అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను.
మరికొందరు ‘నీవల్ల కాదం’టూ చులకన చేసి మాట్లాడారు. అయినా లక్ష్మి కుంగిపోలేదు. ఆటో నేర్చుకుని విశాఖ నగరంలో నేడు పలువురు మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడందరూ ఆమెను ఆటో లక్ష్మి అని పిలుస్తారు. తన జీవన ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను లక్ష్మి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాకు ఎర్రినాయుడుతో 1987 వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే నా భర్త వ్యసనపరుడు. దీంతో చూస్తుండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు మా పేరిట ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసి ఓ ఆటో కొన్నాడు. అది కూడా ఎన్నో రోజులు ఉండలేదు. మాకు ఓ కొడుకు పుుట్టాడు. అప్పటికి మా పరిస్థితి మరింత దిగజారింది. ఇల్లు గడవడం కష్టమయింది. మా అత్తగారు ఆడపడుచులు మమ్మల్ని ఎప్పుడూ ఆదుకునేవారు. కానీ ఎన్నాళ్లిలా? గత్యంతరం లేక నేనే ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ నెలకు రూ.3,500 ఇచ్చేవారు. దుర్వ్యసనాలకు బానిసైన నా భర్తకు టీబీ సోకింది. ఒకరోజు నా భర్త ఎక్కడో పడిపోవడంతో వెన్నుపూసకు గాయమైంది. దీంతో పగలే కాదు రాత్రిపూట కూడా ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్‌లో నెలకు మించి సెలవు ఇవ్వలేమన్నారు. దీంతో ఆ ఉద్యోగం పోయింది. రోజులు గడవడం కష్టంగా మారింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి కొన్నాళ్లు గడిపాను.
బట్టల వ్యాపారం…
లక్ష రూపాయలు అప్పు చేసి బట్టల వ్యాపారం ప్రారంభించాను. అది కొన్నాళ్లు బాగానే గడిచింది. బట్టలు కొన్నవాళ్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ సరిగా చెల్లించకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యాపారం కోసం చేసిన అప్పు రూ.నాలుగు లక్షలకు చేరింది. దీంతో వచ్చిన కొంత ఆదాయం కాస్తా వడ్డీలకే పోయేది. నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గత ఏడాది మరణించాడు. ఒకపక్క బాబు చదువు, మరోపక్క ఇంటి నిర్వహణా ఖర్చులు నన్ను వెన్నాడేవి. ఏం చేయాలో పాలుపోలేదు నాకు.
ఆటో నేర్చుకోవాలనుకున్నాను…
ఒక టీవీ చానెల్‌లో నాలాగే కష్టాలు పడి చివరకు ఆటో డ్రైవర్‌గా మారి జీవితాన్ని చక్కదిద్దుకున్న ఒక వ్యక్తి గురించిన కార్యక్రమం చూశాను. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. దాంతో నాకు ఆటో నేర్పించమని స్థానికంగా ఆటోలు నడుపుతున్న కుర్రాళ్లను అడిగాను. ‘మీరా ఆంటీ.. కష్టం నడపలేరు..’ అన్నారు వాళ్లు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఓ అబ్బాయి నాకు నేర్పడానికి ముందుకొచ్చాడు. రోజూ రెండు, మూడు గంటలు చొప్పున నెల రోజుల పాటు ఆటో నడపడాన్ని బాగా సాధన చేసి నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశాను. ఆర్టీఏ అధికారులు కూడా నన్ను ఎంతో అభినందించారు. నగరంలో ఆటో లైసెన్స్‌ తీసుకున్న తొలి మహిళ నేనని చెప్పారు.
డ్రైవింగ్‌ సరే..ఆటో మాటేంటి…
ధైర్యం చేసి ఆటో నేర్చుకున్నాను కానీ.. ఎవరూ ఆటోని అద్దెకిచ్చేందుకు సాహసించలేదు. సొంతంగా ఆటో కొనడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ సుమారు రూ.మూడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను? మళ్లీ జీవితం మొదటికి వచ్చింది. అప్పుకోసం ప్రయత్నించాను. ఎక్కడకు వెళ్లినా ఆస్తులున్నాయా? హామీ ఎవరిస్తారు? అనే ప్రశ్నలు నాకు ఎదురయ్యేవి. ప్రభుత్వ సాయం దక్కదని అర్ధమైంది. గతంలో అప్పు ఇచ్చిన ఒకామె నా పరిస్థితి చూసి జాలిపడి నన్ను ఆదుకుంది.
తొలి రోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు..
ఆటో తీసిన మొదటి రోజు జ్ఞానాపురం జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సుమారు ఐదు కిలోమీటర్లు సర్వీసు ప్రారంభించాను. ఆటోను 40 కిలోమీటర్ల వేగానికి మించి నడపలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు.. తిరిగి మూడు నుంచి ఐదు గంటల వరకు ఆటో నడుపుతాను. ఎక్కువగా కాలేజీ యువతులు, మహిళలు నా ఆటో ఎక్కేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు నగర పరిధిలో 20 కిలోమీటర్లకుపైగా ఆటో నడపగలుగుతున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదించగలుగుతున్నాను. ఆటో ఫైనాన్స్‌ కట్టి మిగిలిన సొమ్ముతో ఇంటిని నడుపుతున్నాను. నా కొడుకు ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాడు డిగ్రీ పూర్తి చేసి స్థిరపడితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్టే.
వాసు, విశాఖపట్నం,
ఫొటోలు.. కోటేశ్వరరావు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.