కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి

దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన పోతున్న నేను నాలో పగలబడి, విరగబడి నవ్వుకున్నాను.ఏ దేవుడో చెప్పను. చెప్పలేను, ఇష్టం లేదు కాబట్టి. శుద్ధ నాస్తికుణ్ని.***”విన్నావుగా” అన్నాడు శాస్త్రి ఆ రోజు ఉదయం మా ఇంటికి వచ్చి.”విన్నావా?” అని అడిగితే అది ప్రశ్నార్థకం. “వినలేదూ?” అంటే పరిహాసం. అదేదీ లేకుండా “విన్నావుగా” అనే మాటలో నేను వినే వుంటాననీ, ఒకవేళ ఏ కారణం చేతనైనా వినకుండా వుంటే విని తీరాలనీ వాని మాటలో అంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానైనా కనబడుతూనే వుంది.”వినలేదు” అన్నాను.”ఏమిటి?””ఏమిటో తెలిసే విన్నాననే చెప్పి వుండే వాణ్ణిగా”నాకో విషయం తెలుసు. శాస్త్రి అంత పొద్దున్నే వచ్చి అంతే పట్టుపట్టి అడుగుతూ వుంటే అదేదో పెద్ద విశేషమైన విషయమే అయి వుంటుందని.శాస్త్రి వచ్చిన టైముకు నేను మొహం కడుక్కుంటున్నాను. ఆ వినేదేదో కాఫీ త్రాగే విందామని ఉండమనిచెప్పి లోపలకు వెళ్ళాను. మరో నిమిషానికే ఆవిడ ఇచ్చిన రెండు గ్లాసుల కాఫీ రెండు చేతుల్తోనూ తెచ్చి వద్దంటున్నా ఒకటి శాస్త్రికిచ్చి, ఇంకోటి నేను నోటిదగ్గర పెట్టుకున్నాను.”ఇప్పుడు చెప్పు””సదానంద స్వాములవారు లేరూ?”శాస్త్రి ప్రారంభించాడు. నేను కూడా వినటం మొదలెట్టాను. కానీ అదేమిటో ఆయన పేరు వింటే నాకు నవ్వు వస్తుంది. సదానంద స్వామివారు అని పిలవబడ్డ ఆయన్ని నేను అప్పుడప్పుడూ ఏ కారో పోయినప్పుడు ఊరి బయట వున్న మఠంలో చూస్తూనే వుంటాను. కానీ అదేమిటో ఆయన ఎప్పుడు చూసినా సదానందంగా కాక విచారగ్రస్తమైన ముఖంతో సాక్షాత్కరిస్తూ వుంటారు.”ఉన్నారు” అని బదులు చెప్పాను.”ఇక తగ్గు. పరిహాసాలు మొదలుపెట్టబోకప్పుడే. ఆయనకు రాత్రి కల వచ్చిందట””నిజంగా?”శాస్త్రికీ, నాకూ ఇటువంటి విషయాల్లో అసలు పడదు.”లేక అబద్ధమనుకుంటున్నావా?” అన్నాడు కోపంగా శాస్త్రి. తరువాత ఒక గుక్క కాఫీ త్రీగి “చెప్పేది సాంతం విను. కల ఏమనో తెలుసా? దేవుడు సాక్షాత్కరించి, ఫలానా రంగయ్యగారి స్థలంలో వెలిశాను. రేపే ఈ విషయం వూరంతా చెప్పి గుడి కట్టడానికి అనువుగా డబ్బు సంపాయించే ఏర్పాటు చేసి, త్వరలోనే నా గుడి ఏర్పాటయే విధానాన్ని చూడమని సెలవిచ్చాడట” అని చెప్పేశాడు చాలా సూక్ష్మంలో.శాస్త్రి అంత తేలికగా చెప్పినందుకు నేను చాలావరకూ సంతోషించాను. కానీ వాడింతలోనే పిడుగు పడ్డట్టుగా “అరే. నీ కసలు ఏ దేవుడో చెప్పనేలేదే” అంటూ మొదలెట్టబోయాడు.”వద్దు. చెప్పవద్దులే” అనేశాను నేను.