నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం
గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు చి శిస్టుసత్యరాజేష్ పని రాక్షసుడు .ఆలోచనాపరుడు .భిన్నత్వం నవీనత్వం కోరేవాడు .అందుకే డొక్కా సీతమ్మ గారిపై గజల్ ,మణిపూసలు ,ఇస్ట పదులు , కైతికాలు ,వచనకవిత్వం అనే పంచ ప్రక్రియలతో 80మంది వివిధ ప్రాంతకవులతో రాయించి ముద్రించి విజయవాడ లో ఈ నెల 9న ఆవిష్కరణ జరిపించిన పట్టుదల అతనిది .ఆసభలో అధ్యక్షస్థానం నాకు గౌరవంగా ఇచ్చినా ,నేను హైదారాబాద్ లో ఉండటం వల్ల ఆ అదృష్టం నాకు దక్కలేదు .ఆవిష్కరణ ఘనంగా జరిగి పుస్తకాలు నాకు పంపగా నిన్ననే అందాయి .ఇప్పుడే చదివే సమయం దొరికి ,చదివి ,,నా స్పందన రాస్తున్నాను .
‘’బువ్వన్న’’గారమ్మాయి, ‘’డొక్కావారి’’ కోడలు సీతమ్మతల్లి అలుపు సొలుపు లేకుండా ,డొక్క మాడే ,జనాలకు పిలిచి బువ్వ వండి పెట్టి ఆ రెండు పేర్లకు సార్ధకత చేకూర్చిన అమ్మ సాధ్విసీతమ్మ.ఆ చరిత్ర ఇంటింటా సుమారు వందేళ్ళ క్రితం మారు మోగి,ఇప్పుడు అదృశ్యమైంది కాలవైపరీత్యం వలన ..ఆకలికి కులం గోత్రం ఏమీ లేవు అని నమ్మి ఆచరణలో చూపిన సాధ్వీమతల్లి . సీతమ్మ దంపతులు ఎన్నో పెళ్ళిళ్ళు చేయించారు .భర్త జోగన్నగారు పశువులకు వచ్చే గాళ్ళ వ్యాదుఅకు చికిత్స చేసేవారు .నయం కాగానే తమ పచ్చిక బీళ్ళలో మేపే ఏర్పాటు చేసేవారు నయంయ్యాక పంపించేవారు ..ఆ దంపతులకు మనుషులలోనేకాదుపశు పక్ష్యాదులలోనూ దైవం కనిపించేవాడు .మొదటిసారిగా పొలాలలో మినుము ,పెసర పండించిన కర్షకులువారు .కొబ్బరి మామిడి చెట్లు కూడా మొదట వారే వేసి పెంఛి కోనసీమ అందాలకు మార్గ దర్శులయ్యారు .మంచినీటి బావులు అనేక౦ త్రవ్వించి త్రాగునీటి వసతి కలిపించిన అపర భగీరదులు .సీతమ్మగారు త్రవ్వించిన మంచి నీటి బావి ‘’పేరూరు ‘’అగ్రహారం లో ఇప్పటికీ సాక్షిగా ఉన్నది .ఎన్ని రహదారి సౌకర్యాలు ఏర్పడినా 1909లో సీతమ్మగారు మరణించేదాకా ఆ ఇంట అన్నదానం అక్షయంగా నిరతాన్నదానంగా కొనసాగింది మళ్ళీ సీతమ్మ చరితను నేటి తరానినికి అందించేతలపుతో నవ యువ కవులచేత కవిత్వం రాయించి ప్రచురించటం అమృతోపమానమే .రాజేష్ కృషికి ,రాసిన కవులకు అభినందనలు .
