గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ

గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక  సర్వోపచార పూజ

కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’లో అష్టమ శతకం ,,ముప్ఫై వ స్తబకం లో ఉమా దేవిని ధ్యాన ,ఆవాహనలతో కూడిన  సర్వోప  చార పూజను ఆధ్యాత్మికం గా ‘’ప్రమాణిక వృత్త ‘’శ్లోకాల తో చేసి ప్రత్యేకతను చూపారు .ఆ పూజలో మనమూ పాల్గొని తరిద్దాం .

‘’కృతేన సా నిసర్గాతో ద్రుతేన నిత్య మాననే –సితేన శీత శైలజా స్మితేన శం తనోతు మే ‘’అని మొదటి శ్లోకం తో అమ్మ వారిని ప్రార్ధించి ,ఎప్పుడూ ప్రకాశించే తెల్లని నవ్వుతో ఉమాదేవి తనకు శుభం కలిగించాలని కోరుకొన్నారు .మామూలు మనం చేసే నిత్య పూజ ను  ధ్యానం తో మొదలు పెడతాం .గణపతి ముని

‘’ప్రతి క్షణం వినశ్వర నయే విసృజ్య గోచరాన్ –సమర్చ యేశ్వరీం మనో వివిచ్య విశ్వ శాయినం ‘’

 అని రెండో శ్లోకం లో  నశించే శబ్దాది విషయాలను వదిలి చిత్త వృత్తులను వేరు పరచి చిత్త వృత్తులకు ,విషయాలకు ఆధారం గా ఉన్న చిద్రూపిణి అయిన పరమేశ్వరిని  అర్చించ మని మనసును కోరారు. ఇదే ధ్యానం .

విశుద్ద దర్పనేన వా విదారితే హృదాంబ మే –అయి ప్రయచ్చ సన్నిధిం నిజే వాపు ష్యగాత్మజే ‘’

దీనిలో ఆవహనం చెప్పారు .నిర్మలమైన అద్దంవంటి నా హృదయం లో  నీరూపాన్ని ప్రదర్శింపు అని దేవికి ఆవాహన చెప్పారు .

‘’పురస్య మధ్య మాశ్రితం సితం  య దస్తి పంకజం –అజాండ మూల మస్తుతే సురార్చితే తవాసనం ‘’’’నా శరీర మధ్యమం లో ముఖ్యమైన మూల స్థానం లో బ్రహ్మాండ మంత విలువ గల నా నిర్మల హృదయ పద్మం నీకు ఆసనం గా వేస్తున్నాను అని భావం .అంటే ఆసనం ఇచ్చారని భావం .తరువాత పాద్యం ఇవ్వాలి కదా –

‘’ఆఖండ ధారయా ద్రవ న్నవేందు శేఖర ప్రియే –మదీయ భక్తీ జీవనం దదాతు తేంబ పాద్యతాం  ‘’

బాలేందు శేఖర ప్రియా !అవిచ్చిన్న ధార గా ప్రవహించే నా భక్తి అనే ఉదకాన్ని నీకు పాద్యం గా సమర్పిస్తున్నాను .అంటారు .తరువాత అర్ఘ్యం ఇవ్వాలి

‘’వివాస నౌఘ మానస ప్రసాద తోయ మాంబ మే –సమస్త రాజ్ఞి హస్తయో రనర్ఘ మర్ఘ్య మస్తుతే’’

సర్వేశ్వరీ !సమస్త వాసనా రహిత మైన నా మనో నిర్మలత్వం అనే జలం నీకు అర్ఘ్యం అగుగాక  ‘’అని సమర్పిస్తారు .తరువాత ఉపచారం -పానీయం –

‘’మహేంద్ర యోని చింతనా ద్భవన్ భవస్య వల్లభే –మహారసో రసస్త్వయా నిపీయతాం విశుద్ధయే ‘’

శివకామినీ దేవీ !జననీ !ఇంద్ర యోని ధ్యానం వలన స్రవించే గొప్ప రుచికల అమృత రసాన్ని నా శరీర శుద్ధి కోసం నువ్వు త్రాగు .అని పానీయాన్ని సమర్పించారు .సుషుమ్నా నాడీ మార్గం లో దవడల మధ్య స్తనం లాగా వేలాడే దాన్ని ‘’ఇంద్ర యోని ‘’అంటారు .ఆ మార్గం లో ధ్యానించే వారికి రసం స్రవిస్తుందని యోగులు అంటారు .తరువాత స్నానం సమర్పించాలి .

