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు .భీమ రూపుడు ,మహాభీముడు ,భీమకర్త ,భీమ భావుడు అయిన విశ్వ రూపుడు భీమతనువును ధ్యానించి ఆత్మను హవనం చేశాడు .కనుకనే పురాణాలలో భీమేశ్వరుడు దేవుడుగా చెప్పబడ్డాడు .ఈ తీర్ధం లో చేసే సకలం మహా ఫలవంతమైనది .గోదావరీ –సముద్ర సంగమ స్థాన స్నానం విశేష పుణ్యప్రదం .పరబ్రహ్మ స్వరూపుడైన భీమేశ్వర దర్శనం పునరావృత్తి జన్మరహితం అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

105-గంగా సాగర సంగమ తీర్ధం

దేవతలకు వంద్యురాలు .మునులు మరుద్గణాలచేత స్తుతి౦పబడిన  గోదావరి పూర్వ సముద్రం లో సంగమించింది .జాబాలి యాజ్ఞవల్క్యుడు క్రతువు అంగీరసుడు ,దక్షుడు ,మరీచుడు వైష్ణవుడు ,శాతా తపుడు,శౌనకుడు దేవారతుడు   భ్రుగువు,అగ్ని వేశుడు,అత్రి మరీచి ,మనువు గౌతముడు కౌశిక తుంబుర పర్వత అగస్త్య ,మార్కండేయ పిప్పల ,గాలవ వామదేవ ,భార్గవ మొదలైన మహామహులంతా గౌతమిని స్తుతిస్తారు .శివ కేశవులు వీరికి దర్శనమిచ్చారు .ద్వాదశాదిత్యులు ,అష్టవసువులు ,సప్త మరుత్తులు ,లోకపాలురు హరిహరులను  స్తుతిస్తారు .మహేశ్వరుడు ఉన్న చోట మాధవుడు రమాదేవితో ఉంటాడు .బ్రహ్మేశ్వరుడు అనే శివుని బ్రహ్మ స్థాపించాడు .చక్రపాణి కూడా బ్రహ్మ స్థాపించినవాడే .సోమేశ్వరుడున్న చోటు సోమ తీర్ధం .ఇదికాక ఇంద్రతీర్ధం ,హయ మూర్ధక తీర్ధం ఉన్నాయి హయ శిరసుతో విష్ణు మూర్తి ఉంటాడు .సకల దేవతలు ఇక్కడే ఉంటారు .

  సోమశ్రవం అనే ఇంద్రుని యజ్ఞం లో దేవతలు ,ఋషులు ‘’సోమా !ఇంద్రుని రక్షించు .సప్త దిక్కులు బహు ఆదిత్యులతో కలిసి మాకు రక్షణ నివ్వు .నీ హవిస్సు మాకు రక్ష .శత్రువు మమ్మల్ని మించకుండా చేయి .చంద్రా ఇంద్ర రక్షణ చేయి ‘’అనగా యజ్ఞం పూర్తయింది .ఇదే సోమ తీర్ధం. దీనికిముందున్నది  ఆగ్నేయ తీర్ధం .అగ్ని మహా యజ్ఞం చేశాడుకనుక ఆపేరు .వేదిమయుడైన ఆదిత్యుడు హరిహర బ్రహ్మలను నిత్యం వచ్చి దర్శిస్తాడు  .ఇక్కడ మధ్యాహ్న నమస్కారం శ్రేష్టం .దీని తర్వాతది బార్హత్పత్య తీర్ధం .బృహస్పతి ఇక్కడ యజ్ఞం చేశాడు .ఇంద్ర గోప పర్వతం పై మహాలింగం ప్రతిస్టితమైంది .దీనికి హిమాలయసంబంధం ఉండటం వలన  అద్రి తీర్ధం అంటారు .గౌతమి తీరాన ఉన్న సకల తీర్దాలు మహిమాన్వితమైనవే .గౌతమీనది సర్వకాలాలలో పుణ్యప్రదం ,కీర్తనీయం అన్నాడు నారద మహర్షి తో బ్రహ్మ దేవుడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-11-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.