లాంతరుపట్టుకొని అర్ధరాత్రి ఎవరైనా బాటసారులు రేవులో దిగారేమో అని వెళ్లి చూసి ఇంటికి వచ్చి అప్పుడు పట్టెడన్నం తిన్న అమ్మ .కడుపు ఆకలి అమ్మకే తెలుస్తుంది .’’అమ్మా !సీతమ్మ తల్లీ ఇక్కడ వరదలో చిక్కుకు పోయానమ్మా ‘’అని హరిజనుడు పొలికేక పెడితేత,ఆగొంతు ‘’వెంకట్రాముడిది ‘’అని గుర్తించి భర్తకు అన్నం కూరలు ,ఆవకాయ మూటకట్టించి,పొగాకు కాడ కూడా ఇచ్చి భర్తను గోదావరిలో ఈదుకు వెళ్లి ఇచ్చిరమ్మంటే ఇచ్చి వచ్చిన పుణ్య దాంపత్యం వారిది .తర్వాతెప్పుడో ఊర్లోకి వచ్చి ‘’అమ్మా !నువ్వు చేసిన ఉపకారానికి నా చర్మం చెప్పులు కుట్టి ఇచ్చినా మీఋణం తీరదు ‘’అని కన్నీటితో అమ్మ పాదాలకు అభి షేకం చేశాడతడు ..ఇలాంటి కథలు గాధలు కోకొల్లలు .ఉప్పొంగి పోయారు జనం గోదారి వరదలాగా .ఆ అమ్మ సన్నిధిలో అందరూ అమృతం తిని ధన్యులయ్యారు .ఈ సంకలనం లో నాకు నచ్చిన కొన్ని లైన్లు మీ ముందుంచుతాను .
‘’గాజుల చేతికి గరిటయె అందం,ఆన౦దమంది –ఆస్తులు వద్దని ఆకలి తీర్చెను సీతమ్మతల్లి ‘’అన్నది గజల్ లో రాదికారాణి .కైతికాలలో రాజేష్ ‘’ఆకలి తీర్చి తల్లిలా –తూర్పు దిక్కుకే దీపానివై –తెలుగు నేల వెలిగావు ‘’అని ప్రస్తుతించాడు .’’బ్రిటిష్ చక్రవర్తి నాడు –దేవతగా తలచినాడు –పాదాలకు (చిత్రపటానికి )ప్రణమిల్లి –సి౦హాసన మెక్కినాడు ‘’అని మణిపూసలతో కవితాహారమల్లింది .’’భారతీయత ఆత్మరూపం ఆ ఇల్లాలు నమ్మకం ‘’అంది గజల్ లో ఉమాదేవి .’’గోదావరి ప్రవాహ ఝరిఅతలాకుతలం చేసినా ,-వరద గోదావరి ఉధృతి లో ఎదురీదినా -అమ్మ చేతి భోజనానికి కొదవలేదు .ఆమె కీర్తి ఇంగ్లాండ్ కు గోదావరి వరద లా పయనించింది ‘’అని వందనం చేసింది పుట్టి నాగలక్ష్మి వచనకవిత్వం లో . శేర్ భారతీ మూర్తి ‘’తనను తాను మలచుకొన్న తరుణీమణి-విశ్వమానవతకు అద్దంపట్టింది’’అన్నది .’’ఉభయ గోదావరి జిల్లాప్రజల గుండెల్లో –నిండుగా అభిమానం పొంగించిన అన్నపూర్ణ ‘’అంటుంది కొలచన విజయభారతి .అనితర సాధ్యమైన సీతమ్మ ఆతిధ్యాన్న్ని ‘’యెంత మందికైనా సరిపోదు అనేది లేదు –యెంత శ్రమకైనా వెనుకాడేది లేదు ‘’అని కీర్తించింది .’’కోనసీమ బియ్యపు గింజ దేదీప్యమానమై పరిమళించింది ‘’అని సేవకు చిరునామాగా ఆమెను వర్ణించి సేవాపరిమళ వ్యాప్తి కలిగించాడు బివివి సత్యనారాయణ .మల్లే విజయలక్ష్మి మరింత అందంగా ,’’చిరునవ్వు చెదరదు –చేయి ఖాళీగాదు-జారే నుదుటి చెమట బిందువులను –భక్తిగా దాచుకొంటు౦ది ఆమె చీరకొంగు –సిరికీ సీతమ్మకూ చెలిమేగా కొదువెక్కడిది ‘’అని సహజ సుందరం గా తెలుగింటి ఇల్లాలుగా ‘’ ‘’అవతరించింది అంటుంది .’’వండనలయదు వేవురు వచ్చి రేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’ ‘అని ప్రవరుని ఇల్లాలును ప్రస్తుతించిన పెద్దన మను చరిత్ర పద్యం గుర్తుకు తెచ్చింది .’’సంస్కారవంతమైన పనికి చదువు సంధ్యలు ఏమాత్రం అడ్డురావు ‘’అని అమ్మ నిరూపించినట్లు వరాహగిరి కృష్ణమోహన్ అభిప్రాయం.
