మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )

  దిగువ మధ్యతరగతి తండ్రి, కాలేజిలో లేక్కలలలెక్చరర్ ,ఇంటి లో ఉన్న  14మంది మందీ మార్బలాన్ని పోషించటానికి గడియారం ముల్లులాగా ఒక మానవ యంత్రంలాగా అహర్నిశలు కష్టపడుతూ తెల్లవారుజామునను౦ డి,కాలేజీకి వెళ్ళేదాకా ,వచ్చాక మళ్ళీ రాత్రి పదిదాకా ,అదీ చాలక అర్ధరాత్రి ఒకటిన్నరకు డిగ్రీ పిల్లలకు మాత్స్ బోధిస్తూ  బహు కష్టపడుతుంటే ,నీకు సిగరెట్ అలవాటై కొనుక్కోటానికి ఆయన్నే డబ్బు అడగటం నామోషీ అయి ,అనుకోకుండా దొరికిన టెలికమ్యూనికేషన్ ఉద్యోగం లో చేరి ఝాం ఝాం న దమ్ములాగుతూ ,కవిత్వం చిలికిస్తూ అదే లోకమని భావించి’’ ఆకాస్టాలే ‘’నీ ఊపిరి తిత్తులపాలిటి సమిధలై దహిస్తాయని తెలీకుండా గడిపావా ?తెలిసినా ‘’జగమంతా కుటుంబం ‘’అనే వ్యామోహం లో ఉండిపోయావా ?నాన్న దీపం లాగ వెలిగితే, నువ్వు కొవ్వొత్తి అయి కరిగి కవిత్వపు వెలుగునిస్తూ కరిగిపోయావా రాముడూ !తండ్రి వద్ద నేర్చిన సంస్కృతం,ధాతుమంజరి నీకు వంటబట్టి శబ్ద ధాతు పుష్టి కలిగిందా ? .అందుకేనేమో మధ్యతరగతి బాధలు నీకు కరతలామలకాలై అమృతమయమైన ‘’అమృతం ‘’సీరియల్ కు టైటిల్ సాంగ్ రాసి ,బాధలు కస్టాలు కన్నీళ్లు తోడిపోశావ్ ‘’మన చేతుల్లో లేదా రిమోట్ కంట్రోల్ ‘’అని ,’’ఏడుపుగొట్టు ప్రోగ్రాములు మార్చి కన్నీళ్లు తుడుచుకొందామన్నావ్’’. వచ్చే కస్టాలు  వార్తల్లో వచ్చే హెడ్ లైన్స్ – అయోడిన్ తో అయిపోయే గాయాలే మనగండాలు అని భరోసా ఇచ్చావ్ .గాలైనా రాని ఇరుకు అద్దె ఇంట్లో ‘’కాలైనా పెడుతుందా పెను తుఫానసలు ?’’అని సవాల్ చేశావ్ . మనం ఈదేది ఒక  చెంచాడు భవసాగరాలే ‘’కరెంటు,రెంటు ఎట్సెట్రా మనకష్టాలు ,నైటంతా దోమలతో మనకు గ్లోబల్ వార్ ‘’అని అన్నీ’’ లైట్ తీసుకొని’’ నవ్వుకోరా భాయ్ అని వేదాంతం చెప్పావ్ బాసూ .మధ్యతరగతి మందహాసానికిది ‘’ఊరటోపనిషత్’’అని పించింది .ఈ టైటిల్ సాంగ్ ఆ సీరియల్ పాలిటి సిరివెన్నెలై ,మూడు వందలకు పైగా ఎపిసోడ్ లతో తెలుగువాళ్ళను సంమోహ పరచింది .గుణ్ణం గంగరాజును ‘’గుర్రం ఎగరావచ్చు ‘’అనే మాయలో పడేసింది బ్రదరూ .

  సిరివెన్నెల ,స్వర్ణకమలం మొదలైన సినిమాలో క్లాసిక్ సాంగ్స్ రాసి ఉన్నత మధ్యతరగతిప్రేక్షకులకు రసానందం కలిగించి ,మాస్ కూడా అర్ధం కాకపోయినా ,అదే ఆనందాన్ని పొందేట్లు చేశావ్ .శివ సినిమాలో యూత్ కోసం ‘’బాటనీ క్లాస్ ఉంది మాటినీ ఆట ఉంది ‘’రాసి వాళ్ళలో క్రేజ్ సృష్టించావ్ .ఈపాటతో ఒక ఊపు తెచ్చింది జనాల్లో ఆ శివ .నిజంగా యూత్ శివమెత్తి పోయారంటే నమ్ము .ఇంగ్లీష్ పదాలను యడా పెడా వాడుతూ ‘’భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ సోలో బతుకే సో బెటరూ’’అని కోట కు మనీ లో రాసి  జోష్ తెచ్చావ్ .’’కాసుముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది –పైసలతో ప్రపంచమంతా పడగ్గదికొస్తుంది ‘’ఆని ఆధునికతా రహస్యం చెప్పావ్ ‘’   

