మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5

5-ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ

చదలవాడ కుటుంబరావు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ చదలవాడ అంటే అందరికీ  తెలుసు . అంటే ఇంటిపేరుతోనే చలామణి అయిన  హాస్యనటుడు శ్రీ చదలవాడ కుటుంబరావు . కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో జన్మించారు .పెరిగింది చదివిందీ ఇక్కడే .  .ప్రజా నాట్యమండలి నాటకాలలో నటించి   ఆ  అనుభవం సంపాదించిన తర్వాతనే చిత్ర రంగం లోకి ప్రవేశించారు .నాటక రచయిత శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి గారి ‘’పల్లెపడుచు ‘’నాటకంలో చదలవాడ ‘’పిచ్చయ్య ‘’గా నటించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు పొందారు .ఈ నాటకం లో ఊర్వశి శారద ,ఆంధ్రా దిలీప్ చలం మొదలైనవారు కూడా నటించారు .ఇదే సినిమా రంగ ప్రవేశానికి మార్గం చూపింది .ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు దృష్టిలో పడ్డారు .ఆయన తన స్వంత జనతా పిక్చర్స్ తో  తీసిన ‘’నిరుపేదలు ‘’సినిమాలో చదలవాడకు అవకాశామిచ్చారు .ఆయనే తీసిన పరివర్తన సినిమాలో అక్కినేని ,సావిత్రి లతో కలిసి చదలవాడ తో నటి౦ప జేశారు ..సావిత్రి నాగేశ్వరరావు చెల్లెలుగా నటించటం విశేషం .   

