మనకు తెలియని మహాయోగులు—2
3-మహా విష్ణు సాక్షాత్కారం పొందిన జ్ఞానయోగి –రామయోగి -1895-1962
నెల్లూరుజిల్లా వేదాద్రి దగ్గర మోపూరులో చేవూరి రావమ్మ ,పిచ్చి రెడ్డి దంపతులకు 29-7-1895 మన్మథ నామసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం రామి రెడ్డి జన్మించాడు .పసితనం లోనే తండ్రి చనిపోతే మేనమామ దగ్గర అన్నారెడ్డి పాలెం లో పెరిగి చదువు నేర్చాడు .భాగవత రామాయణాలలోని సత్య ధర్మ దృష్టి వంట బట్టించ చుకున్నాడు .వాల్మీకి కబీరు లాగా తపోధనుడు కావాలని గంటలతరబడి ధ్యాన నిమగ్నమయ్యేవాడు .భగవత్ సాక్షాత్కారం కోసం పరితపించేవాడు .దీనికోసం రామనామ జపం తీవ్రంగా చేస్తూమనసును ఏకాగ్ర చిత్తం చేశాడు .
బాపట్ల బ్రహ్మానంద తీర్ధులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో ప్రేరణ కలిగించటం విని ,రామి రెడ్డి ఆయన్ను ఆశ్రయించి రామ తారక మంత్రోప దేశం పొందాడు .గురువు ఆదేశం తో రోజుకు అయిదు వేలసార్లు రామతారక మంత్రం జపిస్తూ జ్ఞానపిపాస ఆత్మ జిజ్ఞాసా బలీయమై మనసు వైరాగ్య పూర్ణమైంది .సర్వం త్యజించి హిమాలయాలలో ఒంటరిగా తపస్సుకు బయల్దేరితో దారిలో గుర్వాజ్ఞమేరకు వెళ్ళకుండా స్వగ్రామం వెళ్లి పచ్చని తోటలో చిన్న కుటీరం నిర్మించుకొని ఏకాంతజప ధ్యానాలను తీవ్రతరం చేశాడు .రోజూ రాత్రి ఆరుమైళ్ల దూరం లో ఉన్ననరసింహులు కొండకు వెళ్లి తపస్సు చేసి ,తెల్లారే సరికి ఆశ్రమమం చేరేవాడు
ప్రాణాయామం ,మౌనం ,యోగాసనాలు ,దుఖానుభవాలు తప్పించుకోటానికి ప్రతీకార వాంఛ లేకుండా శాంతంగా ,సహనంగా అనుభవించే తితిక్ష ,నిష్కామం సమభావం మొదలైన అష్టాంగా లతో కూడిన అష్టాంగ యోగం(అహింస ,సత్యం, అస్తేయం –అంటే ఇతరుల ద్రవ్యం పై కోరిక లేకపోవటం ,దొంగతనం లేకపోవటం ,బ్రహ్మ చర్యం ,దయ ,ఆర్జవం –అంటే అన్ని జీవరాసులపై సమభావం ,క్షమ) సాధించాడు .నిర్వికల్ప సమాధిలో ఏకం ,నిత్యం అయిన స్వస్వరూపమే మనసులో ప్రకాశించింది .కొంతకాలం రమణ మహర్షి ని గురువుగా భావించాడు .మామిడి గుహలో తపస్సు చేసి ,అన్నారెడ్డిపాలెం లో ఆశ్రమం నిర్మించుకొని,12ఏళ్ళు మౌనవ్రతం పాటించాడు .1936ఫిబ్రవరిలో రామయోగికి పల్లెపాడు ఆశ్రమం లో ‘’చతుర్భుజ శ్రీ మహా విష్ణువు సాక్షాత్కారం ‘’అనుగ్రహించి దర్శనమిచ్చాడు .రమణమహర్షి భావవ్యాప్తిని రామయోగి పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేశాడు 12-2-1962ప్లవ సంవత్సర మాఘ శుద్ధ అష్టమి సోమవారం 67వ ఏట రామయోగి విష్ణు సాయుజ్యం పొందాడు .ఒక భక్తురాలు కట్టించిన మందిరం లో సమాధి చేశారు రామయోగి జీవిత చరిత్రను తెలుగు ,ఇంగ్లీష్ లలో ఆయన భక్తురాలు తెలుగులో మొదటికవయిత్రి అయిన శ్రీమతి పొనకా కనకమ్మగారు రాశారు .
.