వాడు వూరుకున్నాడు. ఈ వూరుకోవటంలో కాఫీ త్రాగటం ముగించి సదానంద స్వామివారి గొప్పతనాన్ని గూర్చి వర్ణించుకు వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడట, ఈ వూరు వచ్చి… కాదు ఈ వూరికి విచ్చేసి నెల రోజులే అయినా ఆయన ప్రతిభ ఈ వూళ్లోనే కాదు, చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా పాకిపోయిందట. ఎంతమంది కోర్కెలు తీర్చి భగవంతుని దయ వాళ్ళమీద ప్రసారమయ్యేట్లు చేశాడో లెక్కే లేదట.ఇంతా చెప్పి అటువంటి వారికి ఇటువంటి కల రావటం ఒక గొప్ప విషయం కాదని తేల్చాడు శాస్త్రి. అంతటితో వూరుకుంటేనా? నన్ను కూడా నమ్మమంటాడు.నా సిద్ధాంతాలు తెలిసికూడా ఇలా ఎందుకంటాడో, ఇప్పుడు ఒక్కసారే కాదు, చాలాసార్లు – నా కర్థం కాదు.”నా నమ్మకం విషయం నీకెందుగ్గానీ ఆ కల పర్యవసానం చెప్పు” అన్నాను.”ఏముంది? ఈరోజు తెల్లవారుఝామున ఆయన రంగయ్యగార్నీ, ఇంకొంతమంది పెద్ద మనుషుల్నీ వెంటబెట్టుకుపోయి, కలలో దేవుడు చెప్పిన గుర్తుల ప్రకారం తవ్వించాడట. తవ్విస్తే కనిపించింది.””ఏమిటి?””ఇంకేం కనిపిస్తుంది నీ మొహం. విగ్రహం. దేవుడే విగ్రహం. ఏ దేవుడంటే…””వద్దు. వద్దులే” అని ఆపాను అలవాటు ప్రకారం.”సరే. ఇంతకీ ఏమంటావు?” అని ఒక నిమిషం ఊరుకుని.. శాస్త్రి నా వంక ఎగాదిగా చూశాడు. వానిలో వాడు నవ్వుకున్నాడు. ఆశ్చర్యపడ్డాడు.”ఇంతా విని ఇదా నీ ప్రశ్న. ఇప్పటికైనా నీ నాస్తికత్వం మానుకొమ్మని చెబుతున్నాను. దేవుడున్నాడని నమ్మమంటున్నాను. దేవుడు లేనిదే ఇటువంటివి ఎట్లా జరుగుతున్నాయని అడుగుతున్నాను” అంటూ చాలా ఘాటుగానే అడిగాడు.ఇటువంటి ప్రశ్నలు వినటం ఒక్క శాస్త్రి నుంచే కాదు. ఎంతకాలం నుంచో ఎంతమందినుంచో విన్నాను. అందుకని నేను విన్నా విననట్లే లెక్క.”సరే. అయితే అక్కడకి వస్తావురా మూర్తీ” అని అడిగాడు చివరకు.”నేను రాను” అని చెప్పాను.”ఎంచేత?””మళ్ళీ క్రొత్తా?” ఇటువంటివి ఇష్టం లేదు కనుక.శాస్త్రి అదో విధంగా ముఖం పెట్టి “సరే అయితే నీ యిష్టం. కానీ ఎందుకు చెప్పానో కొంచెం ఆలోచించుకో. వెళ్తున్నాను” అంటూ లేచి – పోబోయాడు. నాకు ఒక ఆలోచన తట్టింది. “అయితే ఆగు వస్తున్నాను” అని చెప్పి లోపలకు పోయి బట్టలు మార్చుకు వచ్చాను. ఇద్దరం బయలుదేరాం.”ఆ రంగయ్య ఏమంటున్నాడు?” అని అడిగాను దార్లో.”ఏమంటాడు? పిల్లిలా అయిపోయాడు. గుడి కట్టుకునేందుకు తన స్థలాన్ని ఊరికినే ఇచ్చేస్తానని చెప్పాడు”.ఆశ్చర్యపోయాను. రంగయ్య ఎటువంటి మనిషో నాకు తెలుసు. అటువంటి వానిని ఇట్లా ఒక్క క్షణంలో మార్చగలిగినందుకు నిజంగా ఆ స్వామివార్ని మనసులో అభినందించాను.