  మొదటి చిత్రం 1944లో విడుదలైన తాసీల్దార్ .తర్వాత స్వర్గ సీమ లో ఆతర్వాత 1949లో మనదేశం లో ‘’మధు ‘’పాత్రలో నటించారు .దాదాపు ఆయన నటించిన పాత్రలన్నీ నౌకరు పాత్రలే అంతకు మించి ఆయనకు ప్రమోషన్ దొరకపోవటం బాధ కలిగిస్తుంది .తమాషా అయిన యాస తో అందులోనూ కృష్ణా జిల్లాయాస తో  ఆయన పగలబడి  నవ్వించారు .చూస్తేనే నవ్వు పుట్టేది .విజయా  సంస్థలో నెల జీతానికి పని చేశారు కనుక వారి చిత్రాలలో తప్పక ఉండేవారు .1951లో వచ్చిన పాతాళభైరవి ,1952 లోని పెళ్లి చేసిచూడు లో తన యాసతో నవ్వించి కూసాలు కదిలించారు .’’అబ్బాయా ‘’అంటూ చేసే నటన గిలిగింతలు పెట్టిస్తుంది .’’తేడా ‘’గా కూడా కొన్ని సినిమాలో బాగా చేశారు .వ్యక్తిగతంగా కూడా చమత్కారి ఆయన సెట్ లో ఉంటె నవ్వులపూల వర్షమే కురిసేది .జమీందారు వేషం వేసినా యాస మార్చే వారు కాదు .నిర్మాత ,దర్శకులనే పాత్ర లక్షణాన్ని మార్చమనే వారు .ప్రతి సందర్భం లోనూ వ్యంగ్యం లేకుండా డైలాగ్ ఉండేది కాదు .మాయా బజారులో ఘటోత్కచని గురువు రమణా రెడ్డి శిష్యుడు’’ లంబు’’ గా  ,’’జంబు ‘’పాత్రధారి నల్లరామ మూర్తి తోకలిసి పోటీ పడి ‘’వీర తాళ్ళు ‘’వేయించుకొనే సందర్భం లో హాస్యం ఉరకలేస్తుంది . ‘’దుసత చతుసతయం ‘’అంటూ దుష్ట చతుష్టయాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు చేసిపలికినప్పుడు ఘతోత్కాచుడే సెబాస్  అంటే  నవ్వలేక చస్తాం .హస్తినాపురం లో ఈ త్రయం సృష్టించిన హాస్యవల్లరికి కడుపుబ్బా నవ్వుకొంటాం .పెళ్లి నాటి ప్రమాణాలలో ప్రకటనలు అమ్మకాలు పాత్రలలో చదలవాడ ,అల్లు రామలింగయ్య హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది .  ఆయనపాత్ర ఆయకట్టు కొంటుంది .కొంపలు కూల్చే పనికన్నా కొంపలు నిలబెట్టే పనులు చేసే పాత్రలే ఎక్కువగా పోషించారు చదలవాడ.ఆయన నటించిన పాత్రలన్నీ గుర్తింపు పొందినవే. చెరగని ముద్ర వేసినవే .అప్పు చేసి పప్పు కూడు సినిమాలో సియేస్ ఆర్ ఇంటి నౌకరు  చెంచయ్య పాత్రలో జీవించి యాజమాని  ,కోడలు జమునకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక ,ఆమెను సమర్ధిస్తూ ,విదేశాలనుంచి తిరిగి వచ్చిన యజమాని కొడుకు జగ్గయ్య కు జమున విషయం లో న్యాయం చేయటానికి పూర్తీ మద్దతు నిస్తూ ,మానవత్వం చూపిస్తూ నటించిన తీరు  హాట్సాఫ్ అని పిస్తుంది .నవరాత్రి ,తిరుపతమ్మ కథ చిత్రాలలో ఆయనవి గుర్తుండి పోయే పాత్రలే .ఆదుర్తి సుబ్బారాగారి దర్శకత్వం లో వచ్చిన ఆడపెత్తనం సినిమాలో డామినేటింగ్ కన్నాంబ గారికి అణగి మణగి ఉండే   ‘’హెన్ పెక్కేడ్ హజ్బండ్ ‘’గా ,మొదట్లో అంత పెద్ద నటికీ భర్తగా తానా ?అనికంగారుపడినా,కన్నాంబ ,ఆదుర్తి  ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం తో  ‘’ఇరగదీసి ‘’నటించి  హాస్యం పండించి, ప్రేక్షక సానుభూతి పొందారు . భార్యా భర్తలు సినిమాలో విలన్ వేసిన హాస్యనటుడు పద్మనాభం కు వ్యతిరేకంగా  కీలక సాక్ష్యం చెప్పి   నేరారోపణ పై జైలులో ఉన్న హీరో అక్కినేనిని  విడుదల అవటానికి దోహద పడిన   పాత్ర లో చదలవాడ అద్భుతంగా ,అవలీలగా, సునాయాసంగా తనదైన చమత్కార  ధోరణిలో నటించి చరితార్ధం చేశారు.ఈ మంచి పాత్ర ఆయనకు గొప్పపేరు తెచ్చింది  .మొనాటనీ లేకుండా ఎప్పటికప్పుడు హాస్యానికి కొత్త దనం  చివుళ్ళు తొడుగుతూ  నటిస్తూ మెప్పించారు . శ్రీ కృష్ణార్జున యుద్ధం లో ‘’మంచి బుద్ధి ‘’పాత్రలో తాను ప్రేమించే బాల సరస్వతిని పెళ్లి చేసుకోటానికి చినముని అయిన అల్లును ‘’ఓ ఏరో ,ఎంట్రికో  మీ బూడిదో  దయ సేయండి దాన్ని తాకించి నా దాన్ని సేసుకొంటా ‘’అనే డైలాగ్ ,సుభద్రను రధం మీద ఎక్కించుకొని అర్జునుడు పారిపోయిఅనప్పుడు ‘’మోసం గురూ ‘’అని బలరాముడికి చెప్పినప్పుడు చదలవాడ వైవిధ్యభరిత నటన ప్రదర్శి౦చారు.1959లోవచ్చిన జంపన వారి కృష్ణ లీలలు లో వెర్రి యాదవుడిగా  అలవోకగా నటించి నవ్వించారు .జయభేరిలో ‘’డప్పుల రాఘవులు ‘’పాత్రను హాస్యపు డప్పుతో మెప్పించారు .పల్లెటూరు సినిమాలో ప్లే బాక్ సింగర్  .పరివర్తనలో పిచ్చివాడుగా ,పెద్దమనుషులు లో శేషావతారంగా ,కన్యాశుల్కం లో గురజాడ వారి మర్చి పోలేనిపాత్ర పోలిసెట్టిగా ,చరణ దాసీ లో హనుమంతుగా ,తోడి కోడళ్ళు లో తిరుపతయ్యగా ,1957లో వచ్చిన సంకల్పం లో లక్ష్మయ్యగా ,అన్నా తమ్ముడు లో బ్రహ్మాండంగా ,మా బాబులో రాముగా ,సిరి సంపదలు లో అ౦జయ్యగా ,ఆత్మబలం లో ఆనంద్ తండ్రిగా ,మర్మయోగిలో బైరాగిగా ,ఆస్తిపరులలో మిరియాల పరాత్పర రావుగా ,1967లో వచ్చిన ఆడపడుచులో సుఖాలుగా ,1968లో విడుదలైన లక్ష్మీ నివాసం లోనూ చదలవాడ చెరగని ముద్ర తో నటించి పాత్రలకు జీవం పోశారు .అమాయకపు చిరునవ్వు ,మెలికలు తిరుగుతూ మాట్లాడటం ,కళ్ళలో కొంటెతనం ,ముతకపంచ అరచేతుల చొక్కా పైన తుండు సాధారణంగా ఆయన వేషం .

 స్నేహితుడు శ్రీరామ మూర్తి ,ఇతరుల ప్రోత్సాహం తో  చదలవాడ ‘’సతి తులసి ‘’పౌరాణిక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు తనకు ప్రజానాట్యమండలి లో సహచరుడు అయిన శ్రీ వి .మధుసూదనరావు ను దర్శకునిగా పరిచయం చేస్తూ  సీనియర్ కేరక్టర్ నటుడు శ్రీ గుమ్మడిని ‘’జలంధర ‘’పాత్రకు ఒప్పించి  నిర్మించారు .

   విక్టరి మధు సూదనరావు అనబడే డైరెక్టర్  శ్రీ వి.మధుసూదనరావు  చదలవాడ గారి అల్లుడే .మొత్తం సుమారు 150 సినిమాలో వైవిధ్యభరిత పాత్రలనుపోషిస్తూ నటించిన చదలవాడ 1968లోరాత్రి పూట సినిమా షూటింగు కు వెడుతూ  తెలుగు చలన చిత్ర సీమనుంచి చదలేటి  స్వర్గ సీమకు తరలి వెళ్ళారు .   

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.