‘’సహస్ర పాత్ర పంకజ ద్రవ త్సుదా జలేన సా –సహస్ర పత్ర లోచనా  పినాకినో భిషిచ్యతే ‘’

సహస్రం అనే కమలం నుండి స్రవించే అమృతా రసం తో పరమేశ్వరికి అభిషేకం చేస్తాను అని గణపతి ముని భావం .కనుక స్నానం అనే ఉపచారం పూర్తి అయినట్లే .ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం  సమర్పించాలి .-

‘’మమార్జితం య దిన్ద్రియై స్సుఖం సుగాత్రి  పంచభిః-తదంబ తుభ్య మర్పితం సుదాఖ్య పంచాకాయతమ్’’

మంగ ‘’ళాంగీ !మాతా!కన్ను మొదలైన అయిదు ఇంద్రియాల చేత దర్శనాదుల వలన నేను పొందిన సుఖం నీకు పంచామృత స్నానం అగుగాక .ఇక వస్త్రాన్ని అర్పించాలి –

‘’వసిష్ట గోత్ర జన్మనా ద్విజేన నిర్మితం శివే –ఇదం శరీర మేవ మే తవాస్తు దివ్య మంశుకం ‘’

మంగళ రూపిణీ గౌరీ!వసిష్ట గోత్రం లో పుట్టిన బ్రాహ్మణుడైన ఈ గణపతి ముని చేత రూపొందిన నా దేహమే నీకు దివ్య వస్త్రం అగుగాక .అని దేహాన్నే వస్త్రం గా దేవికి సమర్పించిన ఆధ్యాత్మిక మహా యోగి పుంగవులు కావ్య కంఠులు .నైష్టి కుడైన గణపతి ముని తన తపో బలం చేత దేవికి వస్త్రం కాదగిన అంతర్దేహాన్ని నిర్మించి దాని పరిపాక ప్రభావం వలన భౌతికమైన దేహాన్ని కూడా దేవికి దుకూలం అంటే వస్త్రం అవ్వాలని భావించారని దీని వ్యాఖ్యాత సంస్కృతం లో కపాలి శాస్త్రి గారు ,తెలుగులో శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారు వివరించారు .తరువాత యజ్ఞోప వీత సమర్పణ –

‘’విచిత్ర సూక్ష్మ తంతు భ్రున్మమేయ మాత్మ నాడికా –సుఖ ప్రబోధ విగ్రహే మఖోప వీత మస్తుతే ‘’

‘’చిదానంద స్వరూపిణీ !అద్భుతం సూక్షం గోచరం అయిన నా ఈ ఆత్మ నాడి అంటే సుషుమ్నా నాడి నీకు యజ్ఞోప వీతం గా సమర్పిస్తున్నాను .హృదయం నుండి ఆత్మ అనే జ్యోతిని భరిస్తూ ,సహస్రారానికి పోయే మధ్య నాడిని సుషుమ్న అంటారని మనకు తెలుసు .దీనినే బ్రహ్మ నాడి అని అమృత నాడిఅని కూడా అంటారు .ఇక చందన చర్చ –

‘’మహాద్విచిన్వతో మమ స్వకీయ తత్వ విత్తిజం –ఇదం తు చిత్తసౌరభం శివే తవాస్తు చందనం ‘’

‘’శ్రేయస్కరీ జననీ !సర్వోత్క్రు స్టమైన దాన్ని వెతుకుతున్న నాకు ఆత్మ తత్వ జ్ఞానం వలన కలిగిన సువాసన తో నా మనస్సు పరిపూర్ణ మైంది .అలాంటి నామనసు నీకు గంధం .ఇప్పుడు పుష్పాలతో అర్చన –

‘’మహేశ నారి !నిస్శ్వసన్ తధాయ ముచ్చ్వసన్ సదా-తవానిశం సమర్చకో మమాస్తుజీవ మారుతః ‘’

