ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2
చారిత్రిక ప్రాధాన్యం
పూర్వం నుంచి ఒంటిమిట్ట ప్రాంతాన్ని పాలించిన రాజులెవరో తెలీదుకాని విజయనగర సామ్రాజ్యకాలం లో ,పొత్తపి నాటి చోళులపాలన లో కొంత వైభవం పొందింది క్రీ.శ.1556తళ్ళికోట యుద్ధం ముగిశాక పొత్తపినాటి చోళులైన’’’మట్లి వంశపు’’ రాజులు పాలిచారు .వీరికాల౦ లో ఈక్షేత్రాభి వృద్ధి బాగా జరిగింది .ఆలయం మూడు పర్యాయాలు నిర్మింపబడి నట్లు తెలుస్తోంది. గర్భ గృహం ,అంతరాలయం ,ముఖమండప గోపుర ప్రాకారాదులు వేర్వేరు కాలాలలో నిర్మించారు .
శ్రీ కృష్ణ దేవరాయల తర్వాత సవతి తమ్ముడు అచ్యుతరాయలు 12ఏళ్ళు పాలించాడు .ఆతను చనిపోయాక చిన్న పిల్లాడైన కొడుకు వేంకటపతి రాయలు కు పట్టాభి షేకం చేసి ,అచ్యుతుని బావమరది సకలం తిమ్మయ్య మంత్రిగా ఉన్నాడు .తర్వాత మేనల్లుడిని చంపించి తానే రాజుగా ప్రకటించుకొన్నాడు .ఇదిగిట్టక రాయల అల్లుడు అళియరామరాయలు లేక అరవీటి రామరాయలు సకలం తిమ్మయ్యను చంపి ,అచ్యుతుని అన్నకొడుకు సదాశివరాయలును నామమాత్రపు రాజును చేసి ,బాక్ సీట్ డ్రైవింగ్ గా రాజ్యమేలాడు .అప్పటి నుంచి అరవీటి వంశ ప్రాభవం పెరిగింది .రాజ్యం అత్యున్నత స్థితిలోకి తెచ్చినా, చివరికి నానా అల్లరి పాలై తళ్ళికోట యుద్ధం లో దక్కన్ సుల్తాను చేతిలో చనిపోయాడు .దేవాలయం లోని రెండు శాసనాలలో ఈ చరిత్ర అంతా దర్శనమిస్తుంది .ఇవి 1555 మరియు 1558కాలం శాసనాలు .
కోదండ రామాలయ శిల్ప వైభవం
గర్భాలయం ,అంతరాలయం ,ముఖ మండపాలపై విద్యానగర శిల్ప విన్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ద్వారపాలకులైన జయవిజయులు ,గరుడుని ముందున్న ప్రభు ,దేవేరుల విగ్రహాలు అంజలి ముద్రతో ఉంటాయి .గోపుర నిర్మాణం లో చోళ శైలి కనిపిస్తుంది.కిందున్న సంజీవరాయ గుడి మొదలైనవి హంపీ విఠలాలయ౦ ను పోలిఉంటాయి .అక్కడి ఇసుకతో ఉన్న యెర్ర రాయినే ,ఇక్కడా వాడారు .అక్కడి శిల్ప విన్యాసమే ఇక్కడా ఉన్నది .అంతటి బండరాళ్ళు ఎలా తెచ్చారో ఎలా కస్టపడి మలిచారో ,ఎంతటి అంకితభావం తో జీవకళ సృష్టించారో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది .పై శాసనాల కాలానికి కోదండ రామ స్వామికి ‘’శ్రీ రఘు నాయకులు ‘’అనే పేరున్నట్లు తెలుస్తోంది .