‘’అన్నార్తులాకలి మంటలార్పగ –ముంజేతి కంకణమై ‘’భాసించింది అన్నాడు ఆకుల మల్లికార్జున.’’లక్ష్మీ పార్వతుల కలయిక సీతమ్మ ‘’అంటుంది ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి .’’శుభకార్యాలాకు విరాళాలిచ్చిన మాతృ మూర్తిగా’’చెప్పాడు జక్కు కృష్ణమూర్తి గౌడ్ .’’అన్నం కోరుకొనే ప్రతి మనిషి –ఆమెకు నారాయణుడు ,అల్లా ,జీసెస్ ‘’అని ఆమె ఎల్లలులేని మానవత్వానికి నీరాజనం పట్టాడు కొంపెల్ల కామేశ్వరరావు .వి రాజ్య లక్ష్మి ‘’నిత్యాన్న దానాల గన్నవరం లంకనే –‘’అన్న’’వరం గా మార్చిన దయామయి అంటుంది .సీతమ్మ చేయి ‘’అక్షయ పాత్ర ‘’అంటాడు పవిత్రంగా కొల్లాబత్తుల చక్రపాణి .చెరుకు పల్లి గాంగేయ శాస్త్రీ కి. ‘’అమ్మ చేతి గరిటయెనలేని ఆభరణం ‘’గా ఉందని పించింది .’’గోదావరి ఘోష తెలుగు నేలలో వినిపించినతకాలం ‘’సీతమ్మ పేరు తెలుగు గుండెల్లో శాశ్వతం అంటాడు బత్తులూరి నాగబ్రహ్మా చారి .నిర్మలా౦త రంగ సీతమ్మ’’అన్నపూర్ణ –రామదాసు కీర్తనల సీతమ్మ –త్యాగయ్య కృతుల సీతమ్మగా ‘’దృశ్యమానమైంది .’’భారతీయ ఉదారతకు చలువ పందిరి సీతమ్మ ‘’గా కనిపించింది వడలి రాధాకృష్ణకు .’’రామాయణం లో రమణీయం సీతమ్మ ‘’అని ఆమె ఆతిధ్య రామణీయకానికి మురిసిపోయాడు జి.నాగరాజు .ఇలా అందరూ తమ బావాలను తేటతెల్లం గా తమదైన రీతిగా వర్ణించి సీతమ్మగారి వదాన్యతకు అక్షర నీరాజనమిచ్చారు .అయితే పద్యాలు కూడా ఉండి ఉంటె నిండుగా ఉండేదనిపించింది .కావాలనే వదిలేసి ఉండచ్చుకూడా .ముఖ చిత్రంగా సీతమ్మ తల్లి తెల్లటి శుభ్రవస్త్రాలతో దర్శనమిస్తే ,చివరికవర్ పేజీలో సీతమ్మగారి నుంచి అయిదు తరాల వంశ వృక్షం చూపటం నిండుగా ఉంది .లోపలి పేజీలలో ఆమె నివసించిన ఆనాటి ఇల్లు ,దాన్ని బాగు చేయించి మార్పు తెచ్చిన ఇల్లు, ఈమార్పుకు కారణమైన ఇనిమనవడు కీ శే డొక్కా సత్యనారాయణ గారి చిత్రాలతో పుస్తకం శోభిల్లింది .రాజేష్ కృషి ఫలించి మంచి రూపు దాల్చింది .దీనికి కారకులైన వారందరికీ రాజేష్ తో పాటు అభినందనలు .మరిన్ని మంచి పుస్తకాలు’’ గోరసం ‘’వెలువరించి కవితా గోక్షీరం తో తనియి౦ప జేయాలని కోరుతున్నాను
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-19-ఉయ్యూరు



