మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ
పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర స్త్రీ .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే పనిలో ఉండేది .స్వామి నైవేద్యానికి అల్లం ,ఇంగువ నెయ్యి మసాలావస్తువులుకలిపి’’ కిచిడీ అన్నం ‘’తయారు చేసేది .ఇది హిందూస్తానీయులకు అత్యంత ఇష్టమైనది .దీనినే స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదన చేసేది .
కర్మాబాయి కీర్తి బాగా వ్యాపించగా ఒక రోజు ఒక బైరాగి ఆమె ఇంటికి భిక్షకు వచ్చాడు. సర్వ సద్గుణ శీలి యైన ఆమెను చూసి మహాదానందపడ్డాడు .కాని ఆమె ఏ ఆచారాన్ని పాటించకుండా స్వామి ప్రాసాదం తయారు చేయటం చూసి బాధ, కోపం వచ్చి ,సదాచార విధానం బోధించి ఇకనుండి తాను చెప్పినట్లే చేయమని హితవు చెప్పాడు .మర్నాడు బైరాగి చెప్పిన ఆచార విధానం అంతాపాటించి ప్రసాదం తయారు చేసే సరికి రెండుజాములయింది .కర్మాబాయి ఇంటికి జగన్నథ స్వామి వచ్చి ప్రసాదం తింటాడని ప్రజలలో ఒక గొప్ప నమ్మకం ఉండేది .ఆ రోజుకూడా అలానే వచ్చాడు స్వామి .ఆలస్యమైందని కంగారు పడుతూ బాధపడుతూ స్వామికి ప్రసాదం వడ్డించింది .ఆయనా ఆలస్యమైందని ఆఘమేఘాలమీద తిని ప్రక్షాళనం అంటే నోరు కడుక్కోకుండా మందిరానికి వెళ్ళాడు.
జగన్నాథ మందిర అర్చకస్వాములు స్వామి నోటికి కిచిడీ అన్నం మెతుకులు అంటి ఉండటం గమనించి ‘’పరాత్పరా !ఏ పవిత్ర గృహం పావనం చేసి విందు ఆరగించి జీవితం ధన్యం చేశావు స్వామీ ,మూడులోకాల్లోనూ ఆ పుణ్యమూర్తి ధన్య మూర్తి ‘’అన్నారు.
భక్త సులభుడు జగన్నాథుడు ‘’భక్తులారా !నన్ను సేవించింది పుణ్య చరిత కర్మాబాయీజీ .ప్రతిరోజూ మధ్యాహ్నం కాకుండానే నాకు కిచిడీ ప్రసాదం చేసి వడ్డిస్తుంది .ఈ రోజు ఒక సన్యాసి చెప్పిన మాటలు విని ఆచారం తో ప్రాసాదం చేయటానికి మధ్యాహ్న సమయం దాటింది .ఆమె చేతి ప్రసాదం తింటేకాని నేను వేరే ప్రసాదం స్వీకరించను .ఇవాళకూడా ఆమె ఇంట అన్నప్రసాదం తిని ఆలస్యమైందని, ‘’దేవి’’ నాకోసం ఎదురు చూస్తుందని పరుగుపరుగున వచ్చేశాను .మీరు ఆమె ఇంటికి వెళ్లి, రేపటి నుంచి ఆమె ఇదివరకు ఎలా ప్రసాదం చేసేదో అలానే తయారు చేయమని చెప్పండి ‘’అన్నాడు జగత్ప్రభువు స్వామి .
ఈవిషయం వారు కర్మాబాయీజికి ఇంటికి వెళ్లి తెలియజేశారు .ఆమె చాలా సంతోషించి అటుపై పూర్వంలాగానే ఆచారం పాటించ కుండా స్వామికి కిచిడీ అన్నం ప్రసాదం చేసి వడ్డించింది .ఈ విషయం తెలిసిన బైరాగి స్వామి ఒక రోజు ఆమె ఇంటికి వచ్చి ‘’అమ్మా !నీ మహత్తు తెలియకుండా నీకు సుద్దులు చెప్పాను .ఆచారాలతో స్వామికి కష్టం కలిగించేట్లు చేశాను .నువ్వూ ,స్వామీ నన్ను మన్నించాలి ‘’అని ప్రాధేయపడ్డాడు .నిష్కల్మష భక్తిమహిమ వెళ్ళ డించటానికి జగన్నాథుడు చేసిన లీల ఇది .కర్మాబాయీజీ కర్మ పరిపక్వమై 25-7-1634 న 29ఏళ్ళ వయసులోనే జగన్నాథ సన్నిధి చేరింది . భక్త శిఖామణి అయిన కర్మాబాయిజీ పై ఒక జానపద గీతం ప్రచారం లో ఉంది .’’ Thali bhar’r lyayi khichado upar ghee ki batki !
Jeemo mhara syam dhani jeemavai beti Jat ki !!
కర్మాబాయి స్మరణార్ధం ఇప్పటికీ జగన్నాథ దేవాలయం లో కిచిడీ (ఖేచరాన్నం )తయారు చేసి బంగారు పళ్ళెం లో పెట్టి స్వామికి భోగం చేస్తుంటారు .ఎంగిలి ,అంటూ పూరీ జగన్నాథ మందిరం లో ప్రసాదాన్ని అంటుకోవు .అంతా పవిత్రమే అందుకే ‘’సర్వం అగన్నాథం ‘’అంటారు .కర్మాబాయి అంతకరణ విశుద్ధమైనది .అనురాగ భక్తిభావ రంజితమైంది .అక్కడ ఇక దేనికీ స్థానం లేదు .శుభ్రమైన హృదయం లో భక్తి పరిమళిస్తుంది .అందులోంచి పొ౦గి పొరలే అనురాగం పై ,క్షీర సాగర శయనుడు డోలలాడుతాడు.
ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