‘’మహేశ్వరీ!ఉచ్చ్వాస ,నిశ్వాస రూపం లో ఉన్న నా ప్రాణ వాయువు నీకు పూజా పుష్పం అగుగాక అని ముని సమర్పించారు తన ప్రాణాన్నే అమ్మకు.  .పిమ్మట ధూప సమర్పణ –

‘’విపాక కాల పావక ప్రదీప్త పుణ్య గుగ్గులుః-సువాసనాఖ్య ధూప భ్రుద్భవ  త్వయం  మమాంబ తే  ‘’

అమ్మా !నా పుణ్య పరిపాకం వలన కలిగిన సువాసనలే ,మంచి సంస్కార విశేషాలే నీకు ధూపం .ధూపం తర్వాత దీపం ఇవ్వాలి –

‘గుహావ తార మౌనినా మయీశ్వరీ ప్రదీపితా –ఇయం ప్రబోధ దీపికా ప్రమోద దాయికా స్తుతే ‘’

‘’పరమేశ్వరీ!కుమారస్వామి అవతారం అయిన శ్రీ రమణ మార్షి నాలో వెలిగించిన ఈ జ్ఞాన దీపం నీకు ఆనందాన్ని కలిగించుగాక .అంటూ తనగురువు రమణ మహర్షి తనలో జ్ఞాన దీపం వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టారని గురుస్తుతికూడా చేసి నట్లయింది  ముని –నాయన గారు .ఇప్పుడు మహా నైవేద్యం సమర్పించాలి –

‘’ఇమామయి  ప్రియా త్ప్రియాం మహా రసా మహాం కృతిం –నివేద యామి భుజ్యతా మియం త్వయా నిరామయే ‘’

ఆరోగ్య స్వరూపిణీ అంబా!అత్యంత ప్రియమై ,శుద్ధమై అధిక రుచి కల నా ఈ అహంకారాన్నే నీకు నైవేద్యం గా సమర్పిస్తున్నానని. గణపతి ముని అహంకార వర్జితులై సర్వ సమర్పణం చేశారు ..నైవేద్యం పిమ్మట తాంబూలం ఇవ్వాలి .

‘’సరస్వతీ సుదాయతే మనో దదాతి పూగతాం –హృదేవ పత్ర మంబికే త్రయం సమేత్యతే ర్ప్యతే’’

‘’అమ్మా ! వాక్కును సున్నం గా ,మనస్సును వక్కముక్కగా ,హృదయాన్ని తమల పాకుగా చేసి ఈ మూడింటి తో నీకు తాంబూలాన్ని సమర్పిస్తున్నాను .తాంబూల సేవనం తర్వాత నీరాజనం సమర్పించాలి –

‘’వినీల తోయ దాంతరే విరాజ మాన విగ్రహా –నిజా విభూతి రస్తుతే తటిల్లతా ప్రకాశికా ‘’

‘’నీల మేఘం మధ్య ప్రకాశిస్తూ నీ విభూతి విశేషమైనదీ అయిన నా ఆజ్ఞా చక్రం లోని మెరుపు తీగ నిన్ను ప్రకా శింప  జేసే నీరాజనం అగుగాక అన్నారు –నీరజనానంతరం మంత్రపుష్పం సమర్ప యామి కదా –

‘’స్వరోయ   మంత రంబికే ద్విరేఫ వత్స్వరన్ సదా-మమాభి మంత్ర్య దీసుమం దదాతి దేవి తేన్ఘ్రయే ‘

నా లోపల ఉన్న విశుద్ధ ప్రాణ రూపం అయిన స్వరం నిరంతరం తుమ్మెద లాగ మ్రోగుతూ ,అవ్యక్త నాదమై నా బుద్ధి అనే పుష్పాన్ని అభి మంత్రించి నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను అని గణపతి ముని సర్వోపచార ఆధ్యాత్మిక పూజ పరి సమాప్తి చేశారు .

