నగజా శతకం

నగజా శతకం
కృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ మతోద్ధారకులు శివశ్రీ చిదిరి మఠంవీరభద్రశార్మగారి పాదపద్మాలకు సమర్పించినట్లు తెలిపింది ..’’పతి బూజ బాయక ద్రుతమతిని నాగార్యుని –క్షితి గలదాక మతిలో కొని యాడెద .లక్షణము నేర్పిన లక్షణ వంతుని –కొనియాడుచు తనివి చెందేద .పిన్నపెద్దలను చిన్ని యన్నలను ,పండిత వరులను దండి కవీ౦ద్రులను –ఒప్పులగొని ,తప్పుల ద్రోసి –తప్పక నాకవితకు మెప్పుకు తేగలరని –కరములు మోడ్చి శరణు చేసేద ‘’అని విన్నవించింది .చిదిరి మఠం వీరభద్ర శర్మగారు ‘’తన ముద్దుల మేనకోడలిని సంబోధిస్తూ ,భక్తీ నీతితి సదాచారాలను సరళ భాషలో ‘’నగజా శతకం ‘’రాసింది .ఆధునిక ఆంద్ర శైవ ప్రపంచం లో ఈమె ఒక్కతే శతకకర్త అవటం అత్యంత మోదం కలిగించింది .భావ ప్రౌఢిమ గొప్పగా ఉంది .వయసున చిన్న గుణమున మిన్న .’’అని అభిప్రాయం వెలిబుచ్చుతూ ఆశీర్వదించారు .నగజా కుమారి అనే తన మేనకోడలి ని సంబోధిస్తూ ‘’నగజా ‘’మకుటంతో కందపద్యాలలో రాసిన శతకం ఇది .అందంగా ఉంది .
మొదటిపద్యం –‘’శ్రీ గౌరీ ప్రాణేశుడు –బాగోగులు చిరాయువిచ్చి బ్రతికెడు దనుకన్ –శ్రీ గౌరియు కు౦కుమనిడి-బాగుగ నిన్ను మనుచునమ్మ వసుమతి నగజా ‘’అంటూ శివపార్వతుల ఆశీస్సులు మేనకోడలికి కోరింది .తర్వాత పనులు పూర్తీ చేసే విఘ్నేశుని ,వీరశైవ పంచా చార్యులను స్తుతించింది .’’అర్ధించిన వే-అరదంబుల నిచ్చు ‘’బసవేశుని ‘’భక్తితో కొలిచి ,చిదిరి మఠం వీరభద్రగురుస్వామిని ,దీక్ష ఇచ్చిన శంభు మూర్తిని ,తండ్రి వైద్యుడు పట్టిస వీరయ్యను ,తల్లి నాగమ దేవిని ,చిన్నతనం లో తన్ను పెంచిన సంగయ ,మల్లా౦బలకు ,విద్యాగురువు లక్కన మల్లికార్జున కు ,మతిమంతుడైన భర్త నాగార్యునికి ,పెద్దన్న బసవ ,సోదరులు యల్లమార్య ,వీరభద్ర లను ,అక్కయ్య మహాదేవిని స్మరించి ,భవభూతి బసవ,నన్నెచోళ,కాళిదాసు ,బూసా మల్లయ కవీశ్వరులను 18పద్యాలలో స్తుతించింది .
19వ పద్యం నుంచి నీతులు ఉపదేశాలు రాసింది .’’సిరి గలదంచును పురుషులు –పరుల హింసింప జనదు పాండవులను నా –కురునాధుడు నిందించుట –ధర బడెగా భీము చేత దప్పక నగజా ‘’అన్నది .దీక్ష వదలక కష్టాలకోర్చి కాపురం నిలబెట్టుకొని పుట్టింటి కీర్తి పెంచాలి .పతి భక్తీ భవనాశం ,దానికి మించిన వ్రతం లేదు .ఇరుగుపోరుగువారితో అనురక్తి తో ఉండాలి .బంధువులను గౌరవించాలి ..’’హృదయేశు మీద ప్రేమను మదిలో నిల్పుకోవాలి ‘’.కష్టాలొస్తే నిష్టూరాలు పలకరాదు.గురునిందా పరనింద పరమేశు నింద చేటు తెస్తాయి .’’కట్టిన శివ లింగము నె-ప్పట్టునబాయంగారాదు’’అలావదిలేస్తే కులట అనిపించుకొంటుంది .సత్యమే యశానికి మూలం ,భవమోహనాశనం ,శీలం నిలిపేది .’’పంచాక్షరి భవహరణము –పంచాక్షరి మోక్షనెలవు ‘’.విభూతి రుద్రాక్షలు చేతులలో తాళంతో గౌరీపతిని కీర్తించే వాడే యతి .శివభక్తితో మార్కండేయుడు చిరాయువు పొందాడు .అంగం మాయామయం ,లింగం సర్వేశుని గుర్తు .లింగాన్ని అంగాలను ఏక దృష్టితో చూడాలి .’’అప్పే ముప్పును తెచ్చును –తప్పే యపకీర్తి తెచ్చు ‘’.సురతాగితే ఆరోగ్యం సిరి వంశ ప్రతిష్ట స్థిర చిత్తం విజ్ఞానం అన్నీ నశించిపోతాయి .’’ముక్కంటి మంత్రం ఎక్కడ ఉంటె అక్కడ శివుడు ఉంటాడు .