గేయ రచయితవైన నువ్వు కథా రచనా చేశావంటే కొందరు నమ్మలేక పోతున్నారు .రాసిన యాభై లో 15మాత్రమె ‘’ఎన్నో రంగుల తెల్లని కిరణం ‘’ సంపుటిగా ప్రచురితమయింది అంటే  ఆశ్చర్యమే .

‘’ఔనా అమ్మకు చెల్ల’’అంటూ కృష్ణతత్వాన్ని ‘’ఆనందలాల ‘’గా అలవోకగా ఆద్బా౦ధవుడు  లో చెప్పావ్ . ‘’చిలకా ఏ తోడు లేక-ఎటేపమ్మ వొంటరినడక  -తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
 అమృతమే  చెల్లించి  ఆ విలువతో 

హలాహలం కొన్నావే అతి తెలివితో 

కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే

తీరా నువు కను తెరిచాక  తీరం కనపడదే యింక’’’’గీతాన్ని శుభలగ్నం సినిమాలో మహా తాత్వికతతో రాసి  ఏడిపించావు గదయ్యా నీ తస్సా చెక్కా .

శ్రీకారం సినిమాలో హాలాహలం లాంటి పాట జేసుదాస్ కి రాశావ్ –

 మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని
మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు ఎవరులేరని
చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!

నిండు నూరేళ్ళు జీవి౦చాలి వేటాడే వేళతో పోరాడాలని గుండెకు ధైర్యం చెప్పావ్ .

 అర్ధ శతాబ్దపు స్వాతంత్ర్యం మనకేమిచ్చిందని నిలదీశావ్’’ సిందూరం’’ లో –దాన్ని అజ్ఞానం ,ఆత్మ వినాశపు అరాచకం అన్నావ్ ;శాంతికపోతం గొంతు తెంచి తెచ్చిన బహుమానం అనీ ,సమూహ అంటే ‘’మాస్ క్షేమం’’ పట్టని స్వార్ధం ఇరుకుతనం లో ముడుచుకుపోయినందుకు బాధపడ్డావ్ .ఇది ఆనాధ భారత౦ అనీ,ఆత్మ వినాశాపు అరాచకాన్నిస్వరాజ్యం అని సలా౦ చేద్దామా ?అని దేప్పావ్ .’’తనలో ధైర్యం అడవికి ఇచ్చి –తనధర్మ౦  చట్టానికి ఇచ్చి – కలహం చూస్తూ –సంఘం శిలగా నుంచుంటే –నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం  -ప్రశ్నించటం మానుకొన్న ఈ కబోది జాతిని ఆవేశం నడిపించినా –ఆ హక్కు తమదే అంటుంది అధికారం ‘’అని రక్త సిందూరప్పాట రాసి జనజాగృతి తెచ్చావ్ సీతారాముడూ హాట్స్ ఆఫ్ భాయ్ .

  ప్రేమ కథ లో ‘’ఆమెతో అతడు కలిసి నడిచేదాకా దేవుడు కరుణిస్తాడని తెలియలేదనీ –ఆమెలేక పొతే జీవితం ఎటు వేళ్ళే దో తెలీదని ‘’నిర్వేదాన్నిపండించావ్ .దేవుడు కరుణిస్తాడనే హమ్మింగ్ తో పాట చరితార్ధమైంది

 గమ్యం చిత్రం లో మన గమ్యమేమిటో ఎరుక పరచావ్ –

 ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

మనకిలా ఎదురైన ప్రతివారు

మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషీ అంటే ఎవరూ

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

మనసులో నీవైన భావాలే

బయట కనిపిస్తాయి దృశ్యాలై

నీడలు నిజాల సాక్ష్యాలే

శత్రువులు నీలోని లోపాలే

స్నేహితులు నీకున్న ఇష్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే

అని రుతుగీతం పాడావ్

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం’’అని

మనుషుల మందహాసం తో చేలిమికలిమి బలిమి సౌఖ్యం అని తేల్చి చెప్పావ్

చక్రం లో చక్రి స్వరకల్పనలో ‘’జగమంత కుటుంబం నాది ‘’వైతాళిక గీతం రాసి మురిపించావ్ – కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ

కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిసినై

నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ

వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హ్రుదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి’’

