నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు  

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు  

కలియుగం లో 5వేల సంవత్సరాలు దాటాక భగవన్నామ సంకీర్తనకు, రూప భక్తి ప్రచారానికి ఎక్కువ అవసర మేర్పడింది .ఉత్తర భారతదేశం లో శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ,శ్రీ హరేరాం బాబాజీ ,శ్రీ సియా రఘునాధ శరణ గార్లను భగవంతుడు తన అంశతో జన్మింప జేసి ,వారిద్వారా నామ సంకీర్తనా రూప భక్తీ ప్రచారం చేయించాడు .ఆంద్ర దేశం లో అలాంటి ప్రచారానికి శ్రీ కుందుర్తి నరస దాసు గారినీ ,శ్రీ రఘువర దాసు గారినీ సృష్టించి ప్రచారం చేయించాడు విశ్వాత్మ .శ్రీ రఘువర దాసు పూర్వాశ్రమం లోనూ ,సన్యాసాశ్రమం తీసుకొని శ్రీ అవదూతేంద్ర సరస్వతి పేరుతొ ప్రసిద్ధి చెందారు .

   శ్రీ కుందుర్తి నరసదాసుగారు భగవదంశ సంభూతులు ,కారణ జన్ములు .పుట్టిన దగ్గర్నుంచి భగవన్నామ సంకీర్తన చేస్తూ ,సంకీర్తనా మాధుర్యాన్ని రుచి చూసి ,క్రమంగా నామ సంకీర్తనావతార పురుషులుగా మారారు .వీరికి ఆంద్ర వాల్మీకి వాసుదాసు గారు అనే శ్రీ వావికొలను సుబ్బారావు గారు గురువులై రామమంత్ర ఉపదేశాన్ని పొంది   ,శ్రీరామ కోటి రాస్తూ ,రామనామ సంకీర్తనలో పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు .వాసుదాసుగారు వీరిని చూసి ‘’లోక కల్యాణం కోసమే నీ మూర్తి అవతరించింది .కనుక రామనామ ప్రభావాన్ని ప్రచారం చేస్తూ తరించు ‘’అని ఆశీర్వదించారు .

   నరస దాసు గారు త్రివేణీ సంగమ జపమహాత్మ్యం విని ,అక్కడికి వెళ్లి ,మాఘమాసమంతా అక్కడే తపస్సు చేస్తూ రోజుకు 80వేల రామనామాన్నిజపిస్తూఉండగా ఫలితంగా ఒక మహా పురుషుడు ప్రత్యక్షమై ,దాసుగారికి హస్తమస్తక సంయోగం తో ‘’శ్రీరామ త్రయోదశాక్షర మంత్రం ‘’ఉపదేశించి ,నామ ప్రచారం తో ప్రజలను  తరింప జేయమని ఆశీర్వదించి , అంతర్ధానమయ్యారు  .తర్వాత దాసుగారు శ్రీరామ జన్మ క్షేత్రం అయోధ్యకు వెళ్లి ,అక్కడ ఆమంత్రాన్ని అక్షర లక్షలుగా పునశ్చరణ చేయగా కనులు మూసుకొని ఉన్న సమయం లో శ్రీ రామ సాక్షాత్కారం లభించింది .కళ్ళు తెరువగానే అదృశ్యమై  ఎదుట శ్రీ శియా రఘు నాద శరణ్ గారు దాసుగారియోగ్యతను గుర్తించి ,శ్రీరామ పంచాయతన మంత్రాన్ని కూడా ఉపదేశించి ‘’శ్రీరామ శరణ్’’అనే దీక్షానామ౦ ఇచ్చి ఆశీర్వదించారు .కాశీ వెళ్లి శివపంచాక్షరి ,బృందావనం లో శ్రీ కృష్ణ మంత్రాలను పునశ్చరణ చేసి ,ఆ దేవతలా అనుగ్రహం పొంది ,శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశీస్సులు పొంది  ఆంధ్ర దేశానికి తిరిగి వచ్చారు నరస దాసుగారు .

