కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1
బహునూతన కవి పఠాభి
‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తుంది ‘’పఠాభి ‘అని .అంత ప్రాచుర్యం పొందిన కవి ఆయన .రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు పుట్టాయి .అందరి కంటే భిన్నం గా ఆలోచించాలన్న భావం బలమైనది .తెలుగు కవిత్వానికి కొత్త రక్తం ఎక్కించాలని ఆరాటం పెరిగింది .చెప్పే ప్రతి మాటా కొత్తదనం తో ఆకర్షణీయం గా ఉండాలని పించింది .అందుకే ఛందస్సు బంధాల నుంచి కవిత్వాన్ని విముక్తి చేశాడు .కొత్త రూపు సంత రించాడు .ప్రయోగాలు చేశాడు .ప్రశసల తో బాటు అభిశంసలూ పొందాడు .అతనే తిక్కవరపు పట్టాభి రామ రెడ్డి .తన పేరునే ముందుగా కొత్తగా‘’పఠాభి ‘’గా మార్చుకొని నవ్య కవిత్వానికి నాంది పలికాడు .
‘’ఫిడేలు రాగాల డజన్ ‘’అన్న పేరు విన గానే పఠాభి జ్ఞాపకం వస్తాడు .అంతటి గాఢ ముద్ర ను తెలుగు కవిత్వం పై వేశాడు .ఆయన నెల్లూరు లో 1919 లో జన్మించాడు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఇంటర్ చదివాడు .ఇంటరె కాదు చలాన్నీ శ్రీ శ్రీ ని చదివేశాడు .రవీంద్రుని శాంతి నికేతన్ లో బి.ఏ.చేశాడు .చిత్రలేఖనం పట్టుబడింది .విశ్వకవి రవి కవి సాహిత్యం కరతలామలకం అయింది .కలకత్తా లో ఏం.ఏ.చదివాడు .అప్పటికే కలకత్తా ‘’dying city ‘’గా పేరు పొందింది .వేగవంతమైన జీవితం ,మురికి ఆవాసాలు, కటిక దరిద్రం ,వేదన ,రోదన లతో పిచ్చెక్కి పోయినట్లుండేది .ఇరుకు గదిలో కాపురం ఉన్నాడు .శాంతి నికేతన్ లో చదివినా అశాంతి మనసంతా ఆవరించుకొని ఉంది .చంద్రుడు చల్లగా కన్పించనే లేదు .వింతగా తోచాడు కవి పఠాభి కి .అ భావాలనే తర్వాత కవిత్వం లో పొందు పరచాడు .కుటుంబం మైకా వ్యాపారం చేసేది .తానూ పాలుపంచుకొన్నాడు .మద్రాస్ కు తరచు వెళ్తూఉండే వాడు .ఆ నగరం లో కొత్త నాగరకత ఆకర్షించింది .కవిత్వం మొగ్గ తొడిగింది .
ఫిడేలు రాగాల డజన్
‘’డజను ఫిడేలు రాగాలు ‘’అని సాధారణం గా అంటాం .అలా అంటే పఠాభి ఎందుకవుతాడు ?తిరగేసి కొత్తదనం తెచ్చాడు .ఛందస్సు పరిష్వంగం లోంచి బయట పడ్డాడు .తన ఊహా శక్తికి తగిన వాహిక ను ఎన్నుకొన్నాడు .మద్రాసు నగర జీవితాన్ని ఫిడేలు రాగాలలో బంధించాడు . తానే మేని ఫెస్టోతయారు చేసుకొన్నాడు .’’పద్యానికి ,గద్యానికి అంట కట్టి ,,గ్రాంధికానికి వ్యావహారికానికి పెళ్లి చేసి ,తెలుగు ,ఇంగ్లీష్ కు పొత్తు కలిపి కవిత్వం రాస్తాను .వచన కవిత్వం అనే పేరుతో పిలుస్తా .వాటిని దుడ్డు కర్రల్ని చేసి పద్యాల నడుము విరగ గోడ్తా ‘’అన్నాడు .తన కవిత్వం పూర్వ కవిత్వం కాదు ,నవ్య కవిత్వం కాదు ,భావ కవిత్వం కాదు ‘’నూతనములో బహు నూతన కవిత్వం ‘’తనది అని ప్రవర చెప్పుకొన్నాడు .అందుకే ఫిడేలు రాగాల డజన్ అసలు సిసలు మొదటి వచన కవితా గ్రంధం అయింది అన్నాడు ఆరుద్ర .పాశ్కాస్చవాయిద్యమైన ఫిడేలుతో కర్నాటక సంగీతం పలికించి నట్లు ఇంగ్లీష్ కవిత్వ రీతుల్ని తెలుగులో ప్రవేశపెట్టాడని విమర్శకాభిప్రాయం .ఈ పుస్తకానికి శ్రీ శ్రీ ‘’ఇంట్రో ‘’రాశాడు .అందులో ‘’విచిత్రమే సౌందర్యం ,సౌందర్యమే విచిత్రం ‘’అని తీర్మానించాడు .ఇదే ప్రసిద్ధ ఆంగ్ల కవి రచయితా విమర్శకుడు ఆస్కార్ వైల్డ్ అభిప్రాయం కూడా .తనను ‘’అహంభావ కవి ‘’గా పఠాభి పిలుచుకొన్నాడు .
