పోరాటాల వేదిక ‘సృజన’ – సాహితీ మిత్రులు

 

సృజన- ఆ మూడక్షరాల పేరు ఇరవయో శతాబ్ది రెండో అర్ధభాగపు తెలుగు సాహిత్యంలో, సమాజంలో, సాంస్కృతిక రంగంలో, మేధో ప్రపంచంలో ఉజ్వల అరుణారుణ తార. ఒక చిన్న యువ సాహితీమిత్రుల బృందం పూనికతో స్పష్టాస్పష్ట అన్వేషణగా 1966లో ప్రారంభమైన సృజన పావుశతాబ్ది ప్రయాణం తర్వాత 1992లో అర్ధాంతరంగా ఆగిపోయేనాటికి తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, ప్రజాపక్షపాతానికి, విప్లవ దృక్పథానికి, ప్రామాణిక సృజనాత్మక రచనకు, విశ్లేషణకు అత్యంత ప్రభావశీల నిదర్శనంగా నిలిచిపోయింది.

26 ఏళ్ల యాత్రలో 200 సంచికలలో సృజనలో ప్రచురితమైన వెయ్యికి పైగా కవితలు, పాటలు, మూడు వందల కథలు, వందలాది వ్యాసాలు, పుస్తక సమీక్షలు, అనువాద రచనలు, రెండు వందల సంపాదకీయాలు సమకాలీన సమాజానికి, ప్రజాపోరాటాలకు, సాహిత్య అభివ్యక్తికి ఎప్పటికప్పుడు అద్దం పట్టాయి, ప్రతిఫలించాయి. సృజన వందలాది మంది సాహిత్యకారులను సృష్టించి, వారి సాహిత్యానికి మెరుగులు దిద్దింది. అప్పటికే సాహిత్య లోకంలో లబ్ధప్రతిష్ఠులైనవారి నుంచి అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటూ రచయితలైనవారి వరకు, మేధావుల నుంచి నిరక్షరాస్య సృజనకర్తల వరకు ఎందరికో వేదిక కల్పించడంలో, ఆరుగాలం శ్రమలో తీరిక దొరకని కష్టజీవులను రచయితలుగా మలచడంలో, తీర్చిదిద్దడంలో సృజన సాగించిన కృషి, నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణమైనవి. ఒక అత్యల్ప సంఖ్యాక బుద్ధిజీవుల, సాహితీమిత్రుల ఆధునిక సాహిత్య పఠన అవసరాలు తీర్చే ఆధునిక సాహిత్య వేదికగా ప్రారంభమైన సృజన నవనవోన్మేష ప్రయాణంలో, ప్రజానుకూల చలనంలో, సామాజిక విస్తరణలో లక్షలాదిమంది ప్రజలు ఎదురుచూసే పత్రికగా, వారి ఆరాటాలను గానం చేసేవేదికగా, పోరాటాలకు ఉద్యుక్తుల్ని చేసే కార్యకర్తగా, వారి పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసే వాహికగా తనను తానే అధిగమించుకుంటూ పురోగమించింది. పోరాటంలో నిమగ్నులైన నిరక్షరాస్య రైతుకూలీలు చదివి వినిపించుకునే పత్రికగా ఎదిగింది.

‘సృజన వ్యవస్థాపక సాహితీమిత్రులు వే.నరసింహారెడ్డి, నవీన్, రామన్న, వరవరరావు 1966 మే నెలలో వే.నరసింహారెడ్డి ఇంట్లో సమావేశమై, ఆధునిక సాహిత్య వేదికనొకదానిని ప్రారంభించాలని, దానికి శాస్త్రీయ దృక్పథం, ప్రయోగదృష్టి, సమకాలీన సామాజిక స్పృహ పునాదులుగా ఉండాలని నిర్వచించుకున్నారు. ఆధునిక కవిత్వ పత్రికగా నాలుగైదు సంచికలైనా నడచి ‘నిలిచిన’ ‘నవత’ లేని లోటును తీర్చడమే కాకుండా సాహిత్య కార్యరంగాన్ని విస్తృతపరచి సాహిత్య విమర్శ, కథ, సమీక్షలకు సముచితమైన స్థానం కల్పించాలన్నది కూడ ప్రేరణ. అప్పటికి అయిదో సాక్షి లోచన్. అండగా నిలిచిన పెద్దమనిషి కాళోజీ’ అని సృజన పుట్టుక గురించి వందో సంచిక తలచుకుంది.