4-బాల్యం లోనే పార్వతీ పరమేశ్వరుల చే రామ తారక మంత్రోప దేశం పొందిన- బ్రహ్మర్షి అబ్బూరు నారాయణ స్వామి -1907-1989
గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకా ఆదర్శ గ్రామం అబ్బూరులో కొమ్మూరు గుణకయ్య,మాణిక్యమ్మ దంపతులకు నారాయణ స్వామి 18-11-1907ప్లవంగ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి గురువారం జన్మించాడు .చిన్నతనం నుంచే భాగవత రామాయణ సారాన్ని గ్రహించే నేర్పు అలవడింది .ఎనిమిదవ ఏట నిశ్చలధ్యాన మగ్నుడై ఉండగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై రామ తారకమంత్రం ఉపదేశి౦చి ,జీవితాంతం జపి౦చమని ,అవసానకాలం లో మాత్రమే అర్హుడైన భక్తుడికి ఉపదేశించమని చెప్పి ,మళ్ళీ తాను 15వ ఏట యోగి రూపం లో వచ్చి అష్టాక్షరీ మహా మంత్రోప దేశం చేస్తానని పరమ శివుడు అనుగ్రహించాడు .బడిలో చదువు గుడిలో తారకనామ జపం ఇంట్లో భగవధ్యానం నారాయణకు నిత్య కృత్యాలయ్యాయి .
తల్లి చనిపోయాక ఆధ్యాత్మిక సాధన చేస్తూనే కుల వృత్తి అయిన సన్నాయివాద్యం నేర్చి నాదోపాసనతో పరమేశ్వర సాక్షాత్కారం పొందే సాధనగా చేసుకొన్నాడు .గురువు జొన్నలగడ్డ వెంకటరామయ్య వద్ద భాగవతాది పురాణప్రవచనం చేస్తూ,పతంజలి యోగసూత్రాలనూ ఆకళింపు చేసుకొని యోగాసాధనగా ప్రయోగించుకొన్నాడు .మాదిగల ఇళ్ళకు వెళ్లి చెప్పులు కుట్టటం ,వడ్రంగుల ఇళ్ళలో కర్రపనులు నేరుస్తూ కులమతాలకు అతీతంగా మసలాడు .ఒక బ్రాహ్మణ యువకుడితో ఏర్పడిన స్నేహంతో అతని తలిదంద్రులనే గురు దంపతులుగా భావించి సేవించి వేదవేదాంగ రహస్యాలు మంత్రాలు నేర్చాడు .15వ ఏట శివుడు యోగానంద మహర్షి రూపం లో వచ్చి అష్టాక్షరీ మహామంత్రం ,యోగాసనాలు ,పంచముద్రాది సాధనాలు నేర్పి ఇచ్చినమాట నిలబెట్టుకొన్నాడు పరమేశ్వరుడు .
సకలయోగ రహస్యాల ఆకళింపు తో వైకుంఠ పర్వతం పై కఠిన తపస్సు చేయగా మొదట మార్కండేయ , తర్వాత ఆదిశేష దర్శనం లభించింది .’’గురుదత్త బ్రహ్మర్షి’’ గా అబ్బూరుకు తిరిగి వచ్చాడు నారాయణ స్వామి యోగీంద్రుడు .కపిల గిరిలో గురువుగారు బ్రహ్మర్షి నారాయణ స్వామికి సుదర్శన మంత్రోపదేశం చేశారు .నిర్జన అరణ్యాలలో ఈ మంత్రాన్ని మూడు నెలలపాటు అహోరాత్రాలు జపించి ,అబ్బూరు తిరిగి వచ్చాడు .అప్పటినుంచి అబ్బూరు ఒక తీర్ధ క్షేత్రమే అయింది .1936లో 36వ ఏట తండ్రి నిర్మించిన లక్ష్మీ నారాయణ మందిరాన్ని చక్కగా అభివృద్ధి చేశారు .గురువు సిద్ధిపొందినతర్వాత గుర్వాజ్ఞ మేరకు కపిల గిరి పీఠాధిపతి గా అభిషిక్తులయ్యారు .తర్వాత వైకుంఠ పురం శేషాద్రిపై వెలసిన శ్రీ ,భూ సహిత వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొంతకాలం తపస్సు చేసి మహిమలెన్నో చూపారు .దీనులను హీనులను ఉద్ధరించారు .నాస్తికులను ఆస్తికులుగా మార్చారు .ఆదర్శప్రాయ ఆదర్శ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక భావ జ్యోతి ప్రకాశాన్ని అందిస్తూ విభవనామ సంవత్సర పుష్య భీష్మ ఏకాదశి నాడు 18-1-1989న 82వ ఏటఇహలోక యాత్ర చాలించి నారాయణ సాన్నిధ్యం పొందారు బ్రహ్మర్షి నారాయణ స్వామి .అబ్బూరులో ఆయన సమాధి స్థలం లో ఏటా ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-20-ఉయ్యూరు