గ్రామనామం
ఒంటి మిట్ట అంటే ఒక్కటే ఐన మిట్ట.మిట్ట అంటే కొండ ,బెట్ట ,శైలం అని సమానార్దాలున్నాయి .కనుక ఏక శిలానగరం అన్నారు .ఒకప్పుడు ఇది నగర స్థాయి పొంది౦దన్నమాట..కోటలు ,బురుజులూ ఉండి,కాలక్రమంలో అంతరించి ఉండవచ్చు . పడమటి భాగం లో గొప్ప చెరువు శాసనకాలానికే ఉంది .ప్రాచీన వీరాంజనేయ గుడి చెరువు గట్టున ఉంది .ఈ కట్టపై నుంచి కాశీ ,రామేశ్వరం లకు పోవచ్చు .విశ్రాంతి సత్రాలు అన్నసత్రాలు తో పచ్చగా కళకళ లాడే ఏక శిలానగరం ప్రాభవం కోల్పోయి ఇప్పుడు గ్రామంగా నే ఉండి పోయింది .
క్షేత్రానికి వాయవ్యం లో మృకండాశ్రమ౦,ప్రక్కన సెలయేరు ఉన్నాయి .దీని ప్రక్కనే రైల్వే ట్రాక్ ఇప్పుడు వచ్చింది .సర్వేయర్ లార్డ్ మెకంజీ 160 ఏళ్ళక్రితం ఈ సంగతు లన్నీ’’ కై ఫీయత్’’ లో నమోదు చేశాడు .
ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు
1-త్రిపురాంతకుడు అనే అయ్యలరాజు తిప్పరాజు –
విద్యానగర ప్రౌఢ దేవరాయల ఆస్థానకవి అయ్యలరాజు తిప్పరాజు ఒంటిమిట్ట వాసి .రఘు వీర శతకం రాశాడు –
‘’తారుణ్యోదయ యొంటిమిట్ట రఘునాథా!నీకు నే పద్యముల్ –నూరున్ జెప్పెద ,నూరు బేరు వెలయన్ నూత్నంబుగా ,నంత నా
నోరుం బావన మౌను ,నీ కరుణ గా౦తున్ భక్తి,నన్నందరున్-రారమ్మందురు గారవించి ,రఘు వీరా ,జానకీ నాయకా ‘’
ఈతని మనుమడు అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం కావ్యం రాశాడు .
2-బమ్మెర పోతనామాత్యుడు –
మందారమకరంద భాగవతాన్ని రచించిన పుణ్యమూర్తి బమ్మెర పోతరాజు అనే పోతనామాత్యుడు ఇక్కడే ఉన్నాడు .కాలం 1405-70.తల్లి అక్కమాంబ .తండ్రి కేసనమంత్రి .శైవులు .అన్న తిప్పన .పలికించెడివాడు రామభద్రుడు అని చెప్పాడు భక్తపోతన .’’శ్రీ కైవల్య పదంబు జేరుటకు చింతించి ‘’ముముక్షు జన సేవ్యం బైన భాగవతం రాశాడు .ఫలితం భవహరం .