అక్కడికి చేరుకున్నాం. ఓహ్. జనం తండోపతండాలు. అప్పుడే ఊరంతా ఎలా వ్యాపించిపోయింది? “నేనానా ఆలస్యంగా వచ్చింది” అనుకున్నాను.అంతమంది జనాన్ని తోసుకుని లోపలికి పోయేందుకు మొదట సాధ్యపడలేదు. శాస్త్రి, నేనూ కలిసి ఎట్లా అయితేనేం చివరికి పలికిన దేవుని దగ్గరకు చేరుకున్నాం.అంతమంది జనానికి ముందుగా నిల్చున్నది సదానందస్వామి, ఆ తర్వాత రంగయ్యగారు.చూశాను. దేవుడే. ఏ దేవుడో చెప్పలేను. కానీ ఎలా వెలిశాడు. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడివచ్చి ఇక్కడ ఇలా పాతుకుపోయాడంటే ఎలా నమ్మను? అసలు దేవుడే లేడనే మతమైతే నాది.”చూశావా?” అన్నాడు శాస్త్రి.”చూశాను””ఏం చూశావు?””అమాయక ప్రజలు. వీళ్ళ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూస్తుంటే నాకు జాలికి బదులు కోపమే కలుగుతున్నది” శాస్త్రి ప్రశ్నతో నా కడుపు మండిపోయింది.”ఏం చూశానా? బూటకపు సన్యాసులు దేవుని పేరుతో, భక్తి పేరుతో ఎంతమంది ప్రజలను మోసగిస్తున్నారో చూశాను. ఇంటిముందు నిలబడి దీనంగా అడుక్కునే బిచ్చగానికి పిడికెడు బిచ్చం ఇవ్వటానికి నిరాకరించే షావుకార్లు అర్థంలేని ఈ దేవుని మహికు ఎలా జోహారు చేస్తున్నారో చూశాను” అన్నాను గట్టిగా, ధైర్యంగా. శాస్త్రిగాడు నా నోరు మూయడానికి ప్రయత్నించాడు. నా నోరు మూయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే వినబడవలసిన ఇద్దరికీ ఈ మాటలు వినబడ్డాయి. చుట్టూరా నిల్చుని దేవుని మహిమను గురించి, సదానంద స్వామి మహత్యాన్ని గురించి చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నవాళ్ళు కూడా నా వంక విస్మయంగా చూశారు.రంగయ్యగారు నా వంక కళ్ళెర్రజేసి చూశారు. సదానందస్వామి కళ్ళలో అగ్నిజ్వాలలు లేచాయి.”దేవున్ని గురించే ఇంతమాటా? వచ్చే జన్మలో నీకైమైనా పుట్టగతులుంటాయా? నీ నాలుక తెగిపోదూ?” అన్నారు రంగయ్యగారు నిప్పులుగ్రక్కుతూ.స్వామి మాత్రం “పాపం క్షమించుగాక” అన్నాడు పరమ శాంత స్వరంతో.నేనేం భయపడలేదు. “ఇటువంటి కల్లబొల్లి వచనాలను విని ఇక్కడెవరూ మోసపోరు. మాటా, హృదయంలేని ఈ రాతి బొమ్మ ఈ భూమిలోకి ఎలా వచ్చిపడింది. ఇక్కడ పుట్టుకురావడం మీరెవరైనా చూశారా?” అన్నా ఇంకా గట్టిగా.”అయితే ఇక్కడికి ఎలా వచ్చిందంటావు?” అనడిగారు రంగయ్యగారు నన్ను.”చేతులు సరిగా వుంటే సరి. చీకట్లో ఎంతపనయినా చెయ్యవచ్చు”.రంగయ్యగారి కళ్ళు క్రోధంతో మండిపోతుంటే చూశాను. మరో క్షణం వుంటే ఆయన బలమైన చెయ్యి క్రింద నా చెంప భళ్లుమని వుండేది. కానీ సదానందస్వామి అడ్డుపడి “భగవంతుడు ఈ కుర్రవానిని రక్షించుగాక. ఇకముందయినా ఇతని అమాయకత్వం నశించుగాక” అన్నాడు.”