అలా సృజన మొదటి సంచిక ‘సాహితీమిత్రుల’ నిర్వహణలో కాళోజీ ప్రచురణకర్తగా నవంబర్ 1966లో హనుమకొండ నుంచి వెలువడింది. వివరాలకు వరవరరావు జడ్చర్ల చిరునామా, వే నరసింహారెడ్డి హనుమకొండ చిరునామా అచ్చయ్యాయి. అప్పటి నుంచి 1970 వరకు సాగిన 16 సంచికలు తెలుగు సమాజంలోనూ సాహిత్యంలోనూ జరిగిన సంచలనాలన్నిటికీ అద్దం పట్టా యి. 1971లో సృజన మాసపత్రికగా మారింది. అప్పటికే ఝంఝా ప్రభంజనంగా వీస్తున్న విప్లవ రచయితల సంఘానికి అ«ధికార పత్రిక ఏర్పడకపోవడంతో సృజన విప్లవ సాహిత్యోద్యమ అనధికార వేదికగా నిలిచింది. “ఆధునిక సాహిత్యమంటే-శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, సమకాలీన సమాజం-వీని ప్రభావం వ్యక్తి జీవితంలోని అన్ని అంశాల మీద కొద్దో గొప్పో ఉన్నదని గుర్తించడం, ఈ గుర్తింపు ఉన్న రచనని ఆధునిక సాహిత్యంగా నిర్వచించవచ్చు. ఇతరమైన విలువల్ని కూడా విస్మరించకుండా.

ఇది ఒక సాహస ప్రయోగం. ఇది పత్రికా? కాదు ‘మారుతున్న కాలాన్ని, విస్తృతమౌతున్న జాగృతిని ప్రతిబింబించే, అనువదించే ఒక జౌటఠఝ’. దీనికి సంపాదకుడు లేదు, సాధకులే తప్ప. ప్రయోగశీలత్వం, సృజనాత్మక శక్తి, ఆధునిక దృక్పథం- ఈ జౌటఠఝ పునాదులు” అని మొదటి సంచిక సంపాదకీయం ‘ప్రయోగం’ రాసింది.

ఇవాళ తెలుగు సాహిత్యలోకంలో లబ్ధప్రతిష్ఠులైన వచనకవులు, పాటల రచయితలలో ఎందరో సృజన ద్వారా పరిచయమైనవారే, ప్రాచుర్యం పొందినవారే. మధ్యతరగతి కథల నుంచి ప్రజా జీవితాన్ని, పోరాటాలను, ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతిఫలించిన కథల దాకా సృజన తెలుగు కథ అభివృద్ధికి ఇచ్చిన కానుకలు అపారమైనవి. అల్లం రాజయ్య, ఎన్ఎస్ ప్రకాశరావు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అట్టాడ అప్పల్నాయుడు, కె రాంమోహన్‌రాజు, బిఎస్ రాములు వంటి కథకులెందరో సృజనతోనే తమ కథారచన ప్రారంభించారు. ‘అంపశయ్య’ నుంచి ‘కొలిమంటుకున్నది’ దాకా, చైనా అనువాద నవలలు ‘నా కుటుంబం’, ‘ఉప్పెన’ల దాకా ప్రయాణించింది సృజన. వ్యాసం, సమీక్ష ప్రక్రియలలో సృజన చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు అద్భుతమైనవి. త్రిపురనేని మధుసూదనరావు, కె.బాలగోపాల్, జెసి, సివి సుబ్బారావు, ఆర్ఎస్ రావు వంటి సామాజిక, సాహిత్య విమర్శకులూ వ్యాకర్తలూ ఎంద రో సృజన ద్వారానే ప్రాచుర్యంలోకి వచ్చారు. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంతోపాటు పుట్టి, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలతో వికసించి, దండకారణ్య ఉద్యమపు తొలిరోజుల దాకా సృజన ప్రజావిముక్తి పోరాటాలన్నింటికీ వేదికగా నిలిచింది. సృజన ప్రచురణలుగా ముప్పైకి పైగా పుస్తకాలు ప్రచురించింది.

ప్రజా సాహిత్య రంగంలో ఈ విస్తారమైన కృషి వల్లనే సృజన పాలకవర్గాల నుంచి తీవ్రమైన ఆగ్రహాన్నీ నిర్బంధాలనూ నిషేధాలనూ ఎదుర్కొన్నది. దాదాపు పది సంచికలు నిషేధానికి గురయ్యాయి. ఒక సంచిక నిషేధం కేసులో సంపాదకురాలు పి హేమలతకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వరవరరావును 1973 లో నిర్బంధించినప్పుడు, సికిందరాబాదు కుట్రకేసులో నిందితునిగా చూపినప్పుడు సృజన సంచికల రచనలే నేరారోపణలు. నిర్బంధం వల్లనే ఎమర్జెన్సీలో రెండేళ్లు, ఆటాపాటామాటా బంద్ కాలంలో నాలుగేళ్లు సృజన వెలువడలేకపోయింది.

