మాన్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు –కొన్ని జ్ఞాపకాలు
నేను 1963కృష్ణా జిల్లాపరిషత్ లోసైన్ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయి మొట్టమొదటిసారిగా దివితాలూకా మోపిదేవి హైస్కూల్ లో ఉద్యోగం లో చేరాను .అప్పటికే కృష్ణా జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ గా పని చేసి జిల్లా కాంగ్రెస్ నాయకులుగా పేరుపొందిన శ్రీ కాకాని వెంకటరత్నం గారి ఆశీస్సులతో ఉపాధ్యాయ పెద్దలచే ఏర్పాటు చేయబడిన ‘’కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ ‘’మంచి ఉచ్చస్థితిలో ఉంది .కొత్తగా చేరిన మేమంతా గిల్డ్ సభ్యులం అయ్యాం .అప్పుడు కృష్ణా జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు .ఆయన గిల్డ్ కు గోప్పమద్దతుదారు .ఆయన 27 సంవత్సరాలు చైర్మన్ గా పని చేశారు .కాకాని గారు ఎన్నెన్నో హైస్కూల్స్ స్థాపిస్తే పిన్నమనేని వారు వాటి అభివృద్ధికి బాగా సహకరించారు .సమర్ధులైన ఉపాధ్యాయుల్ని నియమించారు .వీరిపాలనలో కృష్ణా జిల్లా విద్యారంగం మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లింది .పబ్లిక్ పరీక్షా ఫలితాలు చాలాబాగా ఉండేవి .సమర్ధులైన ఉపాధ్యాయులు విద్యారంగానికి గొప్ప సేవ చేశారు .దీనికి గిల్డ్ కూడా దోహదం చేసింది .అలాగే రైట్ కమ్యూనిస్ట్ నాయకుల సపోర్ట్ తోపనిచేసే యు .టి.ఎఫ్ .అనే సంస్థకూడా ఉంది .దీనినాయకులు శ్రీ పి జనార్ధనరావు గారు .లెఫ్ట్ కమ్యూనిస్ట్ నాయకుల సపోర్ట్ తో శ్రీ మర్రివాడ గోపాలకృష్ణమూర్తి,శ్రీ నేక్కలపూడి . రామ కోటేశ్వరరావు మొదలైన వారున్న మరో సంస్థకూడా ఉన్నది మూడూ ఉపాధ్యాయ సంక్షేమం కోసం పని చేసేవే .మేము మాత్రం గిల్డ్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళం .గిల్డ్ అనేక అకాడెమిక్ కార్యక్రమాలు నిర్వహించింది .సిలబస్ మారిఅనప్పుడు టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు పెద్దఎత్తున సమావేశాలు జరిపి సమీక్ష చేసి ప్రభుత్వానికి తెలియజేసేది .పరీక్షా పత్రాల లో మార్పులపై అవగాహన సదస్సులేర్పరచేది ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేది .దీనికి జిల్లాలో ప్రముఖులైన హెడ్ మాస్టర్స్ అందరూ పాల్గొనేవారు
అప్పుడే శాసనమండలికి ఉపాధ్యాయుల తరఫున జిల్లాకు ఒకరు ఉండేవారు .శ్రీ పి శ్రీరామ మూర్తిగారు ఒకసారి ఎన్నికయి అమూల్య సేవలందించారు ఆయన అంటే అందరికీ మహాగౌరావమే .ఆయన కమ్యూనిస్ట్ ల ప్రతినిధి అనే పేరు వచ్చింది .రెండో సారి ఆయన పోటీకి నిలబడ్డారు .గిల్డ్ శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారిని పిన్నమనేని వారి సపోర్ట్ తో నిలబెట్టింది .హోరాహోరీ ప్రచారం జరిగింది .శ్రీరామమూర్తిగారికి మండలి కృష్ణారావు గారు కుడిభుజంగా నిలిచారు .ప్రతిస్కూల్ ను,కాలేజీని సందర్శించి వోట్లు వేయమని అభ్యర్ధులు అర్ధించేవారు .అప్పుడు హెడ్ మాస్టర్లు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చేది .అధికారం లో ఉన్నచైర్మన్ గారు సపోర్ట్ చేస్తున్న అభ్యర్ధికి వోటువేయి౦చాలా ?పెద్దమనిషిగా విద్యావేత్తగా ఉన్నవారికా అని సందేహం .కొల్లూరికి ‘’తెలుగు విద్యార్ధి ‘’మాసపత్రిక ఉంది కమ్యూనిస్ట్ లకూ వారి పత్రికలున్నాయి .సానుభూతి పరులున్నారు .