నేనేం కుర్రవాణ్ని కాదు. నాకు ఇరవై ఐదేళ్లు” అందామనుకున్నాను. కానీ ఏం మాట్లాడతాను. ఒకటి కాదు. రెండు కాదు, కొన్ని వందల చేతులు నన్ను కొట్టేందుకు సిద్ధంగా వున్నాయి. కొన్ని వందల కళ్లు నన్ను భస్మం చేసేటట్లు చూస్తున్నాయి. శాస్త్రి కలగజేసుకుని నా రెక్క పుచ్చుకుని బరబరా బయటికి ఈడ్చుకుని వచ్చాడు.నేనేదో చెప్పబోయాను.”చాల్లే. ఇంకాసేపుంటే ఏమయేది? అయినా నీకెందుకంత తొందర?” అన్నాడు శాస్త్రి.వెనకాలనుంచి తిట్లు, నవ్వులూ వినిపిస్తూనే వున్నాయి.”నిజంగా నాది తప్పేరా శాస్త్రీ” అన్నాను కొంతదూరం పోయాక.శాస్త్రి నావంక సంతోషంగా చూస్తూ “అయితే నీ సిద్ధాంతాలు మార్చుకున్నావా?” అన్నాడు.”అహ. అది ఎప్పటికీ జరగదు. కానీ తప్పని ఎందుకన్నానంటే సజావుగా వాదించకుండా ఆస్తికుల్ని అవమానకరంగా మాట్లాడటం మొదటి తప్పు. పిలవని పేరంటంగా వెళ్ళి వాళ్ళను ఆక్షేపించటం రెండవ తప్పు. ప్రపంచంలో అనేక తరహాల మనుష్యులుంటారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అందరికీ అనువైన పరిస్థితుల్లో తప్ప, అందరికీ ఇష్టమైతే తప్ప ఎవరి ఉద్దేశాలు వాళ్ళు బయట పెట్టుకోకూడదు. అవే ఇప్పుడు ఆచరణ రూపంగా తెలుసుకున్నాను” అన్నాను.నడుస్తున్న శాస్త్రి “ఆ మాత్రమైనా తెలుసుకున్నావు కదా. మేలు” అన్నాడు.కానీ నేను మనసులో వేదానందస్వామిని ఏ మాత్రం నమ్మలేదు. దేవుడు పిలవటాన్ని గురించి అంతకన్నా నమ్మలేదు. తప్పకుండా ఏవన్నా గొడవలు జరుగుతాయనుకున్నాను. ఏం జరిగినా చూద్దామనుకున్నాను.తర్వాత ఇంటికి వచ్చేశాము.ఆ తర్వాత వారం రోజులకు ఇంకోసారి శాస్త్రి కనిపించాడు. “ఏమిట్రా సంగతులు?” అని అడిగాను.”ఏమున్నాయి. బొత్తిగా తీరటం లేదు” అన్నాడు.”అంత తీరని పనేమిటి?””దేవాలయ నిర్మాణానికి డబ్బు వసూలు చేస్తున్నాము. దాంతో ప్రక్క గ్రామాలకు కూడా రాత్రింబవళ్ళు తిరగవలసి వస్తుంది” అన్నాడు.”ఏ మాత్రం వసూలయిందేమిటి ఇప్పుడు?””ఏదీ? ఇప్పటికి ఓ అయిదు వేలయింది. ఇంకా ఇంతకు ఇబ్బడి రావాలి. ఎలానో?” అన్నాడు శాస్త్రి.నాకో సందేహం వచ్చింది. “ఎందుకన్నా మంచిది, ఆ వచ్చిన డబ్బు మట్టుకు స్వామి చేతుల్లో పోయకండి” అన్నాను.”ఏం?””అంతే. మిగిలింది నే చెప్పను” అన్నా మిగిలింది వానిని ఊహించుకోమన్నట్లు.”నీ మొహం. ఇంతవరకూ వచ్చింది ఆయనకే ఇచ్చాము. ఇకముందు కూడా అలానే ఇస్తాం. అర్థంలేని అనుమానాలూ నువ్వూనూ, సరే మళ్ళీ పోవాలి వస్తా.”శాస్త్రి వెళ్ళిపోయాడు. నా అనుమానం నాకుంది.రోజులు మెల్లగా గడుస్తున్నాయి. శాస్త్రిగానికి హడావుడి వున్నకొద్దీ ఎక్కువ అవుతూనే వచ్చింది. వీనిలాగే ఇంకో పదిమంది రాత్రింబవళ్ళు కష్టపడితే ఇంకో ఐదువేలు వసూలయింది. అది చాలదు. ఇంకా కావాలి.