త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3 నౌలూరు గ్రామకరణీకం హనుమంతరావు గారి పెదతండ్రి హయాం వరకు ఈ కుటుంబంలోనే ఉంది .రావుగారి తల్లి గారిపుట్టిల్లు కొలకలూరు .భర్తే పూడి వారి ఆడపడుచు .అవంశం లో అబద్ధం ఆడటం తెలియదు .అన్నిట్లో నిక్కచ్చిగా ఉండేవారు .ఈ రెండు లక్షణాలు తల్లి రాజమ్మ గారికి ,అబ్బాయి రావు గారికీ అబ్బాయి. నౌలూరులో తండ్రీ కొడుకులు ఉండేవారు. తండ్రే వంట చేసేవారు .పైపనులు రావు గారు చేసేవారు .ఆడుకోవటానికి ఇంట్లో ఆయన ఈడు వారెవరూ లేనందున రావు గారు స్నేహితుల ఇళ్లకో బంధువుల ఇళ్లకో వెళ్లి వస్తూండేవారు .ఒక్కోసారి బంధువులఇళ్ళల్లో చాలా రోజులు ఉండిపోయేవారు .ఇరుగుపొరుగు జనం ‘’నరసింహం గారు చనిపోతేకొడుకు ఎక్కడున్నాడో ఉంటాడో ?’’అని పరిహాసం చేసేవారు .ధర్మవ్యాధుని కధను తండ్రి మాటిమాటికీ కొడుకుతో చదివించి బాధ్యత గుర్తు చేసేవారు . హనుమంతరావు గారికి వందే మాతరం ఉద్యమ౦ వలన జాతీయభావాలుకలిగి స్వదేశీ వస్త్రాలే కట్టు కొనే వారు .బ్రహ్మసమాజ ప్రభావంతో సంస్కార బీజాలు పడ్డాయి .అక్కడక్కడ జరిగే విధవా వివాహాల గురించి ప్రజలు గోరంతలు కొండంతలుగా చెప్పుకొనేవారు .విగ్రహారాధనపై అయిష్టత కలిగింది .ఎప్పుడైనా లాంచన ప్రాయంగా గుడికి వెళ్ళేవారు .భక్తీ అంకురించలేదు .నీతినియమాలు పాటిస్తూ సత్యం మాట్లాడుతూ జీవించటం చిన్నతనం నుంచి అలవాటైంది . చదువుకొనే రోజుల్లో శ్రీ అక్కిరాజు ఉమామహేశ్వర విద్యా శేఖరులు ,వారిద్వారా శ్రీ నండూరి శేషాచార్యులు తో పరిచయం కలిగింది .వారు అప్పుడు ఎఫ్ ఎ చదువుతున్నారు .ఉమాకాంతం గారి గది తెలుగు గ్రంథాలతో నిండి ఉండేది స్వయంగా తెలుగుకావ్యాలన్నీ చదివి గొప్ప పండితులయ్యారు. శేషాచార్యులుగారు ఇంగ్లీష్ లో రైనాల్డ్ రాసిన నవలలు ఊపిరి సలపకుండా చదివే వారు .రావు గారూ ఆ రెండురకాల పుస్తకాలనూ చదవటం నేర్చారు .బంకిం నవలలు ,కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రికా మండలి వారి పుస్తకాలు ఉమాగారి భాండారం నుంచి తీసుకొని చదివారు .చిలకమర్తి ,వీరేశలింగం గార్ల రచనలన్నీ తిరగేశారు .ఆకాలం లో ప్రతి ఏడాదీ మండల సభలు ,సంఘ సంస్కరణ సభలు జరిగేవి .తప్పక హాజరయ్యేవారు .ఉన్నవావారితో దుగ్గిరాల వారితో కాలం గడిపేవారు .