పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్

పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్

కెవి శంకర్ 10భారతీయ భాషలసినిమాలకు నృత్య దర్శకులుగా పనిచేసి ఎన్నో అద్భుతమైన డాన్స్ లకు కొరియోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు .ముఖ్యంగా అనేక దక్షిణాది భాషల చిత్రాలకు ఆయన నాట్య గురువు .7-12-1948 న మద్రాస్ లో  జన్మించిన ఆయన 28-11-21న 74వ ఏట హైదరాబాద్ లో కరోనా బారి పడి,కోలుకోకుండా,.అక్కడే శివ సాన్నిధ్యం  చేరారు .మొత్తం 800కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన మహానుభావుడు .తలిదండ్రులు కళ్యాణ సుందరం ,కోమల అమల్.భార్య సుగణ్యా.203లో తమిళ సినిమా ఆలయ్ లో నటుడుగా పరిచయమై తెలుగు తమిళ చిత్రాలలో కేరక్టర్ యాక్టర్ గా ,కమెడియన్ గా నటించారు .చాలా టివి షోలకు ,రియాల్టి షో లకు జడ్జిగా సమర్ధంగా వ్యవహరించారు .

  1975లో ‘’పాట్టు భారతమం ‘’తమిళ సినిమాకు అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్ గా వెండి తెరకు పరిచయమయ్యారు .రెండేళ్ళ తర్వాత 1977లో ‘’కురివికూడు ‘’సినిమాకు నృత్యదర్శకులై ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు .అన్నీ హిట్ చిత్రాలే .మన తెలుగు సినిమాలు అల్లరిపిడుగు,అరుంధతి ,మగధీర ,బాహుబలి ,మహాత్మా ,అమ్మోరు ,సూర్య వంశం,వరుడు మొదలైన వాటికి   డాన్స్ డైరెక్టర్ శివ శంకర్ మాస్టారే .చిరంజీవి సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అద్భుతం అనిపిస్తుంది .మగధీర సినిమా లో ‘’ధీర ధీర ధీర ‘’పాటకు ఆయన చేసిన కోరియోగ్రఫికి జాతీయ పురస్కారం అందుకొన్నారు మాస్టారు .

  తెలుగులో శివశంకర్ మాష్టర్ –నేనే రాజు నేనే మంత్రి,నిను వీడని నీడను నేనే ,సర్కార్ ,ఎన్టి ఆర్ కధానాయకుడు ,రాజుగారి గది ,అక్షర మొదలైన సినిమాలో నటించారు .

  సుమారు 12ఏళ్ల క్రితం హైదరాబాద్ రామోజీ ఫిలిం స్టూడియో లో జరిగిన ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ లో శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం మా కుటుంబానికి దక్కింది .అందులో కనిపించని పాత్రధారులం మేము .మా మనవడు హర్ష  చిన్నతనం లో అల్లు అర్జున్ వేషం వేశాడు. వాడు బాగానే కనిపిస్తాడు .అప్పుడు వేటూరిపాటకు అల్లు అర్జున్ ఎనర్జికి తగిన కొరియోగ్రఫీ చూసి అబ్బురపడ్డాం.ఫుల్ జోష్ తో అర్జున్ చేసి అద్భుతం అనిపించాడు .హావభావాలు చూపిస్తూ నటించి చూపిస్తూ మాష్టర్ నాట్యకళా శాస్త్రాన్ని ప్రదర్శిస్తుంటే అవాక్కయ్యాం .ఆయనను కలిసి మాట్లాడాం కూడా .ఆయన నృత్య విధానాన్ని ప్రశంసి౦చా౦ .నుదుట  వెడల్పైన నిలువు కుంకుమబొట్టు  ఆయన ప్రత్యేకత .’’ఏస్ కొరియాగ్రాఫర్’’అని హిందూ పత్రిక ఆయన్ను శ్లాఘించింది .

  ఓంకార్ నిర్వహించిన రియాల్టి షో లలో శివ శంకర్ మాస్టర్ ఒక ప్రత్యెక ఆకర్షణ గా ఉండేవారు . అందుకేనేమో  శివ శంకర్ పార్ధివ దేహాన్ని శ్మశానానికి స్వయంగా మోసి ఓంకార్ గురు ఋణం తీర్చుకున్నాడు .

మన్మథ రాజా మన్మథ రాజా’… పక్కా మాస్‌ పాట. రగులుతోంది మొగలి పొద’…. శృంగార గీతం.., ‘ధీర ధీర ధీర మనసాగలేదురా’… మంచి రొమాంటిక్‌ సాంగ్‌. దేవ దేవ దేవం భజే’… చక్కని భక్తి పాట… భు భు భుజంగం.. ది ది తరంగం’…. అరాచకుడ్ని అంతం చేయడానికి పాట… పాట ఏదైనా శివ శంకర్‌ మాస్టర్‌ స్టెప్‌’ అందుకు తగ్గట్టే ఉంటుంది. అందుకే ఆయన నృత్యధీర’. వెండితెరపై తారలతో అద్భుతమైన స్టెప్పులేయించిన ఈ మాస్టర్‌ ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు.

డ్యాన్స్‌పైమమకారంపెరిగి..
శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారు. దీంతో శంకర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలన్న పట్టుదల పెరిగిపోయింది.

దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్‌ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట.

ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్‌ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు, వదిలెయ్‌’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు.

 నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్‌ మాస్టర్‌ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు.

  శివ శంకర్ మాస్టర్ అనేక ఆర్ధిక కుటుంబ పరమైన ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో జయించి నిలబడ్డారు . ఆయనకీర్తి అజరామరం .ఆయన ఆత్మకు శాంతికలగాలనీ కోరుతూ ,ఆయన కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.