‘’కాంగ్రెస్ పట్టాభి ని కాదు ,మరో పఠాభి ని ‘’అని నిర్వచిన్చుకొన్నాడు .తన కళ్ళలో టెలిస్కోపులు మైక్రోస్కోపులున్నాయన్నాడు .అన్నీ చూడగలనని చాలెంజి చేశాడు .’’చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని దండిస్తాను .’’అని తొడ గొట్టాడు .అతని ప్రవ్రుత్తి అహంకారం , విశ్రుమ్ఖలత .వైచిత్రీ .సెక్సు ప్రధానం గా సాగిన వచన పద్యాలవి .ఇంతటి తిరుగు బాటును అంత వరకు ఏ కవీ చేయలేదు .నగర జీవితాన్ని వస్తువు గా తీసుకొని రాసిన నవ్య కవుల్లోపఠాభియే మొదటి వాడు .అతనిది ‘’వస్తుభావ పద వైచిత్రి ‘’అంటారు నారాయణ రెడ్డి .సంఘం లోని కుళ్ళు ను బయట పెట్టాడు .అతని పద ప్రయోగ నూతనత్వం ఆశ్చర్యమేస్తుంది .’’బోగం పిల్ల చనులు బూందీ పొట్లాల లాగా ‘’ఉన్నాయి ‘’అంటాడు పచ్చి శృంగారాన్ని ఒలక బోశాడు .బోగం దాన్ని ‘’సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్ ‘’గా వర్ణించాడు .
సూర్య బింబం పఠాభికి ‘’ప్రభాత రేజరు నిసి నల్లని చీకట్ల గడ్డాన్ని షేవ్ జేయన్ పడిన కత్తి గాటు ‘’లా కనీ పించింది .ఇంగ్లీష్ పదాల్ని విచ్చల విడిగా వాడేశాడు .’’హైహీలు యాన ‘’,’’మద్రాస్సిటి ‘’,’’క్యాజ్జేయ ‘’వంటి పద చిత్రాలు కూర్చాడు .శాకా హారుల్ని ‘’శాఖాహారులు ‘’అన్నాడు .అక్షరాల్ని విడదీసి వినోదించాడు .అచ్చులో .అడ్డం గా ,నిలువు గా రాసిచమత్కారాలు చేశాడు .ట్రాఫిక్ పోలీస్ అతనికి ‘’నట రాట్టు లాగా నతండుకూడా మృత్యుంజయ నృత్యంబును సల్పుచుంటాడు సతతము ‘’గా కన్పిస్తాడు .విపరీతం గా ఆలోచించే మనస్తత్వం పఠాభిది.అందుకే రామాయణం లో సీత‘’రామయ్య సతి గా నుంట కన్న ,రావణుని ప్రియు రాలుగా ఉండి ,అమరుడిని చేస్తే బాగుంటుంది ‘’అనివిపరీతపు ఆలోచనా చేసిన వాడు వెర్రి పఠాభి .అందుకే పఠాభి ది ‘’ప్రైవేటు రోడ్డు దాని పై నేను తప్ప వేరెవరు నడవ లేదు‘’అంటాడు తాను కూడా విచిత్ర ప్రయోగ శీలి ప్రయోగ శీలి అయిన ఆరుద్ర .పఠాభి టెక్నిక్కు ,చమత్కారం ,తిరుగుబాటుతనం తెగింపు ఉన్న కవి గా ముద్ర పడ్డాడు .
పఠాభి పన్ చాంగం
అంత్య ప్రాసలతో దేశీ ఛందస్సులో కవిత్వం కూడా రాశాడు పఠాభి .’’కయిత నా దయిత ‘’అనగల ధైర్యం పఠాభి ది .పఠాభికి పేరు తెచ్చింది ‘’పఠాభి పన్ చాంగం ‘’.దీన్ని1946 లో రాశాడు .ఇందులో వాటిని ఉదాహరించని సాహితీ ప్రియుడుండడు .అవన్నీ ‘’శ్లేషక్రడలే’’ .శ్లేష హాయి తెలిసిన వాడు పఠాభి .’’పన్ లలో సంపన్నుడు పఠాభి‘’.అనిపించుకొన్నాడు ..’’నీలగిరి నీలిమలు ‘’కూడా రాశాడు .ఉదాత్తుడైన మనిషి పఠాభి .సోషలిస్టు భావాలున్న వాడు .రామ మనోహర లోహియాకు అతి సన్నిహితుడు పఠాభి .పఠాభి భార్య ‘’స్నేహలత ‘’ఎమెర్జెన్సి కాలం లో ఇందిరా గాంధి దౌష్ట్యానికి బలి అయింది .పఠాభి ‘’సంస్కార ‘’అనే ఆర్ట్ ఫిలిం తీసి దర్శకత్వం వహించాడు .దీనికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది .ఈ సినిమా ను అందరు ‘’నూతన దృశ్య కావ్యం ‘’అన్నారు .ఇంకొన్ని సినిమాలు నిర్మించి పేరుపొందాడు .ఆయన కుమారుడూ సినీ నిర్మాతే ..2006 లో పఠాభి మరణించాడు .పైలోకాల్లోను తన అహంభావం ప్రదర్శించి దేవ వేశ్యలను ‘’బహు బహు నూతనం గా ‘’వర్ణిస్తూ ఉంటాడేమో ?ఏమైనా శబ్దం లోంచి ‘’అగ్గి ‘’పుట్టించాడు పఠాభి .ఆయన‘’పన్ చాంగ పఠనం’’ తో శుభం కార్డు పలుకుదాం
1-‘’ఉద్యోగుల్లో రెండు రకాలు –ఒకరు చేసే వారు –మరొకరు కాజేసే వారు
2-కాంగ్రెస్ వాళ్లకు వడకటం తగ్గి –యేకటం హెచ్చింది
3-కవితా పట్టాభి షిక్తుడు పఠాభి
4-జిహ్వ పని వాదించుటే కాదు –ఆస్వాదించుట కూడా
.
మరో కవిని గురించి ఇంకోసారి
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -31-3-13- ఉయ్యూరు