పోతన తెలంగాణా వాడని అక్కడి వారి అభిప్రాయం .1770లో పురాణం హయగ్రీవ శర్మగారు పోతన చరిత్రను భాగవత పీఠికలో చెప్పారు .ఆతర్వాత వందేళ్ళకు నివాసంపై వివాదమేర్పడింది.ఆంద్ర వాల్మీకి శ్రీ వావికోలనుసుబ్బారావు గారనే వాసు దాసు గారు ‘’బమ్మెర పోతన నికేతన చర్చ ‘’అనే గ్రంథం రాశారు .’’మగిడి ఏక శిలా నగరమునకు చను దెంచితిని ‘’అనటం తో భాగవత రచన చేయటానికి ఇక్కడికి వచ్చాడని తెలుస్తోంది. అప్పటికి తెలంగాణలోని బమ్మెరగ్రామం రచనకు అనుకూలంగా లేకపోవచ్చు .ఆధునిక పోతన బిరుదున్న శ్రీ వానమామలై వరదా చార్యులవారు’’ పోతన చరిత్ర ‘’కావ్యం రాశారు దశమాశ్వాసం 26వ పద్యం లో ‘’నొంటి మిట్టన్ కవి వరే ణ్యుడుంటతెలిసే ‘’
27 వ పద్యం లో –‘’నొంటిమిట్ట రాముని వర మందిరా౦గణము ముందొక పందిరి క్రి౦ద
నందరున్ ఘన దీక్ష రామగుణగాన మొనర్పెడిపుణ్య రూపునిన్ ‘’
46వ పద్యం లో –‘’ఒంటి మిట్ట లోననె వసియింప నాజ్ఞ నిడె నాకు రఘూత్తము డింక-నేను సింగన నృపతి సమ్ముఖమ్ము నకు గ్రమ్మర బమ్మెర కేగ నొల్ల ‘’
49వ పద్యం లో –‘’శ్రీరామనవమీ మహోత్సవములు నపుడె-భాగవతమ్ము రామా౦కితముగ-కృతి సమర్పణ సేయుటుచితమగును ‘’
59వ పద్యం లో –‘’అంత విప్ర జనాను జ్ఞాతు౦డై,రామ భ్ర్ర్రుత్యుం డగు సహజ పా౦ డిత్యుండు ‘’
పోతనార్యు డానందాశ్రుపూర మొల్క-వరదు పాద సన్నిధి నుంచె భాగవతము
రామగళ సూనహార మా గ్రంథము పయి-నూడి పడె గృతికాంత పెండ్లాడె ననగ’’
ఈ విషయాలనన్నిటిని విమర్శక శిఖామణులు ఆచార్యదివాకర్ల వెంకటావధాని ,రీడర్ శ్రీ పల్లా దుర్గయ్య ,పరిశోధకులు శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గట్టిగా సమర్ధించారు .
పోతనగారు వర్ణించిన ‘’మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి –నువిద చెంగట నుండ నొప్పువాడు ‘’పద్యం ఒంటిమిట్ట కోదండరాముని గురించి చెప్పినదే .దేవాలయం లో పోతన విగ్రహం ఉంది .దేవాలయం లో ‘’భాగవత తాంబూలం ‘’అనే మర్యాద ఉంది .శ్రీరామ తీర్దానికి తూర్పున ‘’పోతన మడి.’’ఉంది.శ్రీనాథమహాకవి పల్లకీ ఎక్కి పోతూ పోతనకొడుకు మడిదున్నుతుంటే ‘’హాలికులా !’’అని హాస్యమాడినచోటు , ,పోతన ఇల్లు శిదిలంకాగా అక్కడే దైవ యోగంతో మరో ఇల్లు నిర్మాణమవటం ,పోతన రామ దర్శనం పొంది కృష్ణకథ భాగవతం రాయటం ,జా౦బవాన్ శ్రీరామ శ్రీకృష్ణావతార కాలాలో ఉండటం .పోతన ఈ ఒంటిమిట్టలోనే ఉన్నాడని రుజువు చేసే సాక్ష్యాలు అంటారు ఈ చరిత్రరాసినఒంటిమిట్ట వాసి శ్రీ రామావఝల వేంకటేశ్వర్లుగారు .
ఆంద్ర వాల్మీకి కూడా తన ‘’ఆంద్ర వాల్మీకి రామయణకావ్యం ‘’లో –‘
‘’బమ్మెర పోతరాజు నిరపాయ సుఖస్థితుజేయు పొంటె,వా –క్యమ్ములనిల్పి ,భాగవత మార్ద్ర సుధారస ధార లొల్క,బూ
ర్వమ్మును-నేడు నింక సరివారలు మిన్నలు లేక యుండ ,సా –రమ్ముగ బల్కు నేక శిల రాముడు నాకు బ్రసన్నుడయ్యెడున్’’
అని పోతనామాత్యుని ఏకశిలారామభక్తి ప్రశస్తి చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-19-ఉయ్యూరుς