     ఆంధ్ర దేశం లో రామ నామ సంకీర్తనలు చేస్తూ చేయిస్తూ ,రామనామం స్మరిస్తూ బియ్యాన్ని ఏరి ,దానినే అన్నంగా తినేవారు .ఒక కోటి రామకోటి రాసి,కోటిన్నర రామ కోటితో రామజననం మొదలు  పట్టాభి షేకం దాకా చిత్రాలను చిత్రించి ,గుంటూరులోని శ్రీరామనామ  క్షేత్రం లో ఆవిష్కరింప జేశారు .మొత్తం మీద 8కోట్ల రామనామం రాశారాయన .ఆయన నివసించిన బుద్దాం అనే గ్రామం లో రామమందిరాన్ని నిర్మించి ,ప్రజలను రామభక్తులుగా మార్చి ఆగ్రామానికి ‘’నామ ప్రయాగ ‘’అనే కొత్త పేరు పెట్టారు .రామమందిర నిర్మాణానికి తనకున్న యావదాస్తి చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు నరస దాసుగారు .ఇదికాకా చాల గ్రామాలలో రామమందిర నిర్మాణం చేశారు .చాలా గ్రంథాలు రాశారు .సకాల సంధ్యావందనం సహస్ర గాయత్రీ జపం,వైశ్వ దేవం  మొదలైనవి వారికి నిత్య కృత్యం .శ్రీ శంకరుల అద్వైతాన్ని అధ్యయనం చేసి అందరికీ సుబోధకంగా బోధించారు .నిరాడంబర పవిత్ర జీవనం గడిపారు .ఎందరో నాస్తికులు వారి ప్రభావం తో ఆస్తికులయ్యారు .దాసుగారి జీవిత చరిత్రను వారి శిష్యులు శ్రీ పద్యాల సోదరులు వ్రాయగా శ్రీ గాయత్రీ పీఠాదిపులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి వారు ఆశీర్వచన౦ పలుకగా, సర్వతంత్ర విశారద శ్రీ కుప్పా ఆంజనేయ శాస్త్రిగారు అభినందన వచనాలు రాశారు .ఇది 1986 డిసెంబర్ 26 న ముద్రణ పొందింది .ఇప్పుడు పూర్తి జీవిత విశేషాలు తెలుసుకొందాం .

  నరస దాసు గారి బాల్యం విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా నరసరావు పేట ,వినుకొండ లకు మధ్యలో కుందుర్తి అనే గ్రామం లో నరసదాసుగారు జన్మించారు .వీరి పూర్వీకులు లక్ష్మీ నరసయ్యగారు పాత గుంటూరు జమీందారు మానూరి వారి దగ్గర సముద్దారుగా చేశారు .ఉప్పుటూరు దగ్గర పెద్ద చెరుకూరులో నివాసం .ఆవంశం లో ఏడవ తరం వారు లక్ష్మీ నరసయ్యగారు .కొంతకాలాని కి పదవులు పోయాయి .కానీ చక్కని హాస్యప్రియులు అని శ్రీ కాశీనాధుని నాగేశ్వరావు ,శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చెప్పేవారు .వారే వీరికి ‘’హాస్య కళాప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చారు .తిరుపతి కవులు వీరిపై శతకం చెప్పారు .వేంకటగిరి ,పిఠాపురం, చల్లపల్లి బొబ్బిలి మొదలైన సంస్థానాలలోనూ ,పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతీ స్వామి సన్నిధానం లోనూ ఆయన హాస్యప్రసంగాలు చేసి ఘన సన్మానాలు పొందారు .వీరిసతీమణి సీతమ్మగారు .ఈ దంపతులకు 2-5-1905విశ్వావసు చైత్ర బహుళ త్రయోదశి ,రేవతీ నక్షత్రయుక్త మకర లగ్నం లో రాత్రి 10గంటలకు నరసదాసుగారు జన్మించారు .

  ఒక రోజున తల్లి నీళ్ళు తేవటానికి బావి దగ్గరకు వెడితే చిన్నారి దాసు ఏడుపు లంకి౦చు కొంటే ఒక భిక్షువు ‘’రామా దయ చూడవే ‘’అనే కీర్తన పాడగా ఏడుపు ఆపేశాడు .ఇంతలో తల్లి వస్తే ,పాడటం ఆపేస్తే మళ్ళీ ఏడ్చాడు .పాటపాడితే మానేశాడు ఇలా చాలా సార్లు జరిగింది అప్పుడా భిక్షువు ‘’అమ్మా నీ కొడుకు సంకీర్తన మిత్రుడు .నామగానం లో లీనమౌతున్నాడు .కొద్దికాలానికి రామభక్త రత్నం గా భాసిస్తాడు ‘’అని చెప్పి దీవించి వెళ్లి పోయాడు .5వ ఏడు ని౦డగానే  తుర్లపాటి నరసింహం గారి తో అక్షరాభ్యాసం చేయించారు .

  1910లో చెరుకూరుకు నిమ్మగడ్డ రమణమ్మ గారింటికి నియమ నిష్టలున్న స్వాములవారోకరు వచ్చి ఒక జీర్ణ దేవాలయం లో వేదాంత ప్రవచనాలు చెప్పారు  .ఆ గుడిని పునరుద్ధరించాలని స్వామి ఊరివారందర్నీ పిలిచి  చెప్పారు . .ముందువరుసలో కూర్చున్న బాలనరసయ్యను  ‘’దేవుడు ఎక్కడ ఉన్నాడు ??’’అని  అడిగారు ‘’ఆయన తడుముకోకుండా ‘’దేవుడు గుడిలోనే కాదు  .అన్ని చోట్లా  ఉన్నాడు ‘’అని చెప్పగా ఆశ్చర్యపోయారుస్వామి .ఆయన పులకించి అతడినిపిల్చి తన ఒడిలో కూర్చోపెట్టుకొని అందరితో ‘’వీడు ప్రహ్లాదుడి లాగా లోకానికి ఆహ్లాదం కలిగిస్తాడు ‘’అని మనస్పూర్తిగా ఆశీర్వదించారు .జనం అవాక్కై తమ ఊర్లో మరో భక్త రామదాసు జన్మించినందుకు గర్వపడ్డారు ..

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-21-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.