గిల్డ్ సభ్యులుగా మాకు మండలి వారంటే కొంచెం అసూయ ,ఈర్ష్య భావం వచ్చేట్లు చేశారు మానాయకులు .కనుక చైర్మన్ గారినిఎదిరించే దమ్ము ఉన్న వాళ్ళు తక్కువ .దీనికి లోకల్ పాలిటిక్స్ కూడా తోడ్పడ్డాయి .నాకు గుర్తున్నంతవరకు పెడసనగల్లు హైస్కూల్ లో మండలి వారు, శ్రీరామమూర్తిగారు మాట్లాడి వెడుతుండగా మేము అంటే గిల్డ్ వాళ్ళం పిన్నమనేని గారు కొల్లూరి వారితో కలిసి వెళ్లి టీచర్స్ ను కలిసి మీటింగ్ పెట్టి వోట్లు అభ్యర్ధించా౦.అప్పుడే మండలి వారిని మొదట సారి చూడటం .తెల్ల ఖద్దరు పంచే ,అరచేతుల చొక్కా,నవ్వుతోన్న వెడల్పు ముఖం .గౌరవనీయంగా కనపడ్డారు .మాలో నాటిన విషబీజాలు నాకు ఆయన లో కనిపించలేదు . మమ్మల్నందర్నీ పలకరించి వెళ్ళిపోయారుమండలి .పేరుగుర్తులేదుకానీ మరొక హైస్కూల్ లో మేము మాట్లాడి వెళ్ళాక మండలి వారి బృందం వచ్చింది .పరస్పరం గౌరవంగా నే చూసుకొన్నాం .ఏదిఏమైనా కొల్లూరి మంచి మెజార్టీతో ఎం. ఎల్. సి. అయ్యారు .మిగిలిన జిల్లాల ఎ౦ ఎల్ సి లనుకలుపుకొని ఒక ఫ్రంట్ గా ఏర్పడి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేవారు .రాయలసీమకు చెందిన శ్రీ భుజంగరావు వీరి నాయకుడని గుర్తు .తర్వాత జరిగిన రెండు ఎలేక్షన్లలో కొల్లూరినే గెలిపించాం .ఆయన సెనేట్ మెంబర్ గాకూడా అయ్యారు .నాకు ఒకరకంగా మెంటార్ .కొల్లూరి పిన్నమనేని ‘’కృష్ణార్జునులు’’గా ఉపాధ్యాయుల సేవలో ధన్యులయ్యారు .గిల్డ్ మీటింగ్ లకు ఒకసారి శ్రీ పివి నరసిహారావు గారినీ పిలిపించి మాట్లాడించారు ముఖ్యమంత్రులు ,మంత్రులు సరేసరి .ఆకాలం ఉపాధ్యాయులకు స్వర్ణయుగం .బెజవాడలో కాకాని గిల్డ్ హో౦ ,బందరులో పిన్నమనేని గిల్డ్ హో౦ నిర్మాణాలు జరిగి ఉపాధ్యాయుఅలకు చాలా సౌకర్యంగా ఉండేవి .బెజవాడ హో౦ నిర్వహణ లయోలాకాలేజి లెక్చరర్ శ్రీ వై రాజగోపాలరావు గారు ,బందరు హో౦ ను పోట్టిశర్మగారు చూసేవారు .పైన చెప్పినట్లు మండలివారిని ప్రత్యక్షంగా రెండు సార్లు చూశాను .నన్ను ఉయ్యూరునుంచి విస్సన్న పేట కు బదిలీచేస్తే ,ఎలామళ్ళీ ఉయ్యూరు రావాలిఅనుకొని పరిపరివిధాల ఆలోచించి మండలి వారిని కలిస్తే పని అవుతుందేమోనని అవనిగడ్డకు వారింటికి వెడితే ఆరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు .అలా మూడో సారి చూడలేక పోయాను . అయితే ఆయన రోజూ కూర్చునే అరుగు ను మాత్రం చూసిన గుర్తు .