సృజన ప్రారంభ సంచిక నుం చీ సంపాదకులుగా ఉన్న వరవరరావును 1973 అక్టోబర్‌లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టు చేయడంతో నవంబర్ సంచిక నుంచి సంపాదకురాలు, ప్రచురణకర్త, ముద్రాపకులుగా పి హేమలత బాధ్యత తీసుకున్నా రు. అయితే మొదటి సంచికలో చెప్పినట్టుగా సృజన సంపాదకత్వం ఎప్పుడూ ఒక్కరిది మాత్రమే కాదు. రెండో సంచిక నుంచి 1973 అక్టోబర్ సంచిక వరకూ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్‌గా వరవరరావు పేరు అచ్చయింది. ఆ కాలంలోనూ, చివరివరకూ ఎక్కువ సంపాదకీయాలు వరవరరావు రాసినప్పటికీ, సాహితీమిత్రుల బృందమే ప్రతి రచననూ సమష్టిగా చదివి, చర్చించి, తగిన మార్పులు చేసి ప్రచురణకు సిద్ధం చేసేది. సృజన వరంగల్‌లో ఉన్నన్ని రోజులూ ‘సాహితీమిత్రులు’ వారానికి ఒకరోజయినా సమావేశమయ్యేవారు. ఆ బృందంలో ప్రత్యేకంగా సభ్యత్వం ఏమీ లేదు. రచనల పఠనం, చర్చ జరుగుతున్న సమయంలో ఎవరు వచ్చినా అందులో భాగమయ్యేవారు.

‘సాహితీమిత్రులు’ మేధోశ్రమకూ శారీరకశ్రమకూ మధ్య అంతరం చెరిపివేసిన ఒక ఆదర్శవంతమైన సామూహిక కృషి. అందులో సిద్ధాంతకర్తలు, కార్మికులు, సృజనాత్మక రచయితలు, విశ్లేషకులు, లబ్ధప్రతిష్ఠులైన రచయితలు, వర్ధమాన రచయితలు, కేవలం పాఠకులు అందరూ ఉండేవారు. రచనలో, రచనల ఎంపికలో పాల్గొనేవారే రోజువారీ ప్రూఫ్‌రీడింగ్, సర్క్యులేషన్ పనులు, నెలనెలా ప్యాకింగ్, పోస్టింగ్ పనులు, సంచికల కట్టలు నెత్తినమోసే పనులు కూడ చేసేవారు. 26 ఏళ్లపాటు నడిచిన సృజనకు ఎప్పుడూ ప్రత్యేకంగా కార్యాలయం లేదు, వరవరరావు ఇల్లే కార్యాలయం. వరవరరావు పనిచేస్తుండిన చందా కాంతయ్య మెమోరియల్ కాలేజి, ఆ కాలేజి పోస్ట్ బాక్సులే దాదాపు మూడేళ్లు సృజన చిరునామా. 1971-72ల్లో అతికొద్ది కాలం మినహా ఎప్పుడూ వేతనానికి పనిచేసే పూర్తికాలం సిబ్బంది లేరు. వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులు స్వచ్ఛందంగా, ఉచితంగా అందించిన సేవలతోనే సృజన నడిచింది. మరణించిన వే.నరసింహారెడ్డి, డా.ఎ.రామనాథం, గోపి, సి.వి.సుబ్బారావు, కరుణ, కె.రాంమోహన్‌రాజు, బి.వెంకటేశ్వర్లు, కె.బాలగోపాల్ ఆయాకాలాల్లో ‘సాహితీమిత్రులు’గా సృజన అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. సృజన లోగో అక్షరాలు దిద్దిన పి.సి.నరసింహారెడ్డి ‘శుక్తి’ నుంచి బాపు, చలసాని ప్రసాదరావు, శీలా వీర్రాజు, చంద్ర, మోహన్, అంజన్‌బాబు, కాతోజు వంటి వారెందరో ముఖపత్రాలంకరణలో భాగం పంచుకున్నారు.
– సాహితీ మిత్రులు
(ఈ నెల 17న హైదరాబాద్‌లో సోమాజిగుడ ప్రెస్‌క్లబ్‌లో ఉ.10లకు సృజన 200 సంచికల డివిడి విడుదల జరుగనుంది)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.