 ఇప్పుడు నే  ఉదహరించినవన్నీ అవార్డ్ విన్నింగ్ లిరిక్కులే రామయ్యా .800సినిమాలకు 2450 దాకా అపురూప గీతాలు రాసి ,అశ్లీలం ద్వంద్వార్ధాల జోలికి పోకుండా నిప్పులా రాసిన కవి అనిపించావ్ రాముడూ .భారతప్రభుత్వ ‘’పద్మశ్రీవి’’నువ్వు సిరివెన్నెలా ..300పాటలతో ‘’శివకావ్యం ‘’రాస్తూ ముగించకుండానే,శివసాయుజ్యం చేరావా ?నువ్వుపుట్టింది 20-5-1955,సాయుజ్యాన్నిపొందింది 30-11-21.ఇవి కాలగణనానికే కాని నువ్వు అమరుడవు చిరంజీవివి ..

నీ కవితా ప్రస్థానం లో నాకు రెండు పరిధులు –ప్లేన్స్ కనిపిస్తున్నాయి –ఒకటి సిరివెన్నెల ,స్వర్ణకమలం వగైరాక్లాసిక్స్ లో నీది ఉత్తమోత్తమ క్లాసిక్ కవిత్వం .పండిన భక్తికవితా వేశం . తర్వాత ప్లేన్ లో నీది జగమంత  కుటుంబీకుడివి అయ్యావు .జనసామాన్యం లో మెలిగావ్ .వాళ్ళ కస్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలకు వకాల్తా పుచ్చుకోన్నావ్ . యాభై ఏళ్ల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటె చిర్రెత్తి, చికాకుపడి స్వాతంత్ర్యం అంటే ఏమిటో విడమరచి చెప్పావ్ . మా విధులు బాధ్యతలు గుర్తు చేశావ్ .ప్రజాకవివి ,ప్రజారవివి అనిపించుకొన్నావ్ .జనజాగృతి కై పరితపించావ్ .

  నమ్మకు నమ్మకు ఈ రేయినీ అని పారాహుషార్ చేశావ్ .జామురాతిరి జాబిలమ్మ అందాలు చూపావ్ ,క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ అని మందలి౦చావ్ .నిన్నే పెళ్లాడుతానంటూ చిలిపి చిందులు తోక్కి౦చావ్  , కళ్ళల్లో కళ్ళు పెట్టి దోబూచులాడి౦చావ్ ,ఆకాశం దిగి వచ్చి ఊరంతా పెళ్లిపందిరి వేయించి గ్రామీణ వాతారణం లో సంపన్నుల పెళ్లి జరగాలని ఊహించి ఊరి౦చావ్  .సీతమ్మ అందాలూ రామయ్య చందాలూ అంటూ ఆ ఆదర్శ దంపతుల దాంపత్య వైభవం కళ్ళకు కట్టించావ్ .యువతకు హితవుగా ప్రేరణగా ‘’ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ ‘’అని ఒక పెద్దన్నయ్యలా హిత బోధ చేశావ్ .ఉత్సాహంగా రెండు మూడు’’సినేమాలలో’’ నటించి నీ పాట నువ్వే పాడుకొని సిరివెన్నెల కురిపించావ్ .పాత భావ స్ఫోరకంగా ఎలా పాడాలో నేర్పావ్ .అనుభూతి కలిగించావ్

 ఇప్పుడు అందనంత దూరానికి ‘వినీల గగనపు  వేదిక ‘’పైకి చేరుకొన్నా ,పాడుకోటానికి,అనుభవించటానికి  నీ పాటల ‘’ వెన్నెల సిరి’’ మాకు అప్పగించావ్  సిరివెన్నెల సీతారాముడూ ! ఏమంత వయసైపోయిందని వెళ్లిపోయావయ్యా .ఇంతలోక జ్ఞానం సంపాదించి పాటలలో పంచిపెట్టిన నువ్వు ‘’ధూమపాన బలహీనత ‘’కు బలై పోవటం జీర్ణించుకోలేక పోతున్నాం .ఇదీ లోకానికి ఒక హెచ్చరికగా మిగిల్చావా రాముడూ! .మీ కుటుంబానికి మా సానుభూతి .నీ ఆత్మకు ప్రశాంతి కలగాలని నువ్వు తిరస్కరించిన ఆ ‘’ఆది భిక్షువు’’నే అర్దిస్తున్నాం .

జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |

నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం 

విషయ పరిజ్ఞానం పూర్తిగా పొంది మంచిపనులచే సిద్దులైనవారి కీర్తికి ముసలితనం మరణం వలన భయం లేదు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-21-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.