రంగయ్య స్థలమంటే ఇచ్చాడుగానీ ఈ డబ్బు ఇవ్వలేదు. పైగా “ఇది చాలదా? ఈ స్థలం అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఏ ఆసామి అంత డబ్బు ఇచ్చాడు?” అంటాడట.నాకు ఆ సదానంద స్వామంటే మొదట్నుంచీ నమ్మకం లేదు. డబ్బు కోసమే ఈ నాటకమంతా ఆడిస్తున్నాడని నా విశ్వాసం. శాస్త్రి వాళ్లు అనవసరంగా కష్టపడుతున్నారే అని విచారించేవాడిని. ఏదో ఒకరోజు ఈ స్వామే ఏదో అఘాయిత్యం చేస్తాడని నేను గట్టిగా నమ్మాను.చివరికి ఒకరోజు నేను అనుకున్నదంతా అయింది. శాస్త్రిగాడు ఒక రోజు ఉదయాన్నే చెమటలు గ్రక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చాడు. వాడి నోటినుంచి మాట సరిగ్గా రాకపోవటం కనిపెట్టి కాస్త కాఫీ ఇచ్చి సంగతేమిటని అడిగాను.వాడు చెప్పుకొచ్చాడు.డబ్బంతా స్వామిదగ్గరే వున్నదిగా. ఆయన భద్రంగా ఇనప్పెట్టెలోనే దాస్తున్నాడట. అన్ని రోజుల్నుంచీ వుంచింది అలానే ఉండేది. కానీ ఇవాళ తెల్లవారుఝామున ఏదో అనుమానం కలిగి చూసేసరికి ఖాళీ.స్వామివారు గుండె గుభేలుమంది. ఈ వార్త విన్న గుండె బ్రద్ధలయింది. శాస్త్రితోపాటు పనిచేసిన మిగిలిన పదిమంది గుండెలూ పగిలిపోయాయి.”అయితే ఎలాగ?” అనడిగాను శాస్త్రిని.”పోలీసు రిపోర్టు ఇచ్చాం” అన్నాడు.”నీకేమయినా పిచ్చా? వేరే పోలీసులెందుకు? దొంగ ఇంకెవరయి వుంటారు? వాడే. వాణ్నే నిలదీసి అడక్క….””ఆగరా…” అన్నాడు శాస్త్రి.”అంతటి మాటలు అనబోక ఆయన్ని”.”వాణ్నింకా నమ్ముతున్నావా?””తప్పకుండా. ఇక ముందు కూడా నమ్ముతాను. మేమే కాదు. రంగయ్యగారు కూడా నమ్మారు. ఏదో ఒక దుష్కృత్యం జరిగిపోయింది. మహామహుల్ని పట్టుకుని అలా అనెయ్యటమేనా? పోలీసువాళ్లు స్వామివారి బస కూడా సోదా చెయ్యమని చెప్పేశారు. ఆయనంటే అందరికీ అంత గౌరవం”.”అంత గౌరవం కనకనే అలా చేస్తున్నాడు” అందామనుకున్నాను మనసులో. శాస్త్రి ఎక్కడ ఏడ్చిపోతాడోనని బయటికి మాత్రం అనలేదు.”సరే అంత నమ్మకం వుంటే కానిదేముంది? ఎలా జరగాలో అలాగే జరుగుతుంది” అన్నాను. శాస్త్రి కొంచెంసేపుండి వెళ్ళిపోయాడు.”ఎంత గుండెలు దీసిన బంటు. ఆ డబ్బు తీసుకుని ఎక్కడికో పారిపోలేదు? ఇక్కడ వుండే ఆ డబ్బు కాజేసి నాటకం అంతా ఆడిస్తున్నాడు. కాకేమిటి? ఇటువంటి మూర్ఖ ప్రజలుంటే” అనుకున్నాను వాడు వెళ్ళిపోయిన తరువాత.ఆవిడ వచ్చి గుమ్మందగ్గర నిలబడి అంతా వింది కాబోలు. “అది కాదండీ. ప్రతిదానికీ అలా అనుమానిస్తారెందుకు? దొంగతనం నిజంగా జరగకూడదా?” అంది. శాస్త్రితో మాట్లాడదుగానీ శాస్త్రివైపే ఆమె కూడా -“నీ మొహంలే” అని గదిమేశాను.