     సాధారణం గా పూజ అవగానే విసర్జన చెప్పుతాం. ‘’శోభానాయ పునరాగామనాయచ ‘’  అని అంటాం కాని ఈ పూజలో గణపతి ముని ఆవాహన చెప్పరు .తమాషాగా ఏమంటారో చూడండి –

‘’తవార్చనం నిరంతరం యతో విధాతు మస్మ్యహం -న విశ్వనాధ పత్నితే విసర్జనం విధీయతే ‘’

అమ్మా  విశ్వేశ్వరపట్టమహిషీ ! నేను అవిచ్చిన్నంగా నిన్ను అర్చించాలి కనుక నీకు ఉద్వాసన చెప్పటం లేదు అన్నారు గడుసుపిండం అయిన నాయన .ఇది ఆధ్యాత్మిక పూజ కనుక ఆవాహనతో ప్రారంభమైనా విసర్జనతో అంతం కారాదని భావం .మానసిక పూజ కదా ఇది .

‘’వియోగ మిందు దారిణా న చేహ విశ్వ నాయకే మదంబ సోత్ర రాజతే తటిల్లతా శిఖాంతరే ‘’

అమ్మా విశ్వేశ్వరీ!ఇక్కడ చంద్ర ధరుడైన శివుడితో కూడా వియోగం లేదు .సహస్రార చంద్ర ధరుడు హృదయాకాశం లో ఉండి పరమాత్మ అయిన శివుడు నాభి పైన విద్యుల్లతా జ్వాల మధ్య ప్రకాశిస్తున్నాడుకడా అని చమత్కరించారు .ఇంకో శ్లోకం లో తన దేహాన్ని ఏకాంత మందిరం గా చేసుకొని ,అభిమానించి అందులో నాధుడైన పరమేశ్వరునితో విహరించ  మని ప్రార్ధించారు .దేవికి సహస్రారం శివునికి హృదయం ముఖ్య స్థానాలని కనుక ఈశ్వర సహితం గా హాయిగా విహరింప వచ్చునని అంతరార్ధం గా కోరుకొన్నారు .

     మరో శ్లోకం లో అజ్నాలుల లో లాగా  ,సోమరులలో లాగా  నిద్ర వల్ల ప్రయోజనం లేదని ఎల్లప్పుడూ తన హృదయం లో సంచరించమని కోరారు .ఇరవై నాలుగవ శ్లోకం లో

‘’అయం తవాగ్రిమః సుతః శ్రితో మనుష్య విగ్రహం –తనూజ వేశ్మ సౌష్టవం మ్రుడాని !పశ్య కీద్రుశం

భవానీ –నీ పెద్ద కోడుకు గణపతి మానవ దేహాన్ని (కావ్య కంఠులు )ధరించాడు ఆ నీ కొడుకు దేహం యొక్క సౌష్టవం ఎలాంటిదో పరిశీలించు అని తాను గణపతి అవతారమే నని ఖచ్చితం గా చెప్పుకొన్నారు తల్లికి .చివరి శ్లోక

‘’గణేశితు ర్మహాకవే రసౌ ప్రమాణికావలీ –మనోంబుజే మహేశ్వరీ ప్రపూజ నేషు శబ్ద్యతాం ‘’

‘’అమ్మా ఉమా దేవీ!గణపతి ముని నైన నేను ‘’ప్రమాణికా వృత్తాలలో ‘’రాసిన ఈ శ్లోక సముదాయం దేవీ పూజ లో అర్చకుని చిత్తకమలం లో ధ్వనించు గాక  ‘’అని నిత్య పూజలో ఉన్న అంతర్యాన్ని గ్రహించి దేవుళ్ళకు పూఅలు చేయమని, చేయించమని పూజారులకు అన్యాపదేశం గా సూచన ఇచ్చారు గణపతి ముని .

   ఈ ప్రమాణికా వృత్త శ్లోకాలు మహా రమణీయం గా నడుస్తాయి .చదువుతుంటేనే భక్తీ భావం ధారలై ప్రవహిస్తున్నట్లు ఉంటుంది నోటికి రావటమూ సులభమే .వీటిని  కంఠస్తంచేయటమే  కాక హృదయ గతం చేసుకొని తరిద్దాం .

68వ  భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో

        అన్నట్లు –గణపతి ముని గొప్ప స్వాతంత్ర్య సమార యోధులు .ఎన్నో సంస్కరణలు తెచ్చిన వారు అని  గుర్తు  చేస్తూ

  Flag of India.svg  image of Vasistha Ganapathi Muni

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-14-ఉయ్యూరు

 

‘’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.