తెరపై ఆయన కనిపిస్తే నవ్వులే నవ్వులు

కొన్ని తరాలను ఊపిరాడకుండా నవ్వించిన పేరు పద్మనాభం. నవ్వించడమే కాదు ఆ పేరు కవ్వించింది, కంటతడి పెట్టించింది కూడా. రేలంగి తరువాత అంత వెలుగు వెలిగిన హాస్యనటుడు పద్మనాభం. ఆయన కేవలం హాస్యనటుడే కాదు మంచి దర్శకుడు, ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత కూడా. నటునిగా బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని ఆయన వదిలిపెట్టలేదు. తీరిక చేసుకుని వెళ్లి తన బృందంతో నాటకాలు ప్రదర్శించేవారు. అలాగే అనుకరణవిద్యలో ఆయనకు సాటి ఆయనే. సెట్‌లో ఉన్నప్పుడు సహనటీనటులను వారి ముందే అనుకరించి నవ్వించేవారు. దర్శకుడు పి.పుల్లయ్య షఫ్టి పూర్తి వేడుకలకు అచ్చం పుల్లయ్యగా తయారై వచ్చి ఆయన్నే ఆశ్చర్యపరిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి అజరామరమైన గాయకున్ని తెలుగువారికి అందించిన బసవరాజు వెంకట పద్మనాభరావు సరిగ్గా 83 ఏళ్ల క్రితం కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రి పురంలో జన్మించారు కేవలం 12 సంవత్సరాల వయసులో సినిమాలపై అమితమైన వ్యామోహంతో, గాయకుడుగా ఓ వెలుగు వెలగాలని, అప్పటి చెన్నపురి మహానగరం చేరుకున్నారు. తొలిసారిగా మహానటి కన్నాంబను తన పాటలతో మెప్పించిన ఈ కుర్రాడు రాజరాజేశ్వరీ కంపెనీలో కళాకారుడుగా అడుగు పెట్టాడు. అలా చెన్నై నగరంలో ఎదుగుతూ, గూడవల్లి రామబ్రహ్మం పరిచయంతో ఆయన రూపొందించిన ‘మాయాలోకం’ సినిమాలో తెరంగేట్రం చేశారు. ఇలా సినిమాలు, సీఎస్‌ఆర్ వంటి సీనియర్ నటులతో కలిసి నాటకాలు ఆడుతూ, నాగయ్య గారి త్యాగయ్య సినిమాలో కనిపించి, 1947లో వచ్చిన ‘రాధిక’ సినిమాలో కృష్ణుడుగా మెరిసి ఎల్ వీప్రసాద్ వంటి మహామహుల అభిమానం సంపాదించుకున్నారు. చివరకు నాగిరెడ్డి చక్రపాణి పరిచయంతో వాహిని సంస్థలో ఉద్యోగిగా నటజీవితాన్ని రూపొందించు కున్నారు. 1949లో వచ్చిన షావుకారు చిత్రం పద్మనాభరావుని పద్మనాభంగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. రూ.150 ల జీతంతో ప్రారంభమైన ఆయన సినీజీవితం క్రమంగా వెలుగు నీడలను, మంచి చెడులను చూపిస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా పద్మనాభాన్ని తెలుగు సినీ ప్రేమికుల హృదయంలో నవ్వుల రేడుగా నిలిపింది. నటుడుగా పద్మనాభం జీవితానికి గూడవల్లి రామబ్రహ్మం ఊపిరి పోస్తే, దిగ్ధర్శకుడు కేవీ రెడ్డి మెరుగులు దిద్దారు. షావుకారు తరువాత ‘పాతాళభైరవి’ సినిమాలోని డింగరీ పాత్ర పద్మనాభానికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. పొట్ట చేత పట్టుకుని సినిమాలో చేరాలనే కోరికతో మద్రాసు చేరుకున్న ఆయన తరువాత కాలంలో 80 మందికి పైగా దర్శకులతో 400 సినిమాలలో పనిచేశారు. పొట్టివాడైనా గట్టివాడే అనిపించుకున్నారు.
నిర్మాతగా, దర్శకుడిగా..
జూ నటుడుగా ఒకస్థాయికి ఎదిగిన ఆయన నిర్మాతగా కూడా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై నాటకాలను ప్రదర్శించిన పద్మనాభం చిత్ర నిర్మాణ సంస్థకు కూడా అదే పేరు పెట్టుకున్నారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘దేవత’లో ఎన్టీఆర్ హీరోగా నటించడం ఒక విశేషమైతే, సావిత్రి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. వీరిద్దరి సహకారంతో అనుకున్నరీతిలో చిత్రాన్ని పూర్తి చేయగలిగారు పద్మనాభం.