చెడి బతకటం తేలిక బ్రతికి చెడటం చాలా కష్టం .కాలాన్ని పురుషార్ధగతికి వెచ్చించాలి .’’కక్షలు పుట్టించటానికి ,రక్షకులకు చేటు కూర్చి లక్షణ పరులే –పక్షము నాతొ సరియని –శిక్షల గనకుండి వదరు చెనటియు నగజా ‘’అంటూ క్షకార ప్రయోగంతో అక్షరరమ్యత చేకూర్చింది కవయిత్రి .శిల ,మణి భేదంతో ఉంటాయి మారవు .అలాగే దుర్మార్గులు ,సత్పురుషులు ఉంటారు .కులకాంత కు సద్విద్య బోధించిన వాడే గురువు .’’శ్రీ గురు పదపద్మమ్ములు-భోగీశుని లింగ మాత్మ బోల్పుగ నుంచే –రాగంబుల బడయకెతా –బాగుగ జరియించు వాడె భక్తుడు ‘’
‘’జిలిబిలి పలుకుల పలుకుచు –కులికెడు మురిపెంపు మేనకోడలవనుచున్ –లలి న’’న్నత్తా’యనుటను – యిల నీకే కృతి నొసంగి తింపుగ నగజా ‘’అని మేనకోడలు కు అంకితమిచ్చినది మేనత్తకవయిత్రి .పద్యం రాయటం నేర్పిన అన్న ను స్మరించినది .’’లక్కన వంశోద్భవనై –చుక్కావారింటమెట్టి సుజనావలికిన్-మొక్కులిడి వీరభద్రమ-ఇక్కబ్బము చెప్పెనమ్మ ఇంపుగ నగజా ‘’
చివరి 107,108పద్యాలు
‘’జయజయ హరినుత పాదా – జయజయ ప్రమధార్తిహరణ జయ చంద్రధరా –జయజయ పురహర యనుచును –నియమంబుగ దలతు మతిని నిక్కము నగజా ‘’
‘’మంగళమో భవ హరణా –మంగళమోభక్త పోష మాపతి రమణా-మంగళమోశివ య౦చును –పొంగుచు నే పాడుచుందు ముద్దుల నగజా ‘’
ఈశతకం లో భక్తి,నీతి ,సద్వివేకం ,స్త్రీపురుషులకు సద్ధర్మ జీవన విధానం ,శివ భక్తీ పారమ్య౦ పుష్కలంగా ,ధారశుద్ధి కల సరళపదాలతో మనసుకు ఆకర్షణ కలిగించే రీతితో కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మతన ప్రతిభను చాటింది .కుమారీ శతకంలాగా ‘’నగజా ‘’శతకం కూడా చక్కని శైలిలో నడిచింది .సాహిత్యం లో ముఖ్యంగా శైవ సాహిత్యం లో చిరయశస్సు పొందే ఉంటుంది .కానీ మన వారి దృష్టిలో పడలేదని పించింది .ఆధునిక శైవ కవయిత్రిగా వీరభద్రమ్మ గొప్ప స్థానం పొందింది .ఆమెనూ ఆమె శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగి నందుకు మహదానందంగా ఉంది .వల్లూరి పాలెం మా ఉయ్యూరుకు సుమారు అయిదారు కిలో మీటర్ల దూరం లోనే ఉన్నా ,ఈ కవయిత్రి గురించి నాకు ఇప్పటిదాకా తెలియక పోవటం నా అజ్ఞానమే .మా అబ్బాయి శర్మ ఇలాంటి కవులను శతకాలను వెతికి పంపించి నాతొ రాయిస్తున్నాడు .అతడికి అభినందనలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.