తర్వాత శాస్త్రి నాకు అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాడు. కనిపించినప్పుడల్లా స్వామే దొంగని నేనంటూనే వున్నాను. కాదని చెవి కోసిస్తానని శాస్త్రి అంటూనే వున్నాడు.ఇంతలోనే ఒక విచిత్రం జరిగింది.సదానంద స్వామివారికి ఒక రాత్రి కల వచ్చింది. ఆ కల్లో ఏమని వినిపించిందంటే డబ్బు ఎత్తుకుని పారిపోయిన దొంగలు, తమ పనికి పశ్చాత్తాపపడి ఆ డబ్బు కాస్తా ఒక చిన్న పెట్టెలో పెట్టి, భగవంతుడు వెలసిన చోటకు కొద్ది దూరంలోనే పాతిపెట్టి పోయారని. ఇంకేముంది? మరునాడు స్వామి, రంగయ్యగారు మొదలైన ప్రభృతులంతా కలిసి ఆ చోటుకు పోయి త్రవ్వారు. అన్నట్లుగానే వున్నది డబ్బు.”ఇదంతా నాకు శాస్త్రి చెప్పాడు. చెప్పి, చూశావా? ఆయన్ని అనుమానించావు? భగవంతుని దయవల్ల పోలీసులు సాధించలేని పనిని ఆయనెలా సాధించివేశాడో?” అన్నాడు గర్వంగా.సదానంద స్వామిని గురించి నాకున్న నీచాభిప్రాయాన్ని మార్చుకున్నాను. కానీ ఆ ధనం అపహరించింది ఎవరో నాకు తెలుసు. స్వామికి ఎందుకు కల వచ్చిందో, అలా ఎందుకు జరిగిందో తెలుసు. కానీ శాస్త్రికి ఈ విషయమంతా ఎలా నచ్చచెబుతాను. వాడు వినే పరిస్థితిలో వుంటేగా. పైపెచ్చు నన్నే ఎత్తిపొడుస్తున్నాడు.అదలా అయిపోయింది. ఆ తర్వాత సదానంద స్వామి మహత్యాన్ని గురించి ఆ వూళ్లోనే కాదు, చుట్టుప్రక్కల కూడా మారుమ్రోగిపోయింది. తిరిగి చందాలు వసూలు చేయటానికి శాస్త్రి ప్రభృతులు తిరిగి సంచారం సాగించారు. ఈసారి డబ్బులు గలగల రాలిపోయాయి. కారణం శాస్త్రికి తెలీదు. రంగయ్యకూ తెలీదు. దేవుని మహత్యం అని భావించి వుంటారు.***ఆ సాయంత్రం ఆ దారిన పోతున్న నేను నాలో పగలబడి, విరగబడి నవ్వుకున్నాను. ప్రజల అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని తలచికాదు, సదానంద స్వామి మహిమను తలచుకుని.నా నవ్వులో అవహేళనా లేదు; ఆక్షేపణా లేదు; పరిహాసం లేదు. మనస్ఫూర్తిగా, సంతోషంగా నవ్వుకున్నాను.దేవుడు వుండవచ్చు – ఉండక పోవచ్చు. నావంటి వారి విషయం తీసి వేయండి. దేవుడు ఉన్నాడనుకునే వాళ్ళను తీసుకోండి. దేవుడున్నాడనగానే సరికాదు. అందుకు ఆర్థిక సహాయం కావాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రజల సానుభూతి కావాలి. సానుభూతి కోసం దేవునిలో ఘనమైన మహిమ వుందని అందరూ నమ్మాలి. దేవుణ్ని నమ్మేదెట్లా? అందుకోసం సదానంద స్వామి వంటి మనుషులు కొద్దిమందయినా సరే దేశంలో, కాదు ప్రపంచంలో వుండాలి – ఉండొద్దూ?(05-01-1955 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక నుంచి పునర్ముద్రితం)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.