గ్రంథాలయోద్యమ ప్రభావం కూడా పడి మంగళ గిరిలో దేవస్థానం వారి గదులలో ఒక గదిలో శ్రీ లక్ష్మీ నరసింహ గ్రంధాలయం హనుమంతరావు గారు ఏర్పరచారు .దాదాపు నాలుగు వందల గ్రంధాలు సేకరించి లైబ్రరీకి అందజేశారు .రావు గారుయా వూరు వదిలాక అసమర్దుల చేతిలో పడి నీరుగారిపోయింది . ఉన్నవ వారు గుంటూరులో ప్లీడరీ చేస్తున్నా ,,అప్పుడప్పుడు మంగళగిరి సబ్ కోర్ట్ కు వచ్చి కేసులు వాదించేవారు .ఆయన్ను ఆహ్వానించి కాఫీలు టిఫిన్లు ఇంటివద్ద ఏర్పాటు చేసేవారు రావు గారు .ఏదో రాయాలని ఒక నవల రాసి ఉన్నావ వారికి వినిపిస్తేసంతోషించారు .గుంటూరులో శ్రీ దేవాబత్తుని శేషా చలపతి రావు ‘’దేశాభిమాని ‘’వార పత్రిక స్థాపించి నడుపుతున్నారు .గొప్ప ప్రపంచజ్ఞానమున్న మధ్వ పండితులాయన .గుంటూరులో అందరిగౌరవం పొందినవారు .వ్యవహారం లో పూర్వాచార పరాయణులైనా వితంతు వివాహం చేసుకొన్న ఆదర్శమూర్తి .ఆయన వ్యాఖ్యలు చురకత్తులే.ఎదుట పడి మాట్లాడేసాహాసం ఎవరికీ ఉండేదికాదు .బహు సౌమ్యులు .పత్రికలలో దేశాభిమానపూరిత వ్యాసాలూ రాసి స్పూర్తి కలిగించేవారు .ఆయన్ను జనం పేరుతోకాక ‘’దేశాభిమాని ‘అనే గౌరవంగా పిలిచేవారు .ఉన్నవవారు రావు గారిని ఆయనకు పరిచయం చేసిఉపస౦పాదక ఉద్యోగం ఇప్పించారు .మొదటి నెలజీతం 15వెండిరూపాయలు రావు గారిచేతికిస్తే ఆన౦దానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. .ఈ డబ్బు తండ్రిగారి చేతికిస్తే బ్రహ్మానంద భరితులై నిండుమనసుతో ఆశీర్వ దించారు .ఆపత్రికలో ఒక ఏడాది పని చేశారు. వందేమాతరం ,మొదటి ప్రపంచ యుద్ధం రోజులవి .చేతిలో డబ్బు లేకపోయినావార పత్రికను దినపత్రికగా మార్చి యజమాని ,చేతులుకాల్చుకొని ,చాలా నష్టం పొంది తర్వాత ప్రచురణ మానేశారు .అప్పుడు దుగ్గిరాలగోపాలకృష్ణయ్యగారు చదువుకు ఎడింబరో వెళ్ళలేదు .గుంటూరు కొత్తపేటలో అవ్వారి రామయ్య గారి మేడలో ఆయన, ఆయన నాయనమ్మ రాజమ్మగారు ఉండేవారు . మేడ గదిలో శ్రీ జొన్నవిత్తుల గురునాథం అనే రాజకీయ వేత్త ఉండేవారు .ఆయనదగ్గరకు ఉన్నవవారు నడింపల్లి నరసింహారావు శీరం వెంకట సుబ్బారావు మద్ది రాధాకృష్ణయ్య వంటి యువకులు వచ్చేవారు .రావుగారుకూడా అప్పుడప్పుడు వారితో కలిసేవారు ..జోన్నవిత్తులవారు ,న్యాపతి నారాయణ రావు గార్లు హిందూ పేపర్ లో ‘’ఆంధ్రరాష్ట్రం ఎందుకు కావాలి””? అనే వ్యాస పరంపర రాసి ఉత్తేజితులను చేసేవారు . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.