ఇప్పుడు మరికొన్ని విషయాలు –నేను మోపిదేవిలో పని చేస్తున్నప్పుడు వారంలో ఒకరోజు అవనిగడ్డలో సంత జరిగేది .నేను అప్పుడు పెదప్రోలులో కాపురం .నేనూ లెక్కలమేస్టారు జె.వి .రామణారావుగారు మోపిదేవినుంచి సైకిల్ మీద అవనిగడ్డ వెళ్లి కూరలు వారానికి సరిపడా కొని తెచ్చుకొనేవాళ్ళం .అప్పుడే కృష్ణానదికి ఆక్విడేక్ట్ మునిగగే వరద వస్తే చూశాం ఫామిలీ తోవెళ్లి .ఆవరదలలో నష్టపోయిన వారిని మండలివారు ఎలా ఆదుకుంన్నారో రోజూ పేపర్లలో వార్తలు,ఫోటోలు వచ్చేవి .అవనిగడ్డలో ఎప్పుడు సభ జరిగినా మండలి వారు ఉండేవారు వారికితోడు వారు నిలబెట్టి గెలిపించిన మండలాధ్యక్షులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ గారు తప్పక ఉండేవారు .సన్నగా పొడుగ్గా తెల్లఖద్దరు పంచె లాల్చీ ఖండువాతో అన్నప రెడ్డి గారు చాలా ఎట్రాక్టివ్ గా ఉండేవారు .శ్రీ అంబటి బ్రాహ్మణయ్య ,భోగాదివారు కూడా మండలి ఆప్తకోటిలోని వారని గుర్తు .మా మోపిదేవి హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరావు గారి కజిన్ బ్రదర్ అవనిగడ్డ లాయర్ రాజకీయ విశ్లేషకులు శ్రీ తూమాటి బాలకోటేశ్వరరావు గారు తరచూ సభావేదికలను సుసంపన్నం చేసేవారు .
శ్రీ పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఒకవర్గం ప్రత్యెక ఆంద్ర ఉద్యమ౦ ఉవ్వెత్తున తెచ్చింది .అప్పుడు మంత్రివర్గం లో ఉన్న మండలి వారు ,శ్రీ భాట్టం శ్రీరామమూర్తిగారు మాత్రమె సమైక్య ఆంధ్రకు మద్దతు పలికారు అందరూ అవహేళన చేశారు .నిష్టూరాలాడారు .అవమానం చేశారు మీటింగులు పెట్టనివ్వలేదు .కానీ చలించలేదు .ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయచాతుర్యం చూపి ఉద్యమాన్ని సమసిపోయేట్లు చేసి శ్రీ జలగం వెంగళరావు గారిని ముఖ్యమంత్రిని చేసింది .అప్పుడు జలగం గారిని ‘’కోటిరూపాయల సిఎం ‘’అనేవారు .ఎందుకోతెలీదు .మండలివారు విద్యాశాఖా మంత్రి .అప్పుడే ఉపాధ్యాయుఅలు ఉద్యోగులకు జీతాలు బాగా పెరిగాయి.కేంద్రం డి.ఏ.పెంచినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అడగకుండానే దామాషా ప్రకారం కరువుభత్యం పెంచే ఏర్పాటు జలగం వారి పూనిక .అందుకే ఉద్యోగసంఘాలన్నీ ఆయన్ను అభినందించేవి .ముఖ్యమంత్రి జలగం ,విద్యా,సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మండలివెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు సదస్సు హైదరాబాద్ లో నిర్వహించి ప్రముఖుఅల౦దరినీ ఆహ్వానించి సత్కరించి న భూతో అనిపించారు .మాతెలుగుతల్లి పాట రాసిన శ్రీ శంకరంబాడి సుందరాచారినీ పాడిన శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి నిఘనంగా సత్కరించినట్లు గుర్తు .ఇది మండలి వారి దూరదృష్టి .తెలుగు భాషా సంస్కృతులపై ఉన్న ఆరాధనా భావాలకు నిలువెత్తు నిదర్శనం .అంతర్జాతీయ తెలుగు కేంద్రానికిమొదటి అధ్యక్షులుగా వ్యవహరించారు మండలివారు .ఆతర్వాత అంతర్జాతీయ తెలుగుకేంద్రం ‘ను ’ మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. ఆనాటి ముఖ్యనత్రి శ్రీ రాజశేఖరరెడ్డి .
గుంటూరు జిల్లాను దగ్గర చేసే కృష్ణానదిపై దివిసీమ లోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు నిర్మించి మండలి వేంకట కృష్ణారావు వారధిగా నామకరణం చేసి గౌరవించారు .అన్నిటికంటే ముఖ్యవిషయం మండలి వారి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది.