జూ ఈ సినిమా విజయం సాధించడంతో భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘ఇదేమిటి’ నాటకం ఆధారంగా ‘పొట్టి ప్లీడరు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం టైటిల్ పాత్రను పోషించగా, శోభన్‌బాబు, గీతాంజలి జంటగా నటించారు. 1967లో వచ్చిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం పద్మనాభానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ చిత్రంతోనే ఆయన గాయకునిగా తెలుగువారికి గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రహ్హ్మణ్యానికి తొలి సినిమా అవకాశం ఇచ్చారు.
జూ ఈ మూడు చిత్రాలకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, శ్రీశ్రీరామకథ’ సినిమాతో ఆయన దర్శకునిగా మారారు. 1969లో పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘కథానాయిక మొల్ల’ చిత్రం రసజ్ఞులను మెప్పించడమే కాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
జూ అలాగే తుఫాను బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ సారధ్యంలో 40 మంది నటీనటులు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మద్రాసుకు తిరిగివచ్చిన తరువాత ఆ కార్యక్రమాలను మళ్లీ విక్రం స్టూడియోలో ‘సినిమా వైభవం’గా చిత్రీకరించారు. కృష్ణ, విజయనిర్మల, ప్రభాకరరెడ్డి, జమున, చలం, శారద, రాజబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. దీనిని ఆ తర్వాత థియేటర్లలో ప్రదర్శించినప్పుడు ఈ ప్రయోగానికి మంచి స్పందన లభించింది. ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘పెళ్లికాని తండ్రి’ (1976). హిందీలో హాస్యనటుడు మహమ్మద్ నటించిన ‘కువారా బాప్’ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పద్మనాభం తనయుడు మురళి కూడా నటించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పద్మనాభం నిర్మించిన ‘ శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో గెస్ట్‌గా హీరో కృష్ణ నటించారు. ఈ వేషం ఆయన కెరీర్‌కు బాగా ఉపకరించింది. ఆ కృతజ్ఞతతోనే తను నటించిన చాలా చిత్రాల్లో పద్మనాభం హాస్య భూమికలు పోషించడానికి కృష్ణ పరోక్షంగా కారకులయ్యారు. అంతేకాదు పద్మనాభం నిర్మించిన ‘పెళ్లికాని తండ్రి’ సినిమాలో కూడా గెస్ట్‌గా నటించారు.
జూ దేవత (1964), పొట్టి ప్లీడర్ (1966), శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967), శ్రీరామకథ (1969), కథానాయిక మొల్ల (1970) చిత్రాలతో పాటు ‘జాతకరత్న మిడతంభొట్లు’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎస్.వి. రంగారావు, కన్నడంలో నాగయ్య కోయదొరలుగా నటించారు. గుహనాథన్ రాసిన తమిళ నాటకం ‘కాశీ యాత్ర’ ఆధారంగా ఆయన నిర్మించిన ‘ఆజన్మ బ్రహ్మచారి’ చిత్రంలో నాగభూషణం టైటిల్ పాత్ర పోషించారు. రామకృష్ణ, గీతాంజలి ఇందులో జంటగా నటించారు. ఆ తర్వాత భానుమతి ప్రధాన పాత్రగా ‘మాంగల్య భాగ్యం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం, రమాప్రభ జంటగా నటించారు. ఇద్దరివీ డబుల్స్ రోల్స్ కావడం విశేషం.
గాయకుడిగా
జూ అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన పద్మనాభం మిమిక్రీ చేయడంలో సిద్ధహస్తులు. సీనియర్ నటులను సెట్‌లో అనుకరిస్తూ ఇతరులకు వినోదం పంచేవారు. అలాగే ఆయన మంచి గాయకుడు కూడా. ‘దేవత’ సినిమాలో ‘మా ఊరు మదరాసు.. నా పేరు రాందాసు’ పాట పాడటమే కాకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం ‘తేనె మనసులు’లో ఆయనకి ప్లేబ్యాక్ పాడారు. సినీరంగానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి పద్మనాభం. కొంతమంది నటులకు రీప్లేస్‌మెంట్ ఉండదు. అలాంటివారిలో పద్మనాభం ఒకరు.