వీటన్నిటికి మించి 1977నవంబర్ 19 శనివారం రాత్రి వచ్చిన కనీవినీ ఎరుగని దివిసీమ ఉప్పెన భీభత్సం తలుచుకొంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది .వేలాది మంది మరణం లెక్కలేనన్ని పశునష్టం పంట నష్టం .ఇది చూసి మండలివారి హృదయం ద్రవించింది భోరున ఏడ్చేవారు ఎవరువచ్చినా .అయనా ధైర్యంగా నిలబడి కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వాన్నీ ఒప్పించి పెద్ద ఎత్తున సహాయ పునరాఆస చర్యలు చేబట్టారు .ఆ భీభత్సాన్ని నేను ‘’శనిరాత్రి ‘’అనే దీర్ఘకవితలో వర్ణించాను .ప్రముఖకవి నగ్నముని ‘’కొయ్యగుర్రం ‘’కావ్యంలో ఉప్పెన బీభత్సం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకారం, సామాన్యులుపడిన బాధలను నిరసిస్తూ రాశారు .నేను ఒకరోజు బస్సులో అవనిగడ్డ వెళ్లి అక్కడి నుంచి ఏది దొరికితే అది ఎక్కి భావదేవరపల్లి ,మొదలైన ప్రదేశాలు చూశాను ఇంకా అప్పటికి శవాల గుట్టలు ఉన్నాయి కంపు భరించలేకుండా ఉంది విద్యుత్ స్థంభం పైకి గడ్డిపరకలు కనిపించాయి అంటే అంత ఎత్తున నీరు వచ్చిందని భావం .మండలివారి స్వగ్రామం భావదేవర పల్లి వినాశనం అంతా ఇంతాకాదు .ఒక మహా విలయం అప్పుడు జనం అనుభవించారు .హైస్కూల్ పై అంతస్తు పై తానూ ,హెడ్మాస్టారు మూడునాలుగు రోజులు ఉన్నట్లు అక్కడి లైబ్రేరియన్ తర్వాత ఉయ్యూరుకు బదలీ అయిన శ్రీ నా౦చారయ్య నాతో చెప్పారు .ఆర్ ఎస్ ఎస్ కాంప్ పెట్టి పెద్దఎత్తున సహాయ సహకారాలు అందిస్తోంది . ఉయ్యూరులో పనిచేసిన ఒక సంఘం నాయాకుడు నాకు అక్కడ కనిపించారు వివరాలు చెప్పారు .నాకు టీ ఇప్పించారు .అక్కడినుంచి చల్లపల్లి మీదుగా బందరు వెళ్లాను దారింతా అదే భీభత్సం .భయోత్పాతం .రాత్రికి ఇంటికి చేరా బండరునుంచి .ఆతర్వాత కొన్ని రోజులకు మా తమ్ముడు మరదలు వస్తే కారులో మళ్ళీ దివిసీమకు వెళ్లి వాళ్ళు సేకరి౦చి తెచ్చిన వస్త్రాలు డబ్బు పంచి వచ్చాం .ఉయ్యూరులో ఆర్ ఎస్ ఎస్ నాయకుడు శ్రీ మండా వీరభద్రరావు తో కలిసిమేమంతా వస్తువులు డబ్బు పెద్ద ఎత్తున పోగుచేసి దివిసీమకు పంపించి ఉడత సాయం చేశాం .మండలి వారు ఇత్యం విషణ్ణ వదనంతో పేపర్లలో కనిపించేవారు ఎంతో సాయం చేస్తున్నా ఆయనకు ఇంకా చాలా చేయాల్సి ఉందనే అసంతృప్తి ముఖం లో ప్రస్పుటంగా కనిపించేది .నిస్వార్ధసేవ చేసే తన కళ్ళ ఎదుట ఇంతటి భీభత్సం జరగటం ఆయన జీర్ణించుకోలేకపోయారు .ఇలాంటి మానవీయుల గురించే చెప్పిన –
‘’రవిశ్చంద్రో ఘనావృక్షాః-నదీ గావశ్చసజ్జనాః-ఏతేపరోపకారాయ భువి దీవేన నిర్మితా ‘’’ –సూర్య చంద్ర మేఘాలు నదులు ,ఆవులు సత్పురుషులు పరోపకారం కోసమే దేవునిచేత సృష్టి౦పబడ్డారు .అన్న మాటలు మాన్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి యెడ అక్షరాక్షర సత్య౦ .
ఇది వారికి శతజయంతి నివాళి
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